
పోషకాహారలోపం నివారణకు సహకరించాలి
యునిసెఫ్ ప్రతినిధులతో భేటీలో స్పీకర్ కోడెల
సాక్షి, హైదరాబాద్: చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వాలకు స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సూచించారు. పోషకాహారలోపం నివారణకు అసెంబ్లీ త గిన సహకారం అందిస్తుందన్నారు. మంగళవారం కోడెలతో యునిసెఫ్ ప్రతినిధులు అసెంబ్లీ ఆవరణలో సమావేశమయ్యారు. వ్యవస్థపై ఈ సమస్య విభిన్న రూపాల్లో ప్రభావం చూపుతుందని, దీన్ని అధిగమించేందుకు ప్రపంచవ్యాప్తంగా యునిసెఫ్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
పౌష్టికాహారం విషయంలో మహారాష్ట్ర అనుసరిస్తున్న విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని ఈ సందర్భంగా యునిసెఫ్ ప్రతినిధులు లక్ష్మీ భవాని, ప్రోసన్‌సేన్ స్పీకర్‌కు సూచించారు. పౌష్టికాహారలోపంపై అంతర్జాతీయ సదస్సును విజయవాడలో నిర్వహిస్తామని వారు తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఉద్యోగులు పదోన్నతులు, విభజన విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తానని ఉద్యోగ సంఘాల నేతలకు స్పీకర్ కోడెల హామీనిచ్చారు.