
పల్లకోయే లచ్చిమి.. ఏదో ఈ మూడోరాలు చేసిద్ధుమా.. వందో.. వెయ్యో పట్టుకొస్తే మెల్లగా రెండు నెలలు గడిచిపోతాయి... పల్లక ఇంట్లో కూకుంటే ఏటి వస్తాది చెప్పు... తిరిగి చేతి ఖర్చు కాకపోతే.. కష్టమో నష్టమో.. అటు వెళ్తే కాలం గడుస్తాది... పూట గడుస్తాది.. చెబుతోంది మంగ. అవునుగానీ పిల్లలిద్దరినీ అమ్మగారింట్లో ఒగ్గిసి రావడం మనసుకు కష్టంగానే ఉంది... కానీ చేతిలో పైసా లేదు.. పైగా ఖర్చులు చూస్తుంటే మరింత భయంగా ఉన్నది.. పిల్లల చదువులు. వారి బట్టలు.. పుస్తకాలూ.. ఇవన్నీ తల్చుకుంటే భయంగా ఉంది.. అందుకే నీతో వస్తన్నాను.. అప్పుడైతే జగన్ డబ్బులొచ్చేవి.. ఇప్పుడు అవి కూడా పైసా కానరావడంలేదు.. అవి వచ్చింటే చేతికి ఆధారమయ్యేది.. ఇప్పుడు అంతా మేమిద్దరమే పడాలి అంటూ చేతిలోని సమోసా ముక్క భర్త రామినాయుడికి ఇచ్చింది.. నాకొద్దే నువ్వు తిను అన్నాడు అయన..
మీ మొగుడూ పెళ్ళాల ముచ్చట్లు ఆపర్రా... అంది మంగ.. అవును మంగొదినా... పిల్లల్ని వదిలేసి ఈయన్ను ఈ మనిషిని వెంటేసుకుని జిల్లాలకు జిల్లాలు మారిపోయి అక్కడ పెసరచెను తీతకు వెళ్లడం మనసుకు కష్టంగానే ఉంది కానీ.. ఇక్కడ పైసా లేదు.. అందుకే.. అంటూ పిల్లల్ని తలచుకుని మథనపడింది... పోన్లేవే... లచ్చిమి.. రోజుకు ఒకరికి ఏడొందలు.. మీ మొగుడూ పిల్లలకు పదిహేను వందలు.. ఇద్దరూ రెండు వారాలు చేస్తే ఎంతోకొంత చేతికి వస్తాది.. పైగా బియ్యం వాళ్లే ఇస్తారు.. పడుకోడానికి రూములు కూడా వాళ్ళవే అని మంగ చెబుతుంటే లక్ష్మి కళ్ళు భయం.. ఆందోళన స్థానే కాస్త ధైర్యం.. మెరుపు సంతరించుకున్నాయి.

రాయగడ నుంచి గుంటూరు వెళ్లే ప్యాసింజర్ మహిళలు.. కూలీలతో కిక్కిరిసిపోయింది.. అడుగుతీసి అడుగేయలేని పరిస్థితి. అందరూ నెత్తిన మూటలు.. కొందరు పారలు.. గునపాలు సైతం పట్టుకుని ఎక్కేసారు.. దాదాపుగా అందరూ కిందనే కూర్చున్నారు. ఏమ్మా అక్కడికి అని అడిగితె గుంటూరు.. వెళ్తున్నాం బాబు అన్నారు.. ఎందుకూ అంటే అక్కడ పెసర.. మినపచేలు తీయడానికి వెళ్తున్నాం అన్నారు. అక్కడ కూలీలు దొరకడం లేదట.. పార్వతీపురం ప్రాంతంనుంచి మహిళలు.. పురుషులను ఆ చేను తీయడానికి తీసుకెళ్తున్నారు. ఒకొక్కరికి ఏడువందలు రోజుకూలీతోబాటు జంటకు రోజుకు రెండుకేజిల బియ్యం కూడా ఇస్తారు.
చిన్న రూము.. షెడ్లు కూడా ఉంటాయి.. అక్కడే వండుకుని తిని ఇద్దరూ తెచ్చుకున్న డబ్బును జాగత్త చేసుకుని మూడు వారాల తరువాత మళ్ళీ సొంత ఊళ్లకు వెళ్తారు.. సీతానగరం.. పార్వతీపురం.. కురుపాం ... బాడంగి.. రామభద్రపురం మండలాల నుంచి కూలీలు ఇదే ట్రైన్లో వెళ్తారు.. వంటకు ఎలా మరి అని అడిగితే ఒసే.. పళ్లకుందో ... అప్పులు..పప్పులు.. వర్రగుండ .. పచ్చళ్ళు.. చింతపండు.. అన్నీ పట్టుకెళ్ళిపోతాం కదేటి .. అక్కడే కఱ్ఱలపొయ్యిమీద నాలుగు గింజలు ఉడకేసుకుని తినేసి పడుకుండిపోతాం అంటారు అందరూ కోరస్ గా.. పిల్లల్ని ముసలోళ్ల చెంత వదిలేసి వెళ్లడం బాధగానే ఉంది కానీ.. ఇద్దరం ఈ నాలుగురోజులు కష్టపడితే ఓ ఇరవైవేలు వస్తాయి.. జూన్లో పిల్లల చదువులు.. ఇతర ఖర్చులకు సరిపోతాయి.. అందుకే ఎంతదూరం అయినా వెళ్తామని... మనసు దిటవు చేసుకుని షార్ట్ టైం లేబర్ పేరిట కృష్ణ గుంటూరు జిల్లాలకు వెళ్తుంటారు..
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment