తిత్లీ తుఫాను బీభత్సం ఒకేఒక్క రాత్రిలో ఉద్దానం ప్రజల జీవితాలను చెల్లాచెదురు చేసింది. ఐదారు దశాబ్దాల వారి కలలను ఛిద్రం చేసింది. 1,91,012 ఎకరాల తోటలు ధ్వంసమయ్యాయి. ఇందులో జీడితోటల శాతమే అధికం. రైతులు ధ్వంసమైన పంటల్ని తలచుకొని భవిష్యత్తుని ఊహించుకోవడానికి కూడా భయపడుతున్నారు. మరో పదేళ్ళ పాటు ఏం తిని బతకాలంటూ వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉద్దానంలో తిత్లీ విధ్వంసం వల్ల జరిగిన నష్టాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అలా జరగకపోతే శతాబ్దాల చరిత్ర కలిగిన ఉద్దానం రూపు రేఖలే మారిపోయే ప్రమాదం ఉంది.
ఉద్దానం...ఇది ఒక ఊరు కాదు. ఉద్యమాల ఊపిరి. భారత చరిత్రనే మలుపుతిప్పిన పేరు ఇది. ఎండిన డొక్కలూ, ఎముకల గూళ్ళ లాంటి దేహాలతో దోపిడీపై తిరగబడ్డ ఉద్దానం ప్రాంత ప్రజల నెత్తుటి త్యాగాలు చరిత్ర మరువజాలనిది. నక్సల్బరీకి సమకాలీనంగానూ, నక్సల్బరీ కొనసాగింపుగానూ దోపిడీపె దండెత్తి నెత్తురు చిందించిన శ్రీకాకుళ రైతాంగ పోరాటాలన్నీ ఉద్దానం పచ్చనాకు సాక్షిగా జరిగినవే. తీరప్రాంతంలోని ప్రతి ఇసుకరేణువూ అవే పోరాట కథలను వినిపి స్తుంది. అదే చైతన్యాన్ని ప్రదర్శిస్తుంది. కానీ మొన్నటి తిత్లీ తుఫాను అక్కడి పేదల మదినిండిన ఉద్దానం జాడలను చెరిపేసింది. కనుచూపు మేరలో పచ్చటి జీడితోటలతో కళకళలాడే ఉద్దానమిప్పుడు ఎండినమో డులతో శ్మశానాన్ని తలపిస్తోంది. అందమైన అక్కుపల్లి, మెట్టూరు, గడూరు మామిడిపల్లి, రాజాం, మర్రిపాడు, బొడ్డపాడు, మాకన్నపల్లి, నీలావతి, రంగోయి, లాంటి ఎన్నో పల్లెలు తిత్లీ తుఫానుతో తీరని శోకాన్ని మూటగట్టుకుని ఊళ్ళకు ఊళ్ళే వల్లకాడుగా మారిపోయాయి.
పచ్చని పొదలు పరచుకున్న ఉద్దానం తిత్లీ తుఫానుతో అతలాకు తలమైంది. మొత్తం 38 మండలాల్లో 50 వేల ఇళ్ళు నేలమట్టమ య్యాయి. 38 వేలకు పైగా పశువులు మరణించాయి. 2,500కు పైగా దుకాణాలు ధ్వంసమయ్యాయి. లక్షలాది ఎకరాల పంటలూ, తోటలూ పెనుతుఫాను తాకిడికి తుడిచిపెట్టుకుపోయాయి. ప్రకృతికే పచ్చతో రణం కట్టినట్టుండే ఉద్దానం అదే ప్రకృతి విలయతాండవంతో మరు భూమిగా మారింది. ఇప్పుడక్కడ మిగిలిందంతా çశ్మశాన నిశ్శబ్దమే. ఐదారు దశాబ్దాల పాటు రెక్కలుముక్కలు చేసుకుని పెంచుకున్న జీడి మామిడీ, పనస, మునగ, కొబ్బరి తోటలు పెనుతుఫాను తాకిడికి తుడి చిపెట్టుకుపోయాయి. చుక్కనీరు దొరకని చోట తమ చెమటనే రక్తంగా «ధారబోసి కాపాడుకున్న తోటలు సర్వనాశనం అయ్యాయి. ఒంటినిండా గుడై్డనా కట్టుకోవడం తెలియని అమాయక జన ఉద్దానమిప్పుడు ఆకలి దప్పులతో అల్లాడిపోయే రోజొచ్చింది.
ఉద్దానంలో మూడు రకాల పంట భూములుంటాయి. మెట్టభూ ములు, గుడ్డి(ఇసుక నేలలు), పల్లపు భూములు. మెట్ట భూముల్లో పంటలు పూర్తిగా వర్షాధారమైనవే. ఇక్కడన్నీ ఇసుకనేలలే కాబట్టి జీడి తోటల పెంపకం చాలా ఎక్కువ. ఇది అక్కడి ప్రజలకు ప్రధానమైన వ్యాపార పంట. గ్రామంలోనే తోట ఉందా? తోటలోనే గ్రామం ఉందా అన్నది తేల్చుకోలేని విధంగా పల్లెలన్నీ పచ్చనాకు పందిళ్ళలా ఉంటాయి. ఈ తోటలు దట్టమైన అడవిని మరిపిస్తుంటాయి. ఒక చెట్టు మరుగైతే మనిషి అలికిడిని గుర్తించడం మహాకష్టం. అక్కడి నీటి ఎద్దడిని అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. కింద పెద్ద అండా లాంటిది పెట్టి అందులో నించోబెట్టి పిల్లలకు స్నానం చేయించేవారు. స్నానం చేసేటప్పుడు అండాలో పడిన నీటితో గిన్నెలు కడుక్కునేవారు. ఈlకరువు ప్రాంతంలో లక్షలాది ఎకరాల్లో పచ్చదనం నింపేందుకు ఆ ప్రాంత ప్రజలు పడ్డ కష్టం అనన్యసామాన్యమైనది.
ఎడారిని తలపించే ఇసుక భూములు, ఉప్పునీటిమయమైన సము ద్రతీర పొలాలు. అక్కడి ఇసుకతిన్నెల్లాంటి భూముల్లో సాధారణ పంటలు పండే అవకాశమే లేదు. అందువల్లే అక్కడ జీడి, కొబ్బరి లాంటివి మాత్రమే సేద్యానుకూలంగా ఉంటాయి. అందులో కీలకం జీడిమామిడే. శ్రీకాకుళం ప్రాంతానికి జీడిపంట తొలిసారిగా 1950లో పరిచయం అయ్యింది. ఆ తరువాత 1970 నుంచి జీడితోటల పెంపకం ఊపందుకుంది. అయితే జీడి తోటల పెంపకం దక్షిణ అమెరికాలో ప్రారంభమైంది. 16వ శతాబ్దంలో పోర్చుగీసు ద్వారా బ్రెజిల్ నుంచి ఈ పంటను భారత దేశానికి తీసుకువచ్చారు. కేరళలోని మలబారు తీర ప్రాంతంలో జీడిమామిడిని తొలిసారిగా సాగుచేశారు. అప్పటి నుంచి ఈ పంట భారతదేశంలోని తీరప్రాంతాలన్నింటికీ విస్తరించింది. 1960– 61లో భారత్‌లో 1,76,000 హెక్టార్లలో పంట సాగుచేయగా, 2006– 07లో 8,54,000 హెక్టార్లలో జీడిమామిడి సాగుచేశారు. కేవలం 40 ఏళ్ళలో సాగులోకి వచ్చిన భూమి 8 రెట్లు పెరిగింది. అదే తరహాలో శ్రీకాకుళం ఉద్దానంలో కూడా జీడిమామిడి సాగు విస్తృతంగా పెరిగింది.
1970 ప్రాంతంలో చాలా తక్కువ మంది రైతులు జీడిమామిడిని సాగుచేసేవారు. అయితే రైతులను దళారీలు, షావుకారులూ, ఊరి పెద్దలు ముప్పేట దోపిడీ చేసేవారు. తిండి దొరకని పరిస్థితుల్లో రైతులు ముందుగా అప్పులు తెచ్చుకునేవారు. ముందుగా అప్పు పేరుతో డబ్బులు ఇచ్చి జీడిపిక్కలను బస్తాల్లో నింపుకుని వెళ్ళేవారు. కొలత ల్లోనూ, తూకాల్లోనూ అంతులేని దోపిడీ ఉండేది. 1960 చివరి దశలో ప్రారంభమైన నక్సలైటు ఉద్యమం షావుకార్ల, మధ్య దళారీల దోపిడీకి అడ్డుకట్ట వేసింది. నక్సలైటు ఉద్యమ చైతన్యంతో దోపిడీదారులను తరిమికొట్టగలిగారు. వారి చైతన్యానికి తగ్గట్టుగా వ్యవసాయపద్ధతు ల్లోనూ నైపుణ్యం పెరిగింది. జీడితోటల పెంపకంలో మెళకువలు నేర్చు కున్నారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో 1985 నాటికి 28,000 హెక్టా ర్లలో జీడిమామిడి సాగు అయితే 2001 కల్లా అది 60,000 హెక్టార్లకు పెరిగింది. ఈ రోజు అది లక్షలాది హెక్టార్లకు విస్తరించింది.
అయితే తిత్లీ తుఫాను బీభత్సం ఒకేఒక్క రాత్రిలో ఉద్దానం ప్రజల జీవితాలను చెల్లాచెదురు చేసింది. ఐదారు దశాబ్దాల వారి కలలను ఛిద్రం చేసింది. 1,91,012 ఎకరాల తోటలు ధ్వంసమయ్యాయి. ఇందులో జీడితోటల శాతమే అధికం. 1,18,757 మంది రైతుల జీవి తాలు విధ్వంసానికి గురయ్యాయి. అయితే ఏపీ ప్రభుత్వం జీడితోటల నష్టానికి ఇస్తున్న పరిహారం హెక్టారుకు కేవలం 30,000 రూపాయలు. ఎకరాకు 12,000 రూపాయల్ని నష్టపరిహారంగా చంద్రబాబు ప్రభుత్వం దయతల్చి ఇస్తామని ప్రకటించింది. కొబ్బరి తోటలు, అరటి తోటలకు కూడా ఇదేరకమైన భిక్షాప్రాయమైన నష్టపరిహారాన్ని ఖరారు చేశారు. కొబ్బరి చెట్టుకు ఒక్కింటికి 1,500 రూపాయల నష్టపరిహారం ప్రకటిం చారు. ఒకవైపు రైతులకు ప్రకటించిన నష్ట పరిహారం ఏమాత్రం న్యాయ బద్ధంగా లేదు. అంతేకాదు ఏజెన్సీ ప్రాంతంలో పోడు చేసుకుంటున్న ఆదివాసీల దగ్గర భూములకు పట్టాలుండవు. దీన్ని సాకుగా తీసుకుని ప్రభుత్వం వారి నష్టపరిహారానికి ఎగనామం పెట్టింది. ప్రభుత్వం పేద లకు ఇచ్చిన అసైన్డ్ భూములలోని పంటలకు కూడా నష్టపరిహారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు.
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వాలు కేవలం కంటి తుడుపుగానే వ్యవహరిస్తున్నాయనడానికి ఇంతకంటే నిదర్శనం అక్క ర్లేదు. ఇటీవల తిత్లీ ప్రభావిత గ్రామాలను చూసినప్పుడు అక్కడి రైతులు చెప్పిన మాటలు వింటుంటే వాస్తవ అంచనాలకు ప్రభుత్వాల ఆలో చనలు ఎంత దూరంగా ఉన్నాయో అర్థం అవుతుంది. ఒక జీడి తోటలో మొక్కలు నాటిన తరువాత మొదటి ఫలసాయం అందడానికి కనీసం 5 ఏళ్ళు పడుతుంది. ప్రస్తుతం ధ్వంసమైన తోటల స్థాయి చేరడానికి కనీసం 12 సంత్సరాలకు పైగా పడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం మొక్కలు కొనడానికి కాదుగదా «ధ్వంసమైన చెట్లను తొల గించడానికి కూడా సరిపోదు. మొక్కలు నాటి ఐదేళ్లపాటు ప్రతి మొక్కనీ బతికించుకోవడానికి బొట్టుబొట్టుగా నీటి చుక్కలను పట్టుకొచ్చి ప్రాణప్ర దంగా పెంచడానికి కనీసం ఇద్దరు మనుషులు నిరంతరం కష్టపడాలి. దీనికి ప్రతి కూలీకి ఒక్కొక్కరికి నెలకు పదివేల రూపాయల చొప్పున లెక్కవేస్తే ఏడాదికి 2,40,000 రూపాయలు అవసరమవుతాయి. ఐదేళ్లకు 12 లక్షల రూపాయలు అవుతాయి. ఇంకా ఎరువులు, విత్తనాలు, పురు గుమందుల ఖర్చు అదనం. ఈ లెక్కన కనీసం ఒక ఎకరం జీడితోటలో ఐదేళ్లలో మొదటి ఫలసాయం అందడానికి కనీసం 15 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ ఏపీ ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా 30 వేల రూపా యలిచ్చి మొసలి కన్నీరు కార్చింది.
అయితే ప్రస్తుతం జీడితోటల యజమానులుగా ఉన్న రైతులు ఎవ్వరూ అంతటి ఆర్థిక స్థోమత కలిగిన వారు కాదు. అంతా ఒక ఎకరం నుంచి రెండెకరాల లోపున్న చిన్నసన్నకారు రైతులే. ప్రతి కుటుంబం నుంచి ఎవరో ఒకరు అండమాన్ నికోబార్ దీవులకో, దుబాయ్‌కో, బర్మాకో వలసెళ్ళి రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ ఇక్కడి జీడిపంటకీ, ఆ కుటుంబాలకీ ఆధారం ఉండదు. రైతులు «ధ్వంసమైన పంటల్ని తల చుకుని భవిష్యత్తుని ఊహించుకోవడానికి కూడా భయపడుతున్నారు. మరో పదేళ్ళపాటు ఏం తిని బతకాలంటూ వారు కన్నీరుమున్నీరవుతు న్నారు. తిత్లీ విధ్వంసం వల్ల జరిగిన నష్టాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిం చాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి చేసిన డిమాండ్ నూటికి నూరుపాళ్ళూ సరైనది. ప్రభుత్వం గనక ఆ బాధ్యత తీసుకోకపోతే ఉద్దానం రూపు రేఖలే మారిపోయే ప్రమాదం ఉంది.
ప్రభుత్వం సాయం చేయకపోతే వాళ్ళు సొంత డబ్బుతో దాన్ని బాగుచేసుకోలేరు. బాగుచేసుకోకపోతే అనివార్యంగా తాము నమ్ము కున్న భూములన్నింటినీ తెగనమ్ముకోక తప్పని దయనీయ స్థితి. చిన్న సన్న కారు రైతుల కష్టంతో తడిసిన ఆ భూములన్నీ బడాభూస్వాముల, పెట్టు బడి దారుల చేతుల్లోకి పోవడానికి ఎంతో కాలం పట్టదు. ఉద్దానం పచ్చటి పంటపొలాలన్నీ రేపు కార్పొరేట్ల చేతుల్లోకి జారిపోయే ప్రమాదం ఉంది. అయితే జీడిపంట నాశనమవడంతో దానిపై ఆధా రపడిన జీడిపిక్కల పరిశ్రమల్లో రోజుకూలీలుగా పనిచేసే పలాసలోని 30,000 మందికి పైగా ప్రజలకు తిండికూడా దొరకని పరిస్థితి దాపురిం చనుంది. వ్యాపారంపై ఆధారపడి జీవిస్తోన్న మరో పాతిక వేల మంది భవిష్యత్తు అంధకారంగా మారింది. నిత్యజనసంచారంతో సజీవంగా కళకళలాడే ఉద్దానం పల్లెజనం వలసబాటపట్టి కాశీబుగ్గ, పలాస లాంటి పట్టణాలు జీవకళను కోల్పోయే ప్రమాదం ఉంది.
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు : మల్లెపల్లి లక్ష్మయ్య
lmallepalli@gmail.com
Comments
Please login to add a commentAdd a comment