EAMCET question paper leakage
-
ఎంసెట్ కేసులో చార్జిషీట్..
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఎట్టకేలకు సీఐడీ చార్జిషీట్ దాఖలు చేయనుంది. మూడేళ్లుగా నానుతూ వస్తున్న దర్యాప్తు కొద్ది రోజుల క్రితం పూర్తి కావడంతో పట్టుబడిన నిందితులపై చార్జిషీట్ దాఖలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనితో సీఐడీ దర్యాప్తు బృందం ఇప్పటివరకు కేసులో అరెస్టయిన ప్రధాన సూత్రధారులు, బ్రోకర్లు, కాలేజీ ప్రతినిధులను ఎఫ్ఐఆర్లో చేర్చింది. పట్టుబడకుండా తప్పించుకొని తిరుగుతున్న వారి పేర్లను సైతం చేర్చి దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా డ్రాఫ్ట్ చార్జిషీట్ కొద్ది రోజుల క్రితమే తయారుచేసిన సీఐడీ అధికారులు న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేందుకు లీగల్ విభాగానికి పంపించారు. చార్జిషీట్ డ్రాప్ట్‌ను అధ్యయనం చేసిన న్యాయవిభాగం అధికారులు కొన్ని సాంకేతిక కారణాలను ఎత్తిచూపారు. వీటిని సరిచేసుకున్న దర్యాప్తు బృందం నాంపల్లిలోని సీఐడీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు కేసులో 124 మందిని నిందితులుగా గుర్తించిన సీఐడీ 94 మందిని అరెస్ట్ చేసింది. వీరిలో ప్రధాన సూత్రధారులుగా 22మంది ఉండగా, మిగిలిన వారంతా బ్రోకర్లని సీఐడీ లెక్క తేల్చింది. మరో దఫా దర్యాప్తు... ప్రస్తుతం దాఖలు చేస్తున్న చార్జిషీట్ తుదిది కాదని, మరో దఫా దర్యాప్తు ఉంటుందని సీఐడీ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఈ కేసులో ఇంకొంత మంది పాత్ర తేలాల్సి ఉందని, గతంలో దర్యాప్తు అధికారులు చేసిన పొరపాట్ల వల్ల కొంత మంది నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారని, వారి కోసం వేటసాగిస్తున్నామని అధికారులు తెలిపారు.మరికొంత మంది బ్రోకర్ల పాత్ర సైతం పూర్తి స్థాయిలో వెలుగులోకి రావాల్సి ఉందని, వారినీ అరెస్ట్ చేసి అనుబంధ చార్జిషీట్ కూడా దాఖలు చేసేందుకు తాము కృషిచేస్తున్నామని సీఐడీ ఉన్నతాధికారులు వెల్లడించారు. మూడేళ్లుగా సాగుతూ.. వస్తున్న ఈ కేసులో కీలక నిందితులు ఇద్దరు మృతి చెందడం, కేసులో అనేక ప్రతిష్టంభనలకు కారణమైంది. 312మంది విద్యార్థులకు కోల్కత్తా, బెంగళూరు, ఢిల్లీ, కటక్, ముంబై, పుణేలో క్యాంపులు నిర్వహించి లీకైన ప్రశ్నపత్రంపై శిక్షణ ఇప్పించిన సంగతి విదితమే. -
ఎంసెట్ కేసు దర్యాప్తు వేగవంతం
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీఐడీ అధికారుల దర్యాప్తు తుదిదశకు చేరుకుంది. లీకేజీలో ప్రధానంగా ఆరోపణ ఎదుర్కొంటున్న కార్పొరేట్ కాలేజీల లింకును పూర్తిస్థాయిలో ఛేదించేందుకు కృషి చేస్తున్నారు. లీకేజీలో కీలకంగా ఉండి దర్యాప్తులో మృతి చెందిన కమిలేశ్‌కుమార్ లింకును ఛేదించనున్నారు. కమిలేశ్‌కు అనుచరులుగా వ్యవహరిస్తూ.. విద్యార్థులను క్యాంపులకు తరలించిన మరో 9మందిని సీఐడీ గుర్తించింది. వీరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ బృందాలను పట్నా, పుణే, ముంబై, బెంగళూరు, ఢిల్లీ పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది. రెండు రోజుల్లో నిందితుల ఆచూకీ పూర్తిస్థాయిలో గుర్తిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తునకు సంబంధించి బ్రోకర్లు, కీలక నిందితుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలతో చార్జిషీట్ రూపొందించే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. -
వాసుబాబు, నారాయణకు రిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబు, నారాయణ కళాశాల ఏజెంట్ శివనారాయణలకు సీఐడీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో వీరిద్దరినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు. బుధవారం వీరి కస్టడీ ముగియడంతో సాయంత్రం నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో భాగంగా శివనారాయణను సీఐడీ బృందం భువనేశ్వర్ తీసుకెళ్లి విచారించిన విషయం తెలిసిందే. భువనేశ్వర్‌లోని రాజధాని హోటల్లో 4 రూములు బుక్ చేసి 18 మంది విద్యార్థులకు శిక్షణ ఇప్పించినట్లు సీఐడీ ఆధారాలు రాబట్టింది. ఇందులో రెండు గదులు శివనారాయణ బంధువులమ్మాయి పేరుతో, మరో రెండు గదులు వరంగల్ జిల్లాకు చెందిన తిరుపతిరెడ్డి పేరుతో ఉన్నట్లు హోటల్ రికార్డుల ద్వారా తెలిసింది. హైదరాబాద్ నుంచి భువనేశ్వర్‌కు మేక్ మై ట్రిప్ ద్వారా విమాన టికెట్లు బుక్ చేసినట్లు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అడ్వాన్స్ రూపంలో రూ.65 లక్షలు తీసుకున్నట్లు విచారణలో వాసుబాబు, శివనారాయణ వెల్లడించినట్లు అధికారుల ద్వా రా తెలిసింది. సీఐడీ కస్టడీలోని వీరిద్దరినీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం ప్రశ్నించారు. కార్పొరేట్ కాలేజీలకు చెందిన మరో వ్యక్తి వ్యవహారంపై వారిని ఆరా తీసినట్లు తెలిసింది. గత దర్యాప్తు అధికారులపై నజర్ గతంలో దర్యాప్తు అధికారులుగా పనిచేసిన వారిపై పోలీస్‌శాఖ దృష్టి సారించింది. రెండుసార్లు చార్జిషీట్ దాఖలు చేసేందుకు ప్రయత్నించి విఫలమైన ఆ అధికారులపై సీఐడీ ఉన్నతాధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేసులోని కీలకాంశాలను పూర్తిగా వెలుగులోకి తీసుకురాకుండా కుట్రపూరితంగా వ్యవహరించారని, దీని వెనకున్న రహస్యా న్ని బయటపెట్టేందుకు అంతర్గత విచారణకు ఆదేశించామని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. గతేడాది ఆగస్టులో శ్రీచైతన్య మాజీ డీన్‌ను విచారణ పేరుతో పిలిచి పంపేయడం, ఆ తర్వాత మరో కార్పొరేట్ కాలేజీ ప్రిన్సిపాల్‌నూ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించినట్లు వెలుగులోకి రావడంతో పోలీస్ పెద్దలు సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. కేసును కేవలం బిహార్ గ్యాంగ్‌కు అంటగట్టి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నించారని, కార్పొరేట్ కాలేజీల ఒత్తిడికి తలొగ్గి వారి నుంచి భారీగా దండుకున్నారని పోలీస్ పెద్దలు అనుమానిస్తున్నారు. దాదాపు రూ.1 కోటి వరకు దర్యాప్తు అధికారుల మీదుగా చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఏమాత్రం ఆధారం దొరికినా దర్యాప్తు అధికారి, ఆయనకు సహకరించిన డీఎస్పీ, ఇద్దరు ఎస్సైలను సస్పెండ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. -
పాత్రధారులయ్యారు.. ఇక సూత్రధారే!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కార్పొరేట్ విద్యాసంస్థలకు చెందిన మరో కీలక వ్యక్తి ని అరెస్టు చేసేందుకు సీఐడీ రంగం సిద్ధం చేసింది. తమ కస్టడీలో ఉన్న శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణ విచారణలో ఆ కీలక వ్యక్తి వ్యవహారం వెలుగులోకి రావడంతో అతడిని అరెస్టు చేసేందుకు ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంది. కేసుకు సంబంధించి 16 మంది బ్రోకర్ల అరెస్టుకు 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు దర్యాప్తు అధికారుల ద్వారా తెలిసింది. అతడే కీలకం: ప్రశ్నపత్రం ప్రింటింగ్, లీక్, విద్యార్థులతో బ్రోకర్ల క్యాంపు నిర్వహణ తదితరాలన్నీ సీఐడీ ఛేదించింది. కుట్రకు సూత్రధారిగా భావిస్తున్న కార్పొరేట్ సంస్థల కీలక వ్యక్తిని అరెస్టు చేస్తే దర్యాప్తు పూర్తయినట్లేనని అధికారులు భావిస్తున్నారు. అనుకున్నట్లుగా అతడిని అరెస్టు చేస్తే ఆగస్టు రెండో వారానికి చార్జిషీట్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సీఐడీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా పలు క్యాంపులు నిర్వహించిన బ్రోకర్లలో 16 మంది పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోడానికి కౌంటర్ ఇంటెలిజె న్స్ నేతృత్వంలో 6 ప్రత్యేక బృందాలు ముంబై, ఢిల్లీ, బిహార్, పుణే, కర్ణాటక, షిర్డీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. నేటితో ముగియనున్న కస్టడీ: వాసుబాబు, శివనారాయణ సీఐడీ కస్టడీ బుధవారంతో ముగియనుంది. దీంతో వీరిని బుధవారం మధ్యాహ్నం నాంపల్లిలోని 6వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. వాసుబాబు, శివనారాయణ లింకు ద్వారా అరెస్టయిన గణేశ్ప్రసాద్ను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని సీఐడీ భావిస్తోంది. -
‘ఎంసెట్’ నిందితులు సీఐడీ కస్టడీకి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సీఐడీ లోతుగా దర్యాప్తు చేయనుంది. ఈ కేసులో అరెస్టయి న శ్రీచైతన్య కాలేజీ డీన్ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణలను ఆరు రోజులపాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి 6వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసులో కార్పొరేట్ కాలేజీల గుట్టు విప్పేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నారు. లీకైన ప్రశ్నపత్రంపై క్యాంపులో శిక్షణ పొందిన 136 మంది విద్యార్థుల వాంగ్మూలాలను సీఐడీ ఇప్పటివరకు సేకరించింది. వారిలో 80 శాతం మంది ఈ రెండు కాలేజీలకు చెంది న వారే ఉండటంతో వాసుబాబు, శివనారాయణ కస్టడీ విచారణ కీలకం కానుందని దర్యాప్తు అధికారులు అభిప్రాయపడ్డారు. కమీషన్ల కోసమే విద్యార్థులను క్యాంపులకు పంపించామంటూ వాసుబాబు, శివనారాయణ చెబుతుండగా కమీషన్ల కోసమే అయితే ఇంత మంది ఒకే గ్యాంగుతో ఎలా క్యాంపులకు వెళ్తారని సీఐడీ అనుమానిస్తోంది. రెండు కార్పొరేట్ కాలేజీల్లో చదివి, ప్రస్తుతం మెడికోలుగా ఉన్న ఆరుగురు బ్రోకర్లు సైతం మాఫియా తో చేతులు కలపడం వెనుకున్న రహ స్యాన్ని బయటపెట్టేందుకు వాసుబాబు, శివనారాయణ కస్టడీ కీలకమని అధికారులు తెలిపారు. శ్రీచైతన్యలోనే చదివిన బ్రోకర్, మెడికో గణేష్‌ప్రసాద్ వెల్లడించిన ఆసక్తికర అంశాలు వాసుబాబు, శివనారాయణ మెడకు ఉచ్చు బిగేంచేలా ఉన్నట్లు తెలిసింది. ఏటా ఎంసెట్ సమయంలో వీరిద్దరూ గణేష్, ఇతర నిందితులైన డాకర్లు ధనుంజయ్, సందీప్‌లతోనూ వ్యవహారం నడిపినట్లు తేలింది. దీంతో కేవలం ఆరుగురు విద్యార్థులనే కాకుండా వాసుబాబు, శివనారాయణ ఈ రెండు కార్పొరేట్ కాలేజీలకు చెందిన మరికొందరిని క్యాంపులకు తరలించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ లింకు ఛేదించేందుకు శుక్రవారం నుంచి ఆరురోజులపాటు ప్రశ్నిస్తామని దర్యాప్తు అధికారులు తెలిపారు. -
అందరూ ఆ కాలేజీ పక్షులే!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో మరో కీలకమైన లింకు బయటపడింది. ఈ కేసుకు సంబంధించి శ్రీచైతన్య కాలేజీలో డీన్‌గా పని చేసిన వాసుబాబు ఇప్పటికే అరెస్ట్ కాగా.. తాజాగా అదే కాలేజీలో చదువుకుని వైద్య విద్య ఫైనలియర్ చదువుతున్న విజయవాడకు చెందిన డాక్టర్ గణేశ్ ప్రసాద్ అరెస్టవడం సంచలనం రేపు తోంది. ప్రస్తుతం కర్ణాటక ధావనగిరిలోని మెడికల్ యూనివర్సిటీలో గణేశ్ చదువుతున్నాడు. ఇతడి సోదరుడు శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ పూర్తి చేయ గా, ఎంసెట్ రాసేందుకు సిద్ధమయ్యాడు. గణేశ్ తన స్నేహితులతో కలసి ఎంసెట్ ప్రశ్నపత్రంపై భువనేశ్వర్‌లో క్యాంపు నిర్వహించాడు. తన సోదరుడితోపాటు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి, డోర్నకల్‌కు చెందిన మరో విద్యార్థిని క్యాంపునకు తీసుకెళ్లాడు. వారితో రూ.30 లక్షలకు డీల్ కుదుర్చుకుని.. అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు వసూలు చేసినట్టు సీఐడీ విచారణలో బయటపడింది. డాక్టర్లు సందీప్, ధనుం జయ్‌లతో వాసుబాబుకు లింకు బయటపడటం, వాసుబాబుతో గణేశ్ లింకు బయటపడటంతో అధికారులకు క్లారిటీ వచ్చినట్లు సమాచారం. ర్యాంకుల వెనుక గుట్టు శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణ అరెస్ట్‌తో.. తీగ లాగితే డొంక కదిలినట్టు చిట్టా బయటపడుతోంది. శివనారాయణ లింకులో బిహార్‌కు చెందిన మరో డాక్టర్, ఇద్దరు బ్రోకర్ల పాత్ర వెలుగులోకి రావాల్సి ఉందని సీఐడీ భావిస్తోంది. దీంతో వాసుబాబుతోపాటు శివనారాయణను మూడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గణేశ్ అరెస్ట్‌తో నిందితుల జాబితా 90కి చేరింది. -
ఎంసెట్ కేసులో సీన్ రివర్స్..
నిందితుల జాబితాలోకి జేఎన్టీయూ అధికారులు? ► బ్రోకర్లుగా మారిన తల్లిదండ్రులూ నిందితులే ► కేసు దర్యాప్తును తిరగదోడుతున్న వైనం సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లో సంచల నం రేపిన ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవ హారం కొత్త మలుపు తిరిగింది. కేసు పూర్తయి చార్జిషీట్ వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న దర్యాప్తు అధికారులకు ఉన్నతాధికారులు ఝలక్ ఇచ్చారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో జేఎన్టీయూ అధికారుల నిర్లక్ష్యాన్ని పేర్కొన కపోవడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఎంసెట్ కేసులో డ్రాఫ్ట్ చార్జిషీట్‌ను రూ పొందించిన దర్యాప్తు అధికారులు.. దానిని కోర్టుకు పంపించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో కేసు పూర్వాపరాలు, దర్యాప్తు వివరాలను సీఐడీ ఉన్నతాధికారులు పరిశీలిం చారు. కేసులో అసలు విషయం తెలుపకుండా చార్జిషీట్ దాఖలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వారి పాత్రను చేర్చాల్సిందే.. ఢిల్లీ శివారులోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో జేఎన్టీయూ అధికారులు ఎంసెట్ ప్రశ్నపత్రం ప్రింట్ చేయించారు. ఈ ప్రెస్ నుంచి ఇప్పటివరకు 11 సార్లు వివిధ రాష్ట్రాల ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ అయిన చరిత్ర ఉంది. ఆ ప్రెస్లోనే జేఎన్టీయూ, ఎంసెట్ నిర్వహణ అధికారులు ఎందుకు ప్రింటింగ్ చేయించారు? గతంలో ప్రశ్నపత్రాలు లీకైన వ్యవహారం తెలియక ప్రింటింగ్ చేశారా? తెలిసే చేయించారా? అన్న కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందని సీఐడీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. గతంలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పీజీ మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో వర్సిటీ అధికారుల పాత్ర ఉన్నట్టు తేలిందని, ఇప్పు డు కూడా వర్సిటీ అధికారులు కాకపోయినా ఎక్కడో ఒక దగ్గర నిందితులతో లింక్ ఉం టుందని, ఆ కోణంలో దర్యాప్తు చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యంతో వేలాది విద్యార్థుల భవిష్యత్ అంధ కారంలో పడిందని, దీనికి కారణం సంబంధి త అధికారుల నిర్లక్ష్యమే నని, ఈ మేరకు వారి నిర్లక్ష్యంపై చార్జిషీట్లో స్పష్టంగా పేర్కొనా ల్సిందేనని ఆ ఉన్నతాధి కారి దర్యాప్తు అధికారులకు తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. దర్యాప్తు తిరగదోడాల్సిందే.. ప్రస్తుతం సీఐడీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐపీఎస్ ఎంసెట్ కేసు దర్యాప్తును తిరగదోడే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రశ్నపత్రాలు ఆ ప్రింటింగ్ ప్రెస్లోనే ముద్రిస్తున్న విషయం నిందితులకు ఎలా తెలిసింది? ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్ లీక్ చేసిన రావత్ అనుమానాస్పద మృతి వెనకున్న అసలు కథేంటి? అన్న అంశాలపై సీనియర్ ఐపీఎస్ ఇప్పుడు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. లీకేజీకి కీలక సూత్రధారిగా ఉన్న కమిలేశ్కుమార్సింగ్ సీఐడీ కస్టడీలో మృతిచెందాడు. కీలక నిందితు లిద్దరి మరణం యాదృచ్ఛికమా? లేకా ఇంకేదైనా ఉండి ఉంటుందా? అన్న కోణంలో కేసు దర్యాప్తును సంబంధిత అధికారి తిరగదోడున్నట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులూ నిందితులే... తన కూతురో/కుమారుడి కోసమో ప్రశ్నపత్రం కొనుగోలు చేసి ఉంటే మానవతా దృక్పథంతో వదిలివేశారు అను కోవచ్చు. అలాకాకుండా మరో ఐదారుగురు విద్యార్థులకు ప్రశ్నపత్రం లీక్ చేసి, డబ్బులు దండుకున్న పలువురు తల్లిదండ్రులను నిం దితులుగా చేర్చాల్సిందేనని సంబంధిత సీనియర్ ఐపీఎస్ దర్యాప్తు అధికారులకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో బ్రోక ర్లుగా మారిన 12 మంది తల్లిదండ్రులను నిందితుల జాబితాలో చేరుస్తున్నట్టు సీఐడీ అధికారులు తెలిపారు. దర్యాప్తు పూర్తయిం దనుకున్న సమయంలో సీన్ రివర్స్ అవడం దర్యాప్తు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తి స్తోంది. కేసు దర్యాప్తు లో చూసీచూడనట్టుగా వ్యవహరించిన పలు కీలకాంశాలు ఇప్పుడు ఏ అధికారి మెడకు చుట్టుకుంటాయోనని వారు ఆందోళన చెం దుతున్నారు. లాలూచీ పడ్డట్టు తేలితే దర్యా ప్తు అధికారులు సైతం ఊచలు లెక్కబెట్టక తప్పదని సీఐడీలోని సీనియర్ ఐపీఎస్ ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. వారి పాత్రపై దర్యాప్తు చేస్తున్నాం.. ఎంసెట్ కేసులో నిర్వాహకులు, సంబంధిత అధికారుల పాత్రపైనా విచారణ చేస్తున్నాం. పేపర్ లీక్‌లో వారి పాత్ర ఉన్నట్టు పెద్దగా ఆధారాలు దొరకలేదు. అయితే పదే పదే లీక్ అవుతున్న ప్రింటింగ్ ప్రెస్‌కే ముద్రణ బాధ్యతలు అప్పగించడంపై అనుమానా లున్నాయి. దీనిపై విచారణ చేసేందుకు 18, 19 తేదీల్లో దర్యాప్తు అధికారులు, నేను స్వయంగా ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్‌కు విచారణ నిమిత్తం వెళ్తున్నాం. ఆధారాలు పక్కాగా దొరికితే 100 శాతం నిందితుల జాబితాలో చేరుస్తాం. – సీఐడీ అదనపు డీజీపీ గోవింద్‌సింగ్