ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్‌కు భారీ షాక్ తగిలింది. ఒహాయో అటార్నీ జనరల్ డేవిడ్ యోస్ట్ మెటాపై (ఫేస్‌బుక్) దావా వేశారు. ఫేస్‌బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ విజిల్ బ్లోవర్‌గా మారి..ఫేస్‌బుక్ మీద సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె చేస్తున్న ఆరోపణల కంటే ఇప్పుడు ఒహాయో అటార్నీ జనరల్ వేసిన దావా చాలా ప్రమాదకరమని న్యాయనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగి పెట్టిన చిచ్చుకంటే ఇదే పెద్దది
ఓహియో అటార్నీ జనరల్ మెటాపై పరువు నష్టం దావా వేశారు. ఫెడరల్ సెక్యూరిటీల చట్టాన్ని ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. అంతేకాదు ఒహాయో పబ్లిక్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టమ్, ఫేస్‌బుక్ పెట్టుబడిదారుల తరపున ఈ కేసు దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగిగా మారిన విజిల్‌బ్లోయర్ ఫ్రాన్సిస్ హౌగెన్ మొదట వాల్ స్ట్రీట్ జర్నల్‌కు అంతర్గత పత్రాలను లీక్ చేశారు.
ఆ లీక్ చేసిన డాక్యుమెంట్లు కారణంగా పబ్లిక్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టమ్, ఫేస్‌బుక్ పెట్టుబడిదారులు 100 బిలియన్ల మార్కెట్ వాటాను కోల్పోయినట్లు డేవిడ్ యోస్ట్ చెప్పారు. అయితే ఈ దావా మార్క్ జుకర్‌బర్గ్‌లాంటి వ్యక్తుల గురించి కాదని, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యవస్థలపై పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఈ దావాతో పెన్షన్ ఫండ్ నష్టాలను తిరిగి పొందవచ్చని, అలాగే ప్రజలను తప్పుదోవ పట్టించకుండా ఉండటానికి కంపెనీ మార్పులు చేస్తుందని తాను ఆశిస్తున్నట్లు యోస్ట్ ప్రకటనలో పేర్కొన్నారు.
ఫేస్‌బుక్ పై కఠిన చర్యలు తప్పవ్
డేవిడ్ యోస్ట్ చేసిన కేసు అంశంపై మెటా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌పై నమోదైన ఫిర్యాదుల కంటే యోస్ట్ వంటి రాష్ట్ర అటార్నీ జనరల్ వేసిన కేసు ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఎనలిస్ట్ బ్లెయిర్ లెవిన్ చెప్పారు. కోర్టు మెటాను మరిన్ని అంతర్గత పత్రాలను పబ్లిక్ చేయమని ఆదేశించే అవకాశం ఉందని, తద్వారా ఫేస్‌బుక్‌కు మరిన్ని చిక‍్కులు తప్పవని లెవిన్ చెప్పారు.
గతంలోనే యోస్ట్ లేఖ
40 మంది రాష్ట్ర అటార్నీ జనరల్‌లలో ఒకరైన యోస్ట్ గతంలో ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బెర్గ్‌కు లేఖ రాశారు. పిల్లల కోసం డిజైన్ చేసే ఇన్‌స్టాగ్రామ్ వెర్షన్‌పై ఆంక్షలు విధించాలని జుకర్ బెర్గ్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment