తిత్లీ దెబ్బకు కకావికలమైన ఉద్దానం కొబ్బరి తోటలు
తిత్లీ ప్రభావిత ఉద్దానం ప్రాంతం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: తిత్లీ తుపానుతో గుండె చెదిరిన శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం ప్రజలను ఆదుకుని అండగా నిలవాల్సిన అధికార పార్టీ నేతలు ఈ విపత్తును కూడా సొమ్ము చేసుకొనే దుర్మార్గానికి తెర తీశారు. ప్రకృతి విపత్తుతో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులకు దక్కాల్సిన నష్ట పరిహారాన్ని రాబందుల్లా తన్నుకుపోతున్నారు. ఏకంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి బంధువులతోపాటు టీడీపీ నేతలు, వారి బినామీల పేర్లను పరిహారం జాబితాలో పెద్ద ఎత్తున చేర్చారు. అర్హులైన వారికి మాత్రం మొండిచేయి చూపారు.
అర్హుల పేర్లు గల్లంతు
తిత్లీ తుపాను అక్టోబర్ 10న శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసింది. కోనసీమను తలపించే పచ్చటి ఉద్దానం కకావికలమైంది. పంటలన్నీ నీట మునిగాయి. కొబ్బరి తోటలు నేలకొరిగాయి. చిన్నాచితకా బడ్డీ కొట్ల నుంచి నివాస గృహాల వరకూ అంతా ధ్వంసమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 4.72 లక్షల మంది నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు సమర్పించారు. ఇందులో నకిలీ పేర్లే ఎక్కువగా ఉన్నాయని గుర్తించిన అధికా రులు దాదాపు 81,000 మందిని పరిహారం జాబితా నుంచి తొలగించారు. 3.91 లక్షల మంది మాత్రమే అసలైన బాధితులని తేల్చారు. అయితే అధికార పార్టీ నేతలు, జన్మభూమి కమిటీలు ఒత్తిడితో నిజమైన బాధితులను తొలగించి టీడీపీ సానుభూతిపరులను నష్టపరిహారం జాబితాలో చేర్చారు.
లేని తోటలు కూలిపోయాయట!
రెంటికోట పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, టీడీపీ మండల అధ్యక్షుడు తమ్మినాన గంగారాం అక్రమంగా నష్టపరిహారం పొందాడు. పలాస మండలం రాజగోపాలపురానికి చెందిన గంగారాం అధికారులకు భయపెట్టి తన ఖాతాలోకి సొమ్ము జమ చేసుకున్నాడు. పల్లపు ప్రాంతంలోని భూముల్లో వరి మాత్రమే పండేచోట తుపాను వల్ల కొబ్బరి, జీడి మామిడి చెట్లను కోల్పోయినట్లు రాయించుకోవడం గమనార్హం. రాజగోపాలపురం పరిసరాల్లో రెవెన్యూ రికార్డుల్లో లేని 68/7, 15/2 సర్వే నంబర్లలో తన తండ్రికి జీడి తోటలు ఉన్నట్లు చూపించి కాశీబుగ్గ విశాఖ గ్రామీణ బ్యాంకులో రూ.15,782 పరిహారం పొందాడు. తమ్మినాన గంగారం పేరుమీద ఎస్‌బీఐలో రూ.75,000, మరో ఖాతాలో గ్రామీణ బ్యాంకులో రూ.5,585 మేరకు పరిహారం ఇచ్చినట్లు నమోదైంది.
ప్రభుత్వ భూమినీ వదల్లేదు...
పలాస–మందస మండలాల మధ్య ఉన్న ప్రభుత్వ భూములను కూడా టీడీపీ నేతలు బినామీ పేర్లతో పరిహారం కోసం రాయించుకున్నారు. ఇక్కడ 1,100 ఎకరాల్లో మెండు జీడితోటలున్నాయి. ‘మెండితోట’గా పిలిచే ఈ ప్రాంతంలో బినామీ పేర్లతో టీడీపీ నేతలు సాగు చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉండటంతో అక్రమంగా క్రయ విక్రయాలు సాగిస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. తాజాగా ఇందులో 30 ఎకరాలను నష్టపరిహారం జాబితాలో టీడీపీ నేతలు రాయించుకున్నారు.
కొబ్బరి చెట్ల లెక్కలు పెరిగాయి...
తిత్లీ తుపానుతో శ్రీకాకుళం జిల్లాలో వరి 2.30 లక్షల హెక్టార్లలో దెబ్బ తిన్నట్లు కలెక్టర్ స్వయంగా ప్రకటించారు. అయితే చివరి అంచనాలు పూర్తయ్యేసరికి దీన్ని 1.59 లక్షల హెక్టార్లుగా నమోదు చేశారు. నిజంగానే నష్టపోయినా కావాలనే కొందరి పేర్లు తొలగించడంతో నష్టపోయిన వరి విస్తీర్ణాన్ని తగ్గించినట్లు భావిస్తున్నారు. ఇక అరటి, కొబ్బరి లాంటి ఉద్యాన పంటలు 43 వేల హెక్టార్లలో దెబ్బ తిన్నట్లు తొలుత పేర్కొనగా ఇప్పుడు దీన్ని 28 వేల హెక్టార్లకు కుదించారు. అయితే కొబ్బరి చెట్ల విషయంలో లెక్కలు పెరిగాయి. తొలుత 3.10 లక్షల కొబ్బరి చెట్లే నేల కూలినట్లు పేర్కొనగా ఇప్పుడు దీన్ని 4,54,303కు పెంచారు.
చిచ్చు రేపిన స్వార్థం!
ప్రకృతి ప్రకోపానికి తల్లడిల్లిన ఉద్దానం ప్రాంతానికి కష్టకాలంలో అండగా నిలవాల్సిన పాలకులు స్వార్థంతో అన్నదమ్ముల్లా జీవించే ప్రజల మధ్య చిచ్చు రగిలిస్తున్నారు. పరిహారం జాబితాలో పేర్లు లేనివారు అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రం యథేచ్ఛగా పందేరం చేయడంపై ఆక్రోశిస్తున్నారు. కట్టుబాట్లకు విలువ ఇచ్చే ఉద్దానంలో అంతా ఒకేమాట, ఒకేబాటగా ఉంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏకమవుతారు. అలాంటి చోట టీడీపీ నేతల చర్యలతో విబేధాలు తలెత్తుతున్నాయి. పరిహారం విషయంలో తమ పక్కనే ఉన్న పొలం రైతు పట్ల ఒకలా, తమ పట్ల మరోలా వ్యవహరిస్తుంటే తట్టుకోలేక అధికారులను నిలదీస్తున్నారు. కొందరికి అధికంగా పరిహారం ఇస్తున్నారని, మరి కొందరికి అసలు భూమే లేకున్నా జాబితాలో పేర్లు చేర్చడంపై ఘర్షణలకు దిగుతున్నారు.
టీడీపీ నేతల బినామీ పేర్లతో పరిహారం పొందిన మెండుతోట
ఇదిగో... ఇలా కాజేశారు!
- వజ్రపుకొత్తూరులో మాజీ ఎంపీపీ మద్దిల చిన్నయ్యకు ఐదు ఎకరాలుంటే 10 ఎకరాల్లో నష్టం వాటిల్లిందంటూ రికార్డుల్లో రాయించుకున్నారు.
- గండుపల్లి పోలయ్య, బోటు లేకున్నా నష్టపోయినట్లు రూ.4 లక్షలు పరిహారం రాయించుకుని ఇప్పటికే రూ.లక్ష కాజేశాడు.
- టీడీపీ నాయకులు కాశ మాధవరావు, తమ్మినాన రంగారావు, కంబాల దానేసు, పిరియా శివప్రసాద్, మరడ ధుర్యోధన బినామీ పేర్లతోనూ, బంధువుల పేర్లతోనూ పరిహారం కాజేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
- సంతబొమ్మాళిలో టీడీపీ నేత ఒకరు రొయ్యల చెరువులు లేకున్నా పరిహారం జాబితాలో పేరు నమోదు చేయించుకున్నాడు.
- బహాడపల్లిలో సారా దుర్వాసులు, అతడి భార్య లక్ష్మికి అసలు భూమే లేకున్నా వారికి రూ.1.15 లక్షల చొప్పున నష్టపరిహారం దక్కింది.
- బహాడపల్లికి చెందిన మట్ట నాగమణికి 75 సెంట్లు, మట్ట తులసీదాసుకు 4.50 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వారి పేర్లను జాబితాలో చేర్చారు. నిజానికి వీరికి ఎలాంటి భూమి లేదు. ఇదే గ్రామంలో బొడ్డు ఉదయకుమార్, లక్ష్మీనారాయణ, శాంతిప్రియలకు భూములు లేకపోయినా జాబితాలో పేర్లు నమోదు చేశారు.
- టెక్కలి మండలం పోలవరం గ్రామానికి సంబంధించి పరిహారం కోసం రూపొందించిన బాధితుల జాబితాలో అన్నెపు పున్నయ్య పేరు ఉంది. వాస్తవానికి అతడి పేరుతో 70 సెంట్ల భూమి మాత్రమే ఉన్నా పరిహారం జాబితాలో మాత్రం 3.04 ఎకరాలలో వరి పంట నష్టం జరిగినట్లు నమోదు చేశారు.
- పోలవరం గ్రామంలో బి.జయరామ్‌కు ఎకరం పొలం మాత్రమే ఉంది. కానీ పరిహారం జాబితాలో 3.89 ఎకరాల్లో వరి నష్టపోయినట్లు నమోదు చేశారు.
- బి.ఆదినారాయణకు 50 సెంట్ల పొలం ఉంది. కానీ పరిహారం జాబితాలో అది 1.55 ఎకరాలకు పెరిగిపోయింది.
- బి.గణపతిరావుకు పొలమే లేకున్నా లేదు. కానీ పరిహారం జాబితాలో అతని పేరుతో 1.09 ఎకరాల్లో వరి పంట నష్టపోయినట్లు నమోదు చేశారు.
- బి.నీలకంఠం పేరున 70 సెంట్ల పొలం మాత్రమే ఉన్నా పరిహారం జాబితాలో ఏకంగా 2.35 ఎకరాల్లో వరి పొలం తిత్లీ తుపానుకు దెబ్బ తిన్నట్లు చూపించారు.
- డి.హరిప్రసాద్‌కు 70 సెంట్ల భూమి ఉండగా 2.40 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు రికార్డుల్లో నమోదైంది.
- డి.లక్ష్మీకి అసలు భూమే లేదు. కానీ పరిహారం జాబితాలో ఆమె 3.89 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు నమోదు చేశారు.
ఆత్మహత్యలే శరణ్యం....
తిత్లీ తుపాన్‌తో ఉద్దానం ప్రాంతం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. ప్రజలు జీవనాధారం కోల్పోయారు. మళ్లీ పంట చేతికి రావాలంటే ఐదు నుంచి పదేళ్లు పడుతుంది. కూలిన చెట్లను తొలగించడానికే వేలాది రూపాయలు ఖర్చవుతుంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏ మూలకూ సరిపోదు. ఒక రైతు ఎన్ని ఎకరాలు నష్టపోయినా పరిహారం మాత్రం 5 ఎకరాలకే ఇస్తామంటున్నారు. ఇక మేం కూడా పత్తిరైతుల్లా ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే.
–మామిడి మాధవరావు (ఉద్దానం రైతాంగ కమిటీ అధ్యక్షుడు)
రెవెన్యూ రికార్డులు చూడరా?
మందస గ్రామంలో 18 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నమోదు చేశారు. నిజానికి అక్కడ ఉన్నవి 14 వేల ఎకరాలే. తర్వాత ఈ విషయాన్ని గుర్తించామంటూ తగ్గిస్తున్నారు.
ఇలా పెంచి తగ్గించడం వల్ల రైతుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఏ గ్రామంలో ఎవరికి ఎంత భూమి ఉందనేది రెవెన్యూ రికార్డుల్లో ఉంటుంది. వాటిని పరిశీలించి జాబితాలు తయారు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు.
– డొక్కర దానయ్య (బహాడపల్లి)
నచ్చినట్లు ఇస్తున్నారు...
ఎకరా పంట నష్టం జరిగిన వారికి మూడెకరాలు కోల్పోయినట్లు పరిహారం ఇచ్చారు. మాకు ఎనిమిది ఎకరాలు దెబ్బతింటే ఐదెకరాలకే ఇస్తామంటున్నారు. ఇంతవరకూ అదికూడా ఇవ్వలేదు. ఇల్లు కూలిపోతే పరిహారం ఇవ్వ లేదు. ఇదేం అన్యాయమని అడిగితే మా గ్రామంలో ఉన్న భూమి కంటే జాబితాలో ఎక్కువగా నమోదైందని, అందువల్ల పరిహారాన్ని సర్దుబాటు చేస్తున్నామని చెబుతున్నారు. అన్ని చోట్లా ఇలాగే జరుగుతోంది. గుడ్డిభద్ర రైతులు దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు కలెక్టర్ దృష్టికి తెచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదు.
–శేషగిరిరావు (లొహరబంద)
‘కింజరాపు’ అని ఉంటే చాలు..లక్షల్లో లబ్ధి..
తిత్లీ తుపాను బాధితుల జాబితాను ఏకపక్షంగా రూపొందించారు. జన్మభూమి కమిటీలు ఇచ్చిన పేర్లను జాబితాలో చేర్చేశారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇంటిపేరే ఏకైక అర్హతగా జాబితాలు తయారయ్యాయి. కింజరాపు అని ఉంటే చాలు కళ్లు మూసుకుని వారికసలు భూమి ఉందా? లేదా? అని కూడా చూడకుండా పరిహారానికి అర్హులుగా నిర్ధారిం చేశారు. మంత్రికి స్వయానా వదిన అయిన మహిళ పేరును కూడా రికార్డుల్లో చేర్చారు. ఇలా చిన్నబమ్మిడి, హరిశ్చంద్రపురం, నిమ్మాడ గ్రామాల్లో కింజరాపు అని ఇంటిపేరు ఉన్న దాదాపు 80 మంది రూ.9.72 లక్షల దాకా పరిహారం పొందారు.
కుటుంబమంతా రోడ్డున పడ్డాం..
తిత్లీ తుపాను మా ఇళ్లను నేల కూల్చడంతో నలుగురు పిల్లలతో సహా మా కుటుంబం మొత్తం రోడ్డున పడింది. కర్రలకు బరకా కట్టి అందులోనే తలదాచుకుంటున్నాం. ఇంత వరకూ ఒక్కరైనా మా దగ్గరకు వచ్చి ఎలా బతుకుతున్నారని చూడలేదు. ఒక్క పైసా కూడా పరిహారం ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment