ఆకలితో మరణించిన చిన్నారులు
న్యూఢిల్లీ : ఎనిమిది, నాలుగు, రెండు ఏళ్ల వయసున ముగ్గురు చిన్నారులు. అన్యం పుణ్యం ఎరుగని ఈ పసి పిల్లలు ఎనిమిది రోజుల పాటు తినడానికి తిండి లేక, ఆకలితో అలమటించిపోయారు. తండ్రి ఎక్కడికి పోయాడో తెలియదు, అమాయకురాలైన తల్లి.. వీరికి కడుపు కాలిపోతున్నా ఏం చేయలేని పరిస్థితి. 8 రోజుల పాటు ఈ బాధను అనుభవించిన ముగ్గురు చిన్నారులు, చివరకు తనువు చాలించారు. సొమ్ముసిల్లిపోయిన వీరిని ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి, ఈ తల్లికి కడుపు కోత పెట్టేలా.. డాక్టర్లు షాకింగ్ న్యూస్ చెప్పారు. అప్పటికే ఆ పిల్లలు మరణించారని డాక్లర్లు నిర్దారించారు. ముగ్గురు పిల్లలు ఒకేసారి చనిపోవడంపై విచారణ చేపట్టిన పోలీసులకు, ఆ తల్లి అరిచిన ఆకలి కేకలు గుండెలు బద్దలయ్యేలా చేశాయి. పిల్లలు ఎలా చనిపోయారంటూ పోలీసులు అడగగానే..‘ నాకు ఆహారం ఇవ్వడంటూ...’ అరుస్తూ అక్కడిక్కడే ఆమె సొమ్ముసిల్లిపడిపోయింది. ఈ సంఘటనంతా ఆసుపత్రిలో ఉన్నవారందరికీ కన్నీరు తెప్పించింది.
ప్రాథమిక విచారణ జరిపిన డాక్టర్లు, ముగ్గురు పాపలు ఆకలితో మరణించారని నిర్థారించారు. ఎనిమిది రోజులుగా వారు ఎలాంటి ఆహారం తీసుకోలేదని పేర్కొన్నారు. రెండోసారి శవపరీక్ష నిర్వహించిన డాక్టర్లకు మరింత విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కనీసం వారి శరీరాల్లో ఎలాంటి కొవ్వు లేదని తెలిసింది. అంతేకాక వారి కడుపులు పూర్తిగా ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. పోషకాహార లోపం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ కేసే నిదర్శనమని లాల్ బహదూర్ శాస్త్రి హాస్పిటల్ మెడికల్ సూపరిటెండెంట్ అమితా సక్సేనా అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో తన 15 ఏళ్ల వైద్య వృత్తిలో ఇలాంటి కేసును ఎన్నడూ చూడలేదని మరో డాక్టర్ చెప్పారు. దేశంలో రెండో అతిపెద్ద ఆదాయ నగరంగా ఉన్న రాజధాని ఢిల్లీలో ఆకలితో పిల్లలు మరణించడమనేది నిజంగా షాకింగ్ గురిచేస్తుందని అన్నారు.
బెంగాల్‌కు చెందిన ఈ కుటుంబం, తూర్పు ఢిల్లీలోని మండవలిలో నివాసం ఉంటున్నారు. రిక్షా తొక్కి కుటుంబాన్ని పోషించే తొక్కే భర్త ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో, ఈ కుటుంబాన్ని తీవ్ర కష్టాల్లోకి నెట్టేసింది. పని వెతుకోవడం కోసం అతను ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాడని, రెండో రోజుల్లో తిరిగి వస్తుంటాడని కొందరు పక్కింటివాళ్లు చెప్పారు. పిల్లల తల్లి, మానసికంగా వికరాంగులని తెలిసింది.
భర్త కనిపించకుండా పోవడంతో, ఈ కుటుంబమంతా మూడు రోజులుగా గదిలోనే ఉంటున్నారు. వారి గదిలో కొన్ని మెడిసిన్ బాటిల్స్‌ను, డయేరియా మాత్రలను ఫోరెన్సిక్ టీమ్ గుర్తించింది. గత కొన్ని రోజులుగా ఇద్దరు అక్కాచెల్లెళ్ల ఆరోగ్యం కూడా బాగాలేనట్టు తెలిసింది. డయేరియాతో వారు వాంతులు చేసుకుంటున్నారని, మరో పాప ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనం తింటున్నా అనారోగ్యానికి గురైనట్టు ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. ఈ హృదయ విదారకర ఘటనతో, ఒక్కసారిగా ఆప్ ప్రభుత్వంపై విమర్శలు వర్షం కురుస్తోంది. ‘ఇది చాలా అవమానకరమైన సంఘటన.. దీనిపై రాజకీయం చేయదల్చలేదు. కేంద్రం రాయితీలోనే ఆహారాన్ని పంపిణీ చేస్తోంది. దాన్ని పౌరులకు అందించాల్సిన బాధ్యత ఢిల్లీ ప్రభుత్వంపై ఉంది’ అని బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ అన్నారు. చనిపోయిన చిన్నారుల తల్లిని పరామర్శించిన అనంతరం.. వీరి బాధను విని చాలా షాకింగ్ గురయ్యా, ఇది పూర్తిగా ప్రభుత్వం, సిస్టమ్ విఫలమేనని కాంగ్రెస్ అజయ్ మాకేన్ కూడా విమర్శించారు. అయితే ఇంటివద్దకే రేషన్ డెలివరీని బీజేపీ బ్లాక్ చేయడంతోనే, ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆప్ నేత సంజయ్ శర్మ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment