ప్రశ్నిస్తే ప్రతినాయకుడే కదా! | mallepalli laxmaiah opinion on cast system | Sakshi
Sakshi News home page

ప్రశ్నిస్తే ప్రతినాయకుడే కదా!

Published Thu, Sep 1 2016 12:24 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

ప్రశ్నిస్తే ప్రతినాయకుడే కదా! - Sakshi

ప్రశ్నిస్తే ప్రతినాయకుడే కదా!

 కొత్త కోణం

వేల ఏళ్లనుంచి అణచివేతకు, వివక్షకు సాధనాలుగా మారిన భారత, భాగవత, రామాయణా లను ఈనాటి సామాజిక దృక్పథంతో పునఃపరిశీలించాలని బాబాసాహెబ్ భావించారు. ఇవి వ్యాప్తి చేసిన భావాలు మనుగడలో ఉన్నంత కాలం, వాటికి పవిత్రత, ప్రాధాన్యం ఇచ్చినంత కాలం కుల వ్యవస్థ పటి ష్టంగానే ఉంటుందని అంబేడ్కర్ రాసిన ‘కుల నిర్మూ లన’లో పేర్కొంటారు. కుల నిర్మూలన జరగాలంటే వర్ణాంతర, కులాంతర వివాహాలు కొంతమేరకు మాత్రమే ఉపయోగపడతాయని వ్యాఖ్యానించారు.
 
దేశమంతా రామాలయాలూ, కృష్ణ మందిరాలూ, శివలింగాలూ కనిపిస్తుం టాయి. లేకపోతే నూతనంగా ప్రతిష్టిస్తుంటారు. కానీ భారత, రామాయణా లలో ప్రతినాయకులైన దుర్యోధన, రావణ వంటి వారిని పూజించే వారు ఉండడం, వాళ్లు నెలకొల్పిన దేవాలయాలు ఉండడం ఆశ్చర్యకరం. రావణు డికి అక్కడక్కడా, దుర్యోధనుడికి చాలా గ్రామాల్లో దేవాలయాలు ఉండడం విశేషం. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ దగ్గర ఉత్తర కాశీ జిల్లాలో దుర్యోధనుడి దేవాలయాలు ఉన్నాయి. ఏటా ఆషాఢ, శ్రావణ మాసాల్లో జాతర జరుగు తుంది. ఈ దేవాలయాలున్న ప్రాంతాన్ని జాన్సర్ బావర్ ప్రాంతమని పిలు స్తారు. డెహ్రాడూన్ జిల్లా పరోలా తహిసీల్‌లోని పరోలాతో పాటు ఉత్తర కాశీ జిల్లాలోని కట్‌గావ్, సిధారి, కట్‌మేర్, జాకోల్, దహరా, పెటారీ, లెబాడీతో పాటు రవైన్ పరగణాలోని సౌర్ గ్రామంలో కూడా దుర్యోధనునికి దేవాల యాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో తమస్, యమున ప్రవహిస్తుంటాయి. తమస్ అంటే విషాదం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత ఇరు వర్గాల వారు విడిచిన కన్నీటితో ఏర్పడినదే తమస్ అని చెబుతారు. అందుకే ఆ నీటిని తాగరు.

బవరీల మూలపురుషుడు దుర్యోధనుడు
దుర్యోధనుడు తమ మూలపురుషుడిగా, ఆరాధ్యదైవంగా బవరీ తెగల వారు కొలుస్తారు. దుర్యోధనుడి గుడితో పాటు కర్ణుడి దేవాలయం కూడా ఇక్కడ ఉన్నది. దుర్యోధనుడి దేవాలయాలను కర్రతో నిర్మించారు. జాకోల్ గ్రామంలో మాత్రమే దుర్యోధనుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆషాఢ మాసం 21వ రోజు నుంచి దుర్యోధనుడి విగ్రహయాత్ర జాకోల్ గ్రామం నుంచి  ప్రారంభమౌతుంది. మళ్లీ నెలరోజుల తర్వాత ఆ విగ్రహాన్ని జాకోల్‌కు తీసు కుని వస్తారు. ఆషాఢ మాసం 25వ రోజు కోటేగాం చేరుకొని అక్కడ రెండు రోజులు పూజల కోసం ఉంచుతారు. శ్రావణం 19వ రోజున ఓస్లా గ్రామంలో ఆ విగ్రహంతో బ్రహ్మాండమైన జాతర నిర్వహిస్తారు. దుర్యోధనుడి ప్రధాన పూజారిగా ఖాస్ రాజపుత్ర తెగకు చెందినవారే ఉంటారు. ఈ యాత్రలోఅన్ని వర్గాల ప్రజలు పాల్గొని పూజలు నిర్వహిస్తారు. కానీ ఇటీవల ఈ దేవాల యాలను సోమేశ్వరాలయాలుగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతు న్నాయి. ఆ విధంగా దుర్యోధనుడి జాడ లేకుండా చేయాలని చూస్తున్నారు.

దుర్యోధనునికి ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అతడు మొదట ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై , నివాసం ఏర్పరుచుకోవాలనుకున్నాడు. అందుకు మహస్ అనే దేవత అనుమతి కావాలి. సుయోధనుడు మహస్‌ని కోరగానే ఆమె అంగీకరించి, ఇక్కడి ప్రజల బాగోగులను కూడా చూడాలని ఉపదేశించిందట. అప్పటి నుంచి ప్రజలను దుర్యోధనుడు ప్రేమగా చూసు కున్నాడని, ప్రజలు అతడిని మహారాజుగా గౌరవించారని ఐతిహ్యం. ఈ ప్రాంతపు నానుళ్లు, స్థల పురాణాలు పరిశీలించిన పరిశోధకులు ఇక్కడి ప్రజ లకు సుయోధనుడు ఎందుకు ఆరాధనీయుడో విశ్లేషించారు. భారతంలో దుర్యోధనుడి పాత్ర అధర్మం వైపు నిలిచినట్టు చిత్రీకరించారు. ధర్మనిరతులు అనిపించుకున్న పాండవులను ఇతడు వేధించాడని కథనం. ఒక స్త్రీని నిండు సభలో వివస్త్రను చేసి అవమానించాడనీ, తద్వారా కురుక్షేత్ర యుద్ధానికి, వేలాదిమంది మరణానికి కారకుడయ్యాడనీ భారతం చెబుతోంది.

ఎవరు గొప్ప? ధర్మజుడా? దుర్యోధనుడా?
నిజానికి దుర్యోధనుడి సామాజిక భావాలు, ఆచరణ; పాండవుల ధర్మనీతి, పరిపాలన బేరీజు వేస్తే మన ఆలోచనలు మార్చుకోకుండా ఉండలేం. మను షులంతా ఒక్కటేననే భావనను ఇవాళ మనం అంగీకరిస్తున్నాం. దుర్యోధ నుడు ఇదే ఆచరించి చూపాడు. పాండవులు దాన్ని తిరస్కరించి వర్ణధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించారు. క్షత్రియుడికి మాత్రమే రాజ్యపాలన అవ కాశం ఉంటుందని భారతం చెప్పింది. కర్ణుడి ఉదంతమే ఇందుకు ఉదా హరణ. కురుసభలో విలువిద్య పోటీలు జరిగినప్పుడు, అర్జునునితో తాను పోటీ పడతానంటూ ఒక యువకుడు సిద్ధమవుతాడు. భీష్ముడు కలుగ జేసుకుని ఇది క్షత్రియుల మధ్య పోటీ, ఇతరులకు అవకాశం లేదని ప్రకటి స్తాడు. సుయోధనుడు లేచి ‘మీరన్నట్టు క్షేత్రం కలిగినవాడే క్షత్రియుడైతే అతి సుసంపన్నమైన అంగరాజ్యాన్ని సూతపుత్రుడైన కర్ణుడికి ఇస్తున్నాను’అంటూ ప్రకటిస్తాడు. భారతం క్రీస్తుశకం మూడవ శతాబ్దంలో రాసిందనడానికి సుయోధనుడు చేసిన ఈ వ్యాఖ్యానమే తార్కాణం.కులం గురించిన ప్రశ్నలు కులం కుళ్లును, కుల సంకరాన్ని, క్రీస్తుశకం ఒకటవ శతాబ్దంలో బౌద్ధ రచ యిత అశ్వఘోషుడు తన ‘వజ్రసూచి’లో విపులీకరించాడు. అవే విషయా లను సుయోధనుడు తన వ్యాఖ్యానంలో పేర్కొనడం గమనార్హం. నిజా నికి బౌద్ధం దెబ్బకొట్టిన వర్ణవ్యవస్థను పదిలపర్చడానికి చేసిన ప్రయత్నమే మహా భారత రచన.

ఇక ఏకలవ్యుడి ఉదంతం పాండవుల దురాగతానికీ, వర్ణధర్మ రక్షణకూ అద్దం పడుతుంది. కిరాత తెగకు చెందిన ఏకలవ్యుడు తన స్వశక్తితో సాటిలేని మేటి విలుకాడిగా తయారవుతాడు. అది తెలుసుకున్న పాండవులు తమ గురువు ద్రోణాచార్యుడి ద్వారా ఏకలవ్యుడిని విలువిద్యకు దూరం చేయాలని కుట్రపన్నారు. ఆ కుట్రలో భాగంగా ద్రోణుడు గురుదక్షిణగా బొటన వేలుని ఇమ్మని  ఏకలవ్యుని కోరతాడు. ఏకలవ్యుడు వేలుని కోసి ఇచ్చి గురుభక్తిని ప్రదర్శిస్తాడు. ఈ రెండు ఘటనల ప్రకారం క్షత్రియులు తప్ప మరెవ్వరూ రాజ్యం పరిపాలించకూడదని, ఎటువంటి విద్యలూ నేర్వరాదని, వర్ణధర్మం నిర్దేశించి, నిజస్వరూపాన్ని ప్రదర్శించింది.

భారతం వాస్తవమా, కాదా అనే చర్చ అనవసరం. అందులో పేర్కొన్న పాత్రలను బట్టి, వారి స్వభావాలను బట్టి ఈనాటి కుల వివక్ష, అవమానాలకు పునాదులు అక్కడే ఉన్నాయని అర్థం అవుతుంది. కుల వివక్షకు ప్రతినిధు లుగా పాండవులు ఉంటే, వాటిని కొంతలోకొంతైనా ప్రతిఘటించిన వర్గానికి నాయకునిగా సుయోధనుడు కనిపిస్తాడు. అందుకే సుయోధనుడి పేరుని దుర్యోధనుడిగా మార్చి ఆ పాత్ర లక్షణాలనే తారుమారు చేశారు.మహాభారతానికి అనుబంధంగా భగవద్గీత కూడా వర్ణ ధర్మాన్ని ఆకాశా నికెత్తింది. ఒక విధంగా యుద్ధాలను నిరసించిన బౌద్ధానికి వ్యతిరేక ప్రచా రాస్త్రంగా భగవద్గీతను బోధించారు. యుద్ధం క్షత్రియధర్మమన్నదే గీతా సారాంశం. ఇది వర్ణ ధర్మ పరిరక్షణే. కులం వర్ణం లాంటి అసమాన విధానాలను నిలబెట్టిన యుధిష్టిరుణ్ణి ధర్మరాజుగా, దానికి వ్యతిరేకంగా నిలబడిన సుయోధనుడిని దుర్యోధనుడిగా ప్రచారం చేశారు.

 ఒకానొక సందర్భంలో ఒకే ప్రశ్నకు ధర్మరాజు, సుయోధనుడు ఇచ్చిన వేర్వేరు సమాధానాలు కూడా ఇదే విషయాన్ని రూఢి చేస్తున్నాయి. బ్రాహ్మ ణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు ఒకేరకమైన హత్యానేరం చేస్తే ఎటు వంటి శిక్షలు విధిస్తారని భీష్ముడు అడిగితే, అందరికీ ఒకే రకమైన శిక్షలుం డాలని సుయోధనుడు సమాధానమిస్తాడు. కానీ ధర్మరాజు మాత్రం ‘బ్రాహ్మ ణుడు దైవంతో సమానం, అతనిని శిక్షించే అధికారం ఎవరికీ ఉండదు. క్షత్రియుడు ఏది చేసినా రాజ్య రక్షణార్థమే. అతనికి శిక్ష ఉండదు. వైశ్యులను మంద లించి వదిలేయాలి. శూద్రులను కఠినంగా శిక్షించాలి’ అంటాడు. అనేక దృష్టాంతాలలో ధర్మరాజుగా మారిన యుధిష్టిరుడు వర్ణధర్మ రక్షణ వైపే నిలబడతాడు.

వర్ణ సమాజంలోని వారిని మాత్రమే కాకుండా, ఆదివాసీలను కూడా పాండవులు అడవితో సహా దహనం చేశారు. దానినే ఖాండవ దహనం అన్నారు. పాండవులు తాము కొత్త రాజధానిని నిర్మించుకోవడానికి అడవిని తగులబెట్టి అందులో లక్షలాదిగా నాగజాతి వారిని దహనం చేశారు. భారతంలో వారిని సర్పాలుగా చూపించారు. ఆ ఖాండవ దహనంలో మిగిలిన వాసుకి అనే సర్పం పాండవుల సంతతికి చెందిన పరిక్షిత్‌ను కాటేసి చంపినట్టు రాసుకున్నారు. నిజానికి అవి సర్పాలు కావు. బౌద్ధాన్ని అవలం బించిన నాగజాతి అది. ఈ విషయాన్ని బాబాసాహెబ్ అంబేడ్కర్ సమ గ్రంగా పరిశోధించి నిరూపించారు. ఈ ఘటన కూడా వర్ణ ధర్మపరిరక్షణ కర్తవ్యంలో భాగంగా జరిగిందే. పై అంశాలను అర్థం చేసుకున్న తరువాత నూటికి తొంభై శాతంగా ఉన్న శూద్రులు అంటరాని వాళ్లు ఎవరి పక్షాన నిలబడాలి? ఒకవేళ పూజిస్తే ఎవరిని పూజించాలి? నేటి రాజ్యాంగంలో పొందుపర్చుకున్న విలువల ప్రకారం అందరూ సమానులనే భావనకు ఎవరు ప్రతినిధులవుతారు? ధర్మరాజుతో పోలిస్తే కచ్చితంగా సుయోధనుడే అర్హుడవుతాడు.

కులం పునాదులు
వేల సంవత్సరాల నుంచి అణచివేతకు, వివక్షకు సాధనాలుగా మారిన భారతం, భాగవతం, రామాయణం వంటి ఇతిహాసాలను, పురాణాలను ఈనాటి సామాజిక దృక్పథంతో పునఃపరిశీలించాలని బాబాసాహెబ్ భావిం చారు. ఇవి వ్యాప్తి చేసిన భావాలు మనుగడలో ఉన్నంత కాలం, వాటికి పవిత్రత, ప్రాధాన్యం ఇచ్చినంత కాలం కుల వ్యవస్థ పటిష్టంగానే ఉంటుం దని అంబేడ్కర్ రాసిన ‘కులనిర్మూలన’లో పేర్కొంటారు. కుల నిర్మూలన జరగాలంటే వర్ణాంతర, కులాంతర వివాహాలు కొంతమేరకు మాత్రమే ఉపయోగపడతాయని, కానీ హిందూ మత గ్రంథాల ప్రాశస్త్యం కొనసాగితే అవి మళ్లీ నిరర్ధకమవుతాయని బాబాసాహెబ్ అన్నారు. కాబట్టి మనుషుల్ని మూఢత్వంలోనే ముంచి ఎటువంటి శాస్త్రీయ, హేతువాద దృక్పథానికి చోటు లేని పరిస్థితులను పెంచిపోషిస్తున్నంత కాలం కులం పునాదులు పది లంగానే  ఉంటాయి. అందుకుగాను గత చరిత్రను నేటి సమానత్వం స్వేచ్ఛ, సోదరత్వం భావాలతో చూసుకొని పునర్లిఖించుకోవాల్సిన అవసరాన్ని అంబేడ్కర్ పదేపదే నొక్కి చెప్పారు. అందుకే ఇక దుర్యోధనుడిని సుయో ధనుడిగా పిలుచుకోవాలి.

వ్యాసకర్త:మల్లేపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు
మొబైల్ : 97055 66213


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement