
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కార్పొరేట్ విద్యాసంస్థలకు చెందిన మరో కీలక వ్యక్తి ని అరెస్టు చేసేందుకు సీఐడీ రంగం సిద్ధం చేసింది. తమ కస్టడీలో ఉన్న శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణ విచారణలో ఆ కీలక వ్యక్తి వ్యవహారం వెలుగులోకి రావడంతో అతడిని అరెస్టు చేసేందుకు ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంది. కేసుకు సంబంధించి 16 మంది బ్రోకర్ల అరెస్టుకు 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు దర్యాప్తు అధికారుల ద్వారా తెలిసింది.
అతడే కీలకం: ప్రశ్నపత్రం ప్రింటింగ్, లీక్, విద్యార్థులతో బ్రోకర్ల క్యాంపు నిర్వహణ తదితరాలన్నీ సీఐడీ ఛేదించింది. కుట్రకు సూత్రధారిగా భావిస్తున్న కార్పొరేట్ సంస్థల కీలక వ్యక్తిని అరెస్టు చేస్తే దర్యాప్తు పూర్తయినట్లేనని అధికారులు భావిస్తున్నారు. అనుకున్నట్లుగా అతడిని అరెస్టు చేస్తే ఆగస్టు రెండో వారానికి చార్జిషీట్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సీఐడీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా పలు క్యాంపులు నిర్వహించిన బ్రోకర్లలో 16 మంది పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోడానికి కౌంటర్ ఇంటెలిజె న్స్ నేతృత్వంలో 6 ప్రత్యేక బృందాలు ముంబై, ఢిల్లీ, బిహార్, పుణే, కర్ణాటక, షిర్డీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసింది.
నేటితో ముగియనున్న కస్టడీ: వాసుబాబు, శివనారాయణ సీఐడీ కస్టడీ బుధవారంతో ముగియనుంది. దీంతో వీరిని బుధవారం మధ్యాహ్నం నాంపల్లిలోని 6వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. వాసుబాబు, శివనారాయణ లింకు ద్వారా అరెస్టయిన గణేశ్‌ప్రసాద్‌ను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని సీఐడీ భావిస్తోంది.