బీ'టెక్కు'బాబు
చచ్చీచెడీ ప్రభుత్వోద్యోగం సాధించిన ఓ ప్రబద్ధుడు అక్కడితో సంతృప్తి చెందలేదు. పెత్తనం చేసే పైస్థాయి పోస్టు వస్తే.. హోదాకు హోదా.. సంపాదనకు సంపాదన.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టేయాలనుకున్నాడు. కానీ అధికారి స్థాయి పోస్టుకు కావాల్సిన విద్యార్హత లేదు. అలాగని కష్టపడి చదివే సత్తానూ లేదు.
ఇవి లేకుండానే అనుకున్నది సాధించేందుకు ఓ స్కెచ్ వేశాడు. ఎక్కడో ఊరూ పేరూ లేని యూనివర్సిటీ నుంచి బీటెక్ పట్టా కొనేసి.. దాన్ని చూపించి ప్రమోషన్ కొట్టేశాడు. ఆ తర్వాత ఇక్కడే ఎంటెక్ కూడా చేసేశాడు. ఆనక ఓ టీడీపీ ప్రజాప్రతినిధిని పట్టుకుని ఇటీవలే ఓ కీలక పోస్టులో దర్జాగా సెటిల్ అయిపోయాడు. అప్పటినుంచి అడ్డంగా వసూళ్లపై పడిపోతున్నాడు. ఆయనెవరు?.. ఏమిటాయన బీ‘టెక్కు’??.. మీరే చదవండి..
విశాఖపట్నం : డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఓ యువకుడు పంచాయతీరాజ్ శాఖలో సూపర్‌వైజర్‌గా ఉద్యోగం సాధించాడు. తదనంతరకాలంలో ఆ శాఖలో సూపర్‌వైజర్ పోస్టులు రద్దు కావడంతో అసిస్టెంట్ ఇంజనీర్ హోదా కట్టబెట్టారు. అదే హోదాతో పాడేరు, పెందుర్తి, అనకాపల్లి ప్రాంతాల్లో పనిచేశాడు. అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఎన్నాళ్లు చేస్తాం.. ప్రమోషన్ సాధిస్తే పలుకుబడితో పాటు పైసలు సంపాదించొచ్చని ఆశ పడ్డాడు. కానీ పదోన్నతి కావాలంటే డిప్లొమా సరిపోదు ఇంజనీరింగ్ పట్టా కావాలి.
అయితే కష్టపడి చదివేంత సీన్ అతగాడికి లేదు. దాంతో చదువు‘కొనేద్దామని’ ప్లాన్ వేశాడు. అనుకోవడమే ఆలస్యం.. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) గుర్తింపు లేని రాజస్థాన్‌కు చెందిన ఓ యూనివర్సిటీ నుంచి బీటెక్ పట్టా కొనేశాడు. రాజస్థాన్ రాష్ర్టంలోని వర్సిటీ నుంచి కరస్పాండెన్స్ కోర్సు ద్వారా చదివాడని అనుకుందామన్నా.. అప్పట్లో బీటెక్ సివిల్ విభాగం కోర్సుకు ఆ అవకాశం లేదు. పోనీ ఈయన గారే అక్కడకు వెళ్లి చదువుకున్నాడని అనుకుందామంటే.. ఇక్కడ ఉద్యోగానికి సెలవు పెట్టాలి. శాఖాపరమైన అనుమతి తీసుకోవాలి.
కానీ అలాంటివేవీ ఆయన సర్వీసు రికార్డుల్లో లేవు. ఎలాగైతేనేం కొనేసిన బీటెక్ పట్టా చూపించి ప్రమోషన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. అప్పట్లో హైదరాబాద్‌లో స్క్రూటినీ చేసిన పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు ఇతని బీటెక్ పట్టా చూసి అగ్గి మీద గుగ్గిలమైపోయారు, మమ్మల్నే మోసం చేయాలని చూస్తావా.. ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్‌లు చేస్తే అరెస్టు చేయిస్తాం.. అని వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ప్రమోషన్ పోతే పోయింది... ఉన్న ఉద్యోగం మిగిలింది.. అదే చాలు.. ఇంకేమీ ఆలోచనలు పెట్టుకోకుండా ఆ ఉద్యోగం చేసుకోమని సహోద్యోగులు సలహా ఇచ్చారు. కానీ ఆయనగారి ఆశ చావలేదు.. ఆయనలోనూ మార్పు రాలేదు.
ఈసారి మరో స్కెచ్
ఆ బీటెక్ సర్టిఫికెట్‌తోనే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంటెక్ కోర్సుకు దరఖాస్తు చేసుకున్నాడు. కనీసం ఏ వర్సిటీ నుంచి బీటెక్ పట్టా పొందాడో కూడా పరిశీలించని ఏయూ అధికారులు అతనికి ఎంటెక్ సీటు.. రెండేళ్ల తర్వాత పట్టా ఇచ్చేశారు. ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంటెక్ పట్టా వచ్చిందంటే ఇంకేముంది.. వెంటనే ప్రమోషన్ కూడా వచ్చేసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అండ కూడా తోడైంది. అంతే డిప్యుటేషన్‌పై విద్యాశాఖకు బదలీ అయ్యాడు..
ఇటీవలే సర్వశిక్ష అభియాన్‌లో కీలక పోస్టు కూడా దక్కించుకున్నాడు. ఆ విధంగా తన కలల పోస్టులో కూర్చున్నాడు. ఇక అడ్డు అదుపు లేకుండా వసూళ్ల దందాకు తెర లేపాడు. కేవలం నెలల వ్యవధిలోనే రూ.కోట్లకు పడగలెత్తాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నమొన్నటి వరకు తమ పక్కనే ఉన్న ఓ ఉద్యోగి నకిలీ పట్టాతో అడ్డగోలుగా దూసుకుపోతూ రూ.కోట్లకు పడగలెత్తడాన్ని జీర్ణించుకోలేని పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు మనోడి బండారాన్ని బట్టబయలు చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారట!.