సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యాశాఖలో జరిగిన అవినీతి విచ్చలవిడిగా సాగింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తనయుడు నారా లోకేశ్, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అప్పటి సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ఎస్పీడీ (స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్) జి. శ్రీనివాస్ తదితర ఉన్నతాధికారులు వర్ట్యువల్, డిజిటల్ తరగతుల ఏర్పాటు పేరిట రూ.74 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెట్టారు. భారీగా ముడుపులు దండుకునేందుకు రూ.2లక్షల నుంచి 2.5 లక్షలలోపు విలువ చేసే ఒక్కో యూనిట్ పరికరాలను రూ.6.19 లక్షలకు పైగా పెంచేసి ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టేలా పథకం పన్నారు. మొన్నటి సాధారణ ఎన్నికల ముందు ఈ తతంగాన్ని నడిపించారు. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్ల పంపిణీ పేరిట రూ.45 కోట్లకు పైగా ప్రభుత్వ నిధులకు గండిపడేలా ప్రైవేటు సంస్థలకు ఆర్డర్లు ఇచ్చిన వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి మర్చిపోకముందే మరో బాగోతం బయటపడింది.
రూ.50 కోట్లలోపు పరికరాలకు రూ.124 కోట్ల రేటు
కాగా, బూట్ల దోపిడీని తలదన్నేలా ప్రభుత్వ పెద్దలు వరŠుచ్యవల్, డిజిటల్ తరగతుల పేరిట మరో భారీ అవినీతికి తెరతీశారు. రాష్ట్రవ్యాప్తంగా రెండువేల ప్రభుత్వ స్కూళ్లలో ఈ తరగతుల ఏర్పాటు పేరుతో పెద్ద స్కెచ్చే వేశారు. ఒక్కో యూనిట్ కేవలం రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల మేర మాత్రమే విలువ చేసే ఈ పరికరాల ఏర్పాటుకు రేటును మూడు రెట్ల మేర రూ.6.19లక్షలకు అమాంతం పెంచేసి సెల్‌కాన్ ఇంప్లెక్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. భారీగా ముడుపులు దండుకుని ఆర్డర్లు ఇచ్చారు. ప్రముఖ కంపెనీల నుంచి వీటిని తీసుకున్నా అంతకూడా కాదని.. పైగా అది సెల్‌కాన్ కంపెనీ కాబట్టి పరికరాలు ఇంకా తక్కువ ధరే ఉండే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే.. మొత్తం రూ.50కోట్లలోపే విలువచేసే పరికరాలకు దాదాపు రూ.124కోట్లు చెల్లిస్తున్నారు. కాగా, మెలూహ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ద్వారా ఈ కథను నడిపించారు.
పనిచేయని పరికరాలు
ఇదిలా ఉంటే.. 90 రోజుల్లోగా వీటిని ఏర్పాటుచేయించాలని ఒప్పందంలో షరతు విధించారు. కానీ, గడువు ముగిసినా కేవలం 780 స్కూళ్లకు మాత్రమే అందించారు. ప్రస్తుతం ఈ పరికరాలు పనిచేయకపోవడంతో అవన్నీ వృధాగా పడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఎన్నికల అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. అవినీతి రహిత పాలన దిశగా కొత్త ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో ఈ డిజిటల్ పరికరాల బాగోతం వెలుగుచూసింది. దీంతో ఈ ఆర్డర్‌ను నిలిపివేయాలని ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీగా బాధ్యతలు స్వీకరించిన వాడ్రేవు చినవీరభద్రుడు జులై 4న ఆదేశాలిచ్చారు. ఇది పసిగట్టిన టీడీపీ పెద్దలు రద్దు ఉత్తర్వులు రాకముందే సెల్‌కాన్, మెలూహ కంపెనీల ద్వారా హడావుడిగా మిగిలిన స్కూళ్లకు కూడా డిజిటల్ పరికరాలను ఆఘమేఘాల మీద డంప్ చేయించారు. పరికరాలు పంపిణీ పూర్తయినందున రూ.124 కోట్లు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ వ్యవహారం తలనొప్పిగా మారడంతో సర్వశిక్ష అభియాన్ దీనిపై నివేదికను ఇటీవల ప్రభుత్వానికి పంపింది.
నిధుల కేటాయింపు లేకుండానే ఆర్డర్
నిజానికి వర్ట్యువల్, డిజిటల్ పరికరాల పంపిణీ ఒప్పందం పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని స్పష్టమవుతోంది. ఎస్‌ఎస్‌ఏ ద్వారా ఏ పని చేపట్టాలన్నా అందుకు సంబంధించి ఆ సంస్థ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) నివేదికలో పొందుపరిచి ఉండాలి. కానీ, అలా జరగకపోవడమే కాక నిధుల కేటాయింపు కూడా లేకుండానే పంపిణీ ఆర్డర్ ఇచ్చేశారు. ఈ పరికరాల రేటు కూడా నిబంధనల ప్రకారం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాక.. పేద పిల్లలకు వినియోగించాల్సిన ఇతర కార్యక్రమాల నిధులనూ దీనికోసం దారిమళ్లించేలా అప్పటి ప్రభుత్వ పెద్దలు, ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీ చేసినట్లు సమాచారం.
చంద్రబాబు అధికారంలోకి రాగానే..
కాగా, 2014లో చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే ఈ సంస్థ ఏర్పాటైంది. ఇది లోకేశ్‌కు బినామీ కంపెనీ అన్న ఆరోపణలున్నాయి. ఈ సంస్థకు డిజిటల్, వర్ట్యువల్ తరగతుల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి అనుభవమూ, సాంకేతిక పరిజ్ఞానమూ లేదు. దీంతో సెల్‌కాన్ ఇంప్లెక్స్ సంస్థను ముందు పెట్టి ఈ కంపెనీతో ఒప్పందాన్ని చేయించారు. రెండువేల స్కూళ్లలో ఈ డిజిటల్ తరగతుల పరికరాల ఏర్పాటు ఆర్డర్‌ను ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే ఒకరోజు ముందు మార్చి 9న అప్పటి ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీ జి. శ్రీనివాస్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment