Tech Executive Accuses Meta of Anti-Asian Bias Files Lawsuit - Sakshi
Sakshi News home page

Meta: ‘మెటా’పై తీవ్ర ఆరోపణలు! కేసు వేసిన ఉ‍ద్యోగిని.. ఏం జరిగిందంటే..

Published Sat, Jul 15 2023 1:19 PM | Last Updated on Sat, Jul 15 2023 1:43 PM

Tech executive accuses Meta of anti Asian bias files lawsuit - Sakshi

Lawsuit on Meta: యూఎస్‌ టెక్‌ దిగ్గజం మెటా (Meta) జాతి వివక్షకు పాల్పడుతోందని, ఆసియన్లను చిన్నచూపు చూస్తోందని ఆరోపిస్తూ వైష్ణవి జయకుమార్ అనే సింగపూర్‌కు చెందిన భారతీయ సంతతి ఉద్యోగిని కాలిఫోర్నియా పౌర హక్కుల విభాగంలో దావా వేశారు. 2020 జనవరిలో మెటా కంపెనీలో చేరిన ఆమె అంతకు ముందు డిస్నీ, గూగుల్, ట్విటర్‌ సంస్థల్లో పనిచేశారు. ప్రమోషన్లలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తనను తక్కువ అనుభవం ఉన్న ఉద్యోగుల కింద చేర్చి అవకాశాలు లేకుండా చేశారని వైష్ణవి వాపోయారు.

ఆసియన్ మహిళ అయిన తనపై ఎలా జాతి వివక్ష చూపారో వైష్ణవీ జయకుమార్ ఇటీవలి లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో రాశారు. గత నెలలో మాస్‌ లేఆఫ్‌ల రూపంలో తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. మెటా కంపెనీలో యూత్ పాలసీ హెడ్‌గా ఉన్న వైష్ణవీ జయకుమార్ మెటా యాప్‌లన్నింటిలో వయసు ఆధారిత పాలసీలు, ఉత్పత్తి లక్షణాలపై పనిచేసే బృందానికి నాయకత్వం వహించేవారు.

మొదటి రెండేళ్లు అంతా బాగానే జరిగిందని, ఆ తర్వాత ప్రమోషన్ గురించి అడిగినప్పుడు జాతి వివక్షను ఎదుర్కొన్నట్లు వైష్ణవి పేర్కొన్నారు. తన మేనేజర్ ఉన్నట్టుండి జాతి వివక్ష చూపడం ప్రారంభించారని చెప్పుకొచ్చారు. తనకు ఇతర అభ్యర్థుల కంటే ఎక్కువ అనుభవం ఉన్నప్పటికీ నాయకత్వ బాధ్యతలకు తాను సీనియర్‌ని కానంటూ యాజమాన్యానికి తప్పుడు నివేదిక ఇచ్చారని వాపోయారు. 

ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో 25 శాతమే..
వైష్ణవీ జయకుమార్ తన దావాలో ఆసియా, పసిఫిక్ ద్వీపవాసుల నిపుణుల నెట్‌వర్క్ ‘అసెండ్‌’ 2022లో చేసిన ఒక అధ్యయనాన్ని ప్రస్తావించారు. దాని ప్రకారం మెటా కంపెనీలోని మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 49 శాతం మంది ఆసియన్‌లు ఉంటే ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో 25 శాతం మంది మాత్రమే ఆసియన్‌లు ఉన్నారు. 2022 చివరి నాటికి మెటా కంపెనీ 11,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది.

ఈ ఏడాది మార్చిలో మరో రౌండ్ మాస్ లేఆఫ్‌లలో మరో 10,000 మందికి ఉద్వాసన పలికింది. సిలికాన్ వ్యాలీలో దీర్ఘకాలంగా ఉన్న జాతి వివక్షకు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని కోరుతూ టెక్ పరిశ్రమలో ఆసియా అమెరికన్లు దాఖలు చేసిన అనేక వ్యాజ్యాలలో వైష్ణవీ జయకుమార్ వేసిన దావా కూడా ఒకటి. అయితే ఈ ఆరోపణలపై మెటా కంపెనీ వర్గాల నుంచి ఇంతవరకు ఎటువంటి వివరణ రాలేదు.

ఇదీ చదవండి: ఎలాన్‌ మస్క్‌పై కోర్టులో దావా: ఇష్టమొచ్చినట్లు తొలగించడం కాదు.. కట్టు రూ. 4వేల కోట్లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement