యునిసెఫ్, టీసీఎస్ బృందాల ప్రశంస
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ‘అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ఏటీఎల్)’ సద్వినియోగం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని యునిసెఫ్, టీసీఎస్ ప్రతినిధులు ప్రశంసించారు. శుక్రవారం న్యూఢిల్లీ, హైదరాబాద్ నుంచి వచ్చిన యునిసెఫ్, టీసీఎస్ ప్రతినిధులు ఎన్టీఆర్ జిల్లాలో మొవ్వ, పెనమలూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. దీన్లోభాగంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్, హబ్, స్పోక్స్ మోడల్‌తో పాటు ప్రభుత్వం అమలు చేసిన స్టెమ్ ఆధారిత కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విజయవాడలో పాఠశాల విద్య కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్‌తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 713 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను హబ్, స్పోక్ మోడల్‌గా రూపొందించామన్నారు. విద్యార్థులను సాంకేతికత విజ్ఞానం వైపు ప్రోత్సహించడానికి ‘సంకల్పం’ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నామన్నారు. అటల్ టింకరింగ్ మారథాన్, సీడ్ ది ఫ్యూచర్, సైన్స్ ఫెయిర్, ఇన్‌స్పైర్ తదితర పోటీల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపుతున్నారన్నారు. ఇలాంటి సమయంలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పనితీరుపై యునిసెఫ్ డాక్యుమెంటరీ రూపొందించడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీ నుంచి వచ్చిన యునిసెఫ్ ప్రతినిధులు అరేలియా ఆర్డిటో (చీఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్), ప్రమీల (విద్యా నిపుణురాలు), హైదరాబాదు నుంచి శేషగిరి మధుసూదన్ (విద్యా నిపుణులు), శిఖా రాణా (విద్యాధికారి), టీసీఎస్ నుంచి విమల్, విపుల్, శ్రీనివాస్ విశ్వనాథ, ఏపీ యునిసెఫ్ కన్సల్టెంట్ టి.సుదర్శన్, రాష్ట్ర నోడల్ అధికారి డా.జిఆర్ భాగ్యశ్రీ, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్ రెడ్డి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment