corporate educational institutions
-
చెలరేగిపోతున్న కార్పొరేట్ కళాశాలలు ..అధికంగా ఫీజుల వసూలు
హితేష్ అనే విద్యార్థి నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ‘చైనా’ బ్యాచ్ అని, 24 గంటలూ ఏసీ అని రూ.90 వేలు ఫీజు కట్టించుకుంటున్నారు. పుస్తకాలకు మరో రూ.15 వేలు వసూలు చేశారు. హాస్టల్‌కు నెలకు రూ.5 వేల చొప్పున కట్టించుకున్నారు. నారాయణ కళాశాలలో నర్మద అనే విద్యార్థినికి ఐఐటీ కోచింగ్ పేరుతో ఏడాదికి రూ.75 వేలు, హాస్టల్‌కు నెలకు రూ.5 వేలు చొప్పున కట్టాలని చెప్పారు. పుస్తకాలు, ప్రాక్టికల్స్ పేరుతో మరికొంత చెల్లించాలని ఒత్తిడి చేశారు. తలకు మించిన భారం కావడంతో తల్లిదండ్రులు రెండు నెలల క్రితం నారాయణ కళాశాలలో టీసీ తీసుకుని.. కూతురిని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్చారు. నారాయణ విద్యా సంస్థల్లో ముందస్తుగా అడ్మిషన్లు చేయడానికి పీఆర్వోలను నియమించుకున్నారు. ముందుగా చేరితే ఫీజుల రాయితీ ఇస్తామని అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. జెడ్ఎఫ్బీ, ఎన్120, కోస్పార్క్ అని ఆకర్షణీయమైన పేర్లు పెట్టి స్టడీ మెటీరియల్‌పై అమాంతంగా ఫీజులు పెంచుతున్నారు. అనంతపురం నారాయణ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ ఇటీవల కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఫీజు మొత్తం కడితేనే రికార్డులు ఇస్తామని బెదిరించడంతో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తెలిపింది. ఫీజు కట్టలేదని అందరి ముందు అవమానించడం, క్యాంపస్ బయట నిల్చోబెట్టడం, రికార్డులు, హాల్‌టికెట్లు ఇవ్వబోమని బెదిరించడం కార్పొరేట్ కళాశాలల్లో షరామామూలవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భవ్యశ్రీ లాంటి విద్యార్థినులు ఎంతోమంది అర్ధంతరంగా చదువులు మానేయడం.. ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించడం వంటివి చేస్తున్నారు. అనంతపురం: కార్పొరేట్ కళాశాలలు అడ్డగోలు సంపాదనకు తెరలేపాయి. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కన్నా అదనంగా వసూలు చేస్తున్నాయి. నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్ కళాశాలల్లో అధిక ఫీజులు, వసూళ్ల కోసం వేధింపులు పరాకాష్టకు చేరుతున్నాయి. సూపర్ –20, ఐఐటీ తదితర కోర్సుల పేరుతో విచ్చలవిడిగా వసూలు చేస్తూ తల్లిదండ్రులపై విపరీతమైన భారం మోపుతున్నారు. విద్యార్థుల్లోనూ మానసిక ఒత్తిడి పెంచుతున్నారు. దీని నుంచి విద్యార్థులు బయటపడలేక అర్ధంతరంగా చదువు మానేయడం, ఆత్మహత్యకు యత్నించడం వంటి విపరీతమైన పరిస్థితులకు దారితీస్తోంది. కళాశాలలపై పర్యవేక్షణ చేయాల్సిన ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు నిమ్మను నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. హాస్టల్ ఫీజు ఏడాదికి రూ.60 వేలట! నారాయణ కళాశాలలో ఒక్కో విద్యార్థికి హాస్టల్ ఫీజు రూ.60 వేలుగా నిర్ధారించారు. నెలకు రూ.5 వేల చొప్పున వసూలు చేస్తూ ఒక్కో గదిలో 10 మందిని కేటాయించారు. నాణ్యమైన భోజనం కూడా పెట్టడం లేదు. ఇదే విషయం ఇటీవల తనిఖీలో వెలుగు చూడటంతో జాయింట్ కలెక్టర్ జరిమానా విధించారు. ఒక్కో విద్యార్థికి ఇంటర్మీడియెట్‌లో ఫీజు రూ.20 వేలు దాటకూడదు. కానీ కార్పొరేట్ కళాశాలలు రూ.65 వేల నుంచి రూ.80 వేల దాకా వసూలు చేస్తున్నాయి. తెలుగు అకాడమీ పుస్తకాలు మాత్రమే చదవాల్సి ఉన్నప్పటికీ సొంత మెటీరియల్ పేరుతో మరో రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. ఏడాదికి హాస్టల్ ఫీజు, కళాశాల ఫీజు మొత్తం రూ.1.50 లక్షలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారు. అంత డబ్బు చెల్లించుకోలేని వారు తమ పిల్లలను చదువు మాన్పిస్తున్నారు. అన్నీ అద్దె భవనాలే.. నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ఏ ఒక్క బ్రాంచ్‌కూ సొంత భవనాలు ఉండవు. అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ కళాశాలల హవా నడిచినన్నాళ్లూ తల్లిదండ్రులను ముక్కుపిండి వసూలు చేసి.. అద్దె భవనాలు ఖాళీ చేసి వెళ్లిపోవచ్చుననే ఎత్తుగడతోనే కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులకు నివేదించాం నారాయణ కళాశాల ఘటనకు సంబంధించిన సమగ్ర వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాం. అధిక ఫీజులు వసూలు చేస్తున్న అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – డాక్టర్ సురేష్‌బాబు, ఆర్ఐఓ, అనంతపురం -
టెన్త్ పరీక్షల్లో సమూల మార్పులు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధానంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. వీటికి సంబంధించి పాఠశాల విద్యా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపుతోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం.. రానున్న పరీక్షల్లో విద్యార్థులు 100 మార్కులకు (50 మార్కుల చొప్పున రెండేసి పేపర్లు) పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ప్రతి పేపర్లో పది మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో బిట్ పేపర్ ఉండగా దాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించారు. 20 శాతం అంతర్గత మార్కుల రద్దు నేపథ్యంలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ద్వారా పాఠశాల విద్యా శాఖ ఈ ప్రతిపాదనలు రూపొందించింది. అంతర్గత మార్కులను రద్దు చేస్తూ ప్రభుత్వం జూలై 16న జీవో 41 ఇచ్చిన సంగతి తెలిసిందే. బిట్ పేపర్ రద్దు బిట్ పేపర్ వల్ల మాస్ కాపీయింగ్ జరుగుతోందని, కార్పొరేట్ విద్యా సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. బిట్ పేపర్ స్థానంలో ఏకవాక్య సమాధానాలు రాసే విధంగా ప్రశ్నలు ఇవ్వనున్నారు. వీటిని విడిగా కాకుండా ప్రధాన ప్రశ్నపత్రంలోనే ఇస్తారు. ఇప్పటివరకు హిందీ (100 మార్కులు) మినహాయించి ఆయా సబ్జెక్టుల్లో 40 చొప్పున 80 మార్కులకు రెండు పేపర్లు ఉండేవి. సబ్జెక్టుకు 20 చొప్పున అంతర్గత మార్కులుండేవి. ఇక నుంచి హిందీ/సంస్కృతం మినహాయించి ప్రతి సబ్జెక్టులోనూ ఒక్కో పేపర్‌ను 40 మార్కులకు బదులు 50 మార్కులకు ఇవ్వనున్నారు. మార్కులు, ప్రశ్నలు పెరుగుతున్నందున కొన్ని పేపర్ల పరీక్ష సమయాన్ని కూడా మార్పు చేయనున్నారు. హిందీ/సంస్కృతం మినహాయించి మిగిలిన సబ్జెక్టుల్లో ప్రతి పేపర్‌కు 2.30 గంటలు పరీక్ష రాయడానికి, 15 నిమిషాలు ప్రశ్నపత్రం చదువుకోవడానికి ఉంటుంది. హిందీ/సంస్కృతం 100 మార్కులకు ఉండనున్నందున పరీక్ష రాయడానికి 3 గంటలు, ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు ఇవ్వనున్నారు. నాలుగు భాగాలుగా ప్రశ్నపత్రం పదో తరగతి ప్రశ్నపత్రాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తారు. ఒక్కో విభాగంలో ఎన్ని ప్రశ్నలు ఇవ్వనున్నారో ప్రశ్నపత్రం, బ్లూప్రింట్‌ను కూడా రూపొందించారు. ఈపాటికే దీన్ని విడుదల చేయాల్సి ఉన్నా అనుమతి రానందున పాఠశాలలకు పంపలేదు. ఒక్కో పేపర్ 50 మార్కులకు ఉంటుంది. విద్యార్థులు బట్టీ పట్టి రాయకుండా సొంతంగా రాయగలిగేలా, ఆలోచనాత్మకంగా, సృజనాత్మకంగా ప్రశ్నలు ఇస్తారు. అర మార్కు ప్రశ్నలు 12 ఉంటాయి. వీటికి ఆరు మార్కులు కేటాయించారు. వీటికి ఒకే వాక్యం/పదంతో జవాబు రాయాలి. బిట్ పేపర్‌కు బదులుగా దీన్ని పెడుతున్నారు. ఒక మార్కు ప్రశ్నలు 8 ఉంటాయి. వీటికి ఒకటి లేదా రెండు వాక్యాల్లో జవాబు రాయాలి. వీటికి 8 మార్కులు ఉంటాయి. రెండు మార్కుల ప్రశ్నలు 8 ఉంటాయి. మూడు లేదా నాలుగు వాక్యాల్లో జవాబు రాయాలి. వీటికి 16 మార్కులు కేటాయించారు. పెద్ద ప్రశ్నలు 5 ఉంటాయి. వీటికి ఎనిమిది నుంచి పది వాక్యాల్లో జవాబు రాయాలి. ఒక్కో దానికి నాలుగు మార్కుల చొప్పున 20 మార్కులు కేటాయించారు. సమాధానాలు రాసేందుకు 12 నుంచి 16 పేజీలుండే బుక్‌లెట్‌ను రూపొందించి ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నారు. దీని ద్వారా మాస్ కాపీయింగ్‌ను నివారించొచ్చని భావిస్తున్నారు. పేపర్ల వారీగా పాస్ మార్కులు ఇప్పటివరకు పదో తరగతిలో ఆయా సబ్జెక్టుల్లోని రెండు పేపర్లు కలిపి 35 మార్కులు వచ్చినా ఉత్తీర్ణులైనట్లుగా పరిగణించేవారు. ఇక నుంచి సబ్జెక్టుల్లోని రెండు పేపర్లలో ప్రతిదానిలోనూ ఉత్తీర్ణులవ్వాలని ప్రతిపాదించారు. దీని ప్రకారం.. ప్రతి పేపర్లోనూ 17.5 చొప్పున మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇలా రెండు పేపర్లకు కలిపి 35 మార్కులు వస్తేనే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. పాత విధానంలో ఒక పేపర్లో 35 మార్కులు వచ్చి, రెండో దానిలో సున్నా వచ్చినా పాసవుతున్నారు. దీనివల్ల విద్యార్థులు ఎందులో వెనుకంజలో ఉన్నారు.. ఏ సబ్జెక్టుల్లో ప్రమాణాలు ఉన్నాయి.. టీచర్లలో ఎవరు బాగా పాఠాలు చెబుతున్నారు.. ఎవరు చెప్పడం లేదు అనే విషయాలు తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదన చేశారు. -
ప్రైవేట్ విద్యా సంస్థలకు ముకుతాడు
తల్లిదండ్రులు గానీ, ప్రభుత్వాలు గానీ పిల్లలకు, భావితరాలకు ఇవ్వగలిగే మంచి ఆస్తి ఒక్క చదువు మాత్రమే. మన పిల్లలను మనం బాగా చదివించుకోగలిగితేనే వాళ్లు రేపు పేదరికం నుంచి బయట పడతారు. చదువు అనేది పేదరికం నుంచి బయటపడేసే ఆయుధం. అందుకే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా.. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చదువు అన్నది ఒక హక్కుగా మేం చర్యలు ప్రారంభించాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యకు సంబంధించి దేశంలో ఒక చట్టం ఉంది. స్కూళ్లు కానీ, కాలేజీలు కానీ.. ఏవీ కూడా లాభాపేక్షతో, వ్యాపార దృక్పథంతో నడపాల్సినవి కావు. ప్రజా సేవలో భాగంగానే నడపాలి. అయితే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ ఫీజులు కూడా ఏకంగా రూ.63 వేలు, లక్ష రూపాయలు అని చెబుతుంటే మన పిల్లలను ఎలా చదివించగలం? సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యా రంగంలో సమూల మార్పుల కోసం ప్రభుత్వం శాసనసభలో ప్రవేశ పెట్టిన పాఠశాల, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ల బిల్లులు చరిత్రాత్మకమైనవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివర్ణించారు. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని ప్రోత్సహిస్తూ గత ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలను నీరుగార్చిందని విమర్శించారు. విద్యను వ్యాపారమయంగా మార్చేసిన ఆయా సంస్థలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ పిల్లలు చదువుకునే పరిస్థితులు లేకుండా చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీలో పాఠశాల, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ల బిల్లులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతులే గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉండడంతో ఫీజులు నియంత్రించలేని పరిస్థితి ఉండేదన్నారు. ఈ తరుణంలో విద్యా రంగం సమూల ప్రక్షాళన, ఫీజుల నియంత్రణతో పాటు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను పిల్లలకు అందించడానికి వీలుగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ బిల్లులు ఎంతగానో దోహదం చేస్తాయని వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. విద్యా సంస్థల పెద్దలే మంత్రులైతే నియంత్రణ సాధ్యమా? ‘ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ బిల్లు ఒక చరిత్రాత్మక బిల్లు. మన కళ్లెదుటే ప్రైవేట్ స్కూళ్లు ఫీజుల పేరుతో తల్లిదండ్రులను ఎడాపెడా బాదుతున్నా ఎవరూ అడగలేని పరిస్థితి. పట్టించుకోని దుస్థితి. సాక్షాత్తు ఆ పెద్ద పెద్ద స్కూళ్లు, కాలేజీలకు సంబంధించిన యాజమాన్యాలకు చెందిన వారే గత ప్రభుత్వంలో ఇక్కడ మంత్రులుగా ఉండటం మనం కళ్లారా చూశాం. ఆ పెద్ద పెద్ద వాళ్లే మంత్రులుగా ఉన్న పరిస్థితుల్లో స్కూళ్లను, ఫీజులను నియంత్రించలేని పరిస్థితి. ప్రతి ప్రైవేట్ స్కూల్లో 25 శాతం సీట్లను పేదలకు ఉచితంగా ఇవ్వాలి. లేదా తక్కువ ఫీజులు వసూలు చేయాలి, ఆ ఫీజులు కూడా ప్రభుత్వం కట్టాలి. గడిచిన ఐదేళ్లలో ఒక్క స్కూల్లో కూడా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయలేదు. దాంతో ఇష్టానుసారం ఆ స్కూళ్లలో ఫీజులు పెంచుకునే పరిస్థితులు నెలకొని, వ్యవస్థ అంతా నాశనమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. పథకం ప్రకారం ప్రభుత్వ స్కూళ్ల నిర్వీర్యం రాష్ట్రంలో ఒక పథకం ప్రకారం ప్రభుత్వ స్కూళ్లను నీరుగార్చారు. అప్రజాస్వామిక విధానాలతో గత ఐదేళ్లూ ప్రభుత్వ స్కూళ్లను క్రమంగా నిర్వీర్యం చేశారు. చివరకు ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన బకాయిలు కూడా కనీసం 6 నుంచి 8 నెలలపాటు చెల్లించని పరిస్థితి. మధ్యాహ్న భోజన పథకం సరుకుల బిల్లులు కూడా ఇవ్వకుండా ప్రభుత్వ స్కూళ్లను నీరుగార్చారు. గతంలో ప్రభుత్వ స్కూళ్లలో పాఠ్య పుస్తకాలను కూడా సమయానికి ఇవ్వలేదు. జూన్‌లో ఇవ్వాల్సిన పుస్తకాలు సెప్టెంబర్, అక్టోబరులో కూడా ఇవ్వని పరిస్థితులను నా పాదయాత్ర సమయంలో చూశాను. హేతుబద్ధీకరణ పేరుతో స్కూళ్లను మూసేయడంతో పాటు ఓ పద్ధతి ప్రకారం ప్రభుత్వ స్కూళ్లన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు. మరోవైపు ప్రైవేట్ స్కూళ్లలో ఇష్టానుసారం ఫీజులు పెంచుకునే అవకాశం ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు విద్య పేరుతో దోచేస్తున్న పరిస్థితులు మన రాష్ట్రంలో చూస్తున్నాం. సమూల మార్పుల దిశగా ముందడుగు రాష్ట్రంలో చదువులు అతి దారుణంగా ఉన్నాయి. విద్యా వ్యవస్థను మేలుకొలపడానికే ఈ బిల్లును తీసుకొచ్చాం. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం చదువు రాని వారు 33 శాతం మంది ఉన్నారు. అంటే నిరక్షరాస్యత ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. తల్లిదండ్రులకు పిల్లలను చదివించాలన్న కోరిక, తపన లేక కాదు.. వారికి ఆర్థిక స్థోమత లేని కారణంగా.. రాష్ట్రంలో నిరక్షరాస్యత 33 శాతంగా ఉంది. దేశం మొత్తం మీద నిరక్షరాస్యత 26 శాతమే. ఇలాంటి పరిస్థితిలో ఈ బిల్లును తీసుకొస్తున్నాం. చదువు అనేది అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. హైకోర్టు చీఫ్ జస్టిస్ సూచించే హైకోర్టు రిటైర్డ్ జడ్జిని ఈ కమిషన్‌కు చైర్మన్‌గా నియమిస్తున్నాం. జాతీయ స్థాయిలో విద్యా రంగానికి సంబంధించిన ప్రముఖులతో కలుపుకుని మరో 11 మందిని సభ్యులుగా నియమిస్తున్నాం. నిబంధనలు పాటించకపోతే స్కూళ్లను మూయించే అధికారం ఈ కమిషన్లు ఏదైనా స్కూలు, కాలేజీకి వెళ్లి అక్కడ అడ్మిషన్, టీచింగ్ ప్రక్రియలను పర్యవేక్షించగలుగుతుంది. స్కూళ్ల గ్రేడింగ్‌ను, విద్యా హక్కు చట్టం అమలును, అక్రిడిటేషన్‌ను వీళ్ల పరిధిలోకి తీసుకు వస్తున్నాం. యాజమాన్యాలను హెచ్చరించడమే కాదు.. జరిమానాలు విధించడం, చివరకు స్కూళ్లను కూడా మూసి వేయించే అధికారం ఈ కమిషన్‌కు ఉంటుంది. స్కూళ్లలో ఫీజులు రియాల్టీలోకి రావాలి. ఏ మాత్రం ఫీజులు ఉంటే పిల్లలు చదువుకోగలుగుతారన్నది, మౌలిక సదుపాయాలను ఈ కమిషన్ పర్యవేక్షిస్తుంది. మొత్తంగా పేదలు, మధ్యతరగతి వారికి అందుబాటులోకి చదువులను తీసుకెళ్తున్నాం. అందుకే ఈ చట్టం చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరించారు. -
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల వసూళ్ల దందాకు అడ్డుకట్ట!
సాక్షి, కర్నూల్(ఆదోని అర్బన్ ) : ‘‘సార్వత్రిక ఎన్నికలు తుదిఘట్టం చేరాయి. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ వెంటనే సీఎం చంద్రబాబు నాయుడూ మేనిఫెస్టో ప్రకటించారు. ఏ మాత్రం స్పష్టతలేని సీఎం మేనిఫెస్టోపై పెదవి విరుస్తున్న ప్రజలు జగన్ మోహన్‌రెడ్డి నవరత్నాలతోపాటు బీసీ డిక్లరేషన్ హామీలు మేళవింపుగా ప్రకటించడాన్ని హర్షిస్తున్నారు. ఓ వైపు సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అందజేస్తామని చెబుతూనే గాడి తప్పిన పాలనను కట్టడి చేస్తామంటూ ప్రైవేట్, కార్పొరేట్ వసూళ్ల దందాను నియంత్రిస్తామన్న జగన్ ప్రకటను ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు. వైఎస్సార్ రైతు భరోస పథకం కింద రైతులకు పెట్టుబడికి ఏటా రూ. 12,500 సాయం, వార్షికాదాయం రూ. 5 లక్షలు దాటని అన్నివర్గాలకు ఆరోగ్యశ్రీ వర్తింపు, పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి అమ్మఒడి పథకం కింద ఏటా రూ. 15,000 సాయం, వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్టీ, ఎస్సీ మహిళలకు పింఛన్... కార్పొరేషన్ల ద్వారా రూ. 75, 000 ఉచితంగా సాయం, మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ప్రోత్సాహకంగా రూ. 24,000 అందజేత, కుల, చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డుతోపాటు సున్నా వడ్డీకే రూ. 10,000 తదితర వరాల జల్లులు కురిపించారు జగన్. ప్రతి సామాజిక వర్గానికే ఇది చేయనున్నామని స్పష్టంగా మేనిఫెస్టో విడుదల చేసిన ప్రతిపక్ష నేత ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల మితిమీరిన ఫీజుల వసూళ్లను నియంత్రిస్తామని ప్రకటించారు. అదేవిధంగా ప్రైవేట్ టీచర్ల స్థితిగతులు మెరుగు పరుస్తామన్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేస్తామని, నివేదిక నేరుగా సీఎంకు అందజేసే విధంగా చర్యలు తీసుకుంటామన్న జగన్ మోహన్‌రెడ్డి హామీపై విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు తల్లిదండ్రులు నుంచి హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వారి అభిప్రాయాలు ఇలా’’... బ్యాంకుల ద్వారా ఫీజులు చెల్లింపులు ఉండాలి ఫీజు నియంత్రణ చట్టం అమలులోకి రావాలంటే విద్యార్థుల ఫీజులు బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు దొంగ బిల్లులతో విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాయి. ఫీజు నియంత్రణ చట్టం ఉన్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఫీజులు తగ్గించేందుకు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం సంతోషకరం. ఫీజులు నియంత్రించగలిగితే రాష్ట్రం విద్యాభివృద్ధి చెందుతుంది. – చంద్రశేఖర్, రిటైర్డ్ లెక్చరర్, ఆదోని ఫీజు నియంత్రణ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి ఫీజు నియంత్రణ చట్టం ఉన్నా ఏ మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముకాయడం మూలంగానే చట్టం అమలు కావడం లేదు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఫీజులు తగ్గించేందుకు ప్రత్యేక కమిషన్ నియమిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం సంతోషకరం. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఫీజులు తగ్గించి చూపుతామన్న హామీని నమ్ముతున్నాం. – లోకేష్, న్యాయవాది, ఆదోని ఫీజుల నియంత్రణ అవసరం ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల యాజమాన్యలు విచ్ఛలవిడిగా ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. ఈ దోపిడీని నియంత్రించే నాథుడే కరువయ్యారు. తమ పిల్లలను బాగా చదివించాలనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించి పేదలు చాలా ఇబ్బందులకు గురువుతున్నారు. మధ్యలో చదువు నిలిపేసిన సంఘటనలు లేకపోలేదు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఫీజుల నియంత్రిస్తామని హామీ ఇవ్వడం అభినందనీయం. ఆయన చేసి చూపుతారని నమ్ముతున్నాం. – కమలనాభ శర్మ, విద్యార్థి తండ్రి విద్యాభివృద్ధికి జగన్ చేయూత పేద, మధ్య తరగతి పిల్లలు ప్రతి ఒక్కరూ చదివి ఉన్నత స్థాయికి చేరాలనే ఉద్దేశంతో జగన్ ప్రైవేట్ స్కూళ్లు, కార్పొరేట్ కళాశాల ఫీజులు తగ్గిస్తామిని ప్రకటించారు. ఆయన నిర్ణయం చాలా మంచిది. విద్యాభివృద్ధి చెందుతుంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలతో ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యనభ్యశించి స్థిరపడ్డారు. – శంకర్, విద్యార్థిని తండ్రి చాలా మంచి నిర్ణయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో బాగుంది. ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల ఫీజు నియంత్రణ చేపడుతామని ప్రకటించడం చాలా మంచి నిర్ణయం. రెగ్యులేటర్ కమిషన్ ఏర్పాటు చేస్తే ఫీజులు తగ్గే అవకాశం ఉంది. అదికూడా డైరెక్ట్‌గా ముఖ్యమంత్రికే కమిషన్ నివేదిక అందజేయాలనే విధంగా చర్యలు తీసుకుంటామన్న నిర్ణయం అభినందనీయం. – ఈరన్న, రిటైర్డ్ డిప్యూటీ ఈఓ, ఆదోని -
పాత్రధారులయ్యారు.. ఇక సూత్రధారే!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కార్పొరేట్ విద్యాసంస్థలకు చెందిన మరో కీలక వ్యక్తి ని అరెస్టు చేసేందుకు సీఐడీ రంగం సిద్ధం చేసింది. తమ కస్టడీలో ఉన్న శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణ విచారణలో ఆ కీలక వ్యక్తి వ్యవహారం వెలుగులోకి రావడంతో అతడిని అరెస్టు చేసేందుకు ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంది. కేసుకు సంబంధించి 16 మంది బ్రోకర్ల అరెస్టుకు 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు దర్యాప్తు అధికారుల ద్వారా తెలిసింది. అతడే కీలకం: ప్రశ్నపత్రం ప్రింటింగ్, లీక్, విద్యార్థులతో బ్రోకర్ల క్యాంపు నిర్వహణ తదితరాలన్నీ సీఐడీ ఛేదించింది. కుట్రకు సూత్రధారిగా భావిస్తున్న కార్పొరేట్ సంస్థల కీలక వ్యక్తిని అరెస్టు చేస్తే దర్యాప్తు పూర్తయినట్లేనని అధికారులు భావిస్తున్నారు. అనుకున్నట్లుగా అతడిని అరెస్టు చేస్తే ఆగస్టు రెండో వారానికి చార్జిషీట్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సీఐడీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా పలు క్యాంపులు నిర్వహించిన బ్రోకర్లలో 16 మంది పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోడానికి కౌంటర్ ఇంటెలిజె న్స్ నేతృత్వంలో 6 ప్రత్యేక బృందాలు ముంబై, ఢిల్లీ, బిహార్, పుణే, కర్ణాటక, షిర్డీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. నేటితో ముగియనున్న కస్టడీ: వాసుబాబు, శివనారాయణ సీఐడీ కస్టడీ బుధవారంతో ముగియనుంది. దీంతో వీరిని బుధవారం మధ్యాహ్నం నాంపల్లిలోని 6వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. వాసుబాబు, శివనారాయణ లింకు ద్వారా అరెస్టయిన గణేశ్ప్రసాద్ను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని సీఐడీ భావిస్తోంది. -
కార్పొరేట్ విద్యా సంస్థలను జాతీయం చేయాలి
సాక్షి, అమరావతి బ్యూరో : ‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పెద్దలు, కార్పొరేట్ విద్యా సంస్థల మధ్యనున్న అనైతిక, అవినీతి బంధం విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తోంది. అనారోగ్యకరమైన పోటీ, అనవసరమైన ఒత్తిడి వల్లే విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయి..’ అని ప్రముఖ విద్యావేత్త, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత సందీప్ పాండే తీవ్రంగా విమర్శించారు. జాతీయ విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించే కార్పొరేట్ విద్యాసంస్థలను జాతీయం చేయడమే ఈ సమస్యకు పరిష్కారమని ఆయన సూచించారు. ఓ సదస్సులో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన సందీప్ పాండే ఆదివారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు వెల్లడించారు. సాక్షి : తెలుగు రాష్ట్రాల్లో రెండేళ్లలో దాదాపు 450మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పరిస్థితిని మీరు ఎలా చూస్తారు? సందీప్ పాండే : కార్పొరేట్ విద్యా విధానంతో దేశ విద్యా వ్యవస్థలో విపరీత పోకడలు పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మరీ అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నారాయణ, చైతన్య అనే రెండు పెద్ద విద్యా సంస్థలు ప్రభుత్వ వ్యవస్థలను నియంత్రిస్తూ ఈ విష సంస్కృతిని పెంచిపోషిస్తున్నాయి. అనారోగ్యకర పోటీని పెంచుతూ విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. సాక్షి : పాలకులు, కార్పొరేట్ విద్యా సంస్థల బంధం విద్యా రంగంలో సంస్కరణకు అవరోధంగా మారుతోందా? పాండే : కచ్చితంగా. ప్రధానంగా ఏపీలో.. పాలకులు, కార్పొరేట్ విద్యా సంస్థల అవినీతి, అనైతిక బంధం విద్యా వ్యవస్థను నాశనం చేస్తోంది. ఇక్కడ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవీ కూడా పార్లమెంట్ ఆమోదించిన విద్యా హక్కు చట్టాన్ని ఏమాత్రం గౌరవించడంలేదు. సాక్షి : విద్యా రంగంలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలని మీరు సూచిస్తారు? పాండే : దేశంలో సార్వత్రిక విద్యా విధానం ఉండాలి. విద్యా సంస్థలను ప్రభుత్వమే నిర్వహించాలి. -
నేడు కార్పొరేట్ విద్యాసంస్థల బంద్
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ విద్యాసంస్థలైన నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సోమవారం కార్పొరేట్ విద్యాసంస్థల బంద్‌కు పిలుపు ఇస్తున్నట్లు ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రాఘవేందర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రెండు విద్యాసంస్థల్లో ఇప్పటివరకు వందల సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్యలు జరిగినా ఒక్క అరెస్టు కూడా జరగలేదన్నారు. ఆయా కాలేజీల హాస్టళ్లకు అనుమతులే లేవని, అయినా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని అన్నారు. -
రేపటి నుంచి ప్రైవేటు విద్యా సంస్థల బంద్
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు రేపటి నుంచి నిరవధిక బంద్ పాటించనున్నట్టు విద్యా సంస్థల జేఏసీ ఓ ప్రకటనలో తెలిపింది. విద్యా సంస్థలపై పోలీసు, విజిలెన్స్ దాడులకు నిరసనగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు జేఏసీ ప్రకటించింది. ఈ నెల 30వ తేదీలోపు ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసింది. విద్యా శాఖ అధికారులతోనే తనిఖీ చేయించాలని, లోపాలు ఉంటే సరిచేసుకోవడానికి ఏడాది సమయం ఇవ్వాలని డిమాండ్ చేసింది. కార్పొరేట్ విద్యా సంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరింది. -
‘పది’ విద్యార్థులకు హాల్ టికెట్ వేధింపులు అరికట్టాలి: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి విద్యార్థులను హాల్ టికెట్ల పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు వేధించడాన్ని అరికట్టాలని, వాటిని ప్రభుత్వం నియంత్రించాలని సీపీఎం డిమాండ్ చేసింది. వారం రోజుల్లో పదో తరగతి పరీక్షలు మొదలుకానుండగా, ప్రైవేట్ సంస్థలు హాల్ టికెట్ల జారీ పేరుతో విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించింది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను ఆందోళనకు గురిచేయకుండా షరతులు లేకుం డా హాల్ టికెట్లు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఇటీవల ప్రారంభమైన ఇంటర్ పరీక్షల సందర్భంగా కూడా హాల్ టికెట్ల జారీలో విద్యార్థులను ప్రైవేట్ విద్యాసంస్థలు వేధించాయని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిందని ధ్వజమెత్తింది. -
కార్పొరేట్ ఉరితాళ్లు
కార్పొరేట్ విద్యావిధానం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసానికి బదులు ఒత్తిడిని పెంచుతోంది. హాస్టళ్లు కార్పొరేట్ జైళ్లుగా మారాయి. నిర్బంధాలను భరించలేక కొందరు, భయంతో మరికొందరు విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. చిన్న వయసులోనే తమ నూరేళ్ల జీవితాన్ని అర్ధంతరంగా ముగిస్తున్నారు. తల్లి దండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. కాలేజీల యాజమాన్యాలు మాత్రం పిల్లలు చనిపోతే మేమేమి చేస్తామంటూ శవాలను తల్లిదండ్రులకు అప్పగిస్తున్నాయి. మరి నేటి విద్యావిధానంలో మార్పు వచ్చేదెన్నడు!? - విద్యార్థి దశలోనే బలవన్మరణాలు - తల్లిదండ్రులకు మిగుల్చుతున్న కడుపుకోత సాక్షి ప్రతినిధి, విజయవాడ : కార్పొరేట్ విద్యా సంస్థలు లక్షల రూపాయల్లో ఫీజులు దండుకుంటున్నా విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థులకు ఆవాసం కోసం ఏర్పాటుచేసిన హాస్టళ్లలో కనీస వసతులు కూడా ఉండటం లేదు. ఒక్కో గదిలో ఆరు నుంచి పది మంది వరకు విద్యార్థులను ఉంచుతూ తీవ్ర నిర్బంధాలకు గురిచేస్తున్నారు. ఇరుకు గదుల్లో గాలి, వెలుతురు సరిగా అందక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. అనారోగ్యానికీ గురవుతున్నారు. ఆహారం విషయంలోనూ నాణ్యత పాటించకపోవడంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు పోటీ పేరుతో తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తుండటంతో విద్యార్థులు తట్టుకోలేకపోతున్నారు. ర్యాంకుల కోసం 12 గంటల విద్యా విధానం... కార్పొరేట్ కాలేజీల్లో ర్యాంకుల కోసం 12 గంటల విద్యా విధానం అమలవుతోంది. కదిలితే కాళ్లు విరగ్గొడతామనే భయంతో విద్యాభ్యాసం చేపడుతున్నారు. విద్యార్థినీ విద్యార్థులు ఒత్తిళ్లను తట్టుకోలేక, తమ భవిష్యత్‌ను ఎలా తీర్చిదిద్దుకోవాలో అర్థం కాక, తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడలేక, కాలేజీ నుంచి ఇంటికి వెళదామంటే లక్షల్లో డబ్బు కట్టిన తల్లిదండ్రుల బాధ చూసి తట్టుకోలేక.. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రుల్లోనూ మార్పు రావాలి... ర్యాంకుల రేసులో కొట్టుకుపోతున్న నేటి విద్యావిధానం వెంటే తల్లిదండ్రులు కూడా పయనిస్తున్నారు. అదే తమ బిడ్డల బంగారు భవితకు ఆధారమని భావిస్తున్నారు. అప్పులు చేసి మరీ లక్షల రూపాయలు కార్పొరేట్ కళాశాలలకు చెల్లిస్తున్న తల్లిదండ్రులు, పిల్లల ఇబ్బందులు, వారి మనసు తెలుసుకోలేకపోతున్నారు. తాము చెప్పిందే వినమంటున్నారు. అటు అమ్మానాన్నల మాట కాదనలేక, మనసుకు నచ్చని చదువు చదువలేక పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తేలిపోతున్న పోలీస్ కేసులు విద్యా సంస్థల్లో జరిగే ఆత్మహత్యలు, అనుమానాస్పద మృతి కేసులు తేలిపోతున్నాయి. విచారణలో ఆత్మహత్యకు పురిగొల్పిన కారణాలను సరిగా బయటికి తీయడం లేదు. కార్పొరేట్ కళాశాలల్లో కేసులను మాత్రం త్వరగా ముగించేస్తున్న ఉదంతాలే ఎక్కువ. గత ఏడాది సెప్టెంబర్‌లో, నవంబరులో ఇద్దరు విద్యార్థులు, ఈ ఏడాది జనవరి, మార్చి నెలల్లో మరో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నలుగురు ఒకే విద్యా సంస్థలో విద్యార్థినీ విద్యార్థులు. తాజాగా కడపలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దీనికి తాజా ఉదాహరణ. పిల్లల ఆసక్తిని గుర్తించాలి పిల్లల ఆసక్తికి అనుగుణంగా తల్లిదండ్రులు చదివించాలి. ఇందుకు భిన్నంగా జరిగినప్పుడు ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. డాక్టర్, ఇంజనీర్, చార్టర్డ్ అకౌంటెంట్ మాత్రమే చదువు కాదు. ఇవి కాకున్నా జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. చదువు కంటే జీవితం ముఖ్యమని గుర్తించాలి. తమ ఆశలను బలవంతంగా వారిపై రుద్దరాదు. పిల్లల శక్తిసామర్థ్యాలను బట్టి చదివించాలి. వారి ఆసక్తిని గుర్తించి ఆ దిశగా ప్రోత్సహిస్తే ఒత్తిడి లేకుండా ఇష్టంగా చదివి ఉన్నత శిఖరాలకు చేరతారు. - ఎల్.కాళిదాస్, డీసీపీ (శాంతి భద్రతలు), విజయవాడ మానసిక స్థితి అర్థం చేసుకునే పరిస్థితుల్లేవు పిల్లల మానసిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఉదయం నుంచి రాత్రి వరకూ పర్యవేక్షణలోనే చదివించడం వల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో వారు అక్కడి నుంచి పారిపోవాలనే ఆలోచనలు, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలు పాల్పడేందుకు సిద్ధపడుతున్నారు. వాళ్లంతట వారే చదువుకునే వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. - బి.రవిప్రసాద్, విద్యావేత్త, విజయవాడ కారణాలు అనేకం... ఇటీవల జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు అనేక కారణాలు వెలుగు చూస్తున్నాయి. నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషితేశ్వరి ర్యాగింగ్‌తో ఆత్మహత్య చేసుకుంటే, మరొకరు చదువులో తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులు బలవంతంగా తమ ఆశలను పిల్లలపై రుద్దుతున్నారు. దీంతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు ఎక్కువగా ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. - డాక్టర్ టీఎస్ రావు, మానసిక వికాస నిపుణుడు, విజయవాడ -
కార్పొరేట్ విద్యాసంస్థల దిష్టిబొమ్మ దహనం
రాజంపేట్(వైఎస్సార్): కార్పొరేట్ విద్యాసంస్థలకు వ్యతిరేకంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం రాజంపేట పట్టణంలోదిష్టిబొమ్మ దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలతో కుమ్మక్కు కాకుండా విద్యార్థినీల ఆత్మహత్యకు కారణమైన కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. -
‘బాబు’ కోసం గురుపూజోత్సవం వాయిదా
సాక్షి ప్రతినిధి, గుంటూరు : గుంటూరులో శుక్రవారం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు ఓవర్ యాక్షన్ చేశాయి. దేశవ్యాప్తంగా సెప్టెంబరు ఐదో తేదీన రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పునస్కరించుకుని గురుపూజోత్సవాన్ని జరుపుకుంటుంటే, గుంటూరులోని కొన్ని విద్యాసంస్థలు మాత్రం శనివారానికి వాయిదా వేశాయి. జిల్లా యంత్రాంగం ఆదేశాలకు అనుగుణంగా గురుపూజోత్సవ కార్యక్రమానికి దాదాపు పది వేల మంది విద్యార్థులను సమీకరించాయి. వీరిలో కొందరు రహదారికి ఇరువైపులా బారులు తీరి ఉండానికి, మరి కొందరు కార్యక్రమం జరిగిన పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌కు కేటాయించారు. ఉదయం తొమ్మిది గంటలకే వీరిని నిర్ధేశించిన ప్రాంతాలకు చేర్చారు. ముఖ్యమంత్రి కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. అప్పటి వరకు తాగేందుకు తాగునీటిని కూడా సరఫరా చేయకపోవడంతో విద్యార్థులు నీరసించిపోయారు. షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి కార్యక్రమం తరువాత గురుపూజోత్సవాన్ని విద్యాసంస్థల్లో జరపాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం కార్యక్రమం ఆలస్యం కావడంతో విద్యార్థులను ఇళ్లకు పంపించి వేశారు. సీఎం కార్యక్రమం కారణంగా శుక్రవారం నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని శనివారానికి వాయిదా వేశారు. కొన్ని సంస్థలు సెలవు ప్రకటిస్తూ విద్యార్థుల తల్లితండ్రులకు ఎస్ఎంఎస్లు పంపాయి. కొన్ని విద్యాసంస్థలు అసలు కార్యక్రమమే నిర్వహించకపోతే మరికొన్ని శనివారం జరపడానికి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై విద్యాశాఖ అధికారులను సాక్షి వివరణ కోరితే, విద్యాసంస్థలపై తామెటువంటి ఒత్తిడి తీసుకురాలేదని, కార్యక్రమం విజయవంతం చేసేందుకు కొన్ని సంస్థలు విద్యార్థులను తీసుకువచ్చాయని చెప్పారు. -
ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల చట్టం రావాలి
సాక్షి,సిటీబ్యూరో: ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ చట్టాన్ని తీసుకురావాలని ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్ (ఏఐసీఎస్‌వో) నేషనల్ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ ఉదిత్‌రాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం రవీంద్రభారతిలో ఆల్ ఇండి యా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ,ఎస్టీ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో నేషనల్ సెమినార్ -2014 నిర్వహించారు. ప్రైవేట్ రంగం, పదోన్నతులు, కార్పొరేట్ విద్యా సంస్థలు, డీలర్ షిప్, కాంట్రాక్టులు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల్లో రిజర్వేషన్లు అమలు గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలల్లో అమలవుతున్న రిజర్వేషన్ల విధానాన్ని ప్రైవేట్ రంగంలోనూ అమలు చేయాలన్నారు. ఇందుకు అందరం ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నా రు. యువజన సంఘాలను ఉద్యమంలో భాగస్వాములు చేయాలన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో దళితులను ఏకం చేయాల్సి ఉందన్నారు. విశ్రాంత చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు మాట్లాడుతూ ప్రమోషన్లలో రిజర్వేషన్‌కు సంబంధించి 117వ రాజ్యాంగ సవరణ బిల్లు వెంటనే ఆమోదించాలన్నారు. గురుకుల విద్యాలయ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ పేరుతో సంఘాలు ఏర్పాటు చేయడం కాదని, గ్రామాల్లోకి వె ళ్లి పనిచేయాలన్నారు. సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోలాగా జాతీయ స్థాయిలో సబ్‌ప్లాన్‌ను జాతీయ స్థాయిలో చట్టంగా తేవాలన్నారు. ఆల్ ఇండియా క్రిష్టియన్ కౌన్సిల్ చైర్మన్ మాట్లాడుతూ జోషఫ్ డిసౌజా మాట్లాడుతూ జాతీయ స్థాయి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌కంట్యాక్స్ కమిషనర్ డాక్టర్ యు. దేవి ప్రసాద్, అడిషనల్ కమిషనర్ ఎం దయా సాగర్, ప్రముఖ కవి గోరటి వెంకన్న, కుల వివక్షపోరాట సమితి నేత జి. రాములు, ఓయూ లా కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ గాలి వినోద్ కుమార్, ప్రజా కవి గద్దర్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ మాట తప్పారు : ఎంపీ ఉదిత్‌రాజ్ తెలంగాణ రాష్ట్రానికి దళితున్ని తొలి సీఎం చేస్తానని తెలంగాణ రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖరరావు మాట ఇచ్చి తర్వాత తప్పారని ఎంపీ డాక్టర్ ఉదిత్‌రాజ్ తెలిపారు. ఆదివారం రవీంద్రభారతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో దళితుల పాత్ర కీలకమైందన్నారు. దళితులను కేసీఆర్ విస్మరిస్తే దళితులకు ద్రోహం చేసినట్లేనని చెప్పారు. -
గుర్తింపు లేకుంటే కొరడా
గుర్తింపులేని పాఠశాలలపై చర్యలు షురూ వివరాల సేకరణలో జిల్లా విద్యాశాఖ మే నెలాఖరు వరకు రెన్యువల్ గడువు సాక్షి, విశాఖపట్నం : విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. కొత్త విద్యా సంవత్సరానికి జిల్లా విద్యాశాఖ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. ముందుగా గుర్తింపులేని పాఠశాలల భరతం పట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు వివరాల సేకరణలో పడింది. ముందుగా ఈ విద్యా సంవత్సరంలో గుర్తింపు కాల పరిమితి ముగిసిన యాజమాన్యాలకు మే నెల వరకు గుర్తింపు పునరుద్ధరణకు గడువిచ్చింది. ఆ తర్వాత నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. గుర్తింపులేని స్కూళ్లు 160 : జిల్లాలో గుర్తింపులేని పాఠశాలలు సుమారు 160 వరకు ఉన్నట్టు విద్యాశాఖ చెప్తోంది. కానీ మరో 100 వరకు అనధికారికంగా ఉన్నట్టు సమాచారం. ఇవన్నీ విశాఖ అర్బన్లోనివే కావడం గమనార్హం. వీటిలో కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందిన శాఖలూ ఉన్నాయి. కొన్నేళ్లుగా విద్యాశాఖ చర్యలతో చాలా స్కూళ్లు ప్రభుత్వ గుర్తింపు తెచ్చుకున్నాయి. కొన్ని ట్యూ టోరియల్స్ పేరిట కొనసాగుతున్నాయి. తల్లిదండ్రుల ఒత్తిడి, పిల్లల సంఖ్య తగ్గిపోవడంతో వీరు కూడా గుర్తింపు బాట పట్టా రు. ఎక్కువగా ఈ ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. అర్బ న్లో మాత్రం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ఒత్తిడితో కా ర్పొరేట్ విద్యా సంస్థల జోలికి జిల్లా విద్యాశాఖ వెళ్లలేని పరిస్థితి. గత ఆదేశాలు బుట్టదాఖలు! : గతేడాది ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గుర్తింపులేని ప్రయివేటు/కార్పొరేట్ విద్యాసంస్థలపై జిల్లా విద్యాశాఖ అధికారులు కొరడా ఝళిపించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కార్పొరేట్ విద్యాసంస్థలపై దాడులు చేశారు. గుర్తింపులేకుండా నడుస్తోన్న వాటికి రూ.లక్ష చొప్పున అపరాధ రుసుము విధిస్తూ నోటీసులు జారీ చేశారు. స్కూళ్లను కూడా మూయించారు. నగర పరిధిలో మాత్రం చిన్నాచితకా ప్రయివేటు యాజమాన్యాలపై మినహా బడా కార్పొరేట్ బ్రాంచిలపై దృష్టి సారించలేకపోయారు. ఒకటీ అరా.. దృష్టిపెట్టినా.. కనీస చర్యలు కూడా తీసుకోలేదు. కార్పొరేట్ సంస్థలకు జారీ చేసిన రూ.లక్ష నోటీసులకు ఒక్కరూ స్పందించలేదు. ఒక్క రూపాయి కూడా విద్యాశాఖకు జమకాలేదు. అనధికారికంగా ఎక్కువ బ్రాంచిలు నడుపుతున్న ఓ కార్పొరేట్ స్కూల్ యజమానితో అప్పటి విద్యాశాఖమంత్రి జిల్లా పర్యటనలో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఆ సంస్థపై కన్నెత్తి కూడా చూడలేకపోయారు. దీంతో చిరు యాజమాన్యాలు విద్యాశాఖ తీరును బాహాటంగానే ఎండగట్టాయి. నోటీసులిచ్చి మూయిస్తాం గుర్తింపులేని పాఠశాలల్ని ఉపేక్షించేది లేదు. గతేడాది చాలా వాటికి నోటీసులు జారీ చేసి మూయించాం. ఈసారి కూడా గుర్తింపులేని స్కూళ్ల వివరాలు సేకరిస్తున్నాం. వీటిని వెబ్సైట్లో పెట్టి విస్తృత ప్రచారం కల్పిస్తాం. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాలలకు గుర్తింపు ఉందో, లేదో తెలుసుకుని మరీ తమ పిల్లల్ని చేర్పిస్తే బాగుంటుంది. - బి.లింగేశ్వరరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి