Indian language
-
భారతీయ యాసను వెక్కిరించిన కానిస్టేబుల్
లండన్: ఫిర్యాదు చేసేందుకు ఫోన్ చేసిన ఒక మహిళ భారతీయ యాసను వెక్కిరించిన పోలీస్ కానిస్టేబుల్‌ను బ్రిటన్ క్రమశిక్షణా ట్రిబ్యూనల్ విధుల నుంచి తప్పించింది. గత ఏడాది నవంబర్ 29వ తేదీ జరిగిన ఘటన తాలూకు కేసులో పోలీసు ప్యాట్రిక్ హ్యారిసన్‌ను దోషిగా తేలుస్తూ లండన్‌లోని ట్రిబ్యూనల్ తీర్పుచెప్పింది. గత నెలలో తీర్పువెలువగా వివరాలు తాజాగా బహిర్గతమయ్యాయి. వెస్ట్ యార్క్‌షైర్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేసే ప్యాట్రిక్ ఘటన జరిగిన రోజు లండన్‌లోని ఫోర్స్ కాల్సెంటర్లో విధుల్లో ఉన్నాడు. తనపై ఒకరు విద్వేష నేరానికి పాల్పడ్డారంటూ ఒక మహిళ ఈ కాల్‌సెంటర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదుచేసింది. ఫిర్యాదును పట్టించుకోకుండా ప్యాట్రిక్ ఆమె మాట్లాడే భారతీయ యాసను వెక్కిరించడం మొదలెట్టాడు. అసలది విద్వేష నేరమని ఎందుకు అనుకుంటున్నావ్? అని భారతీయ యాసను అనుకరిస్తూ వెటకారంగా మాట్లాడాడు. ఫోన్ కట్‌చేశాక ఆమె ఫిర్యాదుచేస్తుందేమోనని భయపడ్డాడు. ఆమెకు వేరే నంబర్ నుంచి ఫోన్ చేసి ఆమె ఏం అనుకుందోనని ఆరాతీశాడు. ప్యాట్రక్ చర్యతో విసిగిపోయిన ఆమె ‘టెల్ మామా’కు ఫిర్యాదుచేసింది. బ్రిటన్‌లో ముస్లింవ్యతిరేక ఘటనలపై ప్రభుత్వం ‘టెల్ మామా(ఎంఏఎంఏ–మెజరింగ్ యాంటీ ముస్లిం అటాక్స్) ప్రాజెక్ట కింద చర్యలు తీసుకుంటోంది. ఈ ఉదంతంలో ప్యాట్రిక్ వైఖరిని ట్రిబ్యూనల్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘15 ఏళ్లపాటు విధుల్లో ఉంటూ కూడా అధికారం, హోదాను మరిచి మహిళతో అనుచితంగా మాట్లాడాడు. ఈయన వైఖరితో ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం, విశ్వాసం తగ్గిపోతాయి. ఇది మొత్తం పోలీసు వ్యవస్థకే అప్రతిష్ట. జాతి వివక్ష, ఇస్లామోఫోబియా దేశవ్యాప్తంగా పోలీసుల్లో గూడుకట్టుకోవడం ఆందోళనకరం’’ అని ట్రిబ్యూనల్ ఆగ్రహం వ్యక్తంచేసింది. అతడిని విధుల నుంచి తప్పించింది. -
మైక్రోసాఫ్ట్, మేక్మైట్రిప్ జట్టు
న్యూఢిల్లీ: జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథ) ద్వారా భారతీయ భాషల్లో వాయిస్ ఆధారిత బుకింగ్ సర్వీసులు అందించే దిశగా ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో ట్రావెల్ పోర్టల్ మేక్మైట్రిప్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో సందర్భం, బడ్జెట్, కాల వ్యవధి, యాక్టి విటీలు మొదలైన వివరాలను ప్రయాణికులు తెలియజేస్తే .. వ్యక్తిగత ప్రాధాన్యతలను బట్టి వారికి అనువైన ప్యాకేజీలను ఆఫర్ చేసేందుకు వీలవుతుందని కంపెనీ తెలిపింది. పోర్టల్‌లో ఈ సాంకేతికతను పొందుపర్చారు. ప్రస్తుతం ఫ్లయి ట్లు, హాలిడేస్ కస్టమర్ల కోసం ఇంగ్లీష్, హిందీ భాషల్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు మేక్మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు రాజేష్ మాగో తెలిపారు. మేక్మైట్రిప్ అనుభవం, తమ ఏఐ సామర్థ్యాలతో దేశీయంగా ప్రయాణికులకు మరింత మెరుగైన సర్వీసులను అందించేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని మైక్రోసాఫ్ట్ ఇండియా ఈడీ సంగీతా బవి వివరించారు. -
భారతీయ భాషలను కాపాడుకోవాలి: గవర్నర్
నాంపల్లి (హైదరాబాద్): భారతీయ భాషలను కాపాడుకోవాలని, తాను తమిళనాడులో పుట్టినప్పటికీ తెలంగాణ సోదరిగా తెలుగు నేర్చుకుంటున్నానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మండలి వెంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఆధ్వర్యంలో నందమూరి తారకరామారావు కళామందిరంలో ఏర్పాటు చేసిన సంస్కృతి పురస్కార ప్రదానోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె తమిళనాడులో తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షిస్తూ వాటి పరివ్యాప్తి కోసం కృషి చేస్తున్న ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణుడు, అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు చిల్లకూరు ముద్దు కృష్ణారెడ్డికి సంస్కృతి పురస్కారాన్ని అందజేసి ప్రసంగించారు. మండలి వెంకటకృష్ణారావు తెలుగుభాషా ప్రేమికుడిగా, గాంధేయవాదిగా, ప్రజల మనిషిగా సమాజసేవ చేశారని, ఆయన పేరుతో ఏర్పాటు చేసిన సంస్కృతి పురస్కారాన్ని కృష్ణారెడ్డికి అందజేయడం అభినందనీయం అన్నారు. కార్య క్రమంలో తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య కిషన్‌రావు, ఏపీ శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ఆచార్య వై.రెడ్డి శ్యామల విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్, డాక్టర్ విజయ్‌పాల్ పాత్లోత్ తదితరులు పాల్గొన్నారు. -
ఆక్స్‌ఫర్డ్‌లో ఆధార్, డబ్బా, హర్తాళ్, షాదీ!
న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్ తన లేటెస్ట్ ఎడిషన్ డిక్షనరీలో 26 కొత్త భారతీయ ఆంగ్ల పదాలను చేర్చింది. అందులో ఆధార్, చావల్, డబ్బా, హర్తాళ్, షాదీ వంటి పదాలకు చోటు కల్పించింది. శుక్రవారం విడుదల చేసిన ఆక్స్ఫర్డ్ డిక్షనరీ 10వ ఎడిషన్‌లో 384 భారతీయ ఆంగ్ల పదాలతో పాటు 1,000కి పైగా చాట్‌బోట్, ఫేక్ న్యూస్, మైక్రోప్లాస్టిక్ వంటి కొత్త పదాలను చేర్చినట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (ఓయూపీ) తెలిపింది. ఈ కొత్త ఎడిషన్ ఆక్స్ఫర్డ్ లెర్నర్స్ డిక్షనరీ వెబ్సైట్, యాప్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ వెబ్సైట్లో ఆడియో–వీడియో ట్యుటోరియల్స్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లున్నాయి. ఈ ఎడిషన్‌లో చేర్చిన 26 కొత్త భారతీయ ఆంగ్ల పదాల్లో 22 పదాలను డిక్షనరీలో ప్రచురించామని, మిగతా నాలుగు పదాలు డిజిటల్ వర్షన్లో ఉన్నాయని పేర్కొంది. -
టూకీగా ప్రపంచ చరిత్ర 106
వేకువ ఇంద్రుడు అనేక పురాలను కూల్చినట్టు రుగ్వేదం చెబుతున్నా, అవి సింధూ ప్రాంత పట్టణాలుగా ఆనవాళ్లు దొరకలేదు. ఇంద్రుడు ఏకాకిగా పోరాడటం తప్ప, సమూహంగా ఆర్యులు దండయాత్ర చేసిన సందర్భం వేదాల్లో ఒక్కటైనా కనిపించదు. దండయాత్ర చేసిగానీ, చెయ్యకగానీ - సనాతన ప్రపంచంలో ఆర్యులు ప్రవేశించిన ప్రతి ప్రదేశంలోనూ అనివార్యంగా మనకు కనిపించేది ఆర్యభాష అధికారం. బహుశా శబ్దాల సంఖ్య బహుళంగా ఉన్న సౌకర్యం కారణంగా ఈ ఆధిపత్యం సాధ్యమై ఉండొచ్చు. అంతమాత్రాన ఇతర భాషలకు చెందిన పదాలను, శబ్దాలను ఆర్యులు గ్రహించలేదని కాదు. ఆర్యభాషా కుటుంబానివిగా గుర్తించిన ఏవొక్క యూరోపియన్ భాషలోను ‘ణ’, ‘ళ’ శబ్దాలు కనిపించవు. ఒక్క భారతీయ భాషల్లోనే ఆ ఉచ్ఛారణ ఉంది. బహుశా ఆర్యులు పంజాబ్ ప్రాంతంలో నివసించే సమయంలో మెలుహ్హన్ల నుండి వీటిని స్వీకరించి ఉండవచ్చు. ఏదో కొంత మోతాదులో స్థానిక భాషనూ సంప్రదాయాన్నీ మిళితం చేసుకోకుండా ఏ జాతివారికైనా కొత్త జాతితో విలీనం జరగడం ఊహాతీతం. ఈ దశలోనే ఆర్య వనితలకు చెవి దిద్దులు, చేతి గాజులు అలంకార సాధనాలుగా సంక్రమించి ఉండవచ్చు. అంతేగాదు, కేవలం పశుపోషణ మీదే ఆధారపడకుండా వ్యవసాయంలో దిగేందుకు వాళ్లు చేసిన ప్రాథమిక ప్రయత్నాలు రుగ్వేదం ద్వారా తెలుస్తున్నాయి. పంజాబ్ చేరుకున్న ఆర్యులు అనతికాలంలోనే తదుపరి విస్తరణకు తావులు వెదుక్కోవలసిన అవసరం కలిగినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే, ఖాళీ అయినవి మెలూహన్ల నగరాలు, వాటిని ఆశ్రయించి బతికిన గ్రామాలు మాత్రమే. స్వయంపోషఖ సదుపాయం గల గ్రామాలు చెక్కుచెదరకుండా నిలిచే ఉన్నాయి. ఆ ప్రాంతానికి ఆర్యసంతతి మొత్తాన్ని ఇమిడించుకునేంత వసతి లేదు. అందువల్ల, వాళ్లు తదుపరి విస్తరణకు తూర్పుదిశను ఎన్నుకున్నారు. తూర్పు దిశనే ఎన్నుకున్న కారణం మనం ఊహించలేం. రథాలను ఆవలకు దాటుకోనివ్వమని సింధూను, దాని ఉపనదులను పదేపదే బతిమాలుకునే రుగ్వేద మంత్రాలను గమనిస్తే, క్రీ.పూ. 1400 కాలంలో ఆర్యులు సప్తసింధును దాటుకునే ప్రయత్నంలో ఉన్నట్టు అర్థమౌతుంది. అందువల్ల వాళ్లకు ఘగ్గర్ - హాక్రా గురించి గానీ, గంగా యమునల గురించి గానీ తెలిసుండే అవకాశమే లేదు. మొదటి నుండి తుదిదాకా ప్రక్షిప్తమని (అసలు పేరుతో ఇతరులు జొప్పించినవని) భాషా నిపుణులు నిస్సంకోచంగా తేల్చిన రుగ్వేదం పదవ మండలంలో గంగా-యమునల ప్రస్తావన ఒకే వొక్కసారి కనిపించడం మినహా మిగతా మండలాల్లో ఆ నదుల ఎరుకే కనిపించదు. దీన్నిబట్టి ఆర్యులు సప్తసింధును దాటుకునే సమయానికి ఘగ్గర్ - హాక్రా ఉనికే లేకుండా అంతరించి ఉండాలి. ఆర్యులు గంగామైదానం చేరుకునే పాటికే సింధూ నాగరికత జనావాసాలు అక్కడ పల్చగా విస్తరించి ఉన్నాయి. మెలూహన్ల భాషనూ, సంప్రదాయాలను కొంతమేరకు ఇమిడించుకుని అక్కడికి చేరిన ఆర్యులకు ఈ కొత్త నివాసాలతో సహజీవనం కష్టమైందిగాదు. ఆ ప్రాంతంలో స్థిరపడిన తరువాత మెలుహ్హన్ల వ్యవహారిక భాష అచ్చంగా ఇదివరకటి ఉండేందుకు వీలులేదు. స్థానిక భాషలతో మిళితమై, కొత్త తరహా భాషలు పుట్టుకొచ్చాయి. ఈ పామర భాషలను తరువాతి కాలంలో ‘ప్రాకృతం’ అన్నారు. ప్రాకృతాల్లో ఒక వైవిధ్యానికి ‘అర్ఘమాగధి’ అనే పేరుంది. బహుశా అది మగధ పరిసరాల స్థానిక వ్యవహారంతో సమ్మిళితమైన మెలూహన్ల భాష వంటిది కావచ్చు. అందులో కొంత ‘పాళీ’ భాష కూడా కలిసుండొచ్చు. ఎందుకంటే, మగధ సరిహద్దుకు ఇరుగుపొరుగున ఉన్నవి పాళీ భాష మాట్లాడే హిమాలయ పర్వత జాతులు కాబట్టి! గంగా మైదానంలో కుదుటపడిన తరువాత ఆర్యుల భాష, సంప్రదాయం, జీవన విధానాలు పూర్తిగా మారిపోయాయి. విరాటులు, యాదవులు వంటి కొన్ని వంశాలను మినహాయిస్తే, మిగతా వంశాలకు పశుపోషణ వృత్తిగా తప్పిపోయింది. వాళ్ల భాష సంస్కృరించబడిన ‘సంస్కృతం’గా మారిపోయింది. ఆ భాషలో తర్కశాస్త్రం, వ్యాకరణాల వంటి ప్రత్యేక నైపుణ్యాలకు పునాది ఏర్పడింది. వాటి ఆధారంగా సాహిత్యం బహుముఖంగా పరిగెత్తడం ప్రారంభించింది. సప్తసింధును దాటుకునే సమయానికి వేదత్రయం మినహా ఇతర సాహిత్యం లేని ఆర్యులకు గంగామైదానంలో అధర్వవేదం మొదలు ఉపనిషత్తులు, బ్రాహ్మణులు, అరణ్యకాలు, పూర్వగాథల ఆధారంగా ఎదిగిన ఇతిహాసాలు, దేవుళ్లకు స్వరూప స్వభావాలు కలిగించిన పురాణాలు మొదలైనవి సాహిత్య సంపదగా ఏర్పడ్డాయి. ఆ సాహిత్యంలో సింధూనది ప్రసక్తి అట్టడుగు పడిపోవడం గమనిస్తే, ఆర్యుల జ్ఞాపకాల నుండి సింధూనది మాసిపోయినట్టు కనిపిస్తుంది. ఉత్తర దక్షిణంగా హిమాలయాల నుండి వింధ్య వరకు విస్తరించిన భూభాగం సంస్కృత సాహిత్యం మూలంగా ‘ఆర్యావర్తం’ అయిపోయింది. ఇంత పురోభివృద్ధి జరిగినా సంస్కృతానికి ‘లిపి’ లేని కొరత కొన్ని శతాబ్దాల పర్యంతం కొనసాగింది. వ్యాకరణానికి మూలపురుషుడుగా ప్రసిద్ధికెక్కిన ‘పాణిని’ చదువు మౌఖికంగా సాగినదే. ప్రపంచంలో సాటిలేని సాహిత్య గ్రంథంగా నిలిచిపోయిన ‘మహాభారతం’ తరువాతి తరాలకు మౌఖికంగా అందుబాటుకొచ్చిందే. ఆర్యులు గంగామైదానం చేరుకునే పాటికే సింధూ నాగరికత జనావాసాలు అక్కడ పల్చగా విస్తరించి ఉన్నాయి. మెలూహన్ల భాషనూ, సంప్రదాయాలను కొంతమేరకు ఇమిడించుకుని అక్కడికి చేరిన ఆర్యులకు ఈ కొత్త నివాసాలతో సహజీవనం కష్టమైందిగాదు. రచన: ఎం.వి.రమణారెడ్డి రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com