Sample Registration System
-
దేశానికే దిక్సూచి ‘మిడ్వైఫరీ’
సాక్షి, హైదరాబాద్: మాతా, శిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో దేశంలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిడ్ వైఫరీ (ప్రసూతి సహాయకులు) వ్యవస్థపై ఐక్యరాజ్య సమితి అను బంధ ఆరోగ్య సంస్థ యూనిసెఫ్ ప్రశంసలు కురిపించింది. ప్రసవ సేవలు అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచి, దిక్సూచిగా మారిందని అభినందించింది. ప్రసూతి సేవలు అద్భుతంగా ఉన్నాయని, సుఖ ప్రసవాలు జరిగేందుకు ఇవి దోహదం చేస్తున్నాయని పేర్కొంది. ‘ఫర్ ఎవ్రి చైల్డ్ ఎ హెల్థీ స్టార్ట్’ హాష్ ట్యాగ్‌తో హైదరాబాద్‌లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో జన్మించిన నవజాత శిశువు ఫొటోను జత చేసి యూనిసెఫ్ ట్వీట్ చేసింది. తెలంగాణ మిడ్ వైఫరీ వ్యవస్థపై యూనిసెఫ్ ప్రశంసల పట్ల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణ సాకారం అవుతుందనడానికి ఇది మరొక నిదర్శనం అని ట్వీట్ చేశారు. తగ్గిన మాతృ మరణాలు మాతా, శిశు సంరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మాతృత్వపు మరణాల రేటు (ఎంఎంఆర్) గణనీయంగా తగ్గటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్ఆర్ఎస్) ప్రత్యేక బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో ఎంఎంఆర్ 43కు తగ్గింది. 2017–19లో ఇది 56 ఉండగా, వైద్య,ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల ఎంఎంఆర్ 13 పాయింట్లు తగ్గింది. తద్వారా అతి తక్కువ మరణాలతో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. కేరళ, మహారాష్ట్ర మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. జాతీయ సగటు 97గా నమోదైంది. అంటే తెలంగాణ కన్నా రెట్టింపు అన్న మాట. 2017–19లోనూ తక్కువ ఎంఎంఆర్‌లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రం ఏర్పడేనాటికి ఎంఎంఆర్ 92గా ఉండేది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల క్రమంగా తగ్గుతూ ఇప్పుడు 43కు చేరింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 49 పాయింట్లు తగ్గింది. జాతీయ సగటు 2014లో 130గా ఉండగా... ఇప్పుడు 97కు తగ్గింది. కేవలం 33 పాయింట్లు తగ్గుదల నమోదైందని వెల్లడించింది. దీని ఫలితంగానే యూనిసెఫ్ మిడ్వైఫరీ వ్యవస్థను ప్రశంసించిందని పేర్కొంది. -
దేశంలో తగ్గిన నవజాత శిశు మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: నవజాత శిశు, బాలల మరణాల నివారణలో దేశం గణనీయమైన పురోగతిని సాధించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు నమూనా రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) స్టాటిస్టికల్ రిపోర్ట్–2020ని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. 2014తో పోలిస్తే శిశు మరణాల రేటు (ఐఎంఆర్), నవజాత శిశు మరణాల రేటు (ఎన్ఎంఆర్), ఐదేళ్లలోపు వారి మరణాల రేటు(యూఎంఆర్)లో బాగా తగ్గాయని తెలిపింది. ‘‘నవజాత శిశు మరణాల రేటు 2019లో ప్రతి వెయ్యిమందికి 22 కాగా, 2020 నాటికి 20కి తగ్గింది. మరణాల వార్షిక తగ్గుదల రేటు 9.1%. ఇది పట్టణ ప్రాంతాల్లో 12%, గ్రామీణ ప్రాంతాల్లో 23%. ఐదేళ్ల కంటే తక్కువ వయసు బాలల మరణాలు 2019లో ప్రతి వెయ్యికి 35 కాగా 2020కి 32కి తగ్గాయి. వీటిని 2030 నాటికి 25కు తగ్గించాలన్న లక్ష్యాన్ని తెలంగాణ సహా 11 రాష్ట్రాలు ఇప్పటికే చేరుకున్నాయి’’ అని నివేదిక తెలిపింది. ఈ తరహా మరణాల తగ్గింపులో కేరళ (8), తమిళనాడు (13), ఢిల్లీ (14)ముందు వరుసలో ఉండగా తెలంగాణలో ప్రతి వెయ్యి మందికి 23 మరణాలు ఉన్నాయని వెల్లడించింది. శిశు మరణాల రేటు 2019లో ప్రతి వెయ్యి మందికిు 30 ఉండగా, 2020 నాటికి అది 28కి తగ్గిందని తెలిపింది. -
రాష్ట్రంలో తగ్గిన శిశు మరణాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల కారణంగానే ఈ పురోగతి కనిపిస్తోందని వైద్య, ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. 2020లో శిశు మరణాలపై కేంద్రం ఆధ్వర్యంలోని శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్ఆర్ఎస్) నిర్వహించిన సర్వే నివేదికను తాజాగా విడుదల చేసింది. ఏడాదిలోపు వయసున్న పిల్లలు దేశంలో ప్రతి వెయ్యికి 28 మంది మరణిస్తుండగా, తెలంగాణలో 21 మంది శిశువులు మరణిస్తున్నారు. 2014లో రాష్ట్రంలో ప్రతి వెయ్యి శిశు జననాల్లో 35 మంది శిశువులు చనిపోయేవారని ఎస్ఆర్ఎస్ వెల్లడిం చింది. 1971లో దేశంలో శిశు మరణాల సంఖ్య 129గా ఉండేది. 21 రాష్ట్రాల్లో లెక్క చూస్తే శిశు మరణాల సంఖ్య అత్యంత తక్కువగా కేరళలో ఉంది. ఇక్కడ ప్రతి వెయ్యికి ఆరుగురు మరణిస్తున్నారు. అత్యంత ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో 43 మంది మరణిస్తున్నారు. 9 చిన్న రాష్ట్రాల్లో చూస్తే అత్యంత తక్కువగా మిజోరాంలో ముగ్గురు, ఎక్కువగా మేఘాలయలో 29 మంది మరణిస్తున్నారు. పల్లెల్లో అధికంగా శిశు మరణాలు.. రాష్ట్రంలో ప్రతి వెయ్యి జననాలకు మగ శిశు మరణాలు 21, ఆడ శిశువుల మరణాల సంఖ్య 22గా ఉంది. పట్టణాల్లో శిశు మరణాల సంఖ్య 17 ఉండగా, పల్లెల్లో 24 మంది మరణిస్తున్నారు. పల్లెల్లో మరణించే వారిలో ప్రతి వెయ్యి జననాలకు 25 మంది మగ శిశువులు, 24 మంది ఆడ శిశువులు ఉంటున్నారు. పట్టణాల్లో మరణించే శిశువుల్లో 16 మంది మగ, 18 మంది ఆడ శిశువులు ఉంటున్నారు. రాష్ట్రంలో శిశు మరణాల సంఖ్యలో గ్రామాలకు, పట్టణాలకు మధ్య ఎక్కువ తేడా కనిపిస్తోంది. ఈ తేడాకు ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడమేనని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పట్టణాల్లోనైతే వైద్య వసతి అధికంగా ఉండటం వల్ల శిశు మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
ఎస్ఆర్ఎస్ నివేదికలో షాకింగ్ విషయాలు
నూఢిల్లీ: సాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(ఎస్ఆర్ఎస్)-2018 నివేదిక ఆందోళన కలిగించే అంశాలు వెల్లడించింది. ఐదేళ్లలోపు మరణిస్తున్న చిన్నారుల్లో మధ్యప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉన్నట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా ఐదేళ్లలోపు మరణిస్తున్న చిన్నారుల్లో 20శాతం మరణాలు మధ్యప్రదేశ్‌లోనే సంభవిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. అంటే దేశ వ్యాప్తంగా మరణిస్తున్న ఐదేళ్లలోపు చిన్నారుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు మధ్యప్రదేశ్‌కు చెందిన వారే ఉన్నారు. రెండు శాతం మరణాల రేటుతో కేరళ చివరి స్థానంలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. మధ్యప్రదేశ్ తరువాతి స్థానంలో ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్, బిహార్ రాష్ట్రాలు ఉన్నాయి. ఐదేళ్లలోపు మరణిస్తున్న చిన్నారుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు ఈ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. శిశుమరణాల రేటులో తమిళనాడు, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు కేరళ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఐదేళ్లలోపు మరణిస్తున్న చిన్నారులు సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో సంభవిస్తున్న మరణాలకు, గ్రామీణ ప్రాంతాల్లో సంభవిస్తున్న మరణాల రేటుకు చాలా వ్యత్యాసం ఉంది. అస్సాంలో గ్రామీణ ప్రాంతాల్లో శిశు మరణాల రేటు 16.5 శాతం ఉండగా.. పట్టణాల్లో 6శాతం మాత్రమే ఉంది. మధ్యప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో శిశు మరణాల రేటు 22 శాతం ఉండగా.. పట్టణ ప్రాంతంలో 13.4శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో శిశు మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో శిశుమరణాల రేటు ఎక్కువగా ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది. రాష్ట్రాల వారిగా వివరాలు.. -
రాష్ట్రంలో తగ్గిన శిశు మరణాలు
సాక్షి, హైదరాబాద్: ఏడాదిలోపు వయసున్న శిశువుల మరణాల రేటు రాష్ట్రంలో గణనీయంగా తగ్గింది. ఐదేళ్ల కిందట ప్రతి వెయ్యి జననాలకు శిశువులు 39 మంది మరణిస్తుండగా.. తాజాగా 2018 గణాంకాల్లో 27కి తగ్గింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్ఆర్ఎస్)’సర్వేలో వెల్లడయ్యాయి. రాష్ట్రంలో 2.15 లక్షల జనాభా నుంచి నమూనాల నమోదు చేపట్టారు. శిశు మరణాల రేటులో జాతీయ సగటు (32) కంటే తెలంగాణ (27)లో తక్కువగా నమోదవ్వడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. కేసీఆర్ కిట్, మిషన్ ఇంద్రధనుష్ పథకం, ప్రభుత్వం 29 ఎస్ఎన్సీయూలను నిర్వహిస్తూ నవజాత శిశు ఆరోగ్యాన్ని సంరక్షిస్తోంది. ఫలితంగా శిశు మరణాల రేటు తగ్గినట్లుగా వైద్య వర్గాలు తెలిపాయి. కాగా తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో శిశు మరణాల రేటు 30 ఉండగా పట్టణాల్లో 21 మాత్రమే ఉంది. (చదవండి: రోజు విడిచి రోజు స్కూలుకు..) -
తెలంగాణలో 99% మంది మాంసాహారులే
అహ్మాదాబాద్ : దేశంలో మాంసాహారం తింటున్న వారిలో 99 శాతం మంది ప్రజలతో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా సర్వే వెల్లడించింది. పదిహేనళ్లు ఆపైన వయస్సు ఉన్నవారిని మాంసాహారాన్ని తీసుకుంటున్నారని పేర్కొంది. రాష్ట్రంలోని 98.8 శాతం మంది పురుషులు, 98.6 శాతం మంది మహిళలు మాంసాహారాన్నే భుజిస్తున్నారని తెలిపింది. ఆ తర్వాత స్థానాలు వరుసగా పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ రెండు, మూడు, నాలుగు స్థానాలు అక్రమించాయని చెప్పింది. అలాగే శాఖహారులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది.. ఆ తర్వాత స్థానాలు పంజాబ్, హర్యానా నిలిచాయి. సాంప్రదాయ పద్దతులకు అనుగుణంగా తెలంగాణ ప్రజలు ఆహారం తీసుకుంటున్నారని... అందువల్లే వారు అగ్రస్థానంలో నిలిచారని ఆహార నిపుణులు సవ్యసాచి రాయ్‌చౌదరి వెల్లడించారు. అలాగే తెలంగాణ ప్రజలు ఉదయం పూట టిఫిన్‌గా మటన్, చికెన్ తీసుకుంటున్నారని ఆయన వివరించారు. చాలామంది కుందేళ్లు, కోలంకిపిట్టతోపాటు ఈము పక్షులను కూడా ఇష్టంగా లాగిస్తున్నారని చెప్పారు. జీవనశైలికి అనుగుణంగా ఆహారం తీసుకోవడం వల్ల మాంసం వాడకం విపరీతంగా పెరిగిందన్నారు. హైదరాబాద్‌లో అయితే మాంసం తింటున్నవారి శాతం అత్యధికంగా ఉందని... మిగిలిన తెలంగాణ జిల్లాలో శాఖహారం తీసుకుంటున్న వారు కూడా ఉన్నారని చెప్పారు. దేశంలో అత్యధిక గొర్రెలతో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో నిలిచిందని... అలాగే కోళ్ల ఉత్పత్తిలో దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. శాకాహారులే అధికంగా ఉన్న గుజరాత్ రాష్ట్రంలో కూడా మాంసం తీనే వారి సంఖ్య మరింత పెరిగింది. అది ఎంతగా అంటే దాదాపు 40 శాతం మేర పెరిగారు. అయితే ఈ రాష్ట్రంలో పురుషులతో సరిసమానంగా మహిళలు కూడా మాంసాహారం తింటున్నారు. గుజరాత్లో దాదాపు 1600 కి.మీ. తీరప్రాంతం ఉండగా.. 15 శాతం మంది తెగలు, 7 శాతం మంది దళితులు, 50 శాతం ఒబీసీలు, 12 శాతం మంది మైనార్టీలు ఉన్నారని సామాజిక శాస్త్రవేత్త ఘన శ్యామ్ సా వెల్లడించారు.