సాక్షి ప్రతినిధి, గుంటూరు : గుంటూరులో శుక్రవారం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు ఓవర్ యాక్షన్ చేశాయి. దేశవ్యాప్తంగా సెప్టెంబరు ఐదో తేదీన రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పునస్కరించుకుని గురుపూజోత్సవాన్ని జరుపుకుంటుంటే, గుంటూరులోని కొన్ని విద్యాసంస్థలు మాత్రం శనివారానికి వాయిదా వేశాయి. జిల్లా యంత్రాంగం ఆదేశాలకు అనుగుణంగా గురుపూజోత్సవ కార్యక్రమానికి దాదాపు పది వేల మంది విద్యార్థులను సమీకరించాయి. వీరిలో కొందరు రహదారికి ఇరువైపులా బారులు తీరి ఉండానికి, మరి కొందరు కార్యక్రమం జరిగిన పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌కు కేటాయించారు. ఉదయం తొమ్మిది గంటలకే వీరిని నిర్ధేశించిన ప్రాంతాలకు చేర్చారు. ముఖ్యమంత్రి కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. అప్పటి వరకు తాగేందుకు తాగునీటిని కూడా సరఫరా చేయకపోవడంతో విద్యార్థులు నీరసించిపోయారు. షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి కార్యక్రమం తరువాత గురుపూజోత్సవాన్ని విద్యాసంస్థల్లో జరపాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం కార్యక్రమం ఆలస్యం కావడంతో విద్యార్థులను ఇళ్లకు పంపించి వేశారు.
సీఎం కార్యక్రమం కారణంగా శుక్రవారం నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని శనివారానికి వాయిదా వేశారు. కొన్ని సంస్థలు సెలవు ప్రకటిస్తూ విద్యార్థుల తల్లితండ్రులకు ఎస్‌ఎంఎస్‌లు పంపాయి. కొన్ని విద్యాసంస్థలు అసలు కార్యక్రమమే నిర్వహించకపోతే మరికొన్ని శనివారం జరపడానికి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై విద్యాశాఖ అధికారులను సాక్షి వివరణ కోరితే, విద్యాసంస్థలపై తామెటువంటి ఒత్తిడి తీసుకురాలేదని, కార్యక్రమం విజయవంతం చేసేందుకు కొన్ని సంస్థలు విద్యార్థులను తీసుకువచ్చాయని చెప్పారు.
‘బాబు’ కోసం గురుపూజోత్సవం వాయిదా
Published Sat, Sep 6 2014 1:28 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement