Kottakonam
-
కెడిసేథి; ఒక తరం సైద్ధాంతిక స్వరం
‘‘భారతదేశంలో ఐక్యమయ్యే ప్రక్రియను ఏ శక్తులూ అడ్డుకోలేవు. కానీ ఈ ఐక్యత, విలీనం ప్రభు త్వంతో మాత్రం కాదు. భారత దేశంలోని అశేష ప్రజానీకం, కార్మి కులు, కర్షకులతో మనం కలిసి పనిచేయబోతున్నాం. భూ సంస్కర ణలను అడ్డుకుంటున్న రాచరిక పాలనను మనం అనుసరించ కూడదు. ప్రజలందరూ ఈ నిర్ణయాన్ని హర్షిస్తారు. దేశ రైతాంగంతో పాటు, తెలంగాణ రైతులు కూడా మన వెనుక ఉంటారు. ప్రగతిశీల, ప్రజాస్వామిక శక్తులు, వ్యక్తులు పార్ల మెంటులోనూ, బయటా మనకు మద్దతిస్తారని నేను విశ్వ సిస్తున్నాను.’’ కశ్మీర్ విప్లవోద్యమ నాయకుడు, నక్సలైట్ ఉద్యమనేత కె.డి.సేథి తన 26వ ఏట జమ్మూ–కశ్మీర్ రాజ్యాంగ సభలో చేసిన ప్రసంగ వాక్యాలివి. కె.డి.సేథిగా అందరికీ పరిచ యమున్న క్రిషన్ దేశ్ సేథి జనవరి 28న, తన 93వ ఏట తుదిశ్వాస విడిచారు. ఆయన కశ్మీర్ రాజ్యాంగ సభ సభ్యులలో చివరివాడు. కశ్మీర్‌ను ఒకవైపు భారతదేశంలో విలీనం చేస్తూనే, తనకంటూ ఒక రాజ్యాంగాన్ని జమ్మూ కశ్మీర్ నిర్మించుకుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిన ఆ రాజ్యాంగ సభలో సేథి అందరికన్నా వయస్సులో చిన్నవారు. అయినప్పటికీ జూన్ 11, 1952న ఆయన చేసిన ప్రసంగం ఎంతో సైద్ధాంతిక చైతన్యాన్ని ప్రదర్శించింది. ‘‘అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు ప్రజా స్వామ్య ప్రభుత్వాలుగా చెప్పుకుంటున్నాయి. కానీ పెట్టుబడి దారులకే ప్రజాస్వామ్య కేంద్రాలు. ప్రజలకు ఓటింగ్ హక్కు ఇవ్వడం మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. మనం ఆశిస్తున్నది, విశ్వసిస్తున్నది సామాజిక ప్రజాస్వామ్యం’’ అంటూ ఆయన నిజమైన ప్రజాస్వామ్య విలువలను గుర్తుచేశారు. కె.డి. సేథి జమ్మూ ప్రాంతంలోని మీర్పూర్లో జనవరి 1న 1928లో జన్మించారు. 15 ఏళ్ళ వయస్సులోనే ప్రజా ఉద్యమంలో అడుగుపెట్టారు. తెలుగు ప్రజల ఉద్యమాలు, ప్రత్యేకించి తెలంగాణ సాయుధ పోరాటమంటే ఎనలేని ప్రేమ. 1975లో చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలోని సీపీఐ (ఎంఎల్) పార్టీలో చేరారు. సత్యనారాయణ సింగ్ నాయ కత్వంలో ఉన్న సేథి అంతిమంగా చండ్ర పుల్లారెడ్డితోనే కొనసాగారు. అప్పటి కేంద్ర కమిటీ నాయకులు పైలా వాసుదేవరావుతో పాటు నక్సలైట్ ఉద్యమ నాయకులతో ఎంతో సన్నిహిత సంబంధాలుండేవి. ఐఎఫ్టియూ వ్యవ స్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. అనేక సార్లు తెలుగు రాష్ట్రా నికి వచ్చారు. విప్లవోద్యమంతో సంబంధాలున్న 1977 నాటి కార్యకర్తల్లో ఆయన పేరు తెలియని వారుండరు. చండ్ర పుల్లారెడ్డి మరణానంతరం జరిగిన బహిరంగ సభకు హాజరై హృదయపూర్వక నివాళులు అర్పించారు. సీపీఐ ఎంఎల్ పార్టీలో వచ్చిన చీలికల అనంతరం కూడా విప్లవోద్యమం లోనే కొనసాగారు. ఆయన మొట్టమొదట నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులైన సర్దార్ బుద్సింగ్, రాజ్ మహమ్మద్ అక్బర్ ఖాన్, మౌలానా అబ్దుల్లా లాంటి సీని యర్ నాయకులతో పనిచేసిన అనుభవం సేథి సొంతం. 1946లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రారంభమైన క్విట్ కశ్మీర్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. అందుకుగానూ రెండేళ్ళ జైలు జీవితం గడపాల్సి వచ్చింది. కశ్మీర్ మహారాజు రాచరిక పాలనలో సాగిన అకృత్యాలకు, దోపిడీకి వ్యతి రేకంగా సాగిన ఉద్యమంలో కూడా ఆయన పాత్ర మరువ లేనిది. డోగ్రా ప్రాంతంలో భూస్వాములు, వడ్డీ వ్యాపారస్తులు చేసిన దాడులను ప్రతిఘటించడంలోనూ ప్రధాన పాత్ర పోషించారు. రైతులను, కూలీలను ఈ ప్రతిఘటనలో సమీకరించడంలో సఫలీకృతులయ్యారు. 1953లో షేక్ అబ్దుల్లాతో వచ్చిన విభేదాల వల్ల నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి బయటకు వచ్చి, డెమొక్రటిక్ నేషనల్ కాన్ఫరెన్స్ స్థాపించారు. లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఇది ఏర్పాటైంది. ప్రారంభం లోనే ఆ పార్టీకి 19 మంది శాసనసభ్యులుండేవారు. అయితే ఆ తర్వాత డెమొక్రటిక్ నేషనల్ కాన్ఫరెన్స్ తగినంత ప్రతి ఘటనను ప్రదర్శించలేకపోవడం వల్ల సీపీఐలో, ఆ తర్వాత సీపీఎంలో, దాని నుంచి సీపీఐ(ఎంఎల్)లో చేరారు. జమ్మూ కశ్మీర్లో ఇప్పటికీ బలమైన ఉద్యోగ సంఘానికి ఆయన నాయకత్వం వహించారు. అదే సమయంలో రాజ కీయపరమైన సిద్ధాంతాలను పత్రికల ద్వారా ప్రజలకు తెలి యజేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కశ్మీర్ విషయంలో ఆయన అభిప్రాయాలు విలువైనవి. ఇటీవల భారతీయ జనతా పార్టీ జమ్మూ–కశ్మీర్‌ను మూడు భాగాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో 1999లో రాసిన ఒక వ్యాసంలో తన వ్యతిరేకతను తెలియజేశారు. ఇది అమెరికా సామ్రాజ్య వాదుల కుట్రగా ఆయన అభివర్ణించారు. 1950లో ఐక్య రాజ్యసమితి నియమించిన డిక్షన్ కమిటీ కశ్మీర్‌ను విభజిం చాలని సూచించింది. ఇది కశ్మీర్ ప్రజల మనోభావాలకు విరుద్ధమైనదని ఆయన విమర్శించారు. జమ్మూ–కశ్మీర్‌లోని జమ్మూ, లద్దాఖ్, కశ్మీర్ ప్రాంతాలు సాంస్కృతికంగా, ఆర్థి కంగా ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయనీ, ఈ విభజన కశ్మీర్ సమస్యకు పరిష్కారం కాదనీ అన్నారు. ఈ రోజు కూడా ఈ విభజన సత్ఫలితాలను ఇస్తుందనే విశ్వాసం ఎవరికీ లేదు. అందుకుగానూ ఆయన పరిష్కార మార్గాలు కూడా విడమర్చి చెప్పారు. మొదటిది, పాకిస్తాన్–భారత్ రెండు దేశాలు చిత్తశుద్ధితో చర్చలు జరిపి, కశ్మీర్ విషయంలో ఒక అంగీకారానికి రావాలి. ఇందులో అమెరికాలాంటి సామ్రాజ్యవాద దేశాల ప్రమేయం ససేమిరా ఉండకూడదని హెచ్చరించారు. రెండో విధానం, కశ్మీర్‌లోని అన్ని ప్రాంతాల, వర్గాల, మతాల ప్రజలతో విస్తృతంగా చర్చించి, కొన్ని పరిష్కారాలను నిర్ధారించాలి. గత ప్రభుత్వాలు గానీ, ప్రస్తుత ప్రభుత్వం గానీ అటువంటి ప్రయత్నం చేయలేదు. చేస్తారనే నమ్మకం కూడా లేదు. కె.డి. సేథీకి భారత ప్రజాస్వామిక, విప్లవోద్యమంలో ఉన్నతమైన స్థానం ఉంది. ఆయన సాగించిన ఉద్యమాలు, చేసిన ఆలోచనలు భవిష్యత్ ప్రజాస్వామిక ఉద్యమాలకు, విప్లవ పోరాటాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. 20వ శతాబ్దం విప్లవ యోధులలో చివరి హీరోగా, ఎన్నో జ్ఞాప కాలను, అనుభవాలను భారతదేశ పీడిత ప్రజలకు ఆయన అందించారు. ఆ అనుభవాలే వర్తమాన రాజకీయ పరిస్థితు లను ఎదుర్కోవడానికి స్ఫూర్తిగా నిలుస్తాయి. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
సబ్‌ప్లాన్ అమలులో చిత్తశుద్ధి లోపం
‘‘అణగారిన వర్గాల, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీల విద్య, ఆర్థికాభివృద్ధికోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరమున్నది. అన్ని రకాల వివక్షల నుంచి, దోపిడీ నుంచి వారిని విముక్తి చేయాలి’’ అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 మనకు నిర్దేశిస్తున్నది. మను షులంతా ఒక్కటేననే సమానత్వ భావ నను చట్టబద్ధం చేసింది ఈ రాజ్యాంగం ద్వారానే. అయితే భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 73 ఏండ్లు దాటింది. రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏళ్ళు నిండాయి. అయినా రాజ్యాంగ పూర్తి స్ఫూర్తి మన పాలనలో కనపడడం లేదు. అక్కడక్కడ, అప్పుడప్పుడు కేంద్రంలో, రాష్ట్రాల్లో కొన్ని ప్రభుత్వాలు కొన్ని విధానాలను రూపొందించినప్పటికీ అవి అమ లులో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ఎస్సీ, ఎస్టీల కోసం రూపొందించిన విధానాలు, చట్టాలు పరిమితమైన ఫలితాలను మాత్రమే ఇస్తున్నాయి. అటువంటి విధానమే ఎస్సీ, ఎస్టీల సామాజిక, ఆర్థికాభివృద్ధికోసం ప్రత్యేకించిన నిధుల కేటాయింపులు, బడ్జెట్ విధానాలు. 1974లో మొదటిసారి ట్రైబల్ సబ్‌ప్లాన్, 1979–80లలో ఎస్సీల కోసం స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ విధా నాలు కూడా అందులో భాగంగా వచ్చినవే. ఆ తర్వాత 2006లో స్పెషల్ కాంపోనెంట్ పేరును షెడ్యూల్ కాస్ట్స్ సబ్‌ప్లాన్‌గా మార్చారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటా యింపులు ఉండాలనేది దాని ఉద్దేశం. అయితే 2014లో కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో కొన్ని మార్పులు చేశారు. అప్పటి వరకు ఉన్న ప్లాన్, నాన్ప్లాన్ల పేర్లను తొలగించి, క్యాపిటల్, రెవెన్యూ పేర్లను మాత్రమే ఉంచారు. దీనితో సబ్‌ప్లాన్ అనే పదం మాయమైపోయింది. అంతే కాకుండా, అప్పటివరకు ఉనికిలో ఉన్న ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటుచేశారు. అప్పటివరకు ప్లానింగ్ కమిషన్ చూస్తున్న కర్తవ్యాలను నీతి ఆయోగ్ కిందకి చేర్చారు. దీంతో ఎస్సీ సబ్‌ప్లాన్, ట్రైబల్ సబ్ప్లాన్ల మీద సమీక్ష చేయాల్సి వచ్చింది. 2017లో నీతి ఆయోగ్ ఒక కమిటీని వేసింది. అది 2019లో కొన్ని ప్రతిపాదనలు చేసింది. అందులో ఎస్సీ సబ్‌ప్లాన్ పేరును డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఎస్సీ (డీఏపీఎస్సీ), ట్రైబల్ సబ్‌ప్లాన్‌ను డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్(డీఏపీఎస్టీ)గా మార్చారు. అదేవిధంగా మరికొన్ని ప్రతిపాదనలు కూడా చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని చాలా శాఖలు ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన డబ్బులను పూర్తిగా ఖర్చుచేయటంలేదని, మరి కొన్ని శాఖలైతే అసలు నిధులను వినియోగించటంలేదని నీతి ఆయోగ్ గుర్తించింది. అంత వరకు అది నిజమే. అంతేకాకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిగణనలోనికి తీసుకొని, ఏఏ శాఖలైతే ఎస్సీ, ఎస్టీల కోసం పథకాలను రూపొం దించి, అమలు చేస్తున్నాయో వాటికి మాత్రమే నిధులను అధి కంగా కేటాయించాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అంతే కాకుండా నీతి ఆయోగ్ నివేదికలో కూడా బడ్జెట్ నిధులు పక్క దారి పట్టకుండా, ఖర్చు కాకుండా ఉండడం లాంటి చర్యలు జరగ కూడదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలలోని చాలా కులాలు, తెగలు కనీసం అభివృద్ధికి నోచుకోవడం లేదని, వాళ్ల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉందని నీతి ఆయోగ్ సూచించింది. దీనిపై 2001వ సంవత్సరం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రయత్నం ప్రారంభమైంది. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించే నిధుల దుర్విని యోగంపై ప్రారంభమైన చర్చ, పరిష్కారం చట్టం మాత్రమేనని, అందుకోసం ఉద్యమించే వరకు వెళ్ళింది. అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, మీడియా గ్రూప్‌లన్నీ ముక్తకం ఠంతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం కోసం డిమాండ్ చేశాయి. దాని ఫలితంగా, సుదీర్ఘ పోరాటాల అనంతరం 2012లో చట్టం ఆమోదం పొందింది. 2013 జనవరిలో ఈ సబ్‌ప్లాన్ చట్టం అమలులోకి వచ్చింది. కేంద్రంలో బడ్జెట్లో వచ్చిన మార్పులకను గుణంగా తెలంగాణ ప్రభుత్వం, మరొక చట్టాన్ని ఆమోదించింది. అమలులోకి తెచ్చింది. దానిపేరు ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ యాక్ట్. ఆంధ్రప్రదేశ్‌లో సైతం సబ్‌ప్లాన్ చట్టం అమలు అవుతోంది. అక్కడ ఎస్సీ, ఎస్టీలకు అనేక పథకాలు సైతం ప్రవేశపెట్టారు. ఈ చట్టాలలోని అంశాలను అధ్యయనం చేసి, కేంద్ర స్థాయిలో ఒక చట్టాన్ని రూపొందించడానికి నీతి ఆయోగ్ ప్రతిపాదన చేసి ఉంటే బాగుండేది. నీతి ఆయోగ్ ఆశిం చినట్టుగానే ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన నిధులు సద్విని యోగం కావాలంటే కొన్ని చర్యలు శీఘ్రగతిన చేపట్టాలి. అందులో ముఖ్య మైనది చట్టం రూపకల్పన. దానితో పాటు ఎస్సీ, ఎస్టీల సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వ బడ్జెట్లలోవారి జనాభా దామాషా ప్రకారం నిధులను కేటాయించాలి. అయితే ఈ నిధులు నేరుగా వివిధ శాఖలకు కేటా యించకుండా, కేటాయించిన మొత్తాన్ని బడ్జెట్ నుంచి తీసి నోడల్ ఏజెన్సీలైన ఎస్సీ, ఎస్టీ డిపార్ట్మెంట్ల ఖాతాలకు జమ చేయాలి. ఎస్సీ, ఎస్టీల కోసం ఏఏ డిపార్ట్మెంట్లైతే పథకాలను రూపొం దిస్తాయో, వాటిని పరిశీలించి నోడల్ ఏజెన్సీలు, ఆయా డిపార్ట్ మెంట్లకు కేటాయించాలి. అంతేకాకుండా ఒక సంవత్సరం కేటా యించిన నిధులు అదే సంవత్సరం ఖర్చు కాకపోతే, మరుసటి ఏడాదికి తిరిగి కేటాయించే విధానాన్ని చట్టంలో పొందుపర్చాలి. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీలలో ఉన్న వివిధ కులాలు, తెగల కోసం ప్రత్యేకించి మరింత వెనుకబడిన కులాల కోసం ప్రత్యేక ప్యాకేజీలు కూడా తయారు చేయాలి. నూటికి 25 శాతంగాఉన్న ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి గత డెబ్భై ఏళ్ళలో ఆశించినంతగా ముందుకు సాగలేదు. విద్య, ఉద్యోగాలు, ఆర్థిక వనరులు, భూమి, గృహ సౌకర్యాలు, మౌలిక సదుపాయాలన్నింటిలో ఇంకా వ్యత్యాసం, అంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. 1974 వరకు ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు కార్యక్రమాలు దళిత వాడలకు, ఆదివాసీ గూడేలకు చేరలేదు. రోడ్లు, విద్యుత్, పాఠశాలలు, వైద్యశాలలు, మంచి నీటి సరఫరా లాంటి సౌకర్యాలు ఈ వర్గాలకు గగన కుసుమాలైనాయి. అందువల్లనే ఆనాటి రాజకీయ నాయకత్వం ప్రత్యేకించి ఇందిరాగాంధీ, కొంతమంది నిబద్ధత కలిగిన పి.ఎస్.కృష్ణన్, ఎస్.ఆర్. శంకరన్ లాంటి అధికారుల చొరవతో ఇటువంటి ఆలోచనలు, ఆచరణ రూపం దాల్చాయి. దీనికి కొంత చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీల కోసం ముఖ్యంగా విద్య కోసం ప్రత్యేక పాఠశాలలు కావాలనే ఆలోచన 1882లోనే సామాజిక విప్లవకారుడు జ్యోతీరావ్ ఫూలే నుంచి మొదలైంది. అదేవిధంగా 1927లో బాబాసాహెబ్ అంబే డ్కర్ బొంబాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న సమ యంలో బడ్జెట్‌పై చర్చ జరిగిన సమయంలో ప్రత్యేక హాస్టల్స్ గురించి ప్రస్తావించి, అందుకోసం కొంత మొత్తాన్ని ప్రత్యేకంగా కేటాయించాలని కోరారు. వీటన్నింటి మేళవింపే రాజ్యాంగం లోని ఆర్టికల్–46. దానిఫలితమే సబ్ప్లాన్ల పథకాలు, విధా నాలు. అంటే ఒక పథకం వెనుక ఎంతో చారిత్రక కృషి ఉంటుంది. ప్రభుత్వాలు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా సమాజంలోని అణగారిన వర్గాల కోసం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు పేద వాళ్లకోసమే ఆలోచించాలి. కానీ ఈ రోజు ఇది తల్లకిందులైంది. పేదలు, అణగారిన వర్గాలు, దళితులు, ఆది వాసీలు ప్రభుత్వాల ఎజెండాలో ఎటువంటి ప్రాధాన్యతను సంత రించుకోకపోవడం విచారకరం. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మల్లెపల్లి లక్ష్మయ్య మొబైల్ : 81063 22077 -
‘సంతోషం’ శరణం గచ్ఛామి
కొత్త కోణం ఈ దేశాలన్నింటిలో బౌద్ధం అనుసరిస్తున్న ప్రజలు మెజారిటీగా ఉన్నారు. శాంతి, ప్రశాంతతతో కూడిన మానవాభివృద్ధిని ఇప్పటికే భూటాన్ ప్రతిపాదించింది. చాలా దేశాలు ఆ మార్గంలో ఉన్నాయి. ఆర్థికంగా ఈ దేశాలు అభివృద్ధి చెందిన కొద్దీ బౌద్ధం శక్తి కూడా ప్రపంచవ్యాప్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది గుర్తించడం వల్లనే ఎక్కడైతే బౌద్ధం పురుడుపోసుకొని అడుగులేసిందో ఆ భారతదేశంలోని రాజకీయ నాయకత్వాలు కూడా బౌద్ధం శక్తిని, బౌద్ధాన్ని అనుసరిస్తున్న దేశాల స్నేహాన్ని కాంక్షిస్తున్నాయి. ‘నాకు సంతోషం కావాలి’ అంటూ ఒక వ్యక్తి గౌతమ బుద్ధుడిని ఆశ్రయిం చాడు. అప్పుడు బుద్ధుడు ముందుగా నీ వాక్యంలోని ‘నాకు’ అనే పదాన్ని తొలగించు, అది అహానికి సంకేతం. అలాగే ‘కావాలి’ అనే పదాన్ని తొలగిం చుకో. అది కోరికకూ, ఆశకూ కొలమానం అన్నాడు. ఆ తరువాత నీకు మిగి లేది సంతోషం ఒక్కటే అని చెప్పాడు బుద్ధుడు. ఆ సమాధానం కేవలం ఆ వ్యక్తికి పరిమితం కాదు. సంస్థలకు, సమూహాలకు, రాజులకు, రాజ్యాలకు, ప్రభుత్వాలకు, పార్టీలకు అందరికీ వర్తిస్తుంది. మూడురోజుల క్రితం మనం బుద్ధ జయంతిని జరుపుకున్నాం. పలు ప్రపంచ దేశాలతోపాటు ఈసారి భారతదేశంలో కూడా ఘనంగా ఆ వేడుకలు జరిగాయి. ప్రధాని మోదీ, తెలం గాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సహా చాలామంది పాల్గొన్నారు. బుద్ధుని బోధనలు వర్తమానానికీ, భవిష్యత్‌కూ కూడా మార్గదర్శకాలేనని ప్రకటించారు. ఈ మాటలు అక్షరసత్యాలుగా నిలువబోతున్నాయనడానికి ఇటీవల జరుగుతున్న పరిణామాలే సాక్ష్యాలు. గౌతమ బుద్ధుడు పేర్కొన్నట్టు చెప్పే సంతోషానికి సంబంధించిన ఆ విషయాలను స్ఫూర్తిగా తీసుకొని మానవాభివృద్ధిని కొలిచే విధానాల్లో మార్పులు వచ్చాయి. దానికి పొరుగున ఉన్న భూటాన్ అగ్రభాగాన నిలిచింది. మొట్టమొదట ఆ అంశాన్ని ప్రతి పాదించినది ఆ దేశమే. భూమికను ఇచ్చిన భూటాన్ ప్రజల అభివృద్ధిని ప్రస్తుతం జాతీయ తలసరి ఆదాయం ప్రాతిపదికగా నిర్ణ యిస్తున్నాం. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇతర అంశాలు కొన్నింటిని కొలమా నాలుగా చూస్తున్నాం. తలసరి జాతీయ ఆదాయం అనగానే అది ఎంత మాత్రం ప్రజలందరి అభివృద్ధిని ప్రతిబింబించేది కాదు. వంద రూపాయలు జాతీయ ఆదాయం అనుకుంటే, జనాభా వంద అనుకుంటే, అందులో 90 రూపాయలు ఒక వ్యక్తి ఆదాయం అయితే, మిగతా 99 మంది కేవలం పది రూపాయల ఆదాయాన్ని పంచుకోవాలి. ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ అభివృద్ధికి కొలమానం కాదని ఇప్పటికే చాలామంది ఆర్థిక శాస్త్రవేత్తలు మన జీడీపీ శాస్త్రీయతను తప్పుపట్టారు. ఈ క్రమంలోనే ప్రజల అభివృద్ధిని అం చనా వేయడంలో బౌద్ధ తాత్వికత పునాదిగా భూటాన్ ‘హ్యాపీనెస్ ఇండెక్స్’ (సంతోష సూచిక)ను ప్రతిపాదించింది. 1972లో అప్పటి భూటాన్ రాజు జిగ్మే సింఘే వాంగ్ చుక్ దీనిని రూపొందించారు. పశ్చిమ దేశాలు ప్రతిపాదిం చిన స్థూల జాతీయోత్పత్తి పేరుతో జరిగే భౌతికపరమైన అభివృద్ధికి బదు లుగా, బౌద్ధం విలువల పునాదిగా ఆర్థిక ప్రగతిని చూడాలనేది ‘హ్యాపీనెస్ ఇండెక్స్’ ఉద్దేశం. ఈ విషయాన్ని ప్రతిపాదిస్తూ, వాంగ్ చుక్ అన్న మాటలను గుర్తు చేసుకోవాలి. ‘నేను ప్రతిపాదిస్తున్న స్థూల జాతీయ సంతోష సూచిక (జీఎన్‌హెచ్)కు ఎవరేమైనా అర్థం చెప్పుకోవచ్చు. కానీ నా వరకు ఇది విలువ లతో కూడిన అభివృద్ధి. మానవత్వం, సమానత్వం, కరుణలతో కూడిన ప్రాథ మిక విలువలకూ, అవసరమైన ఆర్థిక ప్రగతికీ మధ్య వారధిని నిర్మించడమే దీని ప్రధాన ఉద్దేశం’ అని వాంగ్ చుక్ చేసిన వ్యాఖ్య బౌద్ధం మౌలిక చింతనకు అద్దం పడుతోంది. ఈ విషయం చాలా మంది ఆర్థికవేత్తలను, రాజనీతి నిపుణులను, విధా న నిర్ణేతలను ఆలోచింపజేసింది. 2005వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్థూల జాతీయ సంతోష సూచిక ఆధారంగా మొదటిసారిగా సర్వే చేపట్టి, 2006 సంవత్సరంలో శ్వేతపత్రాన్ని ప్రచురిం చింది. అదే సంవత్సరం అమెరికా అనేక మంది నిపుణులను ఆహ్వానించి ఈ తాత్వికతపై చర్చించింది. 2007వ సంవత్సరంలో థాయిలాండ్ ‘గ్రీన్ అండ్ హ్యాపీనెస్ ఇండెక్స్’ను విడుదల చేసింది. 2009వ సంవత్సరంలో అమెరికా కూడా ‘వెల్ బీయింగ్ ఇండెక్స్’ పేరుతో సర్వే చేసింది. భూటాన్ మళ్లీ దీనిమీద విస్తృత అధ్యయనం చేయడానికి కర్ముర నేతృ త్వంలో 2010 సంవత్సరంలో ఒక అధ్యయన సంస్థను నెలకొల్పింది. భూటా న్ అధ్యయన సంస్థగా పేర్కొనే ఈ సంస్థ కొన్ని సూచికలను రూపొందించిం ది. ఇందులో శారీరక, మానసిక, ఆధ్యాత్మికస్వస్థత, సమయపాలన, సామా జికవర్గాల శక్తి, సాంస్కృతిక బలం, విద్య, జీవనప్రమాణాలు, సుపరిపాలన, పర్యావరణ సమతుల్యత వంటి అంశాలు చోటుచేసుకున్నాయి. దీని తర్వాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం బహుముఖ పేదరిక సూచికలతో కూడిన నివేది కను రూపొందించింది. దీనినే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యు.ఎన్.డీ.పీ)కూడా అంగీకరించింది. అంతిమంగా, 2011లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ దీనిని అంగీకరిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అదే సంవత్సరం ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈసీడీ) మెరుగైన జీవన సూచిక (బెటర్ లైఫ్ ఇండెక్స్) పేరుతో ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది. అదే సంవత్సరం ఐక్యరాజ్య సమితి వరల్డ్ హ్యాపీనెస్ నివేదికను విడుదల చేసింది. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రతిసంవత్సరం నివేదికలు వస్తున్నాయి. ఆ తర్వాత అనేక దేశాలు ఈ మార్గంలోనే వివిధ పేర్లతో అధ్యయనా లనూ, సర్వేలనూ నిర్వహించి ఒక నూతన విధానానికి శ్రీకారం చుట్టాయి. మన దేశంలో గోవా రాష్ట్రం 2012లో ఈ విధానం ప్రాతిపదికగా ఒక అధ్యయ నాన్ని నిర్వహించి ఒక నివేదికను ప్రచురించడం గమనార్హం. దక్షిణ కొరియా, సింగపూర్, బ్రెజిల్, మెక్సికో, ఫ్రాన్స్, బ్రిటన్, క్రొయేసియా లాంటి దేశాలు తమ తమ దేశాల్లో ఇటువంటి అధ్యయనాలను చేపడుతున్నాయి. భూటాన్ ప్రత్యేకించి ఒక కమిషన్‌ను నియమించింది. భూటాన్ అధ్య యన సంస్థ కార్యక్రమాలకు ఇది అదనం. ఈ కమిషన్ ప్రజల అవసరాల ఆధారంగా ప్రాధాన్యతలను నిర్ణయిస్తుంది. నిధులను కేటాయిస్తుంది. అదే విధంగా లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఈ కార్యక్రమాలను సమన్వయం చేస్తూ, అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తుంది. మళ్లీ ఈ అనుభవాల ఆధారంగా విధానా లనూ, కార్యక్రమాలనూ తిరిగి రూపొందిస్తుంది. అంటే సమగ్ర మానవాభి వృద్ధికి భూటాన్ మార్గనిర్దేశనం చేసింది. ఈ రోజు ప్రపంచం దాని వెంట నడుస్తున్నది. జనాభా రీత్యా భూటాన్ చిన్నదేశమే కావచ్చు. కానీ ఆ ఆలోచ నకు ఉన్న శక్తి గొప్పది. ఈ ఆలోచనకు, ఆచరణకు పునాది బౌద్ధ తాత్వికశక్తి. రెండు వేల ఐదు వందల ఏళ్ల కిందట ప్రపంచాన్ని ప్రభావితం చేసిన బౌద్ధం మళ్లీ పరోక్షంగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నది. భూటాన్ ప్రభుత్వం స్వయంగా బౌద్ధం తమ విలువలకు పునాది అని ప్రకటించింది. అంటే ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థను బౌద్ధం ఆనాడే ప్రతిపాదించింది. ఇప్పటి వరకు ఏ దేశాలైతే ప్రపంచ ఆర్థికవ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకొని ఆధిప త్యం చలాయించాయో, అవి రోజు రోజుకు సంక్షోభం వైపు వెళుతున్నాయి. సమానత్వం, కరుణ, మానవత్వం మౌలిక విలువలను విడిచి దోపిడీ, పీడన, అహంకారం, వివక్ష, ద్వేషాలతో రగిలిపోయి యుద్ధాలను ప్రేరేపించి లక్షల కోట్ల ధనాన్ని ఆయుధాల మీద ఖర్చుపెట్టి, కోట్లాది మంది ప్రజల ప్రాణా లను బలితీసుకున్న వ్యవస్థలు భవిష్యత్‌లో తమ పునాదులను కాపాడుకో లేవు. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలు ఇస్లామిక్ దేశాల మీద, ప్రజల మీద కక్షగట్టి, అక్కడి వనరులను దోచుకుంటూ మారణహోమాన్ని సృష్టించి తమ వినాశనాన్ని తామే కొనితెచ్చుకుంటున్నాయి. ముస్లిం, క్రైస్తవాల పేరుతో ఈ యుద్ధాలు జరగకపోయినా, మిగతా ఆర్థిక, రాజకీయ కారణాలతోపాటు ఇది ప్రధానమైన అంశమనేది మరువకూడదు. అందుకే అమెరికా, యూరప్ దేశాలు పైకి గంభీరంగా కనిపించినా అంతర్గతంగా కృశించిపోయే స్థితికి వచ్చాయి. బౌద్ధం వైపు అందరి చూపు సరిగ్గా ఈ సమయంలోనే తూర్పు ఆసియా, దక్షిణాసియా దేశాలు నెమ్మదిగా నైనా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ దేశాలన్నింటిలో బౌద్ధం అనుసరిస్తున్న ప్రజలు మెజారిటీగా ఉన్నారు. శాంతి, ప్రశాంతతతో కూడిన మానవాభివృ ద్ధిని ఇప్పటికే భూటాన్ ప్రతిపాదించింది. చాలా దేశాలు ఆ మార్గంలో ఉన్నా యి. ఆర్థికంగా ఈ దేశాలు అభివృద్ధి చెందిన కొద్దీ బౌద్ధం శక్తి కూడా ప్రపం చవ్యాప్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది గుర్తించడం వల్లనే ఎక్కడైతే బౌద్ధం పురుడు పోసుకొని అడుగులేసిందో ఆ భారతదేశంలోని రాజకీయ నాయకత్వాలు కూడా బౌద్ధం శక్తిని, బౌద్ధాన్ని అనుసరిస్తున్న దేశాల స్నేహాన్ని కాంక్షిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జపాన్, చైనా లాంటి దేశా లతో స్నేహం పెంచుకోవడానికి బౌద్ధం పేరును వాడుకుంటున్నట్టు మనకు తెలుసు. అమరావతిని రాజధానిగా చేయడానికి కూడా చాలా కారణాలున్నా యి. అయితే తూర్పు, దక్షిణాసియాదేశాల దృష్టిలో పడడానికి అమరావతి పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగించుకున్నదని స్పష్టమౌతోంది. జపాన్ లాంటి బౌద్ధ మూలాలున్న దేశాల నుంచి ఆర్థిక సహాయానికి, ఇతర రకాల అవసరాలకు ఇది ఒక పరిచయ ద్వారమవుతుందనడంలో అనుమా నంలేదు. అయితే బౌద్ధాన్ని ఎవరెన్ని రకాలుగా ఉపయోగించుకున్నా, భారత దేశంలో వేళ్లూనుకున్న కులవ్యవస్థ నిర్మూలనకు కూడా ఆ తాత్విక భూమిక అవుతుందనడంలో సందేహం లేదు. దీనిని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఎప్పుడో గుర్తించారు. బౌద్ధాన్ని స్వీకరించి భవిష్యత్ దర్శనం చేశారు. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213 -
ఇది భిక్ష కాదు.. సమాజానికి రక్ష!
కొత్త కోణం చరిత్ర పొడవునా ఇంతటి అమానుషత్వానికి గురవడంతో పాటు, దేశ పురోగతికి తమ రక్తమాంసాలు ధారపోసిన అంటరాని కులాల పట్ల ఇంకా విద్వేషంతో ఉండడం దేశ పురోగమనానికి అడ్డంకిగా మారుతుంది. గత చరిత్రను అర్థం చేసుకొని, వర్తమానానికి అన్వయించుకొని, భవిష్యత్ సమాజ గమనానికి పునాదులు వేసుకుందాం. మనుషులంతా ఒక్కటేననే భావనను మనలో నింపుకోవడం ద్వారా శక్తివంతమైన దేశ నిర్మాణానికి బాటలు వేద్దాం. గతవారం ‘కొత్తకోణం’ కాలమ్‌లో రాసిన ‘కంచెను కత్తిరించాలి’ అనే వ్యాసా నికి మిశ్రమ స్పందన వచ్చింది. దీనికి ప్రతిస్పందించడం నా కర్తవ్యం. వ్యాసం చదివి నాకు ఫోన్ చేసిన వారిలో కనీసం 30 శాతం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల పట్ల తీవ్ర నిరసనను తెలిపారు. కొంతమంది కోపంతో ఊగిపోయారు. దళితులకు రిజర్వేషన్లు అందకూడదని, ఎంతకాలం ఇస్తారని, ఎంత కాలం ఇచ్చినా బాగుపడరని, ఇది దేశాభివృద్ధికి ఆటంకమని అన్నారు. ఫోన్లో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం సాధ్యంకాదని భావించి ఇలా సమాధానం ఇవ్వదలిచాను. గతంలోని వ్యాసాలకు వచ్చిన స్పందనకూ, ఈ వారం ఫోన్లకూ చాలా భేదం వుంది. వారి పట్ల నాకు కోపం లేదు. ఎస్సీ, ఎస్టీల పట్ల దళితేతర సమాజానికి ఉన్న కోపం, వారి అభివృద్ధి పట్ల అసహనం మరోమారు తేటతెల్లమయిందని భావించాను, అంతే. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఎందుకనే విషయంపై కొత్తగా చర్చించాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ మొదలు, నేటి విద్యావేత్తలు చాలా మంది లోతైన చర్చ జరిపారు. అనేక సందర్భాల్లో రిజర్వేషన్ల అవసరాన్ని నొక్కి చెప్పారు. శాస్త్రీయ దృక్పథంతో వివరించారు. 1919 సౌత్‌బరో కమిటీ ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన వాంగ్మూలం మొదలు, తాను రూపొందించిన ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’ ప్రత్యామ్నాయ రాజ్యాంగ ముసా యిదా వరకు వేల పేజీల సమాచారం ఉంది. అయినప్పటికీ ఇంతటి తీవ్ర దళిత వ్యతిరేక స్వభావం కలిగిన సమాజానికి మరోసారి చరిత్రను గుర్తు చేసి, వర్తమాన పురోగతికి అడ్డం పడవద్దని చెప్పాలని ఉంది. రిజర్వేషన్లు భిక్ష కాదు వెనకబడి ఉన్న కారణంగానే దళితులకు రిజర్వేషన్లు ఇస్తున్నారని చాలామంది అభిప్రాయం. వారి వెనుకబాటుతనానికి రెండు వేల ఏళ్ల అమానుషమైన అం టరానితనం కారణం కాదా? ఈ ప్రశ్న అత్యంత న్యాయమైనదీ, సహజమై నదీ అనడానికి మనుధర్మశాస్త్రంలోనే ఉదాహరణలు దొరుకుతాయి. మను ధర్మశాస్త్రం ప్రకారం అంటరాని కులాలకు ఆస్తి హక్కులేదు. చదువుకునే అర్హత అంతకన్నా లేదు. కనీసం మనిషిగా మనుగడ సాగించడానికి వీలులేని స్థితి. అందరితో కలసి దేవుడిని పూజించే వీలులేదు. దేవుడి ముందు అందరూ సమానులే, కానీ గుడిలో ప్రవేశించడానికి దళితులు అనర్హులు. గతమెప్పుడో కాదు నేటికీ హృదయాన్ని కెలుకుతున్న గాయమిది. అందరిలాగే దాహార్తిని తీర్చుకోవడానికి దళితులు ఇతరుల బావులలో నీళ్లు తాగలేరు. మరణం తరు వాత కూడా దళితేతరుడి పక్కన పూడ్చిపెట్టే సమస్యే లేదు. దళితుడికి కాల్చ డానికి, లేదా పూడ్చడానికి ఈ భూమ్మీద అటు ఆరు ఇటు మూడు అడుగుల జాగా కూడా లేదు. ఇక శ్మశానాలెక్కడి నుంచి వస్తాయి? వివాహాల విషయా నికి వస్తే దళితుడిని పెళ్లాడినందుకు ఊళ్లకు ఊళ్లే పరువు హత్యలతో కాలిపో తున్నాయి. ఇలాంటి రక్తచరిత్రను రాయడానికి మరో చరిత్రకారుడు పుట్టాలి. ఈ నేపథ్యంలో కల్పిస్తున్న రిజర్వేషన్లను ప్రభుత్వాలు పెడుతున్న దయాదాక్షి ణ్యంగానో, భిక్షగానో ఎవరైనా భావిస్తే అది అహంభావమే. ఇది కనీస పశ్చాత్తాపం ఈ రోజు కల్పిస్తున్న రిజర్వేషన్లు దళితులు ఈ దేశానికీ, హిందూ సమాజానికీ, దాని పురోగతికీ, దాని సంపద నిల్వలకు ధారపోసిన చెమటనెత్తురులకు కట్టే కనీస పశ్చాత్తాప కార్యం. సమాజ పురోగతికి వారు చేసిన కృషికి, త్యాగానికి ఇప్పుడిస్తున్న రిజర్వేషన్లు ఉపశమనం మాత్రమే. ఈ దేశపు ప్రగతి ప్రతి మూల మలుపులో అంటరాని కులాలు చేసిన అనితరసాధ్యమైన త్యాగాలకు ఈ దేశం మరింత ప్రతిఫలాన్ని చెల్లించాలి. చరిత్రను తవ్వి తీస్తే రాయబడని నగ్నసత్యాలెన్నో వెలుగుచూస్తాయి. వ్యవసాయం మొదట వర్షాధారమై ఉం డేది. విత్తనాలు చల్లి ఆ వాన చినుకుకోసం ఆకాశంవైపు చూసేవాళ్లు. కానీ చెరువుల నిర్మాణం మన వ్యవసాయాన్ని స్థిరమైన వ్యవస్థగా తయారు చేసింది. ఇటువంటి చెరువుల నిర్మాణంలో నిర్వహణలో అంటరాని కులాల పాత్రను కాదనగలరా? ఇప్పటికీ చెరువుల నిర్వహణ బాధ్యత దళితులదే. అందులోనూ మాలలే అత్యధికులు. ఈ పని ప్రమాదకరమైనది. కనుకనే మాలలకు అప్పగించారు. చెరువులో ఉండే తూముల నుంచి నీటిని కాలు వల్లోకి మళ్లించి, ఎంతో నైపుణ్యంతో పంట పొలాలకు అందించిన, అంది స్తున్న నీరడికాండ్లు వీళ్లే. తూములు ఎప్పుడైనా మూసుకుపోతే వాటిని సరి చేసే సమయంలో ప్రాణాలు కోల్పోయిన నీరడికాండ్ల చరిత్ర ఊరు ఊరునా వినిపిస్తుంది. కష్టమైన పనులన్నీ వారికే... వ్యవసాయానికీ, చేతివృత్తులకూ తోలు అవసరం ఎంతో ఉంది. ఆ మాటకొస్తే తోలు వస్తువు లేకుండా ఏ కుల వృత్తీ పురుడు పోసుకోలేదు. ఇది కూడా హీనంగా చూసే పని కాబట్టి ఇతర కులాలు ఇందులోకి అడుగుపెట్ట లేదు. గ్రామంలోని దాదాపు పదిహేడు కులాలకు తోలు వస్తువులు అందిం చిన ఘనత మాదిగలది. చివరకు ద్విజులు వేసుకునే జంధ్యానికి కూడా తోలును వాడినట్టు సంప్రదాయం చెబుతున్నది. పారిశ్రామికాభివృద్ధికి గనులు, రైల్వేలు మౌలిక ఆధారాలు. ఈ రెండు రంగాల్లో ప్రారంభంలో దళి తులే అధికంగా పనిచేసినట్టు ఆధారాలున్నాయి. పాత రైల్వే కాలనీలు, బొగ్గుగనుల కాలనీల్లో పరిశీలన జరిపిన మాకు నూటికి 90 మంది అంటరాని కులాల వాళ్లే ఉన్నట్టు తెలిసింది. రైల్వేలు, గనుల్లో పనిచేయడం కూడా ప్రమాదకరమైనదే. 1970కి ముందు బొగ్గుగనులలో పనిచేయడమంటే మర ణాన్ని వెదుక్కుంటూ వెళ్లడమే. భర్తలు పనికిపోతే భార్యలు తమ మెడలోని మంగళసూత్రాలు, పుస్తెల తాళ్లను తీసి దేవుడి దగ్గర పెట్టి వాళ్లు తిరిగి వచ్చిన తరువాత మెడలో వేసుకునేవాళ్లు. రైల్వే లైన్లు వేయడంలో కూడా ఎన్నో భయంకరమైన అనుభవాలను ఎదుర్కొన్నారు. మురికి నుంచి, జంతు కళేబరాల దుర్గంధం నుంచి ఊళ్లను కాపాడింది అంటరాని కులాలేనంటే ఎవరైనా కాదనగలరా? ఇటువంటి పనుల ద్వారా దేశాభివృద్ధికి, దేశ సంపద సృష్టికి, దేశ స్వచ్ఛతకు ఉపయోగపడిన అంటరాని కులాలకు ఇస్తున్న అరకొర సౌకర్యాలను, చిత్తశుద్ధిలేని రిజర్వేషన్లను ఒక భిక్షగా భావించడం ఎంత వరకు సబబు? అక్కడ రిపరేషన్లు కోరుతున్నారు అయితే అమెరికా, ఆఫ్రికా ఖండాల్లో బానిసలుగా మగ్గిన ఆఫ్రికన్లు రిజర్వే షన్లు, ఆర్థిక రాయితీలు మాత్రమే కోరడం లేదు. వాళ్లు అమెరికా, యూరప్ సమాజాలను రిజర్వేషన్లు కాదు ‘రిపరేషన్లు’ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆఫ్రికన్ జాతులకు జరిగిన అన్యాయానికీ, దోపిడీకీ వాళ్లు నష్టపరిహారం అడుగుతున్నారు. 2001 సంవత్సరంలో ఈ ఉద్యమం ఊపం దుకుంది. ఎన్నేండ్లు రాయితీలు ఇస్తారని కాదు. చివరి ఆఫ్రికన్ అన్ని రకాల ఆర్థిక, సామాజిక, రాజకీయరంగాల్లోని సమస్యల నుంచి బయట పడేవరకు ఆ బాధ్యత అమెరికా, యూరప్ సమాజాలదే అవుతుందని ‘రిపరేషన్’ ఉద్య మం నినదిస్తున్నది. ఆఫ్రికన్లు అమెరికా, యూరప్ ప్రభుత్వాల నుంచి అణచి వేతకు, దోపిడీకి గురైంది నాల్గయిదు శతాబ్దాల నుంచి మాత్రమే. కానీ అంట రాని కులాలు గత రెండున్నర వేల ఏళ్లుగా హిందూ సమాజం అమానుష త్వానికి, అత్యాచారాలకు బలైపోయారు. ఇప్పటికీ బలౌతున్నారు. బానిసలను మించిన అణచివేత రంగు భేదంతో కూడిన జాతివివక్ష సాగించిన బానిసత్వం కన్నా, అంట రానితనం మరింత భయంకరమైందని అంబేద్కర్ తేల్చారు. బానిస రక్షణ, సంరక్షణ, శిక్షణ యజమాని బాధ్యత. బానిస యజమానికి ఆస్తి లాంటివాడు, ఆదాయవనరు. బానిస ఎంత నైపుణ్యం కలిగి ఉంటే అంత ఖరీదు పలుకు తాడు. హిందూ సమాజం మాత్రం అంటరాని వాళ్లు ఈ సమాజాన్ని మలినం చేస్తారని భావిస్తుంది. వారు ఎదురైతే అరిష్టమని నమ్ముతుంది. అందువల్ల వీళ్లు బతికి ఉండాలని కోరుకోదు. వీళ్లు ఎటువంటి నైపుణ్యం సంపాదించినా ధర్మ విరుద్ధం. వేదాలు వినడం, ఉచ్చరించడం పాపం, అటువంటి వారి చెవుల్లో సీసం పోయాలి, నాలుకను తెగ నరకాలి అని బోధించారు. బానిస ఇంటి పనులన్నీ చేయవచ్చు. కానీ అంటరాని వాళ్ల నీడ కూడా వాళ్ల మీద పడ రాదు. బానిసత్వంలో మగ్గుతున్న వ్యక్తి బానిసత్వంతో డబ్బు సంపాదించు కొని, యజమానికి చెల్లించి బయటపడొచ్చు. అంటరానికులంలో పుట్టిన వాడు, అంటరాని వానిగా ముద్రపడిన వాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ హిందువులతో సమానం కాలేడు. ఏ నాటికీ ఈ సంకెళ్లను తెంచుకొని అవ మానాలు లేని, ఆంక్షలు లేని బతుకు బతికే హక్కు అతనికి లేదు. ఎస్సీ, ఎస్టీలకు ఈ రోజుకీ అద్దెకు ఇల్లు దొరకడం లేదంటే మనం ఎక్కడున్నామో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా అమెరికాలో ఫిబ్రవరి నెలలో బ్లాక్ హిస్టరీ పేరుతో ఆఫ్రికన్లకు జరిగిన అన్యాయాన్ని పాఠశాలల్లో పిల్లలకు బోధిస్తారు. పిల్లల్లో ఒకరకమైన అవగాహనను కలిగించి అమెరికన్లకు ఇచ్చే సౌకర్యాల పట్ల అవగాహన కల్పిస్తారు. కానీ అటువంటి పశ్చాత్తాపం ఇప్పటికీ హిందూ సమాజంలో లేదు. చరిత్ర పొడవునా ఇంతటి అమానుషత్వానికి గురవడంతో పాటు, దేశ పురోగతికి తమ రక్తమాంసాలు ధారపోసిన అంటరాని కులాల పట్ల ఇంకా విద్వేషంతో ఉండడం దేశ పురోగమనానికి అడ్డంకిగా మారుతుంది. గత చరి త్రను అర్థం చేసుకొని, వర్తమానానికి అన్వయించుకొని, భవిష్యత్ సమాజ గమనానికి పునాదులు వేసుకుందాం. మనుషులంతా ఒక్కటేననే భావనను మనలో నింపుకోవడంద్వారా శక్తివంతమైన దేశ నిర్మాణానికి బాటలు వేద్దాం. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 9705566213