టూకీగా ప్రపంచ చరిత్ర 106 | Brief History of the World 106 | Sakshi
Sakshi News home page

టూకీగా ప్రపంచ చరిత్ర 106

Published Thu, Apr 30 2015 11:47 PM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM

టూకీగా  ప్రపంచ చరిత్ర   106

టూకీగా ప్రపంచ చరిత్ర 106

వేకువ

ఇంద్రుడు అనేక పురాలను కూల్చినట్టు రుగ్వేదం చెబుతున్నా, అవి సింధూ ప్రాంత పట్టణాలుగా ఆనవాళ్లు దొరకలేదు. ఇంద్రుడు ఏకాకిగా పోరాడటం తప్ప, సమూహంగా ఆర్యులు దండయాత్ర చేసిన సందర్భం వేదాల్లో ఒక్కటైనా కనిపించదు. దండయాత్ర చేసిగానీ, చెయ్యకగానీ - సనాతన ప్రపంచంలో ఆర్యులు ప్రవేశించిన ప్రతి ప్రదేశంలోనూ అనివార్యంగా మనకు కనిపించేది ఆర్యభాష అధికారం. బహుశా శబ్దాల సంఖ్య బహుళంగా ఉన్న సౌకర్యం కారణంగా ఈ ఆధిపత్యం సాధ్యమై ఉండొచ్చు. అంతమాత్రాన ఇతర భాషలకు చెందిన పదాలను, శబ్దాలను ఆర్యులు గ్రహించలేదని కాదు. ఆర్యభాషా కుటుంబానివిగా గుర్తించిన ఏవొక్క యూరోపియన్ భాషలోను ‘ణ’, ‘ళ’ శబ్దాలు కనిపించవు. ఒక్క భారతీయ భాషల్లోనే ఆ ఉచ్ఛారణ ఉంది. బహుశా ఆర్యులు పంజాబ్ ప్రాంతంలో నివసించే సమయంలో మెలుహ్హన్ల నుండి వీటిని స్వీకరించి ఉండవచ్చు. ఏదో కొంత మోతాదులో స్థానిక భాషనూ సంప్రదాయాన్నీ మిళితం చేసుకోకుండా ఏ జాతివారికైనా కొత్త జాతితో విలీనం జరగడం ఊహాతీతం. ఈ దశలోనే ఆర్య వనితలకు చెవి దిద్దులు, చేతి గాజులు అలంకార సాధనాలుగా సంక్రమించి ఉండవచ్చు. అంతేగాదు, కేవలం పశుపోషణ మీదే ఆధారపడకుండా వ్యవసాయంలో దిగేందుకు వాళ్లు చేసిన ప్రాథమిక ప్రయత్నాలు రుగ్వేదం ద్వారా తెలుస్తున్నాయి. పంజాబ్ చేరుకున్న ఆర్యులు అనతికాలంలోనే తదుపరి విస్తరణకు తావులు వెదుక్కోవలసిన అవసరం కలిగినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే, ఖాళీ అయినవి మెలూహన్ల నగరాలు, వాటిని ఆశ్రయించి బతికిన గ్రామాలు మాత్రమే. స్వయంపోషఖ సదుపాయం గల గ్రామాలు చెక్కుచెదరకుండా నిలిచే ఉన్నాయి. ఆ ప్రాంతానికి ఆర్యసంతతి మొత్తాన్ని ఇమిడించుకునేంత వసతి లేదు. అందువల్ల, వాళ్లు తదుపరి విస్తరణకు తూర్పుదిశను ఎన్నుకున్నారు. తూర్పు దిశనే ఎన్నుకున్న కారణం మనం ఊహించలేం. రథాలను ఆవలకు దాటుకోనివ్వమని సింధూను, దాని ఉపనదులను పదేపదే బతిమాలుకునే రుగ్వేద మంత్రాలను గమనిస్తే, క్రీ.పూ. 1400 కాలంలో ఆర్యులు సప్తసింధును దాటుకునే ప్రయత్నంలో ఉన్నట్టు అర్థమౌతుంది. అందువల్ల వాళ్లకు ఘగ్గర్ - హాక్రా గురించి గానీ, గంగా యమునల గురించి గానీ తెలిసుండే అవకాశమే లేదు. మొదటి నుండి తుదిదాకా ప్రక్షిప్తమని (అసలు పేరుతో ఇతరులు జొప్పించినవని) భాషా నిపుణులు నిస్సంకోచంగా తేల్చిన రుగ్వేదం పదవ మండలంలో గంగా-యమునల ప్రస్తావన ఒకే వొక్కసారి కనిపించడం మినహా మిగతా మండలాల్లో ఆ నదుల ఎరుకే కనిపించదు. దీన్నిబట్టి ఆర్యులు సప్తసింధును దాటుకునే సమయానికి ఘగ్గర్ - హాక్రా ఉనికే లేకుండా అంతరించి ఉండాలి.

ఆర్యులు గంగామైదానం చేరుకునే పాటికే సింధూ నాగరికత జనావాసాలు అక్కడ పల్చగా విస్తరించి ఉన్నాయి. మెలూహన్ల భాషనూ, సంప్రదాయాలను కొంతమేరకు ఇమిడించుకుని అక్కడికి చేరిన ఆర్యులకు ఈ కొత్త నివాసాలతో సహజీవనం కష్టమైందిగాదు. ఆ ప్రాంతంలో స్థిరపడిన తరువాత మెలుహ్హన్ల వ్యవహారిక భాష అచ్చంగా ఇదివరకటి ఉండేందుకు వీలులేదు. స్థానిక భాషలతో మిళితమై, కొత్త తరహా భాషలు పుట్టుకొచ్చాయి. ఈ పామర భాషలను తరువాతి కాలంలో ‘ప్రాకృతం’ అన్నారు. ప్రాకృతాల్లో ఒక వైవిధ్యానికి ‘అర్ఘమాగధి’ అనే పేరుంది. బహుశా అది మగధ పరిసరాల స్థానిక వ్యవహారంతో సమ్మిళితమైన మెలూహన్ల భాష వంటిది కావచ్చు. అందులో కొంత ‘పాళీ’ భాష కూడా కలిసుండొచ్చు. ఎందుకంటే, మగధ సరిహద్దుకు ఇరుగుపొరుగున ఉన్నవి పాళీ భాష మాట్లాడే హిమాలయ పర్వత జాతులు కాబట్టి!

గంగా మైదానంలో కుదుటపడిన తరువాత ఆర్యుల భాష, సంప్రదాయం, జీవన విధానాలు పూర్తిగా మారిపోయాయి. విరాటులు, యాదవులు వంటి కొన్ని వంశాలను మినహాయిస్తే, మిగతా వంశాలకు పశుపోషణ వృత్తిగా తప్పిపోయింది. వాళ్ల భాష సంస్కృరించబడిన ‘సంస్కృతం’గా మారిపోయింది. ఆ భాషలో తర్కశాస్త్రం, వ్యాకరణాల వంటి ప్రత్యేక నైపుణ్యాలకు పునాది ఏర్పడింది. వాటి ఆధారంగా సాహిత్యం బహుముఖంగా పరిగెత్తడం ప్రారంభించింది. సప్తసింధును దాటుకునే సమయానికి వేదత్రయం మినహా ఇతర సాహిత్యం లేని ఆర్యులకు గంగామైదానంలో అధర్వవేదం మొదలు ఉపనిషత్తులు, బ్రాహ్మణులు, అరణ్యకాలు, పూర్వగాథల ఆధారంగా ఎదిగిన ఇతిహాసాలు, దేవుళ్లకు స్వరూప స్వభావాలు కలిగించిన పురాణాలు మొదలైనవి సాహిత్య సంపదగా ఏర్పడ్డాయి. ఆ సాహిత్యంలో సింధూనది ప్రసక్తి అట్టడుగు పడిపోవడం గమనిస్తే, ఆర్యుల జ్ఞాపకాల నుండి సింధూనది మాసిపోయినట్టు కనిపిస్తుంది. ఉత్తర దక్షిణంగా హిమాలయాల నుండి వింధ్య వరకు విస్తరించిన భూభాగం సంస్కృత సాహిత్యం మూలంగా ‘ఆర్యావర్తం’ అయిపోయింది. ఇంత పురోభివృద్ధి జరిగినా సంస్కృతానికి ‘లిపి’ లేని కొరత కొన్ని శతాబ్దాల పర్యంతం కొనసాగింది. వ్యాకరణానికి మూలపురుషుడుగా ప్రసిద్ధికెక్కిన ‘పాణిని’ చదువు మౌఖికంగా సాగినదే. ప్రపంచంలో సాటిలేని సాహిత్య గ్రంథంగా నిలిచిపోయిన ‘మహాభారతం’ తరువాతి తరాలకు మౌఖికంగా అందుబాటుకొచ్చిందే.
 
ఆర్యులు గంగామైదానం చేరుకునే పాటికే సింధూ నాగరికత జనావాసాలు అక్కడ పల్చగా విస్తరించి ఉన్నాయి. మెలూహన్ల భాషనూ, సంప్రదాయాలను కొంతమేరకు ఇమిడించుకుని అక్కడికి చేరిన ఆర్యులకు ఈ కొత్త నివాసాలతో సహజీవనం కష్టమైందిగాదు.
 
రచన: ఎం.వి.రమణారెడ్డి
రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement