ఉపాధికి ఆమడ దూరంలో విద్య | Mallepally Laxmaiah Article On Present Education System | Sakshi
Sakshi News home page

ఉపాధికి ఆమడ దూరంలో విద్య

Published Thu, Apr 8 2021 12:54 AM | Last Updated on Thu, Apr 8 2021 12:56 AM

Mallepally Laxmaiah Article On Present Education System - Sakshi

మన ఇంట్లో, మన ఊళ్లో, మన వీధిలో ఎంతమంది యువకులు పనులు లేక తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తున్నారనేది మనందరికీ తెలుసు. మన దేశంలో విద్యావంతులుగా చెప్పుకుంటున్న వాళ్లలో నూటికి 90 మంది నైపుణ్యం లేని అక్షరాస్యులు మాత్రమే. ఐక్యరాజ్యసమితి నిర్వచనం ప్రకారం, విద్య అంటే అక్షరాస్యత, చదువు, నైపుణ్యం, నైతిక విలువల శిక్షణ. కానీ మనం చదువును మాత్రమే విద్య అంటున్నాం. పారిశ్రామిక, సాంకేతిక సంస్థల, వ్యాపార వాణిజ్య రంగాలకు అవసరమైన నైపుణ్యాలను అందించే విద్యా వ్యవస్థ రావాలి. అప్పుడే మన దేశ నిరుద్యోగ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. కోట్లాది మంది నిరుద్యోగ యువకులకు భవిష్యత్‌ మీద ఒక విశ్వాసం కలుగుతుంది.

‘‘షెడ్యూల్డ్‌ కులాలు ఆర్థికంగా ఎదగడానికి అక్షరాస్యత ఇచ్చే చదువుకన్నా, సాంకేతిక విద్య చాలా ముఖ్యం. సాంకేతిక విద్యను అభ్యసించడం ఈ రోజుల్లో చాలా కష్టం. చాలా ఖర్చుతో కూడుకున్నది. కులతత్వం కలిగిన హిందువులు నైపుణ్యం లేని షెడ్యూల్డ్‌ కులాలను మరింత దోపిడీకి, అణచివేతకు గురిచేస్తారు. అందువల్ల షెడ్యూల్డ్‌ కులాలకు భారత ప్రభుత్వం శాస్త్ర, సాంకేతిక విద్యలో అవకాశాలు కల్పించాలి. నిపుణు లుగా తీర్చిదిద్దాలి’’ అంటూ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 1942 అక్టో బర్‌ 29వ తేదీన ఆనాటి గవర్నర్‌ జనరల్‌కు సమర్పించిన ఒక విజ్ఞాపనలో అభ్యర్థించారు. షెడ్యూల్డ్‌ కులాల సమస్యలపై ఒక సుదీర్ఘమైన మెమోరాండంను అంబేడ్కర్‌ సమర్పించారు. అందులో నాలుగు భాగాలున్నాయి. మొదటిది రాజకీయ ప్రతిపాదనలు, రెండోది విద్యా సంబంధమైన కోర్కెలు, మూడోది, నాలుగోది ప్రధానంగా అంటరానితనం వలన ఎదురవుతున్న సమస్యలు, దాడులు అందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి పేర్కొన్నారు.

అంతేకాకుండా, కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలను కూడా అంబేడ్కర్‌ చేశారు. ఆరోజు ఉనికిలో ఉన్న ఎన్నో సాంకేతికమైన పనులను, శిక్షణ లను ఆయన అందులో ప్రస్తావించారు. ‘‘ఆర్ట్స్, న్యాయ సంబం ధమైన చదువులవల్ల ఎక్కువ ప్రయోజనం ఆశించలేం. శాస్త్ర, సాంకే తిక విద్యవల్ల మాత్రమే షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థులు, హిందూ కులాల విద్యావంతులతో పోటీపడగలరు. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం చొరవచూపి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యను అభ్యసించ అలవడుతున్న షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థులకు ఉపకార వేతనాల ద్వారా సహాయం అందించాలి’’ అని కూడా కోరారు.

ఇవి 80 ఏళ్లనాటి మాటలు. కానీ ఈనాటికీ ఇవి అక్షర సత్యాలు. ఈ మాటలు నేడు కేవలం షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థులకు మాత్రమే పరిమితమై లేవు. శాస్త్ర, సాంకేతిక, వృత్తి నైపుణ్యమైన విద్యను అభ్య సించిన కోట్లాది మంది యువకులు నిరుద్యోగంతో లేదా అర్హతకు సంబంధం లేని పనులతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘ప్యూ’ (pew) అనే సంస్థ నిర్వహించిన అధ్య యనం ప్రకారం ఒక కోటీ 80 లక్షల 60 వేల మంది నిరుద్యోగులు ఉన్నారు. అదే విధంగా 39 కోట్ల 30 లక్షల 70 వేల మంది అరకొర పనులతో, చాలీచాలని జీతాలతో జీవితాలు వెళ్లదీస్తున్నారు. ఇవి అవ గాహనకు మాత్రమే. మనందరికీ తెలుసు మన ఇంట్లో, మన ఊళ్లో, మన వీధిలో ఎంతమంది యువకులు పనులు లేక తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తున్నారనేది. అందుకు చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యమైన అంశం బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 1942లో పేర్కొన్న విషయం.

మన దేశంలో నైపుణ్యం కలిగిన యువకులు పనిచేసే సామర్థ్యం కలిగిన వాళ్లలో కేవలం 4.69 శాతం మాత్రమే. అదే చైనాలో 24 శాతం, 52 శాతం అమెరికాలో, 68 శాతం బ్రిటన్‌లో, 75 శాతం జర్మ నీలో, 80 శాతం జపాన్‌లో, 96 శాతం దక్షిణ కొరియాలో ఉన్నట్టు ఇటీవలి అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అదే విధంగా 2021లో ప్రకటించిన నిరుద్యోగ గణాంకాల ప్రకారం ఇండియాలో చదువు వారీగా నిరుద్యోగుల శాతం ఉన్నది. అందులో గ్రాడ్యుయేట్‌లు 16.3 శాతం, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌లు 14.2 శాతం, సర్టిఫికెట్‌ కోర్సులు చదివిన వాళ్లలో 11.3 శాతం, డిప్లొమా చేసిన వాళ్లలో 11.1 శాతం నిరుద్యో గులుగా ఉన్నారు. అదేవిధంగా హైస్కూల్‌ చదివిన వాళ్లలో 7.4 శాతం, ప్రైమరీ చదివిన వాళ్లలో 5.4 శాతం, నిరక్షరాస్యుల్లో 2 శాతం నిరుద్యోగులు ఉన్నారు. ఉన్నత విద్య చదివిన వాళ్లలో ఎక్కువమంది నిరుద్యోగులుగా ఉన్నారని అర్థమవు తోంది. నిరక్షరాస్యులలో 2 శాతం నిరుద్యోగులుగా ఉన్నారు.. చదువు కున్నవాళ్లలో ఎక్కువమంది నిరుద్యోగులుగా ఉన్నారు.

దీనికి పెద్దగా అధ్యయనాలు, పరిశోధనలు అవసరం లేదు. అయితే విద్యావంతుల్లో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉండటానికి ప్రధానమైనది మన విద్యా వ్యవస్థ. మన చదువుల్లో ఎక్కువమంది ఆర్ట్స్‌ విభాగంలో ఉన్నారు. ఇందులో 30 శాతం మంది విద్యార్థులు ఉండగా, సైన్స్‌లో 16 శాతం మంది, కామర్స్‌లో 14 శాతం మంది, ఇంజనీరింగ్‌లో 12 శాతం మంది, మెడిసిన్‌లో 3 శాతం, ఐటీలో 2.4 శాతం, 2 శాతం మేనేజ్‌ మెంట్‌ కోర్సుల్లో చదువుతున్నట్లుగా ఇటీవల విడుదలైన ఆల్‌ ఇండియా సర్వే ఆన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో వెల్లడైంది. ఆర్ట్స్, కామర్స్, సైన్స్‌ రంగాలు కలిసి 60 శాతం మంది చదువుతున్నారు. ఉద్యోగావకాశాలు ఉన్న ఇంజనీరింగ్, మెడిసిన్, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నా లజీ, మేనేజ్‌మెంట్‌ కోర్సులో చాలా తక్కువమంది ఉన్నారు. ఇందులో ఇంజనీరింగ్‌లో 12 శాతం ఉన్నారు. మనకు తెలుసు మన దేశంలో ఇంజనీరింగ్‌ చదువులు ఎంత ఉన్నతంగా ఉన్నాయో. మెడిసిన్‌ మేనే జ్‌మెంట్, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీలు కొంత మెరుగ్గా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.

మన దేశంలో విద్యా వ్యవస్థ ఇటువంటి ప్రణాళిక లేని ఒక అగమ్యగోచరమైన విధానంగా కొనసాగుతున్నది. ఇక్కడ విద్యా వంతులుగా చెప్పుకుంటున్న వాళ్లలో నూటికి 90 మంది నైపుణ్యం లేని అక్షరాస్యులు మాత్రమే. మనం విద్యను తప్పుగా అర్థం చేసుకున్నాం. ఐక్యరాజ్యసమితి నిర్వచనం ప్రకారం, విద్య అంటే అక్షరాస్యత, చదువు, నైపుణ్యం, నైతిక విలువల శిక్షణ. కానీ మనం చదువును మాత్రమే విద్య అంటున్నాం. కోటి విద్యలు కూటి కొరకే అన్న నానుడి మనందరికీ తెలుసు. దానర్థం కోటి చదువులు అని కాదు. కోటి విధాలైన నైపుణ్యం కలిగిన పనులు అని అర్థం. కానీ, మన విద్యా వ్యవస్థ పూర్తిగా వక్రమార్గంలో పయనిస్తున్నది. 

మన ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాలలోనైనా మంచి చదువును అంది స్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు పేద విద్యా ర్థులకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మరీ చదువును నేర్పిస్తున్నాయి. ఇంటర్‌ తర్వాత వాళ్లలో ఎక్కువమంది ఇప్పటివరకు మనం పేర్కొన్న నైపుణ్యంలేని డిగ్రీలు పుచ్చుకున్నారు. ఫలితంగా నిరుద్యోగుల జాబి తాలో చేరుతున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ప్రభుత్వాల కన్నా అధికంగా తమ పిల్లల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. తమ పిల్లలు పెద్ద చదువులు చదువుతూ మంచి ఉద్యోగం చేస్తారని ఆశించి భంగపడుతున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన సునీల్‌ లాంటి యువకులు తమ ప్రాణాలను వదులుకుంటున్నారు. కారణం సునీల్‌∙నైపుణ్యం లేని డిగ్రీ పాస్‌ కావడమే. లక్షలాదిమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడు తున్నారు. ప్రైవేట్‌ రంగంలో కావాల్సిన నైపుణ్యాన్ని విద్యా వ్యవస్థ వారికి అందించలేకపోతున్నది. భవిష్యత్‌లో చాలా రంగాల్లో అధు నాతన పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యం కలిగిన యువకులకు మాత్రమే ఉద్యోగాలు ఉండబోతు న్నాయి. ప్రభుత్వాలు తమ పరిపాలన కోసం వేలమందిని తీసు కోవచ్చు. కానీ లక్షల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. అందుకే ఈ పరిస్థితి మారాలంటే నిరుద్యోగులుగా ఉన్న యువతకు భరోసా కల్పించి, వారికి సాంకేతికపరమైన శిక్షణను అందించాలి. వారి అభి రుచినిబట్టి ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలి.
దానితోపాటు మన విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేయాలి. పారిశ్రామిక, సాంకేతిక సంస్థల, వ్యాపార వాణిజ్య రంగా లకు అవసరమైన నైపుణ్యాలను అందించే విద్యా వ్యవస్థ రావాలి. చాలా ఏళ్లుగా జర్మనీలో అమలు జరుగుతున్న విద్యా వ్యవస్థను అధ్యయనం చేసి, మన దేశానికి అవసరమైన వారితో మనం దానిని అన్వయించుకోగలిగితే, మన దేశ నిరుద్యోగ సమస్యకు ఒక పరి ష్కారం దొరుకుతుంది. కోట్లాదిమంది నిరుద్యోగ యువకులకు భవిష్యత్‌మీద ఒక విశ్వాసం కలుగుతుంది. అటువైపుగా అందరం ఆలోచించాలి.

వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య 
సామాజిక విశ్లేషకులు
మొబైల్‌ : 81063 22077

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement