మెజీషియన్గా మారనున్న హీరోయిన్!
తిరువనంతపురం: మంజూ వారియర్ ఓ నటిగానే చాలా మందికి తెలుసు. కానీ ఆమె త్వరలో ఓ ఇంద్రజాలికురాలిగా మారబోతోంది. అయితే ఈ అవతారం ఎత్తుతోంది డబ్బులు సంపాదించడానికి మాత్రం కాదండోయ్.. పిల్లల సంరక్షణ కోసం ఈ పని చేయనుంది. ఐక్యరాజ్యసమితికి చెందిన బాలల అత్యవసర నిధి విభాగమైన యూనిసెఫ్ కోసం ప్రముఖ ఇంద్రజాలికుడు, యూనిసెఫ్ ప్రచారకర్త గోపీనాథ్ ముథ్కద్ ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
పుట్టినప్పటి నుంచి 1000 రోజుల లోపు వయసున్న చిన్నారుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించనున్నారు. సహజంగానే సేవాకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే మంజు కూడా ఇందులో తనవంతు సహకారాన్ని అందిస్తున్నారు. గోపీనాథ్‌తో కలిసి మ్యాజిక్ కూడా చేయనున్నారు. ఇందుకోసం అమె ఇంద్రజాల పాఠాలు కూడా నేర్చుకుంటున్నారట. మ్యాజిక్ ద్వారానే తల్లులకు అవగాహన కల్పిస్తానని మంజూ చెబుతున్నారు.