ఆరోపణలు ఉన్నవారికి అందలం!
- హైదరాబాద్, రంగారెడ్డి పరిసర జిల్లాల్లో డీఈవో పోస్టులు
- భారీ ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు?
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో అన్ని జిల్లాల విద్యాశాఖాధికారుల పేర్లను పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. ఇప్పటివరకు పాత జిల్లాల్లో డీఈవోలుగా పనిచేస్తున్న అధికారులు ఇద్దరు మినహా మిగతా వారిని మార్చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లోనూ అసిస్టెంట్ డెరైక్టర్లు, టీచర్ ఎడ్యుకేషన్ కాలేజీల లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర ్లను (డిప్యూటీ ఈవో) ఇన్‌చార్జి డీఈవోలుగా నియమించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు విద్యాశాఖ డెరైక్టరేట్ రూపొందించిన జాబితాను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆమోదం కోసం విద్యాశాఖ ఆదివారం రాత్రి పంపించింది. ఆయన ఓకే అనగానే సోమవారం ఆర్ధరాత్రి తరువాత నియామక ఉత్తర్వులు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
పాఠశాల విద్యా డెరైక్టరేట్ ప్రతిపాదించిన కొత్త జిల్లాల డీఈవోల జాబితా ఇలా..
1.ఆదిలాబాద్: సోమిరెడ్డి (హైదరాబాద్ డీఈవో), 2. నిర్మల్: ప్రణీత (అసిస్టెంట్ డెరైక్టర్ ఆదిలాబాద్), 3. మంచిర్యాల: సహదేవ్ (వరంగల్ సీటీఈ ప్రిన్సిపల్), 4. ఆసిఫాబాద్: రసీఖ్ (ఏడీ నిజమాబాద్), 5. కరీంనగర్: విజయలక్ష్మి (మహబూబ్‌నగర్ డీఈవో), 6.జగిత్యాల: వెంకటేశ్వర్లు (హైదరాబాద్ డిప్యూటీఈవో), 7. సిరిసిల్ల: రాధాకృష్ణ (సీటీఈ వరంగల్ లెక్చరర్), 8. పెద్దపల్లి: వెంకటేశ్వర్‌రావు (ఏడీ కరీంనగర్), 9. వరంగల్ అర్బన్: సత్యనారాయణరెడ్డి (ఆదిలాబాద్ డీఈవో), 10. వరంగల్ రూరల్: వాసంతి (డిప్యూటీఈవో వరంగల్), 11. మహబూబాబాద్: వేణుగోపాల్ (సీటీఈ వరంగల్ లెక్చరర్), 12. జనగాం: రేణుక (డిప్యూటీఈవో వరంగల్), 13. భూపాలపల్లి: యాదయ్య (ఏడీ వరంగల్), 14. ఖమ్మం: రాజేశ్ (ఖమ్మం డీవో), 15. భద్రాద్రి (కొత్త గూడెం): వెంకటనర్సమ్మ (ఖమ్మం డిప్యూటీ ఈవో), 16. నల్గొండ: చంద్రమోహన్ (నల్గొండ డీఈవో), 17. సూర్యాపేట్: చారి (హైదరాబాద్ ఆర్జేడీ ఆఫీస్ ఏడీ), 18. యాదాద్రి: దీపిక (ఎస్‌సీఈఆర్‌టీ లెక్చరర్), 19. నిజామాబాద్: రాజీవ్ (వరంగల్ డీఈవో), 20. కామారెడ్డి: మదన్‌మోహన్ (డిప్యూటీఈవో భువనగిరి), 21. మహబూబ్‌నగర్: రమేష్ (రంగారెడి డీఈవో), 22.నాగర్‌కర్నూల్: జనార్ధన్‌గౌడ్ (ఏడీ మహబూబ్‌నగర్), 23. వనపర్తి: సుశీందర్ (డిప్యూటీఈవో హైదరాబాద్), 24. గద్వాల: నారాయణరెడ్డి (ఎస్‌సీఈఆర్‌టీ లెక్చరర్), 25. మెదక్: రవికాంత్ (ఎస్‌సీఈఆర్‌టీ లెక్చరర్), 26. సిద్దిపేట: కృష్ణారెడ్డి (ఏడీ రంగారెడ్డి), 27. సంగారెడ్డి: చంద్రకళ (డిప్యూటీఈవో రంగారెడ్డి), 28. హైదరాబాద్: లింగయ్య (నిజామాబాద్ డీఈవో), 29. శంషాబాద్: శ్రీనివాసచారి (కరీంనగర్ డీఈవో), 30. మల్కాజిగిరి: ఉషారాణి (డిప్యూటీఈవో రంగారెడ్డి), 31. వికారాబాద్: రోహిణి (డిప్యూటీఈవో రంగారెడ్డి) బ్రాకెట్లలో పేర్కొన్నవి ఆయా అధికారుల పాత స్థానాలు.
చక్రం తిప్పిన ఇద్దరు అధికారులు...
ఈ తాజా జాబితాలో అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు చోటు కల్పించినట్లు విమర్శలొస్తున్నాయి. అలాంటి వారికే కీలకమైన శాఖలను అప్పగించేలా జాబితాలను సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం నిజామాబాద్‌లో ఉన్న ఓ అధికారి అవినీతికి పాల్పడ్డాడంటూ ఓ ఉపాధ్యాయ సంఘం ఏకంగా లోకాయుక్తలోనే కేసు వేసింది. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉండగా, సదరు అధికారిని కీలకమైన హైదరాబాద్ జిల్లా డీఈవోగా నియమించేందుకు విద్యాశాఖ డెరైక్టరేట్ ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిసింది. ఆయనే కాకుండా తాను డీఈవోగా చేయనంటూ నాలుగు నెలలపాటు సెలవుపై వెళ్లిపోయిన కరీంనగర్ జిల్లాకు చెందిన మరో అధికారికి ప్రస్తుతం కీలకమైన శంషాబాద్ జిల్లాను అప్పగించేందుకు జాబితాలో చోటు కల్పించినట్లు సమాచారం.
ఇక ఓ ఉపాధ్యాయ విద్యా కాలేజీలో పనిచేస్తూ, విధులకు ఎగనామం పెట్టి, విద్యార్థుల సొమ్ము మింగేసినట్లు ఆరోపణలున్న మరో అధికారికి డీఈవోగా బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది. ఈ తతంగంలో భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో డెరైక్టరేట్‌లో పని చేసే ఇద్దరు అధికారులు కీలకంగా వ్యవహరించారనేది ప్రధాన ఆరోపణ. ఓ కీలకమైన అధికారి అండదండలతోనే వారు వసూళ్ల పర్వానికి తెరలేపినట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ మహిళా అధికారి వారిని సంప్రదించనందుకు ఆమె పేరును కరీంనగర్ జిల్లాకు కేటాయించేలా జాబితా రూపొందించినట్లు తెలిసింది.
లింగయ్యపై చర్యలు చేపట్టాలి: డీటీఎఫ్
కరీంనగర్ డీఈవోగా పని చేసిన లింగయ్యపై (ప్రస్తుతం నిజామాబాద్) వెంటనే చర్యలు చేపట్టాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రఘుశంకర్‌రెడ్డి, కిష్టప్ప డిమాండ్ చేశారు. ఆయన అవినీతిపై తాము లోకాయుక్తలో కేసు వేశామని, అది విచారణలో ఉండగా హైదరాబాద్ జిల్లాకు డీఈవోగా నియమించేందుకు చర్యలు దారుణమన్నారు.