విజయ్‌ సేతుపతి ‘విడుదల 2’ మూవీ రివ్యూ | Vidudala Part 2 Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Vidudala 2 Review: విజయ్‌ సేతుపతి ‘విడుదల 2’ మూవీ రివ్యూ

Published Fri, Dec 20 2024 3:58 PM | Last Updated on Fri, Dec 20 2024 5:21 PM

Vidudala  Part 2 Movie Review And Rating In Telugu

టైటిల్‌: విడుదల 2
నటీనటులు: విజయ్‌ సేతుపతి, మంజు వారియర్‌, సూరి, కిశోర్‌, గౌతర్‌ వాసుదేవ్‌ మీనన్‌, అనురాగ్‌ కశ్యప్‌ తదితరులు
నిర్మాతలు: ఎల్ రెడ్ కుమార్, చింతపల్లి రామారావు (తెలుగు వెర్షన్)
దర్శకత్వం: వెట్రీమారన్‌
సంగీతం: ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: వేల్‌ రాజ్‌
ఎడిటింగ్‌: ఆర్‌. రామర్‌
విడుదల తేది: డిసెంబర్‌ 20, 2024

విజయ్ సేతుపతి, వెట్రీమారన్‌  కాంబినేషన్‌లో వచ్చిన 'విడుదల -1' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'విడుదల-2' తెరకెక్కింది. ఇళయారాజా సంగీతం అందించిన ఈ చిత్రం నేడు(డిసెంబర్‌ 20) ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మహారాజా లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత విజయ్‌ సేతుపతి నుంచి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
ప్రజాదళం నాయకుడు పెరుమాళ్‌(విజయ్‌ సేతుపతి) అరెస్ట్‌తో  'విడుదల -1' ముగుస్తుంది. కస్టడీలో ఉన్న పెరుమాళ్‌ విచారణతో పార్ట్‌ 2 ప్రారంభం అవుతుంది. పెరుమాళ్‌ అరెస్ట్‌ విషయం బయటకు తెలియడంతో అతన్ని మరో క్యాంపుకు తరలించి, అక్కడే ఎన్‌కౌంటర్‌ చేయాలని ప్లాన్‌ చేస్తారు. ఆ క్యాంపుకి అడవి మార్గం ద్వారానే వెళ్లాలి. కొమరన్‌(సూరి)తో కలిసి మరికొంత మంది పోలీసులు పెరుమాళ్‌ని తీసుకెళ్తారు. 

మార్గమధ్యలో పెరుమాళ్‌ తన ఫ్లాష్‌బ్యాక్‌ స్టోరీ చెబుతాడు. స్కూల్‌ టీచర్‌గా ఉన్న పెరుమాళ్‌ దళంలోకి ఎలా చేరాడు? జమిందారి వ్యవస్థ చేసే అరచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కేకే(కిశోర్‌) పరిచయం పెరుమాళ్‌ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? తను పని చేసే ఫ్యాక్టరీ యజమాని కూతురు మహాలక్ష్మి(మంజు వారియర్‌)తో ప్రేమాయణం ఎలా సాగింది? ప్రజాదళం ఆశయం ఏంటి?  ప్రజల కోసం పెరుమాళ్‌ చేసిన పోరాటం ఏంటి? ప్రజాదళాన్ని అంతం చేసేందుకు ప్రభుత్వంతో కలిసి జమీందార్లు చేసిన కుట్ర ఏంటి? పార్ట్‌ 1లో జరిగిన రైలు ప్రమాదం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? పోలీసు కస్టడీ నుంచి పెరుమాళ్‌ తప్పించుకున్నాడా లేదా? సూరి తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
వెట్రిమారన్‌ సినిమాలు అంటేనే వాస్తవికానికి దగ్గరగా ఉంటుంది. అణచివేత, పెత్తందార్లపై పోరాటాలే ఆయన కథలు. విడుదల పార్ట్‌ 2 నేపథ్యం కూడా అదే. అణగారిన వర్గాల నుంచి ఉద్భవించిన ఓ విప్లవ కెరటం.. పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి ప్రజలను ఎలా బయటపడేలా చేశారు అనేది ఈ సినిమా కథ. విడుదల పార్ట్‌ 1 చూసిన వారికి పార్ట్‌ 2 కథనం ఎలా ఉంటుందనేది అర్థమైపోతుంది. పార్ట్‌ 1లో సూరి పాత్రలో ప్రతి ఒక్కరు కనెక్ట్‌ అవుతారు. అమాయకత్వం, వృత్తి పట్ల నిబద్ధత, నిజాయితీ గల సూరి స్టోరీ అందరి మనసులని కలిచి వేస్తుంది. 

అయితే పార్ట్‌ 2లో మాత్రం సూరి పాత్ర నిడివి చాలా తక్కువ. కథనం మొత్తం విజయసేతుపతి పాత్ర చుట్టే తిరుగుతుంది. చాలా తమిళ సినిమాల్లో చూసిన దళితభావానికి ఎర్రజెండా వాదాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు వెట్రిమారన్‌. ఎప్పటి ప్రతి చిన్న విషయాన్ని చాలా కూలంకషంగా రీసెర్చ్‌ చేసి అందరికి అర్థమయ్యేలా సినిమాను తీర్చిదిద్దాడు. పెత్తందారీ వ్యవస్థను ప్రశ్నిస్తూనే  మావోయిస్ట్‌ ఆవిర్భావం, ఎర్రజెండా వాదం వెనుక ఉన్న ఉద్దేశం వివరించాడు. 

నక్సలైట్స్‌ ఎలా కలుసుకుంటారు? సమాచారాన్ని ఎలా చేరవేస్తారు? బడుగు బలహీన వర్గాలతో వారి సంబంధం.. ప్రతీది కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఎక్కడా కూడా కృత్రిమత్వం లేకుండా.. నిజ జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. అయితే ప్రతి విషయాన్ని చాలా డీటేయిల్డ్‌గా చూపించడంతో సాగదీతగా అనిపిస్తుంది. 

దళితులపై దాడి మొదలు పోలీసుల, నక్సల్స్‌ మధ్య జరిగే పోరు వరకు చాలా సన్నివేశాలు గత సినిమాలను గుర్తుకు చేస్తాయి.  అయితే ఓ ఉద్యమ కథకి చక్కని ప్రేమ కథను జోడించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.  పెరుమాళ్‌, మహాలక్ష్మిల ప్రేమ కథ ఆకట్టుకుటుంది.  కరుప్పన్‌ ఎపిసోడ్‌ ఎమోషనల్‌కు గురి చేస్తుంది.  స్కూల్‌ టీచర్‌గా ఉన్న పెరుమాళ్‌ నక్సలైట్‌గా మారడానికి దారితీసిన పరిస్థితులు తెరపై చూస్తున్నప్పడు..  ఆ పాత్రపై జాలీతో పాటు పెత్తందారి వ్యవస్థపై అసహ్యం కలుగుతుంది.  ఇంటర్వెల్‌ సీన్‌ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం అక్కడడక్కడే తిరుగుతున్న ఫీలింగ్‌ కలుగుతుంది. పోలీసులకు, నక్సల్స్‌ మధ్య జరిగే ఎన్‌కౌంటర్‌ ఎపిసోడ్‌ అయితే విసుగు తెప్పిస్తుంది. ఒకనొక దశలో ఓ డాక్యూమెంటరీ ఫిల్మ్‌ చూసినట్లుగా అనిపిస్తుంది.  క్లైమాక్స్‌ సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి.  పార్ట్‌ 3 కోసం తీసుకున్న లీడ్‌ బాగుంది.  వామపక్ష భావజాలం ఉన్నవారికి ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది. 

ఎవరెలా చేశారంటే.. 
విజయ్‌ సేతుపతి నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రలో అయినా ఆయన జీవించేస్తాడు. పెరుమాళ్‌ పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశాడు. పోలీసు స్టేషన్‌లో నగ్నంగా ఉండే సీన్‌ అయినా.. ఇంట్లో భార్య ముందు స్నానం చేసే సన్నివేశం అయినా.. ఎక్కడ కూడా ఆయన నటించనట్లు అనిపించదు. ఆయన నటన అంత సహజంగా ఉంది. మంజు వారియర్‌కి కూడా బలమైన పాత్ర లభించింది. అభ్యుదయ భావజలం గల మహాలక్ష్మి పాత్రలో ఆమె ఒదిగిపోయారు.  పోలీస్‌ డ్రైవర్‌ కొమరన్‌గా సూరి చక్కగా నటించాడు. అయితే పార్ట్‌ 2లో ఆయన పాత్ర నిడివి చాలా తక్కువ. కిశోర్‌, గౌతర్‌ వాసుదేవ్‌ మీనన్‌, అనురాగ్‌ కశ్యప్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 

సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ఇళయరాజా నేపథ్య సంగీతం సినిమాకి మరో ప్రధాన బలం. ఓ ఉద్యమ కథకి కావాల్సిన బీజీఎం అందించాడు. పాటలు పర్వాలేదు.   డబ్బింగ్‌ బాగోలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెంకడాఫ్‌లో చాలా సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

 

 

 

 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement