మల్లేపల్లి లక్ష్మయ్య
కొత్త కోణం
చరిత్ర పొడవునా ఇంతటి అమానుషత్వానికి గురవడంతో పాటు, దేశ పురోగతికి తమ రక్తమాంసాలు ధారపోసిన అంటరాని కులాల పట్ల ఇంకా విద్వేషంతో ఉండడం దేశ పురోగమనానికి అడ్డంకిగా మారుతుంది. గత చరిత్రను అర్థం చేసుకొని, వర్తమానానికి అన్వయించుకొని, భవిష్యత్ సమాజ గమనానికి పునాదులు వేసుకుందాం. మనుషులంతా ఒక్కటేననే భావనను మనలో నింపుకోవడం ద్వారా శక్తివంతమైన దేశ నిర్మాణానికి బాటలు వేద్దాం.
గతవారం ‘కొత్తకోణం’ కాలమ్‌లో రాసిన ‘కంచెను కత్తిరించాలి’ అనే వ్యాసా నికి మిశ్రమ స్పందన వచ్చింది. దీనికి ప్రతిస్పందించడం నా కర్తవ్యం. వ్యాసం చదివి నాకు ఫోన్ చేసిన వారిలో కనీసం 30 శాతం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల పట్ల తీవ్ర నిరసనను తెలిపారు. కొంతమంది కోపంతో ఊగిపోయారు. దళితులకు రిజర్వేషన్లు అందకూడదని, ఎంతకాలం ఇస్తారని, ఎంత కాలం ఇచ్చినా బాగుపడరని, ఇది దేశాభివృద్ధికి ఆటంకమని అన్నారు. ఫోన్‌లో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం సాధ్యంకాదని భావించి ఇలా సమాధానం ఇవ్వదలిచాను. గతంలోని వ్యాసాలకు వచ్చిన స్పందనకూ, ఈ వారం ఫోన్లకూ చాలా భేదం వుంది. వారి పట్ల నాకు కోపం లేదు. ఎస్సీ, ఎస్టీల పట్ల దళితేతర సమాజానికి ఉన్న కోపం, వారి అభివృద్ధి పట్ల అసహనం మరోమారు తేటతెల్లమయిందని భావించాను, అంతే.
ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఎందుకనే విషయంపై కొత్తగా చర్చించాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ మొదలు, నేటి విద్యావేత్తలు చాలా మంది లోతైన చర్చ జరిపారు. అనేక సందర్భాల్లో రిజర్వేషన్ల అవసరాన్ని నొక్కి చెప్పారు. శాస్త్రీయ దృక్పథంతో వివరించారు. 1919 సౌత్‌బరో కమిటీ ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన వాంగ్మూలం మొదలు, తాను రూపొందించిన ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’ ప్రత్యామ్నాయ రాజ్యాంగ ముసా యిదా వరకు వేల పేజీల సమాచారం ఉంది. అయినప్పటికీ ఇంతటి తీవ్ర దళిత వ్యతిరేక స్వభావం కలిగిన సమాజానికి మరోసారి చరిత్రను గుర్తు చేసి, వర్తమాన పురోగతికి అడ్డం పడవద్దని చెప్పాలని ఉంది.
రిజర్వేషన్లు భిక్ష కాదు
వెనకబడి ఉన్న కారణంగానే దళితులకు రిజర్వేషన్లు ఇస్తున్నారని చాలామంది అభిప్రాయం. వారి వెనుకబాటుతనానికి రెండు వేల ఏళ్ల అమానుషమైన అం టరానితనం కారణం కాదా? ఈ ప్రశ్న అత్యంత న్యాయమైనదీ, సహజమై నదీ అనడానికి మనుధర్మశాస్త్రంలోనే ఉదాహరణలు దొరుకుతాయి. మను ధర్మశాస్త్రం ప్రకారం అంటరాని కులాలకు ఆస్తి హక్కులేదు. చదువుకునే అర్హత అంతకన్నా లేదు. కనీసం మనిషిగా మనుగడ సాగించడానికి వీలులేని స్థితి. అందరితో కలసి దేవుడిని పూజించే వీలులేదు. దేవుడి ముందు అందరూ సమానులే, కానీ గుడిలో ప్రవేశించడానికి దళితులు అనర్హులు. గతమెప్పుడో కాదు నేటికీ హృదయాన్ని కెలుకుతున్న గాయమిది. అందరిలాగే దాహార్తిని తీర్చుకోవడానికి దళితులు ఇతరుల బావులలో నీళ్లు తాగలేరు. మరణం తరు వాత కూడా దళితేతరుడి పక్కన పూడ్చిపెట్టే సమస్యే లేదు. దళితుడికి కాల్చ డానికి, లేదా పూడ్చడానికి ఈ భూమ్మీద అటు ఆరు ఇటు మూడు అడుగుల జాగా కూడా లేదు. ఇక శ్మశానాలెక్కడి నుంచి వస్తాయి? వివాహాల విషయా నికి వస్తే దళితుడిని పెళ్లాడినందుకు ఊళ్లకు ఊళ్లే పరువు హత్యలతో కాలిపో తున్నాయి. ఇలాంటి రక్తచరిత్రను రాయడానికి మరో చరిత్రకారుడు పుట్టాలి. ఈ నేపథ్యంలో కల్పిస్తున్న రిజర్వేషన్లను ప్రభుత్వాలు పెడుతున్న దయాదాక్షి ణ్యంగానో, భిక్షగానో ఎవరైనా భావిస్తే అది అహంభావమే.
ఇది కనీస పశ్చాత్తాపం
ఈ రోజు కల్పిస్తున్న రిజర్వేషన్లు దళితులు ఈ దేశానికీ, హిందూ సమాజానికీ, దాని పురోగతికీ, దాని సంపద నిల్వలకు ధారపోసిన చెమటనెత్తురులకు కట్టే కనీస పశ్చాత్తాప కార్యం. సమాజ పురోగతికి వారు చేసిన కృషికి, త్యాగానికి ఇప్పుడిస్తున్న రిజర్వేషన్లు ఉపశమనం మాత్రమే. ఈ దేశపు ప్రగతి ప్రతి మూల మలుపులో అంటరాని కులాలు చేసిన అనితరసాధ్యమైన త్యాగాలకు ఈ దేశం మరింత ప్రతిఫలాన్ని చెల్లించాలి. చరిత్రను తవ్వి తీస్తే రాయబడని నగ్నసత్యాలెన్నో వెలుగుచూస్తాయి. వ్యవసాయం మొదట వర్షాధారమై ఉం డేది. విత్తనాలు చల్లి ఆ వాన చినుకుకోసం ఆకాశంవైపు చూసేవాళ్లు. కానీ చెరువుల నిర్మాణం మన వ్యవసాయాన్ని స్థిరమైన వ్యవస్థగా తయారు చేసింది. ఇటువంటి చెరువుల నిర్మాణంలో నిర్వహణలో అంటరాని కులాల పాత్రను కాదనగలరా? ఇప్పటికీ చెరువుల నిర్వహణ బాధ్యత దళితులదే. అందులోనూ మాలలే అత్యధికులు. ఈ పని ప్రమాదకరమైనది. కనుకనే మాలలకు అప్పగించారు. చెరువులో ఉండే తూముల నుంచి నీటిని కాలు వల్లోకి మళ్లించి, ఎంతో నైపుణ్యంతో పంట పొలాలకు అందించిన, అంది స్తున్న నీరడికాండ్లు వీళ్లే. తూములు ఎప్పుడైనా మూసుకుపోతే వాటిని సరి చేసే సమయంలో ప్రాణాలు కోల్పోయిన నీరడికాండ్ల చరిత్ర ఊరు ఊరునా వినిపిస్తుంది.
కష్టమైన పనులన్నీ వారికే...
వ్యవసాయానికీ, చేతివృత్తులకూ తోలు అవసరం ఎంతో ఉంది. ఆ మాటకొస్తే తోలు వస్తువు లేకుండా ఏ కుల వృత్తీ పురుడు పోసుకోలేదు. ఇది కూడా హీనంగా చూసే పని కాబట్టి ఇతర కులాలు ఇందులోకి అడుగుపెట్ట లేదు. గ్రామంలోని దాదాపు పదిహేడు కులాలకు తోలు వస్తువులు అందిం చిన ఘనత మాదిగలది. చివరకు ద్విజులు వేసుకునే జంధ్యానికి కూడా తోలును వాడినట్టు సంప్రదాయం చెబుతున్నది. పారిశ్రామికాభివృద్ధికి గనులు, రైల్వేలు మౌలిక ఆధారాలు. ఈ రెండు రంగాల్లో ప్రారంభంలో దళి తులే అధికంగా పనిచేసినట్టు ఆధారాలున్నాయి. పాత రైల్వే కాలనీలు, బొగ్గుగనుల కాలనీల్లో పరిశీలన జరిపిన మాకు నూటికి 90 మంది అంటరాని కులాల వాళ్లే ఉన్నట్టు తెలిసింది. రైల్వేలు, గనుల్లో పనిచేయడం కూడా ప్రమాదకరమైనదే. 1970కి ముందు బొగ్గుగనులలో పనిచేయడమంటే మర ణాన్ని వెదుక్కుంటూ వెళ్లడమే. భర్తలు పనికిపోతే భార్యలు తమ మెడలోని మంగళసూత్రాలు, పుస్తెల తాళ్లను తీసి దేవుడి దగ్గర పెట్టి వాళ్లు తిరిగి వచ్చిన తరువాత మెడలో వేసుకునేవాళ్లు. రైల్వే లైన్లు వేయడంలో కూడా ఎన్నో భయంకరమైన అనుభవాలను ఎదుర్కొన్నారు. మురికి నుంచి, జంతు కళేబరాల దుర్గంధం నుంచి ఊళ్లను కాపాడింది అంటరాని కులాలేనంటే ఎవరైనా కాదనగలరా? ఇటువంటి పనుల ద్వారా దేశాభివృద్ధికి, దేశ సంపద సృష్టికి, దేశ స్వచ్ఛతకు ఉపయోగపడిన అంటరాని కులాలకు ఇస్తున్న అరకొర సౌకర్యాలను, చిత్తశుద్ధిలేని రిజర్వేషన్లను ఒక భిక్షగా భావించడం ఎంత వరకు సబబు?
అక్కడ రిపరేషన్లు కోరుతున్నారు
అయితే అమెరికా, ఆఫ్రికా ఖండాల్లో బానిసలుగా మగ్గిన ఆఫ్రికన్లు రిజర్వే షన్లు, ఆర్థిక రాయితీలు మాత్రమే కోరడం లేదు. వాళ్లు అమెరికా, యూరప్ సమాజాలను రిజర్వేషన్లు కాదు ‘రిపరేషన్లు’ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆఫ్రికన్ జాతులకు జరిగిన అన్యాయానికీ, దోపిడీకీ వాళ్లు నష్టపరిహారం అడుగుతున్నారు. 2001 సంవత్సరంలో ఈ ఉద్యమం ఊపం దుకుంది. ఎన్నేండ్లు రాయితీలు ఇస్తారని కాదు. చివరి ఆఫ్రికన్ అన్ని రకాల ఆర్థిక, సామాజిక, రాజకీయరంగాల్లోని సమస్యల నుంచి బయట పడేవరకు ఆ బాధ్యత అమెరికా, యూరప్ సమాజాలదే అవుతుందని ‘రిపరేషన్’ ఉద్య మం నినదిస్తున్నది. ఆఫ్రికన్లు అమెరికా, యూరప్ ప్రభుత్వాల నుంచి అణచి వేతకు, దోపిడీకి గురైంది నాల్గయిదు శతాబ్దాల నుంచి మాత్రమే. కానీ అంట రాని కులాలు గత రెండున్నర వేల ఏళ్లుగా హిందూ సమాజం అమానుష త్వానికి, అత్యాచారాలకు బలైపోయారు. ఇప్పటికీ బలౌతున్నారు.
బానిసలను మించిన అణచివేత
రంగు భేదంతో కూడిన జాతివివక్ష సాగించిన బానిసత్వం కన్నా, అంట రానితనం మరింత భయంకరమైందని అంబేద్కర్ తేల్చారు. బానిస రక్షణ, సంరక్షణ, శిక్షణ యజమాని బాధ్యత. బానిస యజమానికి ఆస్తి లాంటివాడు, ఆదాయవనరు. బానిస ఎంత నైపుణ్యం కలిగి ఉంటే అంత ఖరీదు పలుకు తాడు. హిందూ సమాజం మాత్రం అంటరాని వాళ్లు ఈ సమాజాన్ని మలినం చేస్తారని భావిస్తుంది. వారు ఎదురైతే అరిష్టమని నమ్ముతుంది. అందువల్ల వీళ్లు బతికి ఉండాలని కోరుకోదు. వీళ్లు ఎటువంటి నైపుణ్యం సంపాదించినా ధర్మ విరుద్ధం. వేదాలు వినడం, ఉచ్చరించడం పాపం, అటువంటి వారి చెవుల్లో సీసం పోయాలి, నాలుకను తెగ నరకాలి అని బోధించారు. బానిస ఇంటి పనులన్నీ చేయవచ్చు. కానీ అంటరాని వాళ్ల నీడ కూడా వాళ్ల మీద పడ రాదు. బానిసత్వంలో మగ్గుతున్న వ్యక్తి బానిసత్వంతో డబ్బు సంపాదించు కొని, యజమానికి చెల్లించి బయటపడొచ్చు. అంటరానికులంలో పుట్టిన వాడు, అంటరాని వానిగా ముద్రపడిన వాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ హిందువులతో సమానం కాలేడు. ఏ నాటికీ ఈ సంకెళ్లను తెంచుకొని అవ మానాలు లేని, ఆంక్షలు లేని బతుకు బతికే హక్కు అతనికి లేదు. ఎస్సీ, ఎస్టీలకు ఈ రోజుకీ అద్దెకు ఇల్లు దొరకడం లేదంటే మనం ఎక్కడున్నామో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా అమెరికాలో ఫిబ్రవరి నెలలో బ్లాక్ హిస్టరీ పేరుతో ఆఫ్రికన్లకు జరిగిన అన్యాయాన్ని పాఠశాలల్లో పిల్లలకు బోధిస్తారు. పిల్లల్లో ఒకరకమైన అవగాహనను కలిగించి అమెరికన్లకు ఇచ్చే సౌకర్యాల పట్ల అవగాహన కల్పిస్తారు. కానీ అటువంటి పశ్చాత్తాపం ఇప్పటికీ హిందూ సమాజంలో లేదు.
చరిత్ర పొడవునా ఇంతటి అమానుషత్వానికి గురవడంతో పాటు, దేశ పురోగతికి తమ రక్తమాంసాలు ధారపోసిన అంటరాని కులాల పట్ల ఇంకా విద్వేషంతో ఉండడం దేశ పురోగమనానికి అడ్డంకిగా మారుతుంది. గత చరి త్రను అర్థం చేసుకొని, వర్తమానానికి అన్వయించుకొని, భవిష్యత్ సమాజ గమనానికి పునాదులు వేసుకుందాం. మనుషులంతా ఒక్కటేననే భావనను మనలో నింపుకోవడంద్వారా శక్తివంతమైన దేశ నిర్మాణానికి బాటలు వేద్దాం.
(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు)
మొబైల్: 9705566213