Measles Outbreak Kills 700 Children In Zimbabwe - Sakshi
Sakshi News home page

జింబాబ్వేను వణికిస్తున్న మీజిల్స్ వ్యాధి.. 700 మంది చిన్నారులు మృతి

Published Tue, Sep 6 2022 8:34 AM | Last Updated on Tue, Sep 6 2022 10:11 AM

Measles Outbreak Has Killed 700 Children Zimbabwe - Sakshi

హరారే: జింబాబ్వేను మీజిల్స్ వ్యాధి కలవరపాటుకు గురి చేస్తోంది. ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు ఈ వ్యాధి వల్ల 700 మంది చిన్నారులు మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 1న ఒక్క రోజే 37మంది చిన్నారులు చనిపోయినట్లు తెలిపింది. సెప్టెంబర్ 4 నాటికి దేశంలో మొత్తం 6,291 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. అయితే రెండు వారాల క్రితం మీజిల్స్ వల్ల 157మంది చిన్నారులు మరణించినట్లు అధికారులు చెప్పారు. కానీ ఇ‍ప్పుడు ఆ సంఖ్య ఏకంగా నాలుగు రెట్లు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది.

మీజిల్స్ వ్యాధి బాధితుల్లో ఎక్కువగా వ్యాక్సిన్ తీసుకోని, పోషకాహార లోపం ఉన్న చిన్నారులే ఉంటున్నారు. మతపరమైన నమ్మకాలతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సిన్లు ఇప్పించకపోవడమూ ఈ పరిస్థితికి కారణం. దీన్ని దృష్టిలో ఉంచుకునే వ్యాక్సిన్ తప్పనిసరిచేసేలా కొత్త చట్టం తీసుకురావాలని జింబాబ్వే భావిస్తోంది. 6 నెలల నుంచి 15ఏళ్ల పిల్లలకు పెద్దఎత్తున మాస్ వ్యాక్సినేషన్, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. మతపెద్దలు దీనికి సహకరించాలని కోరుతోంది.

డేంజర్‌..
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధుల్లో మీజిల్స్ కూడా ఒకటి. గాలి ద్వారా, తమ్ముడం, దగ్గడం వల్ల ఇతరులకు సులభంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పిల్లలలో దగ్గు, జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కన్పిస్తాయి. వ్యాక్సిన్ తీసుకోని చిన్నారులకు ఈ వ్యాధి సోకితే తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

మీజిల్స్ వ్యాప్తిని నియంత్రించాలంటే 90శాతం మంది చిన్నారులకు వ్యాక్సిన్లు అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా కారణంగా ఏర్పడిన ఇబ్బందుల వల్ల సేవలు నిలిచిపోయి పేద దేశాల్లో మీజిల్స్ విజృంభిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్‌లోనే హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.5కోట్ల మంది పిల్లలు సాధారణ వ్యాక్సిన్లు తీసుకోలేకపోయారని యూనిసెఫ్‌ జులైలో చెప్పింది. దీనివల్ల పిల్లలకు ప్రమాదమని అప్పుడే హెచ్చరించింది.
చదవండి: చైనాలో తీవ్ర భూకంపం.. 46 మంది దుర్మరణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement