ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దెందులూరు మండలం కొవ్వలి వద్ద ఓ కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. వీరంతా కొవ్వలిలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న స్కార్పియో అదుపు తప్పి కాల్వలోకి దూసుకువెళ్లింది.
ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో డ్రైవర్‌తో సహా తొమ్మిదిమంది ఉన్నారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మృతుల్లో ఓ చిన్నారి సహా అయిదుగురు మహిళలు ఉన్నారు. మృతులు కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లపల్లి వాసులుగా గుర్తించారు.
మృతుల వివరాలు...
1. చిన్నాల లక్ష్మి (60)
2. చిన్నాల కుమారి (55)
3. చిన్నాల పాన్యశ్రీ (2)
4. చిన్నాల సులోచన (60)
5. చిన్నాల విజయ (50)
6. చిన్నాల లక్ష్మీవల్లి దేవి (25)
డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఒక్కసారిగా స్టీరింగ్ అదుపు తప్పడంతో వాహనం కాల్వలోకి దూసుకు వెళ్లినట్లు తెలిపారు. వాహనం కాల్వలోకి దూసుకు వెళ్లడంతో డ్రైవర్ వెంటనే బయటకు దూకేసి ప్రాణాలు దక్కించుకున్నాడు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న డీఎస్పీ, జాయింట్ కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని పర్యవేక్షించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
కాగా ఈ ప్రమాదంపై ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
— YSR Congress Party (@YSRCParty) 14 September 2017