Project activities
-
బెర్త్ పదిలం
రెండేళ్లు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేదు. ఎలాంటి రాయిల్టీ చెల్లించలేదు. ఇలాంటి సంస్థను ఎవరైనా ఏం చేస్తారు. తప్పించేస్తారు. మరో సంస్థకు ఇస్తారు. కానీ అదానీ సంస్థ తనకున్న రాజకీయ పలుకుబడితో పోర్టులో తనకున్న బెర్త్‌ను మళ్లీ చేజిక్కించుకుంది. త్వరలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సాక్షి, విశాఖపట్నం : దేశంలోని బడా పారిశ్రామికవేత్త అదానీ గ్రూపు వైజాగ్ పోర్టులో తనకున్న బెర్త్‌ను చేజార్చుకోకుండా పదిలపర్చుకుంది. రెండేళ్లుగా బెర్త్ ఖాళీగానే ఉంచడంతో ఏటా కోట్ల ఆదాయం కోల్పోతుండడంతో ఎలాగైనా ఈ సంస్థను వదిలించుకొని మరో సంస్థకు బెర్త్‌ను కేటాయించాలని విశాఖ పోర్టు రంగం సిద్ధం చేసింది. అదానీ గ్రూపునకు నోటీసులు కూడా జారీ చేసింది. కానీ కేంద్రంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి నోటీసులను వెనక్కి తీసుకునేలా విశాఖ పోర్టుపై ఒత్తిడి తీసుకొచ్చింది. తద్వారా విశాఖ పోర్టులో రెండేళ్లుగా మూతబడిన బొగ్గు టెర్మినల్‌ను తెరిపించుకునేందుకు మార్గం సుగమం చేసుకుంది. జూలై 1వ తేదీ నుంచి తిరిగి విశాఖ పోర్టు ద్వారా కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రెండేళ్లు కార్యకలాపాలు నిలిపేసినా?a 2014 ఆగస్టు నాటికి రూ.323.18 కోట్ల వ్యయంతో తూర్పు క్వారీ–1 బెర్త్ నిర్మాణానికి 2011లో పోర్టుతో అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. రూ.400 కోట్లతో స్పెషల్ పర్పస్ వెహికల్‌ను కూడా ఏర్పాటు చేసింది. బెర్త్ కోసం ఏటా రూ.3 కోట్లు, టెర్మినల్‌లో జరిగే కార్యక లాపాల ద్వారా టన్నుకు 40 శాతం రాయిల్టీ రూపంలో పోర్టుకు రెవెన్యూ చెల్లించాలన్నది ఒప్పందం. 2016 ఫిబ్రవరి వరకు ఈ బెర్త్ ద్వారా లోడింగ్, అన్లోడింగ్ కార్యకలాపాలు సాగించిన ఈ సంస్థ ఆ తర్వాత కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. రెండేళ్లుగా పోర్టు ఆదాయానికి గండిపడింది. దీంతో అదానీ గ్రూపుతో ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకు పోర్టు సిద్ధమై నోటీసులు జారీ చేయడంతో ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వ పెద్దల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో పోర్టు యాజమాన్యం కూడా దిగిరాక తప్పలేదు. విశాఖ పోర్టులో ప్రతిపాదించిన ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు రూ.20 లక్షలు చొప్పున జరిమానా విధించింది. కాగా 2015లో చేసుకున్న ఒప్పందం మేరకు బెర్త్ తిరిగి ప్రారంభించాలని అదానీ గ్రూపు నిర్ణయించింది. ఈ నిర్ణయం పోర్టు అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ప్రాజెక్టు కోసం పొందిన రుణాల చెల్లింపు సమస్యగా మారింది. ఈ ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాలు పోర్టు ముందస్తు ఆమోదంతో హోల్డింగ్ కంపెనీకి బదిలీ చేయలేదు. ఏడాదికి నాలుగు మిలియన్ టన్నుల నిర్వహణకు అదానీ గ్రూపు ఒప్పందం చేసుకుంది. అదానీ గ్రూపు దేశవ్యాప్తంగా 10 పోర్టుల్లో బెర్త్‌లను కలిగి ఉంది. ముంద్రా, హజీరా, దేహెజ్, కాండ్ల, ధీమ్, గోమా, మార్ముగోవాల వద్ద ఈ గ్రూపునకు టెర్మినల్స్ కలిగి ఉంది. తాజాగా ఒడిశాలోని పోర్టు ప్రాజెక్టు అభివృద్ధిని అప్పగించింది. ఏటా 4 మిలియన్ టన్నుల ఎగుమతి, దిగుమతులు చేపడతామని అదానీ గ్రూపు అంగీకరించిందని, దీంతో బెర్త్ పునరుద్ధరణకు ఆమోదం తెలిపినట్టుగా విశాఖ పోర్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు చెప్పారు. -
కంటితుడుపు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ)కు కొత్త చిక్కు వచ్చిపడింది. నిన్నటివరకు నిధుల లేమితో సతమతమైన జిల్లా ఎస్ఎస్ఏ ప్రాజెక్టుకు తాజాగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కొత్త వార్షిక సంవత్సరం మొదలై దాదాపు ఆర్నెల్లు కావస్తున్న తరుణంలో.. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో అధికారులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. వార్షిక సంవత్సరం మొదలై ఆర్నెల్లు కావడం.. సర్కారు పైసా విదల్చకపోవడంతో ఎస్ఎస్లో పలు విభాగాల్లో బకాయిలు పేరుకుపోయాయి. ప్రస్తుతం భారీగా నిధుల అవసరం ఉన్న తరుణంలో.. ప్రభుత్వం కేవలం కంటితుడుపు చర్యగా రూ.3 కోట్లు విడుదల చేయడంతో ఈ నిధులను ఎలా ఖర్చు చేయాలనే అంశం అధికారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రూ.25 కోట్లు అవసరం... 2014-15 సంవత్సరం బడ్జెట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రాజెక్టుకు రూ.3 కోట్లు విడుదల చేసింది. ఇందులో నిర్మాణ(సివిల్) పనులకు రూ.2 కోట్లు ఖర్చు చేయాలని, మిగతా రూ.కోటి సాధారణ ఖర్చులకు వెచ్చించాలని సూచించింది. నిధుల విడుదలతో సర్కారు చేతులు దులుపుకోగా.. క్షేత్రస్థాయిలో అధికారులకు మాత్రం ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆర్నెల్లు కావస్తోంది. ఈ క్రమంలో ప్రాజెక్టులో భాగంగా తలపెట్టే పలు కార్యక్రమాలకు నిధులు లేక నిలిచిపోయాయి. అదనపు తరగతి గదుల (ఏసీఆర్) నిర్మాణ పనులకు సంబంధించి రూ.16 కోట్ల బకాయిలున్నాయి. బ్రిడ్జి కోర్సులకు సంబంధించి బిల్లుల చె ల్లింపులు నిలిచిపోగా.. యూనిఫాంలకు సంబంధించి బకాయిలు సైతం ఆగిపోయా యి. ఇవన్నీ సాధారణ ఖర్చుకు సంబంధించినవి. ఇవి దాదాపు రూ.9 కోట్లు బకాయిలున్నట్లు ప్రాజెక్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇవే కాకుండా సిబ్బంది, ఇతర ఉద్యోగుల వేతనాలకు ప్రతినెలా రూ.65 లక్షలు అవసరం. ఇంతటి వ్యయమున్న ఎస్ఎస్ఏకు ప్రభుత్వం కేవలం రూ.3కోట్లు విడుదల చేయడం గమనార్హం. ఏం చేద్దాం..? బకాయిలు కుప్పలుగా పేరుకుపోయిన ఎస్ఎస్ఏకు రాష్ట్ర ప్రభుత్వం అత్తెసరుగా కరుణించిన నేపథ్యంలో ఆలోచనలో పడింది. ప్రస్తుతం ఇచ్చిన రూ.3 కోట్లను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై కసరత్తు చేస్తోంది. వాస్తవానికి ఈ నిధి ఏ మూలకూ చాలనప్పటికీ.. అత్యవసరమున్న కేటగిరీకి వీటిని ఖర్చు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రెండ్రోజుల్లో ప్రణాళిక తయారు చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారి కిషన్‌రావు ‘సాక్షి’తో పేర్కొన్నారు. జిల్లా ప్రాజెక్టు వార్షిక ప్రణాళిక.. సర్వశిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు కింద 2014-15 వార్షిక సంవత్సరానికి రూ.192.69 కోట్లతో ప్రణాళిక తయారు చేశారు. ఇందులో ఉపాధ్యాయులు, కాంట్రాక్టు సిబ్బంది వేతనాలకు రూ. 80.55 కోట్లు కేటాయించారు. అదేవిధంగా విద్యార్థుల యూనిఫాం, పుస్తకాలకు రూ.11 కోట్లు, పాఠశాల గ్రాంట్లు, టీచర్ల గ్రాంట్లతో పాటు శిక్షణ కోసం రూ.10 కోట్లు కేటాయించగా, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.55 కోట్లు ఖర్చు పెట్టేలా ప్రణాళిక రూపొందించారు. జిల్లా ప్రాజెక్టుకు పైసా అందకపోవడంతో పలు కార్యక్రమాలు నిలిచిపోయాయి. జిల్లా ప్రాజెక్టు వద్ద ఉన్న రూ.2కోట్ల నిధులతో నెట్టుకొస్తుండగా.. ప్రస్తుతం ఈ నిధి నిండుకుంది.