ఆమ్యామ్యాలపైనే అధికారుల ధ్యాస!
♦ పాఠశాలల బాగోగులు పట్టని వైనం
♦ అవినీతి నిలయాలుగా డీఈవో, ఆర్జేడీ కార్యాలయాలు
♦ కార్యాలయాల సిబ్బందే దళారులు
సాక్షి, హైదరాబాద్: విద్యా శాఖలో అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపూలేదు. అధికారులు, సిబ్బంది చేతివాటానికి విద్యాశాఖ కుదేలవుతోంది. డీఈవో, ఆర్జేడీ కార్యాలయాలు అవినీతి నిలయాలుగా వర్థిల్లుతున్నాయి. దీనికి కొన్ని ఉదాహరణలు ఇవి..
► హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు స్కూల్‌కు ఒక పేరుతో రికగ్నైజేషన్ ఉంటే మరో ఆకర్షణీయమైన పేరుతో కొనసాగిస్తోంది. దీనిపై ఫిర్యాదులు అందడంతో స్కూల్‌ను సీజ్ చేశారు. కానీ ఒక్క రోజు గడవక ముందే ఆ స్కూల్ మళ్లీ తెరుచుకుంది. ఈ వ్యవహారాల్లో ఓ ఉన్నతాధికారి భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఎయిడెడ్ టీచర్ల బిల్లుల మంజూరులో 8 శాతం ముడుపులు పుచ్చుకున్నట్లు విమర్శలున్నాయి.
► నిజామాబాద్‌లో ఒక మహిళా టీచర్ మూడు నెలలు సెలవు పెట్టారు. కానీ రెండేళ్లు విధులకు హాజరుకాలేదు. రెండేళ్ల తరువాత వచ్చిన ఆమెకు ప్రభుత్వ ఆమోదం లేకపోయినా అక్కడే తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.
► కరీంనగర్‌లో మూడేళ్లపాటు విధులకు హాజరుకాని ముగ్గురు టీచర్లకు అక్కడి అధికారి ఒకరు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఫైలు లేదు. ప్రొసీజరు లేదు. భారీ మొత్తంలో ముడుపులు పుచ్చుకుని ఈ పోస్టింగ్‌లు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక 18 నెలలపాటు విధులకు హాజరుకాని మరో టీచర్ డబ్బులు ఇవ్వకపోవడంతో అతనికి పోస్టింగ్ నిరాకరించారు.
► నల్లగొండ జిల్లాలో అక్రమ వైద్య బిల్లులు పొందిన 96 మంది టీచర్లను ఆర్జేడీ సస్పెండ్ చేశారు. అందులో గ్రేడ్-2 హెడ్‌మాస్టర్లు 30 మంది వరకు ఉన్నారు. వారిలో ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసి, తనకు అధికారం లేకపోయినా డీఈవో వారిని తిరిగి నియమిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. డీఈవోలే కాదు.. ప్రాంతీయ సంయుక్త సంచాలకుల(ఆర్జేడీ)పైనా అవినీతి ఆరోపణలున్నాయి. వారి కార్యాలయాల్లో అవినీతికి అంతేలేదు. కేవలం ముడుపులపైనే దృష్టి పెట్టిన జిల్లా అధికారులు, ఉప విద్యాధికారులు, ఎంఈవోలు క్షేత్రస్థాయిలో పాఠశాలల బాగోగులను పట్టించుకోవడం మానేశారు. ఇది విద్యా శాఖ నిర్వహించిన సర్వేలోనే వైల్లడైంది. డీఈవో, ఆర్జేడీ కార్యాలయాల్లోని క్లర్క్‌లు, సూపరింటెండెంట్లే డీఈవోలకు ఏజెంట్లుగా మారిపోయారు. డీఈవో, ఆర్జేడీల కనుసన్నల్లో వసూళ్ల దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మొన్నటి వరకు హైదరాబాద్ ఆర్జేడీ కార్యాలయంలో పని చేసిన ఒక సూపరింటెండెంట్ అయితే అన్ని తానై నడిపిస్తారు. ఏ ఆర్జేడీ వచ్చినా అతనిదే హవా. ఇప్పుడు అతను అక్కడ లేకపోయినా అధికారులకు ఏ అవసరం వచ్చినా అతను రావాల్సిందే.