- గుర్తింపులేని పాఠశాలలపై చర్యలు షురూ
- వివరాల సేకరణలో జిల్లా విద్యాశాఖ
- మే నెలాఖరు వరకు రెన్యువల్ గడువు
సాక్షి, విశాఖపట్నం : విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. కొత్త విద్యా సంవత్సరానికి జిల్లా విద్యాశాఖ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. ముందుగా గుర్తింపులేని పాఠశాలల భరతం పట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు వివరాల సేకరణలో పడింది. ముందుగా ఈ విద్యా సంవత్సరంలో గుర్తింపు కాల పరిమితి ముగిసిన యాజమాన్యాలకు మే నెల వరకు గుర్తింపు పునరుద్ధరణకు గడువిచ్చింది. ఆ తర్వాత నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది.
గుర్తింపులేని స్కూళ్లు 160 : జిల్లాలో గుర్తింపులేని పాఠశాలలు సుమారు 160 వరకు ఉన్నట్టు విద్యాశాఖ చెప్తోంది. కానీ మరో 100 వరకు అనధికారికంగా ఉన్నట్టు సమాచారం. ఇవన్నీ విశాఖ అర్బన్లోనివే కావడం గమనార్హం. వీటిలో కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందిన శాఖలూ ఉన్నాయి. కొన్నేళ్లుగా విద్యాశాఖ చర్యలతో చాలా స్కూళ్లు ప్రభుత్వ గుర్తింపు తెచ్చుకున్నాయి. కొన్ని ట్యూ టోరియల్స్ పేరిట కొనసాగుతున్నాయి. తల్లిదండ్రుల ఒత్తిడి, పిల్లల సంఖ్య తగ్గిపోవడంతో వీరు కూడా గుర్తింపు బాట పట్టా రు. ఎక్కువగా ఈ ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. అర్బ న్లో మాత్రం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ఒత్తిడితో కా ర్పొరేట్ విద్యా సంస్థల జోలికి జిల్లా విద్యాశాఖ వెళ్లలేని పరిస్థితి.
గత ఆదేశాలు బుట్టదాఖలు! : గతేడాది ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గుర్తింపులేని ప్రయివేటు/కార్పొరేట్ విద్యాసంస్థలపై జిల్లా విద్యాశాఖ అధికారులు కొరడా ఝళిపించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కార్పొరేట్ విద్యాసంస్థలపై దాడులు చేశారు. గుర్తింపులేకుండా నడుస్తోన్న వాటికి రూ.లక్ష చొప్పున అపరాధ రుసుము విధిస్తూ నోటీసులు జారీ చేశారు. స్కూళ్లను కూడా మూయించారు. నగర పరిధిలో మాత్రం చిన్నాచితకా ప్రయివేటు యాజమాన్యాలపై మినహా బడా కార్పొరేట్ బ్రాంచిలపై దృష్టి సారించలేకపోయారు. ఒకటీ అరా.. దృష్టిపెట్టినా.. కనీస చర్యలు కూడా తీసుకోలేదు. కార్పొరేట్ సంస్థలకు జారీ చేసిన రూ.లక్ష నోటీసులకు ఒక్కరూ స్పందించలేదు.
ఒక్క రూపాయి కూడా విద్యాశాఖకు జమకాలేదు. అనధికారికంగా ఎక్కువ బ్రాంచిలు నడుపుతున్న ఓ కార్పొరేట్ స్కూల్ యజమానితో అప్పటి విద్యాశాఖమంత్రి జిల్లా పర్యటనలో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఆ సంస్థపై కన్నెత్తి కూడా చూడలేకపోయారు. దీంతో చిరు యాజమాన్యాలు విద్యాశాఖ తీరును బాహాటంగానే ఎండగట్టాయి.
నోటీసులిచ్చి మూయిస్తాం
గుర్తింపులేని పాఠశాలల్ని ఉపేక్షించేది లేదు. గతేడాది చాలా వాటికి నోటీసులు జారీ చేసి మూయించాం. ఈసారి కూడా గుర్తింపులేని స్కూళ్ల వివరాలు సేకరిస్తున్నాం. వీటిని వెబ్‌సైట్లో పెట్టి విస్తృత ప్రచారం కల్పిస్తాం. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాలలకు గుర్తింపు ఉందో, లేదో తెలుసుకుని మరీ తమ పిల్లల్ని చేర్పిస్తే బాగుంటుంది.
- బి.లింగేశ్వరరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి