‘ఫోన్లు కావాలనే తెస్తున్నారా..?’
హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష విధులకు హాజరయ్యే ఇన్విజిలేటర్లు సెల్‌ఫోన్ తీసుకురావద్దని చెబుతున్నా మారట్లేదు. ఫోన్ తీసుకొస్తే పరీక్ష విధుల నుంచి తప్పించడం మినహా మరే ఇతర శిక్ష లేదు. దీంతో విధుల నుంచి తప్పించుకునేందుకే కొందరు టీచర్లు ఫోన్లు తెస్తున్నట్లు సమాచారం. గురువారం జరిగిన ద్వితీయ భాష పరీక్ష సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఆరుగురు ఇన్విజిలేటర్లు దొరికిపోయారు.
దీంతో వారిని పరీక్ష విధుల నుంచి తొలగించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారితో సహా 13 మందిని పరీక్షల విధుల నుంచి తొలగించారు. ఇక వరంగల్ జిల్లాలో ఒకరికి గుండెపోటు వచ్చినందున పరీక్ష విధుల నుంచి రిలీవ్ చేశారు. ఖమ్మం జిల్లాలో మాల్ ప్రాక్టిస్ విషయంలో ఒక ఇన్విజిలేటర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అలాగే 13 మంది విద్యార్థులపై మాల్‌ప్రాక్టీస్ కేసులను నమోదు చేశారు.