పెట్టుబడి కాదు.. జీవితమే ఉపసంహరణ | Mallepalli Laxmaiah Guest Column On Sale Of Public Sector Companies | Sakshi
Sakshi News home page

పెట్టుబడి కాదు.. జీవితమే ఉపసంహరణ

Published Thu, Feb 25 2021 12:38 AM | Last Updated on Mon, Mar 8 2021 5:47 PM

Mallepalli Laxmaiah Guest Column On Sale Of Public Sector Companies - Sakshi

పబ్లిక్‌ రంగ సంస్థల అమ్మకం కొన్ని కార్పొరేట్ల లబ్ధి కోసమే అనుకుంటే పొరపాటే. అంతకన్నా ప్రమాదమేదంటే సామాజిక, ఆర్థిక అసమానతల పెరుగుదల. పబ్లిక్‌ రంగ సంస్థల విధ్వంసం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతారు. ఎందుకంటే ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు అమలులో లేవు. అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండదు. అంటే 1970కి ముందు ఉన్న కాంట్రాక్టర్ల, కార్పొరేట్ల నిలువు దోపిడీకి మరింత అవకాశం దొరుకుతుంది. ప్రైవేటీకరణ అంటే పెట్టుబడుల ఉపసంహరణ మాత్రమే కాదు. అది ఉపాధి ఉపసంహరణ, జీవిత ఉప సంహరణ. అందువల్ల విశాఖ ఉక్కు కోసం సాగుతున్న ఉద్యమం భారత రైతాంగం చేస్తోన్న పోరాటంలాగా దేశ ప్రయోజనాలలో భాగంగా జరగాలి.

‘‘ప్రజాస్వామ్య దేశాలెన్నుకున్న మార్గంలో బలహీనతలు బహిరంగంగా కనిపిస్తున్నాయి. అశక్తులైన జనసమూహాలు తమ సమష్టి కృషి ద్వారా, శాసనాల ద్వారా ఆర్థికంగా శక్తివంతులైన వారి మీద నియంత్రణ సాధించడం అసా «ధ్యమే. సార్వత్రిక ఓటింగ్‌ అమలులో ఉన్నా కూడా, శాసన నిర్మాణ సంస్థలు, ప్రభుత్వాలు సంపన్నుల చేతుల్లోనే ఉంటాయి’’ అంటూ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 1947లో ‘రాష్ట్రాలు–మైనారిటీలు’ అన్న డాక్యుమెంటులో పేర్కొన్నారు. అందులోనే ‘భారీ పరిశ్రమలను, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ లాంటి ఫైనాన్స్‌ సంస్థలను ప్రభుత్వం మాత్రమే నిర్వహించాలి’ అంటూ పరిష్కారం కూడా సూచించారు.

స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం రూపొందించే ప్రక్రియ ప్రారం భించడానికి ముందు బాబాసాహెబ్‌ తనదంటూ ఒక రాజ్యాంగ ముసాయిదాను రూపొందించారు. ఆ సమయంలో తాను రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడిని అవుతానని ఆయన ఊహించలేదు. అందువల్ల ఒక నమూనా రాజ్యాంగాన్ని∙ఆయన రూపొందించి, రాజ్యాంగ సభకు సమర్పించారు. రాజ్యాంగంలో రాజకీయ హక్కు లతో పాటు, ఆర్థిక పరమైన నిబంధనలను కూడా చేర్చాలని, లేనట్ల యితే సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతాయని ఆయన భావించారు. అయితే తాను ఆశించిన నిబంధనల్లో ఆర్థికపరమైన అంశాలు చోటుచేసుకోలేదు. 

అయితే రాజ్యాంగంలోని నాలుగవ భాగంలోని ఆదేశిక సూత్రాల్లో కొన్ని ఆర్టికల్స్‌ను పొందుపరిచారు. అందులో ఆర్టికల్‌–38 ముఖ్య మైనది. ప్రజల మధ్య అవకాశాల్లో, సదుపాయాల్లో, స్థాయిల్లో అసమా నతలు పెరగకుండా ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలని, ఆ విధంగా ఆర్థిక అసమానతలను నిర్మూలించాలన్నది ఈ ఆర్టికల్‌ ముఖ్యోద్దేశం. ఆ సందర్భంగా బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మాట్లాడుతూ ‘ప్రజల హక్కు లను హరించి, నియంతృత్వాన్ని నెలకొల్పకుండా ఉండడానికి రాజ కీయ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుకుంటున్నాం. అలాగే ప్రజల్లో ఆర్థిక వనరుల సమాన పంపిణీ జరిగే విధంగా ఆర్థిక ప్రజాస్వామ్యం కోసం ప్రభుత్వాలు కృషిచేయాలి’ అంటూ తన సమానత్వ భావనను, రాజ్యా ధారిత సోషలిజాన్ని అమలు చేయాలని ఆయన సూచించారు. 

అందుకనుగుణంగానే 1976లో రాజ్యాంగపీఠికలో ‘సోషలిజం’ అనే పదాన్ని చేర్చి కొంత మార్గనిర్దేశనం చేశారు. కానీ ఆ పదం చేర్చిన సమయం ఎమర్జెన్సీ కావడం వల్ల దాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. అయితే ఇందిరాగాంధీ సమయంలోనే అంబేడ్కర్‌ ఆశిం చినట్టుగా బ్యాంకుల జాతీయం జరిగింది. ఎన్నో పబ్లిక్‌ రంగ సంస్థ లను నెలకొల్పారు. పబ్లిక్‌ రంగ సంస్థలను ప్రభుత్వం ఎంతో చారిత్రక అనుభవంతో, ఎందరెందరో తాత్విక వేత్తల ఆలోచనలతో నెలకొ ల్పారు. దేశంలో అప్పటి వరకు ఉన్న బొగ్గు గనులలాంటి ఎన్నో పరిశ్ర మలను జాతీయం చేశారు. దీంతో అప్పటి వరకు చాలా దుర్భరంగా ఉన్న కార్మికుల జీవితాలు చట్టపరమైన రక్షణలోకి, జీవన భద్రతలోకి, వేతనాల గ్యారంటీ వ్యవస్థలోకి మారిపోయాయి. 

ఈ నేపథ్యంలో మనం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విష యాన్ని చూడాలి. తెలుగు చరిత్ర ఉన్నంత వరకు ‘విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు’ నినాదం ప్రతి తెలుగు వాడి మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఎన్నో త్యాగాల, బలిదానాల వల్ల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉనికిలోకి వచ్చింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు కంపెనీకి అప్పగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఈ రోజు ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. ఏపీ బీజేపీ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించకపోవడం గమనార్హం.అయితే భారత్‌లో 1947 స్వాతంత్య్రా నికి ముందు ఉన్న పరిశ్రమలు ప్రైవేట్‌ చేతుల్లోనే ఉన్నాయి. స్వాతం త్య్రానంతరం ఏర్పడిన ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తితో భారీ పరి శ్రమలను ప్రభుత్వాధీనంలోనే ఉంచాయి. అంతే కాకుండా, వందలాది పరిశ్రమలను నూతనంగా నెలకొల్పాయి. 

కానీ 1990 తర్వాత పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్రారంభిం చిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణవల్ల ఆర్థికరంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అందులో ఖాయిలా పడిన పరిశ్రమలను అమ్మే యాలనే విధానం కూడా ఒకటి. కానీ దానిని మరింతగా మార్చి, ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉండడం వల్ల కొన్ని పరిశ్రమలను అమ్మి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని నిర్ణయించారు. అయితే పీవీ నరసిం హారావు తీసుకున్న ఈ విధాన నిర్ణయం ఆ అయిదేళ్ల కాలంలో అంత వేగంగా ముందుకు పోలేదు. కానీ 1998లో రెండవసారి అధికారం లోకి వచ్చిన వాజ్‌పేయి ప్రభుత్వం ఏకంగా పెట్టుబడి ఉపసంహరణ మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది. దానికి ప్రముఖ జర్నలిస్టు అరుణ్‌ శౌరిని మంత్రిగా నియమించింది. ఆయన తన హయాంలో అమ్మకా నికి పెట్టిన కొన్ని సంస్థల, హోటల్స్‌ విషయంలో ‘కాగ్‌’ తప్పు పట్టింది. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. లాభాల్లో ఉన్న బొంబా యిలోని ఒక హోటల్‌ను అమ్మిన సంఘటనను ‘కాగ్‌’ ఉదహరిం చింది. కనీసం టెండర్‌ విధానాన్ని కూడా పాటించలేదని, తమకు ఇష్ట మైన వాళ్ళకు ఇచ్చారని ‘కాగ్‌’ బయటపెట్టింది. 

అయితే మళ్ళీ 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం, పబ్లిక్‌ రంగ సంస్థలకు అమ్మి వేయడం, లేదా వాటాలను అమ్మడం లాంటి పనులను ఆపివేయ లేదు. కానీ అంత వేగంగా పనులు జరగ లేదు. అయితే మళ్ళీ 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఒక ప్రత్యేక శ్రద్ధతో పబ్లిక్‌రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం, లేదా తెగనమ్మడం లాంటి ప్రజా వ్యతిరేక చర్యలకు పూనుకుంది. అయితే వేగంలోనే తేడాయే తప్ప ఈ రెండు పార్టీల వైఖరికీ ఆలోచనలో తేడా లేదు. ప్రైవేట్‌ కంపెనీలు, ప్రత్యేకించి బడాబడా కార్పో రేట్లకు జాతి సంపదను, సహజ వనరు లను అప్పనంగా అప్పజెప్పడంలో దొందూదొందే. ఇటీవల కాంగ్రెస్‌ ముఖ్య నాయకుడు రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వం పబ్లిక్‌ రంగ సంస్థల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలను తప్పు పడుతు న్నట్టు అక్కడక్కడా మాట్లాడుతున్నారు. కానీ అది సరిపోదు. భవిష్య త్తులో కాంగ్రెస్‌ పార్టీ ఎటువంటి ఆర్థిక విధానాన్ని అమలు చేస్తుందో వివరించాలి. బీజేపీ అధికారంలో లేనప్పుడు వారు కూడా ఇలాంటి మాటలే మాట్లాడారు. కానీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ను తల దన్ని చాలా కర్కశంగా పబ్లిక్‌ రంగ సంస్థలను ధ్వంసం చేస్తున్నారు.

పబ్లిక్‌ రంగ సంస్థల అమ్మకం కొన్ని కార్పొరేట్లకు మేలు చేయడం కోసం మాత్రమే అనుకుంటే పొరపాటే. అంతకన్నా పెద్ద ప్రమాదం ఈ దేశానికి పొంచివున్నది. అదే సామాజిక, ఆర్థిక అసమానతల పెరుగు దల. ముఖ్యంగా పబ్లిక్‌ రంగ సంస్థల విధ్వంసం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతారు. ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు అమలులో లేవు. అంతేకాకుండా ఉద్యోగం చేసే వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండదు. ఆ విధంగా మళ్ళీ 1970కి ముందు ఉన్న కాంట్రాక్టర్ల, కార్పొరేట్ల నిలువుదోపిడీకి మరింత అవకాశం దొరుకు తుంది. మన దేశంలో 30 ఏళ్లలో ప్రైవేట్‌ కంపెనీల పెరుగుదల ఊహిం చలేనిది. అందులో కూడా కొన్ని కంపెనీలే ఎక్కువ సంపదను దోచు కుంటున్నాయి.

అటువంటి కంపెనీలు ఈ రోజు ప్రభుత్వాల్ని శాసిస్తు న్నాయి. వాళ్ళ ప్రయోజనాలే దేశ ప్రయోజనాలవుతున్నాయి. క్రమంగా కార్పొరేట్లే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయేమో అనిపి స్తుంది. జాతి సంపదను దోచుకోవడానికి జరుగుతున్న పబ్లిక్‌ రంగ సంస్థల అమ్మకం, వాటాల విక్రయం, మన రాజకీయ ప్రజాస్వా మ్యాన్ని దెబ్బతీస్తుంది. అందువల్ల విశాఖ ఉక్కు కోసం సాగుతున్న ఉద్యమం భారత రైతాంగం చేస్తోన్న పోరాటంలాగా దేశ ప్రయోజ నాలలో భాగంగా జరగాలి. అటువైపుగా ఉద్యమ శక్తులు ఆలోచించా ల్సిన అవసరం ఉంది.

మల్లెపల్లి లక్ష్మయ్య 
సామాజిక విశ్లేషకులు
మొబైల్‌ : 81063 22077


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement