సాక్షి, హైదరాబాద్: మాతా, శిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో దేశంలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిడ్ వైఫరీ (ప్రసూతి సహాయకులు) వ్యవస్థపై ఐక్యరాజ్య సమితి అను బంధ ఆరోగ్య సంస్థ యూనిసెఫ్ ప్రశంసలు కురిపించింది. ప్రసవ సేవలు అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచి, దిక్సూచిగా మారిందని అభినందించింది.
ప్రసూతి సేవలు అద్భుతంగా ఉన్నాయని, సుఖ ప్రసవాలు జరిగేందుకు ఇవి దోహదం చేస్తున్నాయని పేర్కొంది. ‘ఫర్ ఎవ్రి చైల్డ్ ఎ హెల్థీ స్టార్ట్’ హాష్ ట్యాగ్‌తో హైదరాబాద్‌లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో జన్మించిన నవజాత శిశువు ఫొటోను జత చేసి యూనిసెఫ్ ట్వీట్ చేసింది. తెలంగాణ మిడ్ వైఫరీ వ్యవస్థపై యూనిసెఫ్ ప్రశంసల పట్ల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణ సాకారం అవుతుందనడానికి ఇది మరొక నిదర్శనం అని ట్వీట్ చేశారు.
తగ్గిన మాతృ మరణాలు
మాతా, శిశు సంరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మాతృత్వపు మరణాల రేటు (ఎంఎంఆర్) గణనీయంగా తగ్గటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్‌ఆర్‌ఎస్) ప్రత్యేక బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో ఎంఎంఆర్ 43కు తగ్గింది. 2017–19లో ఇది 56 ఉండగా, వైద్య,ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల ఎంఎంఆర్ 13 పాయింట్లు తగ్గింది.
తద్వారా అతి తక్కువ మరణాలతో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. కేరళ, మహారాష్ట్ర మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. జాతీయ సగటు 97గా నమోదైంది. అంటే తెలంగాణ కన్నా రెట్టింపు అన్న మాట. 2017–19లోనూ తక్కువ ఎంఎంఆర్‌లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.
రాష్ట్రం ఏర్పడేనాటికి ఎంఎంఆర్ 92గా ఉండేది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల క్రమంగా తగ్గుతూ ఇప్పుడు 43కు చేరింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 49 పాయింట్లు తగ్గింది. జాతీయ సగటు 2014లో 130గా ఉండగా... ఇప్పుడు 97కు తగ్గింది. కేవలం 33 పాయింట్లు తగ్గుదల నమోదైందని వెల్లడించింది. దీని ఫలితంగానే యూనిసెఫ్ మిడ్‌వైఫరీ వ్యవస్థను ప్రశంసించిందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment