West Yorkshire Police
-
భారతీయ యాసను వెక్కిరించిన కానిస్టేబుల్
లండన్: ఫిర్యాదు చేసేందుకు ఫోన్ చేసిన ఒక మహిళ భారతీయ యాసను వెక్కిరించిన పోలీస్ కానిస్టేబుల్‌ను బ్రిటన్ క్రమశిక్షణా ట్రిబ్యూనల్ విధుల నుంచి తప్పించింది. గత ఏడాది నవంబర్ 29వ తేదీ జరిగిన ఘటన తాలూకు కేసులో పోలీసు ప్యాట్రిక్ హ్యారిసన్‌ను దోషిగా తేలుస్తూ లండన్‌లోని ట్రిబ్యూనల్ తీర్పుచెప్పింది. గత నెలలో తీర్పువెలువగా వివరాలు తాజాగా బహిర్గతమయ్యాయి. వెస్ట్ యార్క్‌షైర్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేసే ప్యాట్రిక్ ఘటన జరిగిన రోజు లండన్‌లోని ఫోర్స్ కాల్సెంటర్లో విధుల్లో ఉన్నాడు. తనపై ఒకరు విద్వేష నేరానికి పాల్పడ్డారంటూ ఒక మహిళ ఈ కాల్‌సెంటర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదుచేసింది. ఫిర్యాదును పట్టించుకోకుండా ప్యాట్రిక్ ఆమె మాట్లాడే భారతీయ యాసను వెక్కిరించడం మొదలెట్టాడు. అసలది విద్వేష నేరమని ఎందుకు అనుకుంటున్నావ్? అని భారతీయ యాసను అనుకరిస్తూ వెటకారంగా మాట్లాడాడు. ఫోన్ కట్‌చేశాక ఆమె ఫిర్యాదుచేస్తుందేమోనని భయపడ్డాడు. ఆమెకు వేరే నంబర్ నుంచి ఫోన్ చేసి ఆమె ఏం అనుకుందోనని ఆరాతీశాడు. ప్యాట్రక్ చర్యతో విసిగిపోయిన ఆమె ‘టెల్ మామా’కు ఫిర్యాదుచేసింది. బ్రిటన్‌లో ముస్లింవ్యతిరేక ఘటనలపై ప్రభుత్వం ‘టెల్ మామా(ఎంఏఎంఏ–మెజరింగ్ యాంటీ ముస్లిం అటాక్స్) ప్రాజెక్ట కింద చర్యలు తీసుకుంటోంది. ఈ ఉదంతంలో ప్యాట్రిక్ వైఖరిని ట్రిబ్యూనల్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘15 ఏళ్లపాటు విధుల్లో ఉంటూ కూడా అధికారం, హోదాను మరిచి మహిళతో అనుచితంగా మాట్లాడాడు. ఈయన వైఖరితో ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం, విశ్వాసం తగ్గిపోతాయి. ఇది మొత్తం పోలీసు వ్యవస్థకే అప్రతిష్ట. జాతి వివక్ష, ఇస్లామోఫోబియా దేశవ్యాప్తంగా పోలీసుల్లో గూడుకట్టుకోవడం ఆందోళనకరం’’ అని ట్రిబ్యూనల్ ఆగ్రహం వ్యక్తంచేసింది. అతడిని విధుల నుంచి తప్పించింది. -
కోట్లు ఖరీదైన కారు.. కొన్న 20 నిమిషాల్లోనే
లండన్ : బ్రిటన్‌కు చెందిన ఒక వ్యక్తి రెండు కోట్ల రూపాయల ఖరీదైన లగ్జరీ కారు కొన్నాడు. అంత ఖరీదు చేసే కారు కొన్నానన్న ఆనందంలో కారును స్టార్ట్‌ను చేసి రోడ్డు మీద రయ్యిమని దూసుకెళ్లాడు. ఇంతలో కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో కారును పక్కకు ఆపి ఇలా దిగాడో లేదో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఇంకేముంది 2 కోట్ల రూపాయలు పెట్టి కొన్న కారు 20 నిమిషాలు కాకుండానే తుక్కుతుక్కుగా మారింది. లోకంలో తనకంటే దురదృష్టవంతుడు మరెవరు ఉండరని అని తెగ బాధపడిపోయాడు. ఈ విచారకర ఘటన గురువారం బ్రిటన్‌లోని వేక్ఫీల్డ్లో చోటుచేసుకుంది. (మరో ఇండో-అమెరికన్‌కు కీలక పదవి!) వివరాలు.. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి తనకెంతో ఇష్టమైన లంబోర్గిని హరికేన్ స్పైడర్ మోడల్ కారును 2 కోట్లు రూపాయలు పెట్టి కొనుగోలు చేశాడు. షోరూమ్ నుంచి కారు డెలివరీ తీసుకొని ఇంటికి వెళ్తుండగా.. మార్గమధ్యలో కారులో సాంకేతిక లోపం తలెత్తింది. కారుకు ఏమైందా అని దిగి పరిశీలించేలోపే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. సమాచారం అందుకున్న వెస్ట్ యార్క్‌షైర్ పోలీస్(డబ్యువైపీ) పోలీసింగ్ యూనిట్ అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని ఓదార్చడం తప్ప ఇంకేమి చేయలేక పోయారు. దెబ్బతిన్న కారు ఫొటోలను పోలిసింగ్ యూనిట్ తమ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై చాలా మంది నెటిజన్లు స్పందిస్తూ... అయ్యో పాపం.. ;నీ కష్టం ఎవ్వరికీ రాకూడదు'. 'ఈ ప్రపంచంలోనే నీ అంత దురదృష్టవంతుడు ఇంకెవరూ లేరు'. అని కామెంట్స్ పెడుతున్నారు.(భారత్‌కు అండగా అమెరికన్ బలగాలు) -
భార్యతోపాటు కూతుళ్లను చంపి ఆత్మహత్య
లండన్: ఏం కష్టం వచ్చిందో ఏమో ఓ ఎన్నారై తన భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలను చంపేశాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన లండన్‌లోని బ్రాడ్‌ఫోర్డ్‌లో చోటు చేసుకుంది. ఎన్నారై జితేంద్ర లాడ్ (49) తన భార్య దుష్కా లాడ్ (44) ఇద్దరు టీనేజీ కుమార్తెలు త్రిషా (19), నిషా (17)లతో కలసి బ్రాడ్ఫోర్డ్ నివసిస్తున్నాడు. సోమవారం రాత్రి జితేంద్ర ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇరుగుపోరుగు వారు వెస్ట్ యార్క్‌షైర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జితేంద్ర నివాసానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జితేంద్ర ఇంత దారుణానికి పాల్పడటానికి గల కారణాలు అన్వేషించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తే కానీ కేసుకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇరుగుపోరుగు వారిని విచారిస్తున్నారు.