‘‘అణగారిన వర్గాల, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీల విద్య, ఆర్థికాభివృద్ధికోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరమున్నది. అన్ని రకాల వివక్షల నుంచి, దోపిడీ నుంచి వారిని విముక్తి చేయాలి’’ అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 మనకు నిర్దేశిస్తున్నది. మను షులంతా ఒక్కటేననే సమానత్వ భావ నను చట్టబద్ధం చేసింది ఈ రాజ్యాంగం ద్వారానే. అయితే భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 73 ఏండ్లు దాటింది. రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏళ్ళు నిండాయి. అయినా రాజ్యాంగ పూర్తి స్ఫూర్తి మన పాలనలో కనపడడం లేదు. అక్కడక్కడ, అప్పుడప్పుడు కేంద్రంలో, రాష్ట్రాల్లో కొన్ని ప్రభుత్వాలు కొన్ని విధానాలను రూపొందించినప్పటికీ అవి అమ లులో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ఎస్సీ, ఎస్టీల కోసం రూపొందించిన విధానాలు, చట్టాలు పరిమితమైన ఫలితాలను మాత్రమే ఇస్తున్నాయి. అటువంటి విధానమే ఎస్సీ, ఎస్టీల సామాజిక, ఆర్థికాభివృద్ధికోసం ప్రత్యేకించిన నిధుల కేటాయింపులు, బడ్జెట్ విధానాలు. 1974లో మొదటిసారి ట్రైబల్ సబ్‌ప్లాన్, 1979–80లలో ఎస్సీల కోసం స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ విధా నాలు కూడా అందులో భాగంగా వచ్చినవే. ఆ తర్వాత 2006లో స్పెషల్ కాంపోనెంట్ పేరును షెడ్యూల్ కాస్ట్స్ సబ్‌ప్లాన్‌గా మార్చారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటా యింపులు ఉండాలనేది దాని ఉద్దేశం.
అయితే 2014లో కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్‌లో కొన్ని మార్పులు చేశారు. అప్పటి వరకు ఉన్న ప్లాన్, నాన్‌ప్లాన్‌ల పేర్లను తొలగించి, క్యాపిటల్, రెవెన్యూ పేర్లను మాత్రమే ఉంచారు. దీనితో సబ్‌ప్లాన్ అనే పదం మాయమైపోయింది. అంతే కాకుండా, అప్పటివరకు ఉనికిలో ఉన్న ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటుచేశారు. అప్పటివరకు ప్లానింగ్ కమిషన్ చూస్తున్న కర్తవ్యాలను నీతి ఆయోగ్ కిందకి చేర్చారు. దీంతో ఎస్సీ సబ్‌ప్లాన్, ట్రైబల్ సబ్‌ప్లాన్‌ల మీద సమీక్ష చేయాల్సి వచ్చింది. 2017లో నీతి ఆయోగ్ ఒక కమిటీని వేసింది. అది 2019లో కొన్ని ప్రతిపాదనలు చేసింది. అందులో ఎస్సీ సబ్‌ప్లాన్ పేరును డెవలప్‌మెంట్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఎస్సీ (డీఏపీఎస్‌సీ), ట్రైబల్ సబ్‌ప్లాన్‌ను డెవలప్‌మెంట్ యాక్షన్ ప్లాన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్(డీఏపీఎస్‌టీ)గా మార్చారు. అదేవిధంగా మరికొన్ని ప్రతిపాదనలు కూడా చేశారు.
కేంద్ర ప్రభుత్వంలోని చాలా శాఖలు ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన డబ్బులను పూర్తిగా ఖర్చుచేయటంలేదని, మరి కొన్ని శాఖలైతే అసలు నిధులను వినియోగించటంలేదని నీతి ఆయోగ్ గుర్తించింది. అంత వరకు అది నిజమే. అంతేకాకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిగణనలోనికి తీసుకొని, ఏఏ శాఖలైతే ఎస్సీ, ఎస్టీల కోసం పథకాలను రూపొం దించి, అమలు చేస్తున్నాయో వాటికి మాత్రమే నిధులను అధి కంగా కేటాయించాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అంతే కాకుండా నీతి ఆయోగ్ నివేదికలో కూడా బడ్జెట్ నిధులు పక్క దారి పట్టకుండా, ఖర్చు కాకుండా ఉండడం లాంటి చర్యలు జరగ కూడదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలలోని చాలా కులాలు, తెగలు కనీసం అభివృద్ధికి నోచుకోవడం లేదని, వాళ్ల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉందని నీతి ఆయోగ్ సూచించింది.
దీనిపై 2001వ సంవత్సరం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రయత్నం ప్రారంభమైంది. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించే నిధుల దుర్విని యోగంపై ప్రారంభమైన చర్చ, పరిష్కారం చట్టం మాత్రమేనని, అందుకోసం ఉద్యమించే వరకు వెళ్ళింది. అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, మీడియా గ్రూప్‌లన్నీ ముక్తకం ఠంతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం కోసం డిమాండ్ చేశాయి. దాని ఫలితంగా, సుదీర్ఘ పోరాటాల అనంతరం 2012లో చట్టం ఆమోదం పొందింది. 2013 జనవరిలో ఈ సబ్‌ప్లాన్ చట్టం అమలులోకి వచ్చింది. కేంద్రంలో బడ్జెట్‌లో వచ్చిన మార్పులకను గుణంగా తెలంగాణ ప్రభుత్వం, మరొక చట్టాన్ని ఆమోదించింది. అమలులోకి తెచ్చింది. దానిపేరు ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ యాక్ట్. ఆంధ్రప్రదేశ్‌లో సైతం సబ్‌ప్లాన్ చట్టం అమలు అవుతోంది. అక్కడ ఎస్సీ, ఎస్టీలకు అనేక పథకాలు సైతం ప్రవేశపెట్టారు. ఈ చట్టాలలోని అంశాలను అధ్యయనం చేసి, కేంద్ర స్థాయిలో ఒక చట్టాన్ని రూపొందించడానికి నీతి ఆయోగ్ ప్రతిపాదన చేసి ఉంటే బాగుండేది. నీతి ఆయోగ్ ఆశిం చినట్టుగానే ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన నిధులు సద్విని యోగం కావాలంటే కొన్ని చర్యలు శీఘ్రగతిన చేపట్టాలి. అందులో ముఖ్య మైనది చట్టం రూపకల్పన.
దానితో పాటు ఎస్సీ, ఎస్టీల సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వ బడ్జెట్‌లలోవారి జనాభా దామాషా ప్రకారం నిధులను కేటాయించాలి. అయితే ఈ నిధులు నేరుగా వివిధ శాఖలకు కేటా యించకుండా, కేటాయించిన మొత్తాన్ని బడ్జెట్ నుంచి తీసి నోడల్ ఏజెన్సీలైన ఎస్సీ, ఎస్టీ డిపార్ట్‌మెంట్‌ల ఖాతాలకు జమ చేయాలి. ఎస్సీ, ఎస్టీల కోసం ఏఏ డిపార్ట్‌మెంట్‌లైతే పథకాలను రూపొం దిస్తాయో, వాటిని పరిశీలించి నోడల్ ఏజెన్సీలు, ఆయా డిపార్ట్ మెంట్‌లకు కేటాయించాలి. అంతేకాకుండా ఒక సంవత్సరం కేటా యించిన నిధులు అదే సంవత్సరం ఖర్చు కాకపోతే, మరుసటి ఏడాదికి తిరిగి కేటాయించే విధానాన్ని చట్టంలో పొందుపర్చాలి. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీలలో ఉన్న వివిధ కులాలు, తెగల కోసం ప్రత్యేకించి మరింత వెనుకబడిన కులాల కోసం ప్రత్యేక ప్యాకేజీలు కూడా తయారు చేయాలి. నూటికి 25 శాతంగాఉన్న ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి గత డెబ్భై ఏళ్ళలో ఆశించినంతగా ముందుకు సాగలేదు. విద్య, ఉద్యోగాలు, ఆర్థిక వనరులు, భూమి, గృహ సౌకర్యాలు, మౌలిక సదుపాయాలన్నింటిలో ఇంకా వ్యత్యాసం, అంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. 1974 వరకు ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు కార్యక్రమాలు దళిత వాడలకు, ఆదివాసీ గూడేలకు చేరలేదు. రోడ్లు, విద్యుత్, పాఠశాలలు, వైద్యశాలలు, మంచి నీటి సరఫరా లాంటి సౌకర్యాలు ఈ వర్గాలకు గగన కుసుమాలైనాయి. అందువల్లనే ఆనాటి రాజకీయ నాయకత్వం ప్రత్యేకించి ఇందిరాగాంధీ, కొంతమంది నిబద్ధత కలిగిన పి.ఎస్.కృష్ణన్, ఎస్.ఆర్. శంకరన్ లాంటి అధికారుల చొరవతో ఇటువంటి ఆలోచనలు, ఆచరణ రూపం దాల్చాయి.
దీనికి కొంత చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీల కోసం ముఖ్యంగా విద్య కోసం ప్రత్యేక పాఠశాలలు కావాలనే ఆలోచన 1882లోనే సామాజిక విప్లవకారుడు జ్యోతీరావ్ ఫూలే నుంచి మొదలైంది. అదేవిధంగా 1927లో బాబాసాహెబ్ అంబే డ్కర్ బొంబాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న సమ యంలో బడ్జెట్‌పై చర్చ జరిగిన సమయంలో ప్రత్యేక హాస్టల్స్ గురించి ప్రస్తావించి, అందుకోసం కొంత మొత్తాన్ని ప్రత్యేకంగా కేటాయించాలని కోరారు. వీటన్నింటి మేళవింపే రాజ్యాంగం లోని ఆర్టికల్–46. దానిఫలితమే సబ్‌ప్లాన్‌ల పథకాలు, విధా నాలు. అంటే ఒక పథకం వెనుక ఎంతో చారిత్రక కృషి ఉంటుంది. ప్రభుత్వాలు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా సమాజంలోని అణగారిన వర్గాల కోసం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు పేద వాళ్లకోసమే ఆలోచించాలి. కానీ ఈ రోజు ఇది తల్లకిందులైంది. పేదలు, అణగారిన వర్గాలు, దళితులు, ఆది వాసీలు ప్రభుత్వాల ఎజెండాలో ఎటువంటి ప్రాధాన్యతను సంత రించుకోకపోవడం విచారకరం.
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మల్లెపల్లి లక్ష్మయ్య
మొబైల్ : 81063 22077
సబ్‌ప్లాన్ అమలులో చిత్తశుద్ధి లోపం
Published Thu, Aug 27 2020 1:05 AM | Last Updated on Thu, Aug 27 2020 1:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment