సాక్షి, మలక్‌పేట: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త (కానిస్టేబుల్) పెట్టే వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. సికింద్రాబాద్‌కు చెందిన శ్రీనివాస్ కుమార్తె పవిత్ర(27), తిరుమలగిరిలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అవినాష్ 2016 జూన్ 6న ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం మలక్‌పేటలోని బి–బ్లాక్ క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. వారికి ఓ కూతురు అవిక్షిత (5) ఉంది.
అయితే కూతురు పుట్టినప్పటినుంచీ అవినాష్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. తాగుడుకు బానిసై అదనపు కట్నం కోసం భార్యను వేధించసాగాడు. మద్యం మత్తులో పవిత్రను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. ఈ విషయమై మహిళా పోలీసుల వద్ద అతనికి కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు. అయినా అతని ప్రవర్తన మారలేదు. ప్రవర్తన మార్చుకుంటానని, మద్యం మానేస్తానని మామ శ్రీనివాస్‌కు చెప్పగా.. కారు కొనుకోవడానికి రూ.2 లక్షలు ఇచ్చాడు.
ఇదిలా ఉండగా.. సోమవారం ఉదయం అవినాష్ డ్యూటీకి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. సాయంత్రం 4.30 గంటలకు అత్త రేణుకకు ఫోన్‌చేసి అరగంట నుంచి తనతో పవిత్ర గొడవ పడుతోందని చెప్పాడు. సాయంత్రం మామకు ఫోన్ చేసి పవిత్ర చీరతో ఉరేసుకుని చనిపోయిందని చెప్పాడు. అల్లుడు అవినాష్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతోనే తన కూతురు చనిపోయిందని మృతురాలు తండ్రి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు అవినాష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment