సాక్షి, రంగారెడ్డి జిల్లా : సర్వశిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ)కు కొత్త చిక్కు వచ్చిపడింది. నిన్నటివరకు నిధుల లేమితో సతమతమైన జిల్లా ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టుకు తాజాగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కొత్త వార్షిక సంవత్సరం మొదలై దాదాపు ఆర్నెల్లు కావస్తున్న తరుణంలో.. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో అధికారులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. వార్షిక సంవత్సరం మొదలై ఆర్నెల్లు కావడం.. సర్కారు పైసా విదల్చకపోవడంతో ఎస్‌ఎస్‌లో పలు విభాగాల్లో బకాయిలు పేరుకుపోయాయి. ప్రస్తుతం భారీగా నిధుల అవసరం ఉన్న తరుణంలో.. ప్రభుత్వం కేవలం కంటితుడుపు చర్యగా రూ.3 కోట్లు విడుదల చేయడంతో ఈ నిధులను ఎలా ఖర్చు చేయాలనే అంశం అధికారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
రూ.25 కోట్లు అవసరం...
2014-15 సంవత్సరం బడ్జెట్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రాజెక్టుకు రూ.3 కోట్లు విడుదల చేసింది. ఇందులో నిర్మాణ(సివిల్) పనులకు రూ.2 కోట్లు ఖర్చు చేయాలని, మిగతా రూ.కోటి సాధారణ ఖర్చులకు వెచ్చించాలని సూచించింది. నిధుల విడుదలతో సర్కారు చేతులు దులుపుకోగా.. క్షేత్రస్థాయిలో అధికారులకు మాత్రం ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆర్నెల్లు కావస్తోంది. ఈ క్రమంలో ప్రాజెక్టులో భాగంగా తలపెట్టే పలు కార్యక్రమాలకు నిధులు లేక నిలిచిపోయాయి.
అదనపు తరగతి గదుల (ఏసీఆర్) నిర్మాణ పనులకు సంబంధించి రూ.16 కోట్ల బకాయిలున్నాయి. బ్రిడ్జి కోర్సులకు సంబంధించి బిల్లుల చె ల్లింపులు నిలిచిపోగా.. యూనిఫాంలకు సంబంధించి బకాయిలు సైతం ఆగిపోయా యి. ఇవన్నీ సాధారణ ఖర్చుకు సంబంధించినవి. ఇవి దాదాపు రూ.9 కోట్లు బకాయిలున్నట్లు ప్రాజెక్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇవే కాకుండా సిబ్బంది, ఇతర ఉద్యోగుల వేతనాలకు ప్రతినెలా రూ.65 లక్షలు అవసరం. ఇంతటి వ్యయమున్న ఎస్‌ఎస్‌ఏకు ప్రభుత్వం కేవలం రూ.3కోట్లు విడుదల చేయడం గమనార్హం.
ఏం చేద్దాం..?
బకాయిలు కుప్పలుగా పేరుకుపోయిన ఎస్‌ఎస్‌ఏకు రాష్ట్ర ప్రభుత్వం అత్తెసరుగా కరుణించిన నేపథ్యంలో ఆలోచనలో పడింది. ప్రస్తుతం ఇచ్చిన రూ.3 కోట్లను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై కసరత్తు చేస్తోంది. వాస్తవానికి ఈ నిధి ఏ మూలకూ చాలనప్పటికీ.. అత్యవసరమున్న కేటగిరీకి వీటిని ఖర్చు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రెండ్రోజుల్లో ప్రణాళిక తయారు చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారి కిషన్‌రావు ‘సాక్షి’తో పేర్కొన్నారు.
జిల్లా ప్రాజెక్టు వార్షిక ప్రణాళిక..
సర్వశిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు కింద 2014-15 వార్షిక సంవత్సరానికి రూ.192.69 కోట్లతో ప్రణాళిక తయారు చేశారు. ఇందులో ఉపాధ్యాయులు, కాంట్రాక్టు సిబ్బంది వేతనాలకు రూ. 80.55 కోట్లు కేటాయించారు. అదేవిధంగా విద్యార్థుల యూనిఫాం, పుస్తకాలకు రూ.11 కోట్లు, పాఠశాల గ్రాంట్లు, టీచర్ల గ్రాంట్లతో పాటు శిక్షణ కోసం రూ.10 కోట్లు కేటాయించగా, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.55 కోట్లు ఖర్చు పెట్టేలా ప్రణాళిక రూపొందించారు. జిల్లా ప్రాజెక్టుకు పైసా అందకపోవడంతో పలు కార్యక్రమాలు నిలిచిపోయాయి. జిల్లా ప్రాజెక్టు వద్ద ఉన్న రూ.2కోట్ల నిధులతో నెట్టుకొస్తుండగా.. ప్రస్తుతం ఈ నిధి నిండుకుంది.
కంటితుడుపు
Published Thu, Sep 11 2014 11:32 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement