Posting orders
-
హైదరాబాద్‌లో నియామకాల జోరు
ముంబై: జూలైలో కార్యాలయ ఉద్యోగుల నియామకాల పరంగా హైదరాబాద్‌లో మంచి వృద్ధి నమోదైంది. ఒకటికి మించిన రంగాల్లో నియామకాలు జూలైలో గణనీయంగా పెరిగినట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా జూలైలో నియామకాలు 12 శాతం పెరిగినట్టు ప్రకటించింది. మొత్తం 2,877 జాబ్ పోస్టింగ్ నోటిఫికేషన్లు (ఉద్యోగులు కావాలంటూ జారీ చేసే ప్రకటనలు) వచ్చినట్టు పేర్కొంది. క్రితం ఏడాది జూలై నెలలో 2,573 జాబ్ పోస్టింగ్‌లతో పోల్చి చూస్తే 12 శాతం పెరిగినట్టు తెలిపింది. జూలై నెలకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నియామకాల ధోరణిని ఈ నివేదిక ప్రతిఫలిస్తుంటుంది. నౌకరీ డాట్ కామ్ పోర్టల్‌పై జాబ్ పోస్టింగ్‌లు, ఉద్యోగ శోధన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందిస్తుంది. ముఖ్యంగా ఫార్మా రంగంలో 26 శాతం మేర నియామకాలు పెరిగాయి. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో 23 శాతం అధికంగా ఉద్యోగాల భర్తీ నెలకొంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చతే జూలైలో ఐటీ నియామకాలు 17 శాతం పుంజుకున్నాయి. ముఖ్యంగా ఏఐ–ఎంఎల్ విభాగంలో 47 శాతం మేర నియామకాలు పెరిగాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అత్యధికంగా 39 శాతం వృద్ధి నమోదైంది. ఆ తర్వాత జామ్‌నగర్‌లో 38 శాతం, బరోడాలో 25 శాతం మేర నియామకాలు పెరిగాయి. హైదరాబాద్‌లో జోరు హైదరాబాద్‌లో హాస్పిటాలిటీ (ఆతిథ్య పరిశ్రమ) రంగంలో నియామకాలు 76 శాతం పెరిగాయి. ఆ తర్వాత బీమా రంగంలో 71 శాతం, బీపీవో రంగంలో 52 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో 44 శాతం చొప్పున జూలైలో నియామకాలు పెరిగినట్టు నౌకరీ నివేదిక తెలిపింది. విజయవాడలో 13 శాతం, విశాఖపట్నంలో 14 శాతం చొప్పున నియామకాల్లో వృద్ధి కనిపించినట్టు పేర్కొంది. ‘‘12 శాతం వృద్ధి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆశాజనకం. ఈ ఆర్థిక సంవత్సరంలో నియామకాల పరంగా సానుకూల వృద్ధి మొదటిసారి నమోదైంది. దేశ కార్యాలయ ఉద్యోగ మార్కెట్లో పురోగమనాన్ని సూచిస్తోంది’’అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ తెలిపారు. -
‘స్పౌజ్’పై సానుకూలత!
సాక్షి, హైదరాబాద్: జోనల్ విధానం అమలు ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. జిల్లాలకు కేటాయించిన ఉద్యోగులకు వీలైనంత త్వరగా పనిచేసే ప్రదేశాలకు సంబంధించిన పోస్టింగ్ ఉత్తర్వులివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో ప్రధాన సమస్యగా మారిన ఉపాధ్యాయుల బదిలీల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. ముఖ్యంగా వేల సంఖ్యలో అందిన విజ్ఞప్తులను ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా పరిష్కరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు బదిలీలకు సంబంధించిన అభ్యంతరాలతో ఇప్పటివరకు మొత్తం 8 వేల వినతులు (అప్పీళ్ళు) అందాయి. 5 వేలకు పైగా స్పౌజ్, ఒంటరి మహిళలు, వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వాళ్ళు తాము పనిచేస్తున్న ప్రాంతంలోనే ఉంచాలని కోరుకున్నారు. అయితే ఇందులో భార్య లేదా భర్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న అర్జీలు 1,500 వరకు ఉన్నాయి. వీటిని ప్రస్తుతానికి పక్కన బెట్టాలని భావిస్తున్నారు. మిగిలిన 3,500 దరఖాస్తులను పరిశీలించిన అధికారులు సానుకూలంగా స్పందించేందుకు సిద్ధమయ్యారు. సీనియారిటీ అర్జీల పరిశీలన మరోవైపు సీనియారిటీలో తమకు అన్యాయం జరిగిందని అర్జీలు పెట్టుకున్న వాళ్ళలో ఆధారాలున్న వాటిని పరిశీలించారు. పదోన్నతి పొందిన నాటి నుంచి సీనియారిటీ పరిగణనలోనికి తీసుకోవడం వల్ల కొంతమంది స్థానికత కోల్పోతున్నారు. వీళ్ళలో కొందరు పదోన్నతి వద్దని, స్థానిక ప్రాంతంలోనే ఉంచాలని కోరుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల్లో కొన్నింటికి ఆమోదం తెలిపేందుకు జిల్లా కలెక్టర్లు సిద్ధంగా ఉన్నారు. వీటన్నింటిపై విద్యాశాఖ, ఇతర శాఖల అధికారులు జిల్లాల వారీ జాబితాలతో ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను పంపారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందిన మరుక్షణమే ఉత్తర్వులపై నిర్ణయం తీసుకునే వీలుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 317 జీవోపై సంఘాల నిప్పులు జోనల్ విధానం కోసం తీసుకొచ్చిన 317 జీవోపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులు పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) నేతృత్వంలో 317 జీవోకు వ్యతిరేకంగా 33 జిల్లాల కలెక్టరేట్లు, డీఈవో కార్యాలయాల వద్ద సోమవారం ఆందోళనలు జరిగాయి. ఉపాధ్యాయ ఖాళీలు చూపించి, సీనియారిటీ జాబితాల్లో తప్పులు సరిచేసిన తర్వాతే బదిలీలు చేపట్టాలని జాక్టో డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమానికి జాక్టో నాయకులు సదానంద్‌గౌడ్, పర్వత్‌రెడ్డి, ఎం రాధాకృష్ణ తదితరులు నాయకత్వం వహించారు తక్షణమే ఉపసంహరించుకోవాలి ప్రభుత్వం ఈ జీవోను తక్షణమే ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని తెలంగాణ ఉద్యోగుల సంఘం (టీఈఏ) హెచ్చరించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్‌కుమార్ స్వామి, ఉపాధ్యక్షుడు పురుషోత్తం సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలొడ్డి పోరాడిన ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందని వారు ధ్వజమెత్తారు. ప్రభుత్వం సృష్టించే గందరగోళంతో ఉద్యోగులు, వారి కుటుంబాలు మానసిక వేదనతో ఉన్నాయని తెలిపారు. అస్మదీయులకు ఇష్టమొచ్చిన చోట పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాగా ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే 317 జీవో తీసుకొచ్చామని విద్యాశాఖ మంత్రి చెప్పడాన్ని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారు. స్థానికతకే ప్రాధాన్యం ఇవ్వాలని చర్చల్లో భాగంగా తాము చేసిన డిమాండ్లను మంత్రి గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. -
సబ్‌కలెక్టర్లుగా 12 మంది ప్రొబేషనరీ ఐఏఎస్‌లు
సాక్షి, అమరావతి : 2018 బ్యాచ్‌కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్‌లను సబ్‌కలెక్టర్లుగా నియమిస్తూ శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కడప సబ్‌కలెక్టర్‌గా పృథ్వీతేజ్, నూజివీడు సబ్‌కలెక్టర్‌గా ప్రతిస్త, అమలాపురం సబ్‌కలెక్టర్‌గా హిమాన్షు, కందుకూరు సబ్‌కలెక్టర్‌గా భార్గవ్‌తేజ, పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా విధేకర్, నర్సీపట్నం సబ్‌కలెక్టర్‌గా మౌర్య, నరసరావుపేట సబ్‌కలెక్టర్‌గా అజయ్‌కుమార్, రాజమండ్రి సబ్‌కలెక్టర్‌గా అంజలి, టెక్కలి సబ్‌కలెక్టర్‌గా ధనుంజయ్, మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా జాహ్నవి, నంద్యాల సబ్‌కలెక్టర్‌గా కల్పన, రాజంపేట సబ్‌కలెక్టర్‌గా కేతన్, చిత్తూరు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఎంఎస్ మురళి ఉన్నారు. -
డిప్యూటీ కలెక్టర్‌గా సంతోషి
సాక్షి, హైదరాబాద్ : భారత్– చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఇటీవల ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ సంతోష్‌బాబు భార్య సంతోషిని రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది. ఆమెకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రగతిభవన్‌లో నియామక ఉత్తర్వులను అందించారు. సంతోషికి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సంతోషికి సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదురుకునే వరకు తోడుగా ఉండాలని సీఎం తన కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను కోరారు. సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీనిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు జగదీష్‌రెడ్డి, ప్రశాంతరెడ్డి, నిరంజన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దీపికా యుగంధర్‌రావు, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి స్థలం అప్పగింత షేక్‌పేట మండల పరిధిలోకి వచ్చే బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 14లో కేబీఆర్ పార్కు ఎదురుగా ఉన్న 711 గజాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి బుధవారం కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి అప్పగించారు. ఆర్డీఓ, తహసీల్దార్లతో సమక్షంలో స్థల పంచనామా నిర్వహించి స్థలాన్ని స్వాధీనం చేశారు. కల్నల్ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం షేక్‌పేట మండలంలో మూడు స్థలాలను కుటుంబసభ్యులకు చూపించారు. వీటిలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో స్థలం కావాలని వారు కోరగా, ఈ స్థలాన్ని కేటాయించారు. కేసీఆర్ తమకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని కల్నల్ సతీమణి సంతోషి కృతజ్ఞతలు తెలిపారు. -
ష్.. గప్‌చుప్‌గా కానిచ్చేయండి..!
సాక్షి, ఒంగోలు టౌన్: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పాత డేట్లతో పోస్టింగ్ ఆర్డర్లు జారీచేసి వారికి కేటాయించిన ప్రాంతాల్లో విధుల్లో చేరాలంటూ ఆ శాఖ అధికారి నుండి ఫోన్లు వెళ్లాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే పాత తేదీలతో పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చి సంబంధిత అధికారులపై ఒత్తిళ్లు తీసుకురావడం ఆ శాఖలో చర్చనీయాంశమైంది. వివరాలు.. సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులను భర్తీ చేసేందుకు దఫాలు వారీగా నోటిఫికేషన్లు జారీ చేశారు. స్పెషల్ ఆఫీసర్ మొదలుకొని కింది స్థాయి వరకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ ప్రక్రియ చేపట్టారు. కొన్ని పోస్టులను రాత పరీక్ష ద్వారా మరికొన్ని పోస్టులను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కంప్యూటర్ ఆపరేటర్లు, ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్లు, సీఆర్పీలు, పీఈటీలకు సంబంధించి 57 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీటిలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు సంబంధిత ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి పోస్టుల భర్తీకి అవకాశం వచ్చిన్నా ఆ ఏజెన్సీతో సంబంధం లేకుండానే తాము అనుకున్న వారికి పాత డేట్లు వేసి పోస్టింగ్‌లు ఇవ్వడం వివాదాస్పదమైంది. పాత డేట్లతో పోస్టింగ్‌లు సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్, ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్, క్లస్టర్ రీసోర్స్ పర్సన్, పీఈటీ వంటి పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ పోస్టుల కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఏమైందో ఏమోగానీ ఈ పోస్టులతో పాటు ప్రకటించిన స్పెషల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించారు. అదే సమయంలో ఈ పోస్టులను తాత్కాలికంగా నిలిపేశారు. మొత్తం మీద ఆ పోస్టులను కూడా భర్తీ చేసుకునేందుకు ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పోస్టుల భర్తీ ప్రక్రియ వివాదాస్పదమైంది. రానా ఏజెన్సీ ద్వారా ఔట్ సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీ చేసుకునేందుకు ఆ ఏజెన్సీకి ఈ నెల 10వ తేదీ అనుమతి వచ్చింది. అదేరోజు సాయంత్రం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేయడంతో ఆ శాఖలో కీలకమైన వ్యక్తికి ‘మనీ’లాంటి ఆలోచన వచ్చింది. ఔట్ సోర్సింగ్ పోస్టులకు ఎలాగూ అనుమతి వచ్చింది కదా అని పాత డేట్లతో పోస్టింగ్ ఆర్డర్లను పుట్టించడం వివాదాస్పదమైంది. సంబంధిత పోస్టుల భర్తీకి పాత డేట్లు వేసి విధుల్లో చేరాలంటూ కొంతమంది ఎస్ఓలపై ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిసింది. కీలకమైన ఆ వ్యక్తి సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి 8, 9వ తేదీల్లో విధుల్లో చేరినట్లుగా చూపించాలని సమగ్ర శిక్షా అభియాన్ కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. కొంతమంది ఆ ఫోన్లకు భయపడి పాత డేట్లతో విధుల్లో చేరినట్లుగానే చూపించేశారు. మరికొంతమంది మాత్రం ఎక్కడ మా ఉద్యోగాలు ఊడతాయోనన్న భయంతో కొద్దిగా సంశయించినా ఒత్తిడి అధికం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాత డేట్లతో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని చేర్చుకున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డు జిల్లాలోని అన్ని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో వాటి రక్షణకు సంబంధించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఎవరు అడుగు పెట్టినా ఆ క్షణం నుంచే సీసీ కెమేరాల్లో రికార్డు అవుతోంది. జిల్లాలోని పలు కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా విధుల్లో చేరేందుకు పాత తేదీలతో వచ్చిన వారి కదలికలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయ. సీసీ కెమెరాలను ఆధారం చేసుకొని సమగ్ర విచారణ జరిపితే కేజీబీవీల్లో ఏం జరుగుతుందో ఇట్టే అర్థమవుతోంది. సంబంధిత అభ్యర్థి ఏ రోజు విధుల్లో చేరారన్నది కూడా స్పష్టంగా తెలియనుంది. పైపెచ్చు ఔట్ సోర్సింగ్ ద్వారా పోస్టులను భర్తీ చేసే సమయంలో రోస్టర్ విధానాన్ని పాటించకుండా, ఓపెన్ కేటగిరి(ఓసీ)కి సంబంధించిన పోస్టులనే భర్తీ చేయడం కూడా చర్చనీయాంశమైంది. ఓసీకి సంబంధించిన వారు అయితే తాము డిమాండ్ చేసిన విధంగా సమర్పిస్తారన్న ఉద్దేశంతో వన్‌సైడ్‌గా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. ‘చిరు’ ప్రభావం కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ కింద నిబంధనలకు విరుద్ధంగా పోస్టులను భర్తీ చేసిన విషయంలో ఆ శాఖకు చెందిన కీలకమైన అ««ధికారితో పాటు మరో కీలకమైన వ్యక్తి చక్రం తిప్పారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ శాఖకు చెందిన మంత్రికి అత్యంత దగ్గర బంధువైన వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నియామకాల్లో కీలకపాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. దానికితోడు ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసిన పోస్టుల్లో రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ కింద తీసిన వాటిలో ఓసీలకు సంబంధించిన పోస్టులకే పచ్చజెండా ఊపడం చర్చనీయాంశమైంది. ఓసీలకు సంబంధించిన పోస్టులను భర్తీ చేయడం ద్వారా ఎక్కువగా తూగుతారని, ఇతరులైతే తాము డిమాండ్ చేసినంత ఇచ్చుకోలేరన్న ఉద్దేశంతో సరికొత్త విధానానికి తెరలేపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. -
మంత్రిగారు.. చూశారా తీరు!
పంచాయతీ కార్యదర్శుల నియామకాల్లో జాప్యం నెలలు గడుస్తున్నా పోస్టింగ్ ఆర్డర్లులివ్వని వైనం {పజావాణిలో డీఆర్వోకు విన్నవించిన అభ్యర్థులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి స్పందించాలని వినతి ఉద్యోగం కోసం వారెంతో శ్రమించారు. ప్రభుత్వం పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గి పంచాయతీ కార్యదర్శి కొలువు కొట్టారు. కానీ వారికి ఆ ఆనందమే మిగలకుండాపోయింది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకుండా అధికారులు నెలల తరబడి తాత్సారం చేస్తున్నారు. కొందరి విద్యార్హతలపై అనుమానం ఉంద ని, విచారణ తర్వాతే అందరికీ పోస్టింగ్ అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ, నిజామాబాద్, మెదక్, వరంగల్ జిల్లాల్లో అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సొంత జిల్లాలో మాత్రం పోస్టింగుల్లో జాప్యం కావడం గమనార్హం. జిల్లాలో ఖాళీగా ఉన్న 88 పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేసేందుకు గతేడాది చివరలో అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23న రాత పరీక్ష నిర్వహించింది. మార్చిలో ఫలితాలు వెలువడ్డారుు. రెండువారాల లోపు ఎంపికైన అభ్యర్థుల విద్యార్హత ధ్రువీకరణపత్రాలు పరిశీలించి వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలి. జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా ఉపాధికల్పనాధికారులతో కూడిన ఎంపిక కమిటీ జూన్, జూలైలో మూడుసార్లు అభ్యర్థుల విద్యార్హత సర్టిఫికెట్లను పరిశీలించింది. ఈ నెల 3న తుది పరిశీలన జరిగింది. ఇందులో 14 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లపై అనుమానం వ్యక్తం చేసిన అధికారులు ప్రక్రియను అక్కడే నిలిపేశారు. అనుమానిత అభ్యర్థుల సర్టిఫికెట్లు తీసుకుని.. వారు ఏ సమయంలో ఎక్కడ చదివారని విచారణ చేయాలని నిర్ణయించారు. కానీ.. ఇంతవరకు విచారణ మొదలే కాలేదు. దీంతో సర్టిఫికెట్లు సరిగా ఉన్న 74 మంది అభ్యర్థులు తమకు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలంటూ జిల్లా పంచాయతీ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. 14 మంది అనుమానిత అభ్యర్థుల సర్టిఫికెట్లు సరిగా ఉన్నాయని తేలిన తర్వాతే అందరికీ ఒకేసారి ఉత్తర్వులు ఇస్తామని, అప్పటివరకు వేచి ఉండాలని అధికారులు లింకుపెట్టారు. ఆ తర్వాత కూడా నియామక ప్రక్రియ నిలిచిపోవడంతో అభ్యర్థులు పలుమార్లు డీపీవోను కలిసి పోస్టింగ్ ఆర్డర్ల కోసం మొరపెట్టుకున్నారు. అయినా స్పందన లేకపోవడంతో సోమవారం ప్రజావాణిలో డీఆర్వో వీరబ్రహ్మయ్యకు విన్నవించారు. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి కుమారస్వామి వివరణ ఇస్తూ.. 14మంది అభ్యర్థుల విద్యార్హతలపై అనుమానం ఉందని, క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన తర్వాత అందరికీ ఒకేసారి పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తామని చెప్పారు. అభ్యర్థులు చింతించాల్సిన అవసరం లేదన్నారు.