వీరబాలికలకు పురస్కారాలు
ముంబై: బాల్యవివాహాలను ఎదురించి చిరుప్రాయంలోనే అందరికీ ఆదర్శంగా నిలిచిన తొమ్మిది మంది మహారాష్ట్ర మారుమూల ప్రాంతాలకు బాలికలకు నవజ్యోతి పురస్కారాలు దక్కనున్నాయి. ఐక్యరాజ్య సమితి చిన్నారుల నిధి (యూనిసెఫ్) వీటిని అందజేయనుంది. సమాజంలో సానుకూల మార్పులు తెచ్చి, తోటివారికి ఆదర్శంగా నిలిచే బాలికలకు రాష్ట్రస్థాయిలో ఈ పురస్కారాలు అందజేస్తామని యూనిసెఫ్ ముంబై విభాగానికి చెందిన రాజేశ్వర్ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. తమ జీవితాలను సమూలంగా నాశనం చేసే బాల్యవివాహాలను ధైర్యంగా అడ్డుకున్న చిన్నారుల వివరాలను ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు.
మావోయిస్టుల ప్రాబల్యం గల గడ్చిరోలి జిల్లాలోని కుగ్రామానికి చెందిన 15 ఏళ్ల సునితా వచామీకి ఐపీఎస్ అధికారి కావాలని ఆశ. పెళ్లి చేసుకోవడం లేదా మావోయిస్టుగా మారిపోవడం.. ఈ రెంటిలో ఏదోఒకదాన్ని ఎంచుకోవాలన్న కుటుంబ సభ్యుల సూచనను ఆమె తిరస్కరించింది. తాను చదువుకుంటానని స్పష్టం చేసింది. భామ్రాగఢ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో సునిత ఇప్పుడు విద్యాభాస్యం చేస్తోంది. పర్భణిలోని కేదార్‌బస్తి వాసి, 10వ తరగతి విద్యార్థిని ఆశా టోండేది కూడా ఇదే కథ. తన అక్కలంతా బాల్యంలోనే పెళ్లి చేసుకొని పడుతున్న ఇబ్బందులతో చలించిన ఈ 16 ఏళ్ల యువతి మెజారిటీ వచ్చాకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.
ఇంట్లోవాళ్లు తెచ్చిన పెళ్లిసంబంధాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించానని ఈ ఔత్సాహిక రెజ్లర్ తెలిపింది. వీరిలో కొందరు బాల్యవివాహాలను తిరస్కరించడమే కాదు.. తోటివారు కూడా ఈ ఊబిలో పడకుండా నిరోధించగలిగారు. జాల్నా జిల్లా నివ్‌దుంగా గ్రామవాసి, 17 ఏళ్ల మాధురి పవార్ తన గ్రామానికి రోడ్డు, బస్సు సదుపాయం కల్పించగలిగింది. గ్రామస్తుల పోరాటానికి నాయకత్వం వహించి జిల్లా అధికారులతో మాట్లాడడంతో ఆమె ఊరికి బస్సు మంజూరైంది. ఫలితంగా బాలికలంతా చదువుకోవడానికి పక్క గ్రామాలకు వెళ్తున్నారు. అంతేకాదు బాల్యవివాహం బారి నుంచి కూడా తప్పించుకున్నారని మాధురి సంతోషంగా చెప్పింది. యావత్మాల్ జిల్లా హివార్‌దారాకు చెందిన 18 ఏళ్ల రోష్నా మరాస్‌కోల్హే స్వయంగా తన వివాహాన్ని నిరోధించడమే కాదు అక్కడి బాలికలను కూడా బాల్యవివాహాల నుంచి రక్షించింది. కుటుంబ సభ్యులు గత ఏడాది తన పెళ్లి చేయడానికి యత్నించగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వరుడు జైలుపాలయ్యాడు. ఇలా ఒక్కొక్కరూ తమ జీవితాలను తాము సరిద్దుకోవడమేగాకుండా సమాజం నుంచి ఇంకా కనుమరుగవని బాల్య వివాహ వ్యవస్థను ధైర్యంగా ఎదుర్కొని, తమ తోటివారికి మంచి జీవితాన్నిచ్చారు. తల్లిదండ్రులను ఆలోచింపజేశారు.