ప్రైవేట్‌ విద్యా సంస్థలకు ముకుతాడు | YS Jagan Says that now poor and middle class students available for education | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ విద్యా సంస్థలకు ముకుతాడు

Published Tue, Jul 30 2019 3:23 AM | Last Updated on Tue, Jul 30 2019 1:57 PM

YS Jagan Says that now poor and middle class students available for education - Sakshi

తల్లిదండ్రులు గానీ, ప్రభుత్వాలు గానీ పిల్లలకు, భావితరాలకు ఇవ్వగలిగే మంచి ఆస్తి ఒక్క చదువు మాత్రమే. మన పిల్లలను మనం బాగా చదివించుకోగలిగితేనే వాళ్లు రేపు పేదరికం నుంచి బయట పడతారు. చదువు అనేది పేదరికం నుంచి బయటపడేసే ఆయుధం. అందుకే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా.. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చదువు అన్నది ఒక హక్కుగా మేం చర్యలు ప్రారంభించాం.
 – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

విద్యకు సంబంధించి దేశంలో ఒక చట్టం ఉంది. స్కూళ్లు కానీ, కాలేజీలు కానీ.. ఏవీ కూడా లాభాపేక్షతో, వ్యాపార దృక్పథంతో నడపాల్సినవి కావు. ప్రజా సేవలో భాగంగానే నడపాలి. అయితే ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్‌ క్లాస్‌ ఫీజులు కూడా ఏకంగా రూ.63 వేలు, లక్ష రూపాయలు అని చెబుతుంటే మన పిల్లలను ఎలా చదివించగలం?

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యా రంగంలో సమూల మార్పుల కోసం ప్రభుత్వం శాసనసభలో ప్రవేశ పెట్టిన పాఠశాల, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ల బిల్లులు చరిత్రాత్మకమైనవని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించారు. ప్రైవేటు కార్పొరేట్‌ విద్యా సంస్థల దోపిడీని ప్రోత్సహిస్తూ గత ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలను నీరుగార్చిందని విమర్శించారు. విద్యను వ్యాపారమయంగా మార్చేసిన ఆయా సంస్థలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ పిల్లలు చదువుకునే పరిస్థితులు లేకుండా చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీలో పాఠశాల, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ల బిల్లులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్పొరేట్‌ విద్యా సంస్థల అధిపతులే గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉండడంతో ఫీజులు నియంత్రించలేని పరిస్థితి ఉండేదన్నారు. ఈ తరుణంలో విద్యా రంగం సమూల ప్రక్షాళన, ఫీజుల నియంత్రణతో పాటు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను పిల్లలకు అందించడానికి వీలుగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ బిల్లులు ఎంతగానో దోహదం చేస్తాయని వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

విద్యా సంస్థల పెద్దలే మంత్రులైతే నియంత్రణ సాధ్యమా?
‘ఏపీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ బిల్లు ఒక చరిత్రాత్మక బిల్లు. మన కళ్లెదుటే ప్రైవేట్‌ స్కూళ్లు ఫీజుల పేరుతో తల్లిదండ్రులను ఎడాపెడా బాదుతున్నా ఎవరూ అడగలేని పరిస్థితి. పట్టించుకోని దుస్థితి. సాక్షాత్తు ఆ పెద్ద పెద్ద స్కూళ్లు, కాలేజీలకు సంబంధించిన యాజమాన్యాలకు చెందిన వారే గత ప్రభుత్వంలో ఇక్కడ మంత్రులుగా ఉండటం మనం కళ్లారా చూశాం. ఆ పెద్ద పెద్ద వాళ్లే మంత్రులుగా ఉన్న పరిస్థితుల్లో స్కూళ్లను, ఫీజులను నియంత్రించలేని పరిస్థితి. ప్రతి ప్రైవేట్‌ స్కూల్లో 25 శాతం సీట్లను పేదలకు ఉచితంగా ఇవ్వాలి. లేదా తక్కువ ఫీజులు వసూలు చేయాలి, ఆ ఫీజులు కూడా ప్రభుత్వం కట్టాలి. గడిచిన ఐదేళ్లలో ఒక్క స్కూల్లో కూడా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయలేదు. దాంతో ఇష్టానుసారం ఆ స్కూళ్లలో ఫీజులు పెంచుకునే పరిస్థితులు నెలకొని, వ్యవస్థ అంతా నాశనమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది.

పథకం ప్రకారం ప్రభుత్వ స్కూళ్ల నిర్వీర్యం
రాష్ట్రంలో ఒక పథకం ప్రకారం ప్రభుత్వ స్కూళ్లను నీరుగార్చారు. అప్రజాస్వామిక విధానాలతో గత ఐదేళ్లూ ప్రభుత్వ స్కూళ్లను క్రమంగా నిర్వీర్యం చేశారు. చివరకు ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన బకాయిలు కూడా కనీసం 6 నుంచి 8 నెలలపాటు చెల్లించని పరిస్థితి. మధ్యాహ్న భోజన పథకం సరుకుల బిల్లులు కూడా ఇవ్వకుండా ప్రభుత్వ స్కూళ్లను నీరుగార్చారు. గతంలో ప్రభుత్వ స్కూళ్లలో పాఠ్య పుస్తకాలను కూడా సమయానికి ఇవ్వలేదు. జూన్‌లో ఇవ్వాల్సిన పుస్తకాలు సెప్టెంబర్, అక్టోబరులో కూడా ఇవ్వని పరిస్థితులను నా పాదయాత్ర సమయంలో చూశాను. హేతుబద్ధీకరణ పేరుతో స్కూళ్లను మూసేయడంతో పాటు ఓ పద్ధతి ప్రకారం ప్రభుత్వ స్కూళ్లన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు. మరోవైపు ప్రైవేట్‌ స్కూళ్లలో ఇష్టానుసారం ఫీజులు పెంచుకునే అవకాశం ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు విద్య పేరుతో దోచేస్తున్న పరిస్థితులు మన రాష్ట్రంలో చూస్తున్నాం. 

సమూల మార్పుల దిశగా ముందడుగు
రాష్ట్రంలో చదువులు అతి దారుణంగా ఉన్నాయి. విద్యా వ్యవస్థను మేలుకొలపడానికే ఈ బిల్లును తీసుకొచ్చాం. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం చదువు రాని వారు 33 శాతం మంది ఉన్నారు. అంటే నిరక్షరాస్యత ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. తల్లిదండ్రులకు పిల్లలను చదివించాలన్న కోరిక, తపన లేక కాదు.. వారికి ఆర్థిక స్థోమత లేని కారణంగా.. రాష్ట్రంలో నిరక్షరాస్యత 33 శాతంగా ఉంది. దేశం మొత్తం మీద నిరక్షరాస్యత 26 శాతమే. ఇలాంటి పరిస్థితిలో ఈ బిల్లును తీసుకొస్తున్నాం. చదువు అనేది అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సూచించే హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిని ఈ కమిషన్‌కు చైర్మన్‌గా నియమిస్తున్నాం. జాతీయ స్థాయిలో విద్యా రంగానికి సంబంధించిన ప్రముఖులతో కలుపుకుని మరో 11 మందిని సభ్యులుగా నియమిస్తున్నాం. 

నిబంధనలు పాటించకపోతే స్కూళ్లను మూయించే అధికారం
ఈ కమిషన్లు ఏదైనా స్కూలు, కాలేజీకి వెళ్లి అక్కడ అడ్మిషన్, టీచింగ్‌ ప్రక్రియలను పర్యవేక్షించగలుగుతుంది. స్కూళ్ల గ్రేడింగ్‌ను, విద్యా హక్కు చట్టం అమలును, అక్రిడిటేషన్‌ను వీళ్ల పరిధిలోకి తీసుకు వస్తున్నాం. యాజమాన్యాలను హెచ్చరించడమే కాదు.. జరిమానాలు విధించడం, చివరకు స్కూళ్లను కూడా మూసి వేయించే అధికారం ఈ కమిషన్‌కు ఉంటుంది. స్కూళ్లలో ఫీజులు రియాల్టీలోకి రావాలి. ఏ మాత్రం ఫీజులు ఉంటే పిల్లలు చదువుకోగలుగుతారన్నది, మౌలిక సదుపాయాలను ఈ కమిషన్‌ పర్యవేక్షిస్తుంది. మొత్తంగా పేదలు, మధ్యతరగతి వారికి అందుబాటులోకి చదువులను తీసుకెళ్తున్నాం. అందుకే ఈ చట్టం చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement