పాఠశాల విద్యాశాఖ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పాఠశాల విద్యా శాఖ విభాగాల విభజనకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం ఉన్న విభాగాలు, కొత్త జిల్లాలకు అనుగుణంగా చేయాల్సిన మార్పులపై రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి మొదలుకొని క్షేత్ర స్థాయిలో మండల విద్యాశాఖాధికారి కార్యాలయం, వాటిలో పనిచేసే సిబ్బంది, వాటి పరిధిలో ఉండే క్లస్టర్ స్కూళ్ల లెక్కలు వేసింది. ప్రస్తుతం ఉన్న ఎంఈవో కార్యాలయాలను విభజించి కొత్త జిల్లాలకు సర్దుబాటు చేయడం ద్వారా ఒక్కో ఎంఈవో కార్యాలయ పరిధిలో ఉండనున్న అధికారులు, సిబ్బంది లెక్కలను కూడా వేసింది.
కొత్త జిల్లాల్లో ఒక్కో మండలంలో (కొత్త మండలాలు కలుపుకొని) రెండు లేదా మూడు క్లస్టర్ స్కూళ్లు ఉండేలా కసరత్తు చేస్తోంది. వీటితోపాటు సర్వశిక్షా అభియాన్‌కు (ఎస్‌ఎస్‌ఏ) చెందిన ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఒక ఎంఐఎస్ కోఆర్డినేటర్, ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్, మేసేంజర్ ఉండేలా చూస్తోంది. మరోవైపు కొత్త మండలాల్లోని మండల రీసోర్సు సెంటర్లలోనే (ఎంఆర్‌సీ) డీఈవో కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం వేర్వేరుగా ఉన్న సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్, డీఈవో కార్యాలయాలను కలిపేసేందుకు చర్యలు చేపడుతోంది. పీవోల వ్యవస్థను రద్దు చేసి, డీఈవో నేతృత్వంలోనే సర్వశిక్షా అభియాన్ కార్యకలాపాలను చూసేందుకు ఒక అధికారికి బాధ్యతలు అప్పగించేలా కసరత్తు చేస్తోంది. అలాగే మోడల్ స్కూళ్లు, ఆర్‌ఎంఎస్‌ఏ కార్యకలాపాలను కూడా డీఈవోల నేతృత్వంలోనే నిర్వహించనుంది. మరోవైపు కొత్త జిల్లాల్లో ఇన్‌చార్జి డీఈవోలను నియమించేందుకు చర్యలు చేపట్టింది. ఇన్‌చార్జి డీఈవో పోస్టుల కోసం జిల్లాల్లో పనిచేస్తున్న డిప్యూటీ డీఈవో, అసిస్టెంట్ డెరైక్టర్ల నుంచి విజ్ఞప్తులు స్వీకరించేందుకు చర్యలు చేపట్టింది.
ప్రతి మండలంలో క్లస్టర్ స్కూళ్లు
Published Mon, Sep 5 2016 2:32 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
Advertisement