బడి బయట బాలలు 1,00,000
2015–16 లెక్కలు వెల్లడించిన కాగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2014–15 విద్యాసంవత్సరంలో 36,519 మంది, 2015–16 విద్యా సంవత్సరంలో 46,391 మంది బాలలు బడి బయట ఉన్నారని కాగ్ నివేదిక వెల్లడించింది. అయితే ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ (యూడీఐఎస్‌ఈ) లెక్కల ప్రకారం 2014–15లో 2,50,581 మంది, 2015–16లో 1,12,991 మంది బాలలు బడి బయట ఉన్నారని తెలిపింది. జాతీయ స్థాయిలో విద్యా హక్కు చట్టం–2009 అమలుపై తాజాగా కాగ్ బహిర్గతం చేసిన నివేదికలో రాష్ట్రంలో జరిగిన ఉల్లంఘనలు, లోపాలను పొందుపరిచింది.
అంశాల వారీగా పరిశీలిస్తే..
► తెలంగాణలో రూ.5.73 కోట్ల సర్వ శిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) నిధులను 2012–13 నుంచి 2015–16 మధ్యకాలంలో ఇతర శాఖలకు దారిమళ్లించడంతో దుర్వినియోగమయ్యాయని కాగ్ తప్పుపట్టింది.
► 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ప్రవేశాల కోసం విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడంతో పాటు క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేసిన 21 పాఠశాలలకు 2014 మార్చి–డిసెంబర్ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం నోటిసులు జారీ చేయగా, అందులోని 9 పాఠశాలలకు రూ.15.29 కోట్ల జరిమానాలు విధించింది. ఈ జరిమానాలను ఇంత వరకు వసూలు చేయలేదు.
► రాష్ట్రంలో తనిఖీలు జరిపిన రెండు జిల్లాల్లో 67 మంది ఉపాధ్యాయులను బోధనేతర పనుల కోసం వినియోగించుకుంటున్నారు.
► 2012–13 మధ్యకాలంలో ఖమ్మం జిల్లాలోని 666 పాఠశాలల విద్యుదీకరణ కోసం రూ.1.03 కోట్లు విడుదల చేయగా, 2016 మార్చి వరకు ఈ నిధులు నిరుపయోగంగా ఉన్నాయి.
► విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర సలహా కమిటీని ఏర్పాటు చేయలేదు.