సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల కారణంగానే ఈ పురోగతి కనిపిస్తోందని వైద్య, ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. 2020లో శిశు మరణాలపై కేంద్రం ఆధ్వర్యంలోని శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్‌ఆర్‌ఎస్) నిర్వహించిన సర్వే నివేదికను తాజాగా విడుదల చేసింది. ఏడాదిలోపు వయసున్న పిల్లలు దేశంలో ప్రతి వెయ్యికి 28 మంది మరణిస్తుండగా, తెలంగాణలో 21 మంది శిశువులు మరణిస్తున్నారు.
2014లో రాష్ట్రంలో ప్రతి వెయ్యి శిశు జననాల్లో 35 మంది శిశువులు చనిపోయేవారని ఎస్‌ఆర్‌ఎస్ వెల్లడిం చింది. 1971లో దేశంలో శిశు మరణాల సంఖ్య 129గా ఉండేది. 21 రాష్ట్రాల్లో లెక్క చూస్తే శిశు మరణాల సంఖ్య అత్యంత తక్కువగా కేరళలో ఉంది. ఇక్కడ ప్రతి వెయ్యికి ఆరుగురు మరణిస్తున్నారు. అత్యంత ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో 43 మంది మరణిస్తున్నారు. 9 చిన్న రాష్ట్రాల్లో చూస్తే అత్యంత తక్కువగా మిజోరాంలో ముగ్గురు, ఎక్కువగా మేఘాలయలో 29 మంది మరణిస్తున్నారు.
పల్లెల్లో అధికంగా శిశు మరణాలు..
రాష్ట్రంలో ప్రతి వెయ్యి జననాలకు మగ శిశు మరణాలు 21, ఆడ శిశువుల మరణాల సంఖ్య 22గా ఉంది. పట్టణాల్లో శిశు మరణాల సంఖ్య 17 ఉండగా, పల్లెల్లో 24 మంది మరణిస్తున్నారు. పల్లెల్లో మరణించే వారిలో ప్రతి వెయ్యి జననాలకు 25 మంది మగ శిశువులు, 24 మంది ఆడ శిశువులు ఉంటున్నారు. పట్టణాల్లో మరణించే శిశువుల్లో 16 మంది మగ, 18 మంది ఆడ శిశువులు ఉంటున్నారు.
రాష్ట్రంలో శిశు మరణాల సంఖ్యలో గ్రామాలకు, పట్టణాలకు మధ్య ఎక్కువ తేడా కనిపిస్తోంది. ఈ తేడాకు ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడమేనని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పట్టణాల్లోనైతే వైద్య వసతి అధికంగా ఉండటం వల్ల శిశు మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment