కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టిన సర్వశిక్షాభియాన్ నాన్ టీచింగ్ ఔట్ సోర్సింగ్ అభ్యర్థులు
సాక్షి, విజయనగరం: సర్వశిక్ష అభియాన్‌లో ఔట్ సోర్సింగ్ విధానంలో నాన్ టీచింగ్ స్టాఫ్‌గా ఎంపికైన యాభై ఎనిమిది మందికి నేటికీ నియామక పత్రాలు అందలేదు. గతంలో ప్రాజెక్టు ఆఫీసర్ చేపట్టిన నియామకాలపై అభ్యంతరాలున్నాయని ప్రస్తుత పీఓ అంటుంటే ... జిల్లా కలెక్టర్ అనుమతిచ్చినా ప్రాజెక్టు ఆఫీసర్ అడ్డుతగులుతున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. నిజానికి సమాధానం చెప్పాల్సిన ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు ముఖం చాటేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. చేసేది లేక అభ్యర్థులంతా సర్వశిక్ష అభియాన్ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నారు. జిల్లాలో సర్వశిక్షాభియాన్ ఆధ్వర్యంలోని కేజీబీవీ పరిధి వివిధ కేటగిరీలో ఉన్న నాన్ టీచింగ్ 134 పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీకి గతేడాది ఎంపిక ప్రక్రియ చేపట్టి, పూర్తి చేశారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ 58 మందిని వివిధ పోస్టులకు ఎంపిక చేసి జిల్లా కలెక్టర్‌కు అప్పగించింది. గతేడాది డిసెంబర్‌లో కలెక్టర్ ఆ జాబితా ను అనుమతించారు. ఈ మేరకు 58 మంది అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా అదే నెలలో విడుదల చేశారు.
శాపంగా మారిన పాత పీఓ బదిలీ
ఈ నియామక ప్రక్రియ జరిగిన సమయంలో ఎస్‌ఎస్‌ఏ పీఓగా ఉన్న బి.శ్రీనివాసరావు రాజకీయ కారణాలతో బదిలీ అయ్యారు. అప్పటి మంత్రులు గంటా శ్రీనివాసరా వు, కిమిడి కళావెంకటరావు మధ్య జరిగిన అంతర్యుద్ధ్ధం లో భాగంగా ప్రస్తుత పీఓ ఎం.కృష్ణమూర్తి నాయుడు ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఆయన వచ్చేనాటికే సిద్ధమైన 58 మంది జాబితాను విడుదల చేయకుండా రెండు నెలల పాటు తాత్సారం చేశారు. ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ వెంటనే సాధారణ ఎన్నికల నోటిఫికేషన్లు వచ్చాయి. ఫలితంగా నియామక ఆదేశాలున్నప్పటికీ అభ్యర్థులకు పోస్టులు రాలేదు. ఇతర జిల్లాల్లో వీరితోపాటే ఎంపిక చేసిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చి నా... ఇక్కడే పెండింగ్‌లో ఉండిపోయింది.
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ఎంపికైన అభ్యర్థులు పలుమార్లు కలెక్టర్‌ను కలిశారు. అప్పటి ఆదేశాల మేరకు పోస్టులను పీఓ ఇస్తారని ఆయన చెప్పడంతో అభ్యర్థులు పీఓ కృష్ణమూర్తి నాయుడు వద్దకు వెళ్లారు. కానీ అక్కడ వారికి ప్రతికూల సమాధానం వచ్చింది. తమకు న్యా యం చేయాలని వారంతా సర్వశిక్షాభియాన్ చుట్టూ తిరుగున్నారు. ఈ క్రమంలో ఈ నెల 30వ తేదీతో పాత ఏజెన్సీల కాలపరిమితి ముగుస్తుందని ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల ప్రకటించడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోసారి వారు కలెక్టరేట్ గురువారం వచ్చి కలెక్టర్‌ని కలిసి వేడుకున్నారు. కొత్తగా ఆదేశాలివ్వక్కర్లేదని అప్పటి ఆదేశాలతో పోస్టులను పీఓ ఇవ్వాలని అభ్యర్థులకు కలెక్టర్ హరిజవహర్‌లాల్ వివరించారు. వారు మళ్లీ పీఓ వద్దకు వెళ్లారు. అక్కడ వారికి పాతకథే ఎదురైంది. అయితే గత పీఓ చేపట్టిన నియామక ప్రక్రియలో అభ్యం తరాలున్నాయని ప్రస్తుత పీఓ కృష్ణమూర్తి చెబుతున్నారు. అభ్యర్థులు న్యాయం అడగాల్సింది ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీని లేదా పాత అధికారినేగాని తనను కాదని ఈయన చెబుతున్నారు. మొత్తమ్మీద వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment