సీఎం ఆమోదం తర్వాతే.. ‘సర్వశిక్షా’ సిబ్బంది వేతనాలు పెంపు!
రూ.2,195 కోట్ల బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం
సాక్షి, హైదరాబాద్: సర్వ శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) సిబ్బంది వేతనాల పెంపునకు పాలకమండలి సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్రభుత్వ ఆమోదం తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఎస్‌ఎస్‌ఏ పరిధిలో దాదాపు 14 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వేతనాల పెంపుపై ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలని పాలకమండలి పేర్కొంది. సోమవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అధ్యక్షతన జరిగిన ఎస్‌ఎస్‌ఏ పాలకమండలి సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. ఎస్‌ఎస్‌ఏ పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు చర్చించారు.
గతంలో ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు ఆమోదించిన వేతనాల పెంపు ప్రతిపాదనలపై సీఎస్ ఆధ్వర్యంలోనే నిర్ణయం తీసుకొని అమలు చేసేవారు. అయితే, ఈసారి విద్యాశాఖ ఫైలు పంపిస్తే సీఎం పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు ఎస్‌ఎస్‌ఏ పరిధిలో సివిల్ వర్క్స్ చూసే ఇంజనీరింగ్ విభా గాన్ని తెలంగాణ విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ)లో విలీనం చేయాలని నిర్ణయించారు. సివిల్ వర్క్స్ మానిటరింగ్‌కు ఈఈ నేతృత్వంలో ఒక విభాగాన్ని కొనసాగించాలని తీర్మానించారు.
మరోవైపు కొత్తగా మంజూరైన కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలు(కేజీబీవీ), 29 అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు, కేంద్రం ఓకే చెప్పిన రూ.2,195 కోట్ల ఎస్‌ఎస్‌ఏ బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యా కమిషనర్ కిషన్, ఎస్‌ఎస్‌ఏ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ భాస్కర్‌రావు, కేజీబీవీ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.