సాక్షి, రంగారెడ్డి జిల్లా : కొత్త రాష్ట్రంలో కొంగొత్త ఆశల నడుమ ప్రవేశపెట్టిన తొలి పద్దులో జిల్లాకు అన్యాయమే జరిగింది. ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతలకు తగిన ప్రాధాన్యం లభించకపోగా, చేవెళ్ల-ప్రాణహితకు అరకొర నిధులే దక్కాయి. సాగునీటిరంగానికి పెద్దపీట వేస్తారని భావించినా..తెలంగాణ ప్రభుత్వం కలల ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.5 కోట్లు విదిల్చడం గమనార్హం.
ఈ నిధులు కూడా కేవలం సర్వే పనులకు మాత్రమే నిర్ధేశించారు. రూ.9వే ల కోట్ల అంచనా వ్యయంతో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టుకు 2014-15 బడ్జెట్‌లో మోక్షం కలుగుతుందనే ఆశలను ఆవిరి చేసిన టీఆర్‌ఎస్ సర్కారు.. ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేసేలా బడ్జెట్లో ప్రస్తావించడం శుభపరిణామంగా చెప్పవచ్చు. జిల్లాకు తలమానికంలా నిలిచే ఐటీఐఆర్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.90 కోట్లు కేటాయించింది.
ఐటీ ఆధారిత సంస్థలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేసింది. దీంట్లో భాగంగా నిర్దేశించిన కారిడార్‌లలో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను వ్యయం చేయనుంది. ఉద్యానవనాల సాగును ప్రోత్సహించేందుకు ‘గ్రీన్‌హౌస్ కల్టివేషన్’ కింద 300 ఎకరాలను అభివృద్ధి చేయనున్నట్లు బడ్జెట్‌లో పొందుపరిచింది. ఇది రైతాంగానికి ఒకింత ఊరట కలిగించే అంశం.
‘పాలమూరు-రంగారెడ్డి’ స్వరూపమిది..
పది లక్షల ఎకరాలకు సాగునీరందించడం పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ముఖ్య ఉద్దేశం. వరదలు వచ్చే సమయంలో వివిధ సందర్భాల్లో 35-90 రోజులపాటు జూరాల నుంచి 50వేల క్యూసెక్కుల వరద నీరు దిగువప్రాంతానికి చేరుతుంది. ఈక్రమంలో ఆ జలాలను ఒడిసిపట్టి ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రిజర్వాయర్లలో జలాలను నిల్వ చేస్తారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో 7లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 3లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఎత్తిపోతల కోసం 2,300 మెగావాట్ల విద్యుత్తు అవసరం. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.9,000 కోట్లు.
తాజా బడ్జెట్లో ప్రభుత్వం కేవలం రూ.5కోట్లు మాత్రమే కేటాయించింది..
ధారూరు, పెద్దేముల్ మండలాల్లోని 18 గ్రామాల్లోని 9,200 ఎకరాల ఆయక ట్టుకు నీరందించే కోటిపల్లివాగు ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.50లక్షలు కేటాయించింది.
ఏడు జిల్లాలకు సాగునీరందించే ప్రాణాహిత -చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు అత్తెసరు నిధులే ఇచ్చింది.
బడంగ్‌పేట్‌లో మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజీకి రూ.72.45లక్షలు ఇస్తున్నట్లు పేర్కొంది.
గ్రీన్‌హౌజ్ సాగుకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో రాజధానికి చుట్టూ జిల్లా విస్తరించి ఉండడంతో జిల్లా ఉద్యానశాఖకు కేటాయింపు ఆశాజనకంగా ఉండనుంది.
జిల్లాకు కేటాయింపులు అంతంతే..!
Published Thu, Nov 6 2014 1:27 AM | Last Updated on Fri, Mar 22 2019 3:19 PM
Advertisement