పినపాక(భద్రాద్రి కొత్తగూడెం): పదో తరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్ నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిష్యత్ అయోమయంగా మారింది. భద్రాద్రి జిల్లా పినపాక మండలం ఎల్చి రెడ్డిపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల కేంద్రం రూం నంబర్1లో 20 మంది విద్యార్థులు శనివారం తెలుగు పేపర్–2 పరీక్ష రాశారు. ఆ గదిలోని ఇన్విజిలేటర్ విద్యార్థులకు మెయిన్ బుక్‌లెట్‌కు బదులు అదనపు సమాధాన పత్రాలు ఇచ్చాడు.
కంగారులో ఉన్న విద్యార్థులు వెంటనే వాటిపై ఉన్న నంబర్‌నే ఓఎంఆర్ షీట్ మీద వేశారు. గంట తర్వాత విద్యార్థులు అడిషినల్ షీట్ అడిగారు. అప్పుడు అసలు తన టేబుల్ మీద మెయిన్ బుక్‌లెట్సే లేవన్న విషయం గమనిం చిన ఇన్విజిలేటర్ అధికారులకు తెలిపారు. సుమారు గంట తర్వాత విద్యార్థులకు మెయిన్ బుక్‌లెట్ ఇచ్చారు. ఇన్విజిలేటర్‌ను పరీక్షల విధుల నుంచి తొలగించా మని పరీక్ష కేంద్రం చీఫ్ సూప రింటెండెంట్ నాగశ్రీ తెలిపారు.