Workplan
-
ఇన్విజిలేటర్ల వల్లే డబుల్ బబ్లింగ్
సాక్షి, హైదరాబాద్: ఇన్విజిలేటర్లకు తగిన అవగాహన లేకపోవడం వల్ల గ్రూప్–2 పరీక్షల్లో డబుల్ బబ్లింగ్ చోటు చేసుకుందని పలువురు అభ్యర్థులు హైకోర్టుకు నివేదించారు. వ్యక్తిగత వివరాలను ఎలా నమోదు చేయాలన్న విషయంలో ఇన్విజిలేటర్లకు అవగాహన లేకపోవడం వల్ల, వారు తమకు సరైన మార్గదర్శకత్వం చేయలేదని, దీంతో డబుల్ బబ్లింగ్ చోటు చేసుకుందని వారు వివరించారు. ఈ డబుల్ బబ్లింగ్‌కు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కూడా ఓ కారణమని తెలిపారు. గ్రూప్–2 పరీక్షలో డబుల్ బబ్లింగ్ చేసిన అభ్యర్థులను, వైట్నర్ వాడిన వారికి, వ్యక్తిగత వివరాలు నమోదు చేయని వారికి తదుపరి ప్రక్రియలో అవకాశం ఇవ్వరాదంటూ సింగిల్ జడ్జి తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై గురువారం న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా అభ్యర్థుల తరఫు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. గందరగోళం వల్ల కొన్ని తప్పులు జరిగినట్లు సాంకేతిక కమిటీ కూడా తేల్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వ్యక్తిగత వివరాల నమోదులో పొరపాట్లను తీవ్రంగా పరిగణిస్తే అభ్యర్థులకు నష్టం జరుగుతుందన్నారు. హైకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సీనియర్ న్యాయవాదుల కమిటీ కూడా డబుల్ బబ్లింగ్ చేసిన వారిని పరిగణనలోకి తీసుకోవాలని చెప్పిందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం, తదుపరి విచారణను ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. -
ఇన్విజిలేటర్ నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం
పినపాక(భద్రాద్రి కొత్తగూడెం): పదో తరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్ నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిష్యత్ అయోమయంగా మారింది. భద్రాద్రి జిల్లా పినపాక మండలం ఎల్చి రెడ్డిపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల కేంద్రం రూం నంబర్1లో 20 మంది విద్యార్థులు శనివారం తెలుగు పేపర్–2 పరీక్ష రాశారు. ఆ గదిలోని ఇన్విజిలేటర్ విద్యార్థులకు మెయిన్ బుక్‌లెట్‌కు బదులు అదనపు సమాధాన పత్రాలు ఇచ్చాడు. కంగారులో ఉన్న విద్యార్థులు వెంటనే వాటిపై ఉన్న నంబర్‌నే ఓఎంఆర్ షీట్ మీద వేశారు. గంట తర్వాత విద్యార్థులు అడిషినల్ షీట్ అడిగారు. అప్పుడు అసలు తన టేబుల్ మీద మెయిన్ బుక్లెట్సే లేవన్న విషయం గమనిం చిన ఇన్విజిలేటర్ అధికారులకు తెలిపారు. సుమారు గంట తర్వాత విద్యార్థులకు మెయిన్ బుక్లెట్ ఇచ్చారు. ఇన్విజిలేటర్‌ను పరీక్షల విధుల నుంచి తొలగించా మని పరీక్ష కేంద్రం చీఫ్ సూప రింటెండెంట్ నాగశ్రీ తెలిపారు. -
‘ఫోన్లు కావాలనే తెస్తున్నారా..?’
హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష విధులకు హాజరయ్యే ఇన్విజిలేటర్లు సెల్‌ఫోన్ తీసుకురావద్దని చెబుతున్నా మారట్లేదు. ఫోన్ తీసుకొస్తే పరీక్ష విధుల నుంచి తప్పించడం మినహా మరే ఇతర శిక్ష లేదు. దీంతో విధుల నుంచి తప్పించుకునేందుకే కొందరు టీచర్లు ఫోన్లు తెస్తున్నట్లు సమాచారం. గురువారం జరిగిన ద్వితీయ భాష పరీక్ష సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఆరుగురు ఇన్విజిలేటర్లు దొరికిపోయారు. దీంతో వారిని పరీక్ష విధుల నుంచి తొలగించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారితో సహా 13 మందిని పరీక్షల విధుల నుంచి తొలగించారు. ఇక వరంగల్ జిల్లాలో ఒకరికి గుండెపోటు వచ్చినందున పరీక్ష విధుల నుంచి రిలీవ్ చేశారు. ఖమ్మం జిల్లాలో మాల్ ప్రాక్టిస్ విషయంలో ఒక ఇన్విజిలేటర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అలాగే 13 మంది విద్యార్థులపై మాల్‌ప్రాక్టీస్ కేసులను నమోదు చేశారు. -
ఇంటర్లో మాస్ కాపీయింగ్
ఇన్విజిలేటర్ల మాయాజాలం నిబంధనలకు తిలోదకాలు చీఫ్ సూపరింటెండెంట్‌ను నిలదీత నర్సీపట్నం: బాలికల గురుకుల కళాశాలలో మాస్ కాపీయింగ్ జరుగుతోందని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ చంద్ర శారదను శుక్రవారం నిలదీశాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇన్విజిలేటర్లను నియమించి మాస్ కాపీయింగ్‌కు పరోక్షంగా సహకరిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కేంద్రంలో పట్టణంలోని రుషి, డాన్‌బాస్కో, ప్రభుత్వ బాలికల, బాలుర, రవితేజ, డాక్టర్ రాజేంద్రప్రసాద్, మోడల్ కళాశాలలకు చెందిన 520 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆయా కళాశాలలకు చెందిన అధ్యాపకులను పరీక్షా కేంద్రంలో ఇన్విజలేటర్లుగా నియమించ కూడదు. నిబంధనలకు తిలోదకాలిస్తూ పరీక్షా కేంద్రం నిర్వాహకులు రాజేంద్రప్రసాద్ కళాశాలకు చెందిన ఇద్దరు అధ్యాపకులను ఇన్విజిలేటర్లుగా నియమిస్తున్నారు. ఈ పరీక్షా కేంద్రంలో రాజేంద్రప్రసాద్ కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాస్తున్నారు. రోజు తప్పించి రోజు మొదట, రెండవ సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. మొదటి సంవత్సర ం పరీక్ష రోజున మాత్రమే ఆ కళాశాలకు చెందిన అధ్యాపకులను ఇన్విజలేటర్లుగా వేస్తున్నారు. పరీక్షా కేంద్రంలో ఇద్దరు ఇన్విజిలేటర్లు వారి విద్యార్థులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడంపై మిగిలిన కళాశాలలకు చెందిన విద్యార్థులు వారి యాజమాన్యాల వద్ద మొరపెట్టుకున్నారు. శుక్రవారం జరిగిన ఫిజిక్స్ పరీక్షకు రాజేంద్రప్రసాద్ కళాశాలకు చెందిన ఫిజిక్స్ అధ్యాపకులు రవికిరణ్, వెంకట్‌ను ఇన్విజిలేటర్లుగా నియమించారు. ఈ విషయం తెలుసుకుని మిగిలిన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు పరీక్షా కేంద్రానికి వెళ్లి కళాశాల ప్రిన్సిపాల్, చీఫ్ సూపరింటెండెంట్ చంద్ర శారదను నిలదీశారు. ఆమెతో వాదనకు దిగారు. రాజేంద్రప్రసాద్ కళాశాల అధ్యాపకులను నియమించలేదని, శ్రీసాయి కళాశాలకు చెందిన అధ్యాపకులను ఇన్విజలేటర్లగా నియమించానని చీఫ్ సూపరింటెండెంట్ చెప్పుకొచ్చారు. ఇద్దరు అధ్యాపకులు రాజేంద్రప్రసాద్ కళాశాలకు చెందిన వారని, శ్రీసాయి కళాశాల పేరుతో ఇన్విజిలేషన్ వేయించుకుంటున్నారని పరీక్షలు ప్రారంభంలోనే మీ దృష్టికి తీసుకువచ్చామన్నారు. మీ ప్రోత్సాహంతోనే ఇలా జరుగుతుందని వారు ఆరోపించారు. రాజేంద్రప్రసాద్ కళాశాలకు చెందిన అధ్యాపకులు అనే విషయం తనకు తెలియదని, ఇప్పుడే విధులనుంచి తొలగిస్తానని చీఫ్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఈ విషయమై ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐవోకు ఫిర్యాదు చేస్తామని నాయుడు, విల్సన్, డి.బాబు, వి రాజులనాయుడు పేర్కొన్నారు. దీనిపై చీఫ్ సూపరింటెండెంట్ చంద్రశారదను వివరణ కోరగా లెక్చరర్లు సరిపోక నలుగురు టీచర్స్ కావాలని ఎంఈవోను రాతపూర్వకంగా కోరగా ఇద్దరు ఉపాధ్యాయులను మాత్రమే ఇచ్చారన్నారు. తప్పనిసరి పరిస్థితిలో ప్రైవేటు కళాశాల అధ్యాపకులను ఇన్విజిలేటర్లగా నియమించానని తెలిపారు. ఎంఈవో బీవీ రమణను వివరణ కోరగా గురుకుల కళాశాల చీఫ్ సూపరింటెండెంట్నుంచి ఎటువంటి లెటర్ రాలేదని తెలిపారు. -
ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సివిల్స్ పరీక్ష కేంద్రాల పరిశీలకుడు, మున్సిపల్ కమిషనర్ హరికిరణ్ హాల్‌టికెట్, ఈ-అడ్మిట్ కార్డు తప్పనిసరిగా చూపించాలి సెల్ఫోన్లు, బ్లూటూత్, కాలిక్యులేటర్లు తీసుకురావద్దు విజయవాడ: అఖిల భారత సివిల్ సర్వీసుల పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థుల్ని అనుమతించవద్దని పరీక్ష కేంద్రాల పరిశీలకుడు, నగరపాలక సంస్థ కమిషనర్ సి.హరికిరణ్ ఆదేశించారు. ఆదివారం నగరంలో జరగనున్న సివిల్స్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను శనివారం ఆయన పర్యవేక్షించారు. అనంతరం నలంద కళాశాలలో ఇన్విజిలేటర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. పరీక్ష సమయం దాటాక ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోపలికి అనుమతించవద్దన్నారు. కేంద్రాల వల్ల అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల సహకారంతో ముందస్తు ఏర్పాట్లను చేయాల్సిందిగా నిర్వాహకులకు సూచించారు. అభ్యర్థులు హాల్ టికెట్, ఇ-అడ్మిట్ తప్పనిసరిగా అధికారులకు చూపించాలన్నారు. ఇన్విజిలేటర్లు, అభ్యర్థులు కేంద్రాల్లోకి సెల్‌ఫోనులు, బ్లూటూత్, కాలిక్యులేటర్లు తీసుకురాకూడదన్నారు. నగరంలో మొట్టమొదటిసారిగా సివిల్స్ పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ ఆర్.ఆర్.పురి కూడా పాల్గొన్నారు.