సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు కార్యాలయం
సాక్షి, ఒంగోలు టౌన్: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పాత డేట్లతో పోస్టింగ్ ఆర్డర్లు జారీచేసి వారికి కేటాయించిన ప్రాంతాల్లో విధుల్లో చేరాలంటూ ఆ శాఖ అధికారి నుండి ఫోన్లు వెళ్లాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే పాత తేదీలతో పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చి సంబంధిత అధికారులపై ఒత్తిళ్లు తీసుకురావడం ఆ శాఖలో చర్చనీయాంశమైంది. వివరాలు.. సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులను భర్తీ చేసేందుకు దఫాలు వారీగా నోటిఫికేషన్లు జారీ చేశారు. స్పెషల్ ఆఫీసర్ మొదలుకొని కింది స్థాయి వరకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ ప్రక్రియ చేపట్టారు. కొన్ని పోస్టులను రాత పరీక్ష ద్వారా మరికొన్ని పోస్టులను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కంప్యూటర్ ఆపరేటర్లు, ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్లు, సీఆర్‌పీలు, పీఈటీలకు సంబంధించి 57 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీటిలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు సంబంధిత ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి పోస్టుల భర్తీకి అవకాశం వచ్చిన్నా ఆ ఏజెన్సీతో సంబంధం లేకుండానే తాము అనుకున్న వారికి పాత డేట్లు వేసి పోస్టింగ్‌లు ఇవ్వడం వివాదాస్పదమైంది.
పాత డేట్లతో పోస్టింగ్‌లు
సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్, ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, క్లస్టర్ రీసోర్స్ పర్సన్, పీఈటీ వంటి పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ పోస్టుల కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఏమైందో ఏమోగానీ ఈ పోస్టులతో పాటు ప్రకటించిన స్పెషల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించారు. అదే సమయంలో ఈ పోస్టులను తాత్కాలికంగా నిలిపేశారు. మొత్తం మీద ఆ పోస్టులను కూడా భర్తీ చేసుకునేందుకు ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పోస్టుల భర్తీ ప్రక్రియ వివాదాస్పదమైంది. రానా ఏజెన్సీ ద్వారా ఔట్ సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీ చేసుకునేందుకు ఆ ఏజెన్సీకి ఈ నెల 10వ తేదీ అనుమతి వచ్చింది. అదేరోజు సాయంత్రం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేయడంతో ఆ శాఖలో కీలకమైన వ్యక్తికి ‘మనీ’లాంటి ఆలోచన వచ్చింది.
ఔట్ సోర్సింగ్ పోస్టులకు ఎలాగూ అనుమతి వచ్చింది కదా అని పాత డేట్లతో పోస్టింగ్ ఆర్డర్‌లను పుట్టించడం వివాదాస్పదమైంది. సంబంధిత పోస్టుల భర్తీకి పాత డేట్లు వేసి విధుల్లో చేరాలంటూ కొంతమంది ఎస్‌ఓలపై ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిసింది. కీలకమైన ఆ వ్యక్తి సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి 8, 9వ తేదీల్లో విధుల్లో చేరినట్లుగా చూపించాలని సమగ్ర శిక్షా అభియాన్ కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. కొంతమంది ఆ ఫోన్లకు భయపడి పాత డేట్లతో విధుల్లో చేరినట్లుగానే చూపించేశారు. మరికొంతమంది మాత్రం ఎక్కడ మా ఉద్యోగాలు ఊడతాయోనన్న భయంతో కొద్దిగా సంశయించినా ఒత్తిడి అధికం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాత డేట్లతో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని చేర్చుకున్నారు.
సీసీ కెమెరాల్లో రికార్డు
జిల్లాలోని అన్ని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో వాటి రక్షణకు సంబంధించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఎవరు అడుగు పెట్టినా ఆ క్షణం నుంచే సీసీ కెమేరాల్లో రికార్డు అవుతోంది. జిల్లాలోని పలు కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా విధుల్లో చేరేందుకు పాత తేదీలతో వచ్చిన వారి కదలికలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయ. సీసీ కెమెరాలను ఆధారం చేసుకొని సమగ్ర విచారణ జరిపితే కేజీబీవీల్లో ఏం జరుగుతుందో ఇట్టే అర్థమవుతోంది. సంబంధిత అభ్యర్థి ఏ రోజు విధుల్లో చేరారన్నది కూడా స్పష్టంగా తెలియనుంది. పైపెచ్చు ఔట్ సోర్సింగ్ ద్వారా పోస్టులను భర్తీ చేసే సమయంలో రోస్టర్ విధానాన్ని పాటించకుండా, ఓపెన్ కేటగిరి(ఓసీ)కి సంబంధించిన పోస్టులనే భర్తీ చేయడం కూడా చర్చనీయాంశమైంది. ఓసీకి సంబంధించిన వారు అయితే తాము డిమాండ్ చేసిన విధంగా సమర్పిస్తారన్న ఉద్దేశంతో వన్‌సైడ్‌గా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి.
‘చిరు’ ప్రభావం
కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ కింద నిబంధనలకు విరుద్ధంగా పోస్టులను భర్తీ చేసిన విషయంలో ఆ శాఖకు చెందిన కీలకమైన అ««ధికారితో పాటు మరో కీలకమైన వ్యక్తి చక్రం తిప్పారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ శాఖకు చెందిన మంత్రికి అత్యంత దగ్గర బంధువైన వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నియామకాల్లో కీలకపాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. దానికితోడు ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసిన పోస్టుల్లో రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ కింద తీసిన వాటిలో ఓసీలకు సంబంధించిన పోస్టులకే పచ్చజెండా ఊపడం చర్చనీయాంశమైంది. ఓసీలకు సంబంధించిన పోస్టులను భర్తీ చేయడం ద్వారా ఎక్కువగా తూగుతారని, ఇతరులైతే తాము డిమాండ్ చేసినంత ఇచ్చుకోలేరన్న ఉద్దేశంతో సరికొత్త విధానానికి తెరలేపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment