సాక్షి, రంగారెడ్డి జిల్లా:సాధారణంగా ఏ శాఖ వద్దనైనా నిధులు అందుబాటులో ఉంటే ఏం చేస్తారు..? నిర్దేశించిన వార్షిక ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు చేపట్టి పురోగతిపై దృష్టి పెడతారు.. అవసరానికి మించినిధులుంటే మరిన్ని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
కానీ ‘సర్వ శిక్షా అభియాన్’లో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. అందుబాటులో కోట్ల రూపాయల నిధులున్నా.. పైసా ఖర్చు చేయకుండా నెలనెలా కేవలం జీతభత్యాలు లాగించేసి చేతులు దులుపుకుంటున్నారు. 2014-15 వార్షిక సంవత్సరం మొదటినుంచి ఇప్పటివరకు ఆ ప్రాజెక్టులో ఇదే తంతు కొనసాగుతోంది. దీంతో వార్షిక ప్రణాళికలో రూపొందించిన పలు కార్యక్రమాలు ఎక్కడివక్కడ పెండింగ్‌లో కొనసాగుతోంది. దీంతో వార్షిక ప్రణాళికలో రూపొందించిన పలు కార్యక్రమాలు ఎక్కడివక్కడ పెండింగ్‌లో ఉండిపోయాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
ఎస్‌పీడీ వద్ద పుష్కలం.. పీఓల వద్ద ఖాళీ!
2014-15 వార్షిక సంవత్సరంలో క్షేత్రస్థాయిలో రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలను క్రోడీకరిస్తూ ఎస్‌ఎస్‌ఏ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ రూపొందించిన పూర్తి ప్రణాళికకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాదాపు రూ. రెండువేల కోట్లతో రూపొందించిన వార్షిక ప్రణాళికకు సంబంధించి తొలి త్రైమాసిక నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం విడుదల చేసింది.
ఈ నిధులను ప్రాధాన్యత ప్రకారం జిల్లా ప్రాజెక్టులకు పంపిణీ చేస్తే.. ఆ మేరకు ప్రణాళిక అమలుకు ప్రాజెక్టు అధికారులు చర్యలు చేపడతారు. కానీ ఈసారి ఎస్‌పీడీ నుంచి జిల్లా ప్రాజెక్టులకు పైసా అందలేదు. వార్షిక సంవత్సరం సగం గడుస్తున్నా ఇప్పటివరకు నిధులు అందకపోవడంతో జిల్లా ప్రాజెక్టులు చతికిల పడ్డాయి. గతేడాది మిగులు నిధులను జిల్లా ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతభత్యాలతో సరిపెట్టాల్సి వస్తోంది.
జిల్లాలో ఇదీ తీరు..
రంగారెడ్డి జిల్లా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు కింద 2014-15 వార్షిక సంవత్సరానికి గాను రూ.192.69 కోట్లతో ప్రణాళిక తయారు చేశారు. ఇందులో ఉపాధ్యాయులు, కాంట్రాక్టు సిబ్బంది వేతనాలకు రూ. 80.55 కోట్లు కేటాయించారు. అదేవిధంగా విద్యార్థుల యూనిఫాం, పుస్తకాలకు గాను రూ.11 కోట్లు, పాఠశాల గ్రాంట్లు, టీచర్ల గ్రాంట్లతో పాటు శిక్షణలకోసం రూ.10 కోట్లు కేటాయించగా, పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన కోసం రూ.55 కోట్లు ఖర్చు పెట్టేలా ప్రణాళిక రూపొందించారు. అయితే జిల్లా ప్రాజెక్టుకు పైసా అందకపోవడంతో పలు కార్యక్రమాలు నిలిచిపోయాయి.
అయితే జిల్లా ప్రాజెక్టు వద్ద ఉన్న రూ.2కోట్ల నిధులతో నెట్టుకొస్తుండగా.. ప్రస్తుతం ఈ నిధి రూ.50లక్షలకు చేరింది. ఈ నెల వేతనాలు చెల్లిస్తే పీఓ ఖాతా నిండుకోనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రాజెక్టు వద్ద నిధులున్నాయని, జిల్లాల వారీగా మిగులు నిధులు, ఖర్చుల లెక్కలు వచ్చిన వెంటనే ఎస్‌పీడీ నుంచి మరిన్ని నిధులు విడుదల చేస్తామని ఎస్‌పీడీ కార్యాలయంలోని ఆర్థిక అధికారి విజయ్‌శంకర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు.
నిధులు ఫుల్... ఖర్చు నిల్!
Published Wed, Sep 3 2014 10:42 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement