వస్త్రోత్పత్తిపై కరోనా పడగ | Textile manufacturers in financial trouble | Sakshi
Sakshi News home page

వస్త్రోత్పత్తిపై కరోనా పడగ

Published Wed, Aug 12 2020 5:34 AM | Last Updated on Wed, Aug 12 2020 5:34 AM

Textile manufacturers in financial trouble - Sakshi

సిరిసిల్ల గోదాంలో బతుకమ్మ చీరలు

సిరిసిల్ల: ‘మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు’ఉంది సిరిసిల్ల నేతన్నల పరిస్థితి’. రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకునేందుకు వివిధ పథకాల్లో వస్త్రోత్పత్తి ఆర్డర్లను ఇస్తోంది. ఈ మేరకు బట్ట ఉత్పత్తి చేస్తూ.. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికులకు ఉపాధి కల్పిస్తూ.. వస్త్రోత్పత్తి రంగం ముందుకు సాగుతోంది. అంతా సాఫీగానే సాగుతుందని భావిస్తున్న తరుణంలో కోవిడ్‌–19 మహమ్మారి వస్త్రోత్పత్తి రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. రాష్ట్ర వ్యాప్తంగా 78 వేల మరమగ్గాలు ఉండగా.. ఒక్క సిరిసిల్లలోనే 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పాలిస్టర్‌ బట్టను కొనేవారు లేక వస్త్ర పరిశ్రమ కుదేలైంది. ప్రభుత్వం ఇచ్చిన సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ), రంజాన్, బతుకమ్మ చీరల ఆర్డర్ల వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. వీటికి సంబంధించిన బిల్లులు అందక వస్త్రోత్పత్తిదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్లకు మొత్తంగా రూ.150 కోట్ల మేరకు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది 

మూలకు పడిన రంజాన్‌ బట్ట 
 రంజాన్‌ పండుగను పురస్కరించుకొని ముస్లింలకు కానుకగా అందించేందుకు సిరిసిల్లలోని వస్త్రోత్పత్తిదారులకు 26.23 లక్షల మీటర్ల షర్టింగ్‌ బట్టకు ఆర్డర్లు ఇచ్చారు. 2020 జనవరి 3వ తేదీన ఆర్డర్లు ఇచ్చిన జౌళిశాఖ అధికారులు.. ఫిబ్రవరి 20లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రంజాన్‌ బట్టను వస్త్రోత్పత్తిదారులు తయారు చేశారు. 10 లక్షల మీటర్ల బట్టను కొనుగోలు చేశారు. మరో 16.23 లక్షల మీటర్ల బట్ట కార్ఖానాల్లోనే ఉంది. ఈలోగా కరోనా లాక్‌డౌన్‌ రావడంతో సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌లో ఉత్పత్తి చేసిన రంజాన్‌ బట్ట నిల్వలు పేరుకుపోయాయి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి నూలు, కొనుగోలు చేసి, కార్మికులకు కూలి చెల్లించి అమ్మకానికి సిద్ధంగా ఉన్న బట్టను జౌళిశాఖ కొనుగోలు చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం రంజాన్‌ పండుగకు కొత్త బట్టలను పంపిణీ చేయలేదు. దీంతో సుమారు రూ.5.40 కోట్ల విలువైన నిల్వలు సిరిసిల్లలో ఉన్నాయి.  

ఎస్‌ఎస్‌ఏది అదే కథ 
సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ)లో 1.30 కోట్ల మీటర్ల బట్టను ఉత్పత్తి చేసేందుకు ఆర్డర్లు ఇచ్చారు. వస్త్రోత్పత్తిదారులు ఆ మేరకు బట్ట ఉత్పత్తి చేశారు. పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులకు స్కూల్‌ యూనిఫామ్స్‌ అందించాలని ప్రభుత్వం భావించి ముందే ఆర్డర్లు ఇచ్చింది. దీంతో ఉత్సాహంగా ఎస్‌ఎస్‌ఏ బట్ట ఉత్పత్తి అయింది. రూ.50 కోట్ల విలువైన బట్ట ఉత్పత్తి చేశారు. ఆరు నెలల కిందట ఈ బట్టను కొనుగోలు చేసిన జౌళిశాఖ ఇటీవల రూ.30 కోట్ల మేరకు చెల్లించింది. ఇంకా రూ.20 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. సంక్షేమ శాఖలకు సంబంధించి బట్టల బిల్లులు సైతం రూ.3 కోట్ల మేరకు ఇలాగే పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఇప్పుడు బతుకమ్మ చీరల ఉత్పత్తి పెట్టుబడిగా వస్త్రోత్పత్తిదారులు అప్పులు చేయాల్సి వస్తుంది. సిరిసిల్లలో ఏడు కోట్ల మీటర్ల బతుకమ్మ చీరల బట్టకు ఆర్డర్లు ఇవ్వగా దీని విలువ రూ.350 కోట్లు. 25 వేల మరమగ్గాలు, వెయ్యి ఆధునిక ర్యాపియర్‌ మగ్గాలపై 225 రంగుల్లో బతుకమ్మ చీరల ఉత్పత్తి సాగుతోంది. మంత్రి కేటీఆర్‌ వస్త్రోత్పత్తి ఆర్డర్ల బిల్లులు ఇప్పించాలని వస్త్రవ్యాపారులు కోరుతున్నారు. 

రూ. 30 కోట్లు ఇచ్చాం 
రంజాన్‌కు సంబంధించి కొనుగోలు చేసిన వస్త్రానికి ఇటీవల రూ.30 కోట్లు ఇచ్చాం. బతుకమ్మ చీరలను ఇప్పుడే సేకరిస్తున్నాం. దానికి ఎప్పటిలాగే పేమెంట్‌ ఇస్తాం. వస్త్రం క్వాలిటీ కంట్రోల్‌ నివేదిక వచ్చిన తరువాత గతంలో కొనుగోలు చేసిన వస్త్రాలకు సంబంధించి జీఎస్టీ బిల్లులను చూసి 10 శాతం బిల్లులను అందరికీ క్లియర్‌ చేస్తాం. బట్టను తీసుకున్న ఆయా ప్రభుత్వ శాఖల నుంచి ఇంకా బిల్లులు రావాల్సి ఉన్నాయి. అవి రాగానే అన్నింటినీ క్లియర్‌ చేస్తాం. 
–శైలజా రామయ్యర్, జౌళిశాఖ డైరెక్టర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement